రష్యా హెచ్చరిక: ‘ఆయిల్ పైప్‌లైన్ మూసేస్తాం.. క్రూడాయిల్ ధర బ్యారెల్ 300 డాలర్లు చేరుకుంటుంది’

రష్యా చమురు

ఫొటో సోర్స్, Reuters

యుక్రెయిన్ మీద దాడితో పశ్చిమ దేశాలు రష్యా మీద అనేక ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు విధించాయి. అయితే, అతి కీలకమైన గ్యాస్, ఆయిల్ ఇండస్ట్రీల జోలికి మాత్రం పోలేదు. రష్యా ఆర్ధిక వ్యవస్థలు, బ్యాంకింగ్ రంగం, కరెన్సీ తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి.

తన ఆయిల్ ఎగుమతులు పూర్తిగా నిలిపేస్తే క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 300 డాలర్ల (సుమారు రూ.23వేలు)కు చేరుకుంటుంది రష్యా హెచ్చరించింది. అదే సమయంలో యూరప్ దేశాలు గ్యాస్, బొగ్గు, ఆయిల్‌ల దిగుమతి కోసం వేరే మార్గాలను అన్వేషిస్తున్నాయి.

ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌కు సరఫరా అయ్యే గ్యాస్, బొగ్గులలో సుమారు మూడింట ఒక వంతు రష్యా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ విషయంలో రష్యా మీద ఆధారపడకుండా ఉండటం ఎలా అన్న అంశంపై యూరోపియన్ యూనియన్ నేతలు గురు, శుక్రవారాల్లో సమావేశం కాబోతున్నారు.

''యూరప్ చరిత్రలో కొత్త శకం ప్రారంభం కాబోతోంది'' అంటూ రష్యా దాడిని నేరుగా ప్రస్తావించకుండా యూరోపియన్ యూనియన్ నేతలు ఒక ప్రకటన చేశారు. 2030 నాటికి అభివృద్ధి, పెట్టుబడులలో కొత్త విధానాలను ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా ఇంధన సరఫరా, దాని మార్గాలను మార్చుకోవడంపై యూనియన్ దృష్టి పెట్టింది.

తాము ఎగుమతులు నిలిపేస్తే ఇంధన ధరలు పెరుగుతాయని రష్యా హెచ్చరించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తాము ఎగుమతులు నిలిపేస్తే ఇంధన ధరలు పెరుగుతాయని రష్యా హెచ్చరించింది

రష్యా ముప్పు

పాశ్చాత్య దేశాల నుండి ఆంక్షలు, హెచ్చరికలతో రష్యా బెదిరింపులకు దిగింది. జర్మనీకి వచ్చే ప్రధానమైన గ్యాస్‌పైప్‌ను మూసేస్తామని, తాము ఎగుమతి చేసే చమురుపై నిషేధం విధిస్తే చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయని హెచ్చరించింది.

ఇటు అమెరికా కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు, రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించేందుకు తాను, తన ఐరోపా మిత్రదేశాలు ఆలోచిస్తున్నాయని ప్రకటించింది.

2008 నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా చమురు ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. సోమవారంనాడు ముడి చమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్ల( సుమారు రూ.10వేలు) కు చేరుకుంది.

వీడియో క్యాప్షన్, పుతిన్ ఇంత శక్తిమంతంగా ఎలా మారారు?

తాము ఆయిల్‌ సరఫరాను నిలిపేస్తే అది ప్రపంచ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ అన్నారు.

రష్యా ఆయిల్‌పై నిషేధం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాల నేతలతో చర్చలు జరిపారు. అయితే, యూరప్ దేశాల నుంచి అమెరికాకు మద్ధతు రాలేదని తెలిసింది.

కానీ, ఈ విషయంలో తాను ముందుకే వెళ్లాలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చాలా ఐరోపా దేశాలు ఇంధన వనరుల కోసం రష్యా పై ఆధారపడతాయి. వీటితోపాటు అమెరికా కూడా తన ఆయిల్ దిగుమతులలో 3 శాతం చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది.

రష్యా నుంచి జర్మనీకి పైప్‌ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా అవుతుంది. గత నెల జర్మనీ నార్డ్ స్ట్రీమ్2 నుంచి వచ్చే రెండో గ్యాస్‌ పైప్‌లైన్‌కు సర్టిఫికేషన్‌ను నిలిపేసింది.

యూరప్‌కు అందే గ్యాస్‌లో 40% రష్యా నుంచే వస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరప్‌కు అందే గ్యాస్‌లో 40% రష్యా నుంచే వస్తుంది

రష్యా ఎంత గ్యాస్ ఇస్తుంది?

అమెరికా, సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో మూడవ అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు రష్యా. ప్రపంచ చమురు సరఫరాలో 8-10 శాతం రష్యా నుంచే వస్తోంది. ప్రతిరోజు 40 నుంచి 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురు, 8,500 బిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువును రష్యా ఎగుమతి చేస్తుంది.

ఇందులో ఎక్కువ భాగం ఐరోపాకు వెళుతుంది. యూరోపియన్ యూనియన్‌కు 40% గ్యాస్, 30% చమురును రష్యా ఎగుమతి చేస్తుంది. ఇంత భారీ ఎత్తున జరిగే సరఫరాకు ఒక్కసారిగా ప్రత్యామ్నాయం కనుగొనడం అంత సులభం కాదు.

ప్రపంచ ఇంధన మార్కెట్‌లో రష్యా ప్రాబల్యం కారణంగా, యూరోపియన్ యూనియన్‌తోపాటు అమెరికా కూడా రష్యా చమురు, గ్యాస్ పరిశ్రమను పూర్తిగా నిషేధించలేకపోయాయి.

ఈ కారణంగానే రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించే ఆలోచనను జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షుల్ట్జ్ సోమవారంనాడు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఉద్దేశపూర్వకంగానే రష్యా చమురు పై నిషేధం ఆలోచన నుంచి తప్పుకున్నామని ఆయన తెలిపారు. మరో మార్గంలో ఇప్పటికిప్పుడు ఆయిల్‌ను పొందడం సులభంకాదని అన్నారాయన.

పైప్‌లైన్ ద్వారా రష్యా యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా చేస్తుంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పైప్‌లైన్ ద్వారా రష్యా యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా చేస్తుంది

ఐరోపా దేశాలకు చమురు కంటే గ్యాస్ ఎక్కువ అవసరం. యూరోపియన్ యూనియన్ తన గ్యాస్‌లో అవసరాలలో 61% దిగుమతి చేసుకుంటుంది. అందులో 40% రష్యా నుండి వస్తుంది.

గ్యాస్ సరఫరా చేయడానికి రష్యా నిరాకరిస్తే, యూరప్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్యాస్ పొందడానికి ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంది.

బ్రోగెల్ థింక్-ట్యాంక్ అంచనా ప్రకారం, రష్యా యూరప్‌కు గ్యాస్ సరఫరాను నిలిపివేస్తే, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే నిల్వ చేసిన గ్యాస్‌పై ఆధారపడవలసి ఉంటుంది. కానీ, ఆ గ్యాస్ ఇప్పటికే దశాబ్దంలో కనిష్ట స్థాయిలో ఉంది.

ఏప్రిల్‌లో ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత యూరప్ దేశాలు గ్యాస్‌ను నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తాయి. అలా నిల్వ చేసిన గ్యాస్‌ను శీతాకాలంలో ఉపయోగించుకుంటాయి. అంటే యూరోపియన్ యూనియన్‌ మరో మార్గం ద్వారా గ్యాస్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాల్సి ఉంది.

ఉత్తర ఆఫ్రికా, అజర్‌బైజాన్ వంటి దేశాల నుండి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)ని దిగుమతి చేసుకోవచ్చు. కానీ అది మొత్తం యూరోపియన్ యూనియన్ గ్యాస్ రంగంపై ఒత్తిడి పెంచుతుంది. ఇప్పటికే పెరుగుతున్న గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయి.

రష్యాతో ఓ గ్యాస్‌ పైప్‌లైన్ ఒప్పందాన్ని జర్మనీ ఇటీవలే నిలిపేసింది

ఫొటో సోర్స్, Reuters

మొత్తం మీద ఇప్పటికిప్పుడైనే రష్యా గ్యాస్, చమురు ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధం విధించలేవు. తమకు మెరుగైన గ్యాస్ సరఫరా ప్రత్యామ్నాయం దొరికే వరకు అవి వేచి చూస్తాయి.

ప్రముఖ చమురు కంపెనీ సంస్థ షెల్ రష్యా నుండి ముడి చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఐరోపాలో చమురు సరఫరాను కొనసాగించడానికి, రష్యా నుండి చమురును కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆ కంపెనీ తెలిపింది.

వీడియో క్యాప్షన్, వార్తలు చూస్తూ ఆందోళన చెందుతున్నారా? అయితే ఇలా చేయండి..

''రిఫైనరీలకు ముడి చమురు సరఫరా కొనసాగుతున్నప్పటికీ, రాబోయే వారాల్లో యూరప్ అంతటా ప్రజలకు అవసరమైన చమురు ఉత్పత్తులను నిరంతరం అందించడానికి ఇంధన పరిశ్రమలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు'' అని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

రష్యా చమురు పై ఆంక్షలు ఇతర చమురు ఉత్పత్తి మార్గాలపై ఒత్తిడిని పెంచవచ్చు. చమురును నిరంతరాయంగా సరఫరా కోసం ఉత్పత్తిని పెంచాలంటూ ఈ వారం సౌదీ అరేబియాపై అమెరికా ఒత్తిడి చేయవచ్చు. చమురు ఎగుమతులపై ఆంక్షలు తొలగిపోతే, ఆయిల్ ఎగుమతులు పెంచి తన అణు కార్యక్రమంపై ఇరాన్ ముందుకు పోయే ఆలోచన చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)