NATS స్కీమ్: ఉద్యోగం చేయకుండానే జాబ్ ఎక్స్‌పీరియన్స్.. డిగ్రీ పాసైన వారికి ఉపకార వేతనంతో శిక్షణ, పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు

ఫొటో సోర్స్, mhrdnats.gov.in
- రచయిత, నాగ సుందరి
- హోదా, బీబీసీ కోసం
ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తే మొదట అడుగుతున్న ప్రశ్న అనుభవం ఉందా? అని. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఇదో సమస్య.
దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్ - NATS) పేరిట ఒక శిక్షణ కార్యక్రమం చేపట్టింది.
ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసినవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ మధ్యే సాధారణ డిగ్రీ ఉన్న వారందరూ శిక్షణ పొందేలా నియమ నిబంధనలు మార్చారు.
కాబట్టి మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు ఈ శిక్షణ పొందవచ్చు. శిక్షణ అనంతరం పొందిన సర్టిఫికెట్తో మీ ప్రాంతంలోని ఉపాధి కేంద్రాల్లో (ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీ) నమోదు చేసుకోవచ్చు.
దాంతో ఈ శిక్షణే మీకు అనుభవంగా పరిగణిస్తారు.
ఇంజనీరింగ్, డిగ్రీ పట్టాలు పొందినా, డిప్లొమాలు చేసినా మంచి ఉద్యోగావకాశాలు దొరకక, తాము ఆశించిన రంగాలలో ప్రవేశించలేక ఎందరో విద్యార్థులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అలాంటి వారికి నాట్స్ ఒక వరం. దీన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
ఈ స్కీమ్ కింద యువతకు సంవత్సర కాలం స్టైఫండ్ ఇస్తూ అత్యున్నత మౌలికసదుపాయాలున్న పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో 126 విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తారు.

ఫొటో సోర్స్, mhrdnats.gov.in
నాట్స్ స్కీమ్ అంటే
డిగ్రీ పూర్తి చేసిన వారికి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడమే దీని ఉద్దేశం. అంటే కాలేజీల్లో చదివి, తాము చదివిన రంగంలోనో లేదా తమకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రాక్టికల్ శిక్షణ లేక చాలా మంది అయోమయంతో ఉంటారు. ఏ పని ఎలా చేయాలో తెలీదు.
కళాశాల స్థాయిలో విద్యార్థులకు అందాల్సినంత శిక్షణ అందకపోవడం వల్ల సమస్య ఏర్పడుతోంది. దాంతో సరైన ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు.
NATSలో చేరిన వారికి వారి సంబంధిత సబ్జెక్టులో లేదా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తారు. దేశంలోని వివిధ సంస్థలు, కంపెనీల్లో NATS ట్రైనీలకు ఆ రంగంలోని మెళకువలు నేర్చుతారు.
అన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకునేలా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో శిక్షణ పూర్తయ్యే సమయానికి యువత ఆ రంగానికి సంబంధించిన వృత్తిపరమైన, సాంకేతికపరమైన నైపుణ్యం పొంది ఉంటారు.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డు ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్/ ప్రాక్టికల్ ట్రైనింగ్ విభాగం ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది.
నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చే రకరకాల ఇనిస్టిట్యూషన్లు దేశమంతటా ఉన్నాయి. అవి అవసరమైన శిక్షణను అందజేస్తాయి.
విద్యార్థులు తాము నివసిస్తున్న ప్రదేశాలను అనుసరించి ఆయా ప్రాంతాల పరిధిలోకి వచ్చే శిక్షణ సంస్థల్లో రిజిస్టర్ కావొచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు NATS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, mhrdnats.gov.in
స్కీమ్ ప్రయోజనాలు:
- సంవత్సర కాలం శిక్షణ ఉంటుంది.
- ట్రైనింగ్ పొందిన చోటే ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి.
- యువతకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, అర్హతలు, వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఈ పథకం పెంపొందిస్తుంది.
- ఫీల్ఢ్ వర్కులో ప్రాక్టికల్ నైపుణ్యం పొందవచ్చు.
- ట్రైనింగ్ మాడ్యూల్సుతో, ట్రైన్డ్ మేనేజర్లతో శిక్షణ ఇస్తారు. ఇలా శిక్షణ పొందడం వల్ల ట్రైనీలు తమ ఉద్యోగ నిర్వహణలో మంచి సామర్థ్యం చూపగలరు. ఎన్నో మంచి ఉద్యోగ అవకాశాలను కూడా యువత అందిపుచ్చుకుంటారు.
- భారత యువత సాంకేతిక సామర్థ్యాన్ని పెంచే స్కీము ఇది. మార్కెట్ కనుగుణంగా విధినిర్వహణలో వస్తున్న మార్పులు, సాంకేతిక, యంత్రాల పని తీరు ట్రైనీలకు తెలిసి వస్తుంది.
- శిక్షణా కాలంలో స్టైఫండ్ ఇస్తారు. స్టైఫండ్లో 50 శాతాన్ని సంబంధిత సంస్థ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
- శిక్షణ పూర్తయ్యాక అప్రెంటిస్లకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫెషియన్సీని భారత ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సర్టిఫికేట్ని దేశంలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లలో ''ఉద్యోగ అనుభవం''గా గుర్తిస్తారు.
- నేట్స్ అప్రైంటిస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందిన వారిని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో చేర్చుకుంటున్నారు.
- కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు రంగాలలో అత్యున్నత శిక్షణా సదుపాయాలు గల సంస్థల్లో అప్రెంటిస్లకు శిక్షణ అందుతుంది కనుక కంపెనీలు లేదా సంస్థలు ఇలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.
- నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీము ప్రోగ్రాములో ఇప్పటివరకూ మొత్తం శిక్షణ పొందిన స్టూడెంట్లు 10,74,673. 13,813 పరిశ్రమలు, 2,669 శిక్షణా సంస్థలు శిక్షణను అందజేస్తున్నాయి.
- నేషనల్ అప్రంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద 'నేట్స్ బోట్' , 'నేట్స్ బాప్ట్' అని రెండు విభాగాలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ సమీక్ష, నిర్వహణల బాధ్యత వహిస్తాయి.
- నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీము ద్వారా తమ ప్రొఫెషన్లో సామర్థ్యాన్ని విద్యార్థులు బాగా పెంపొందించుకుంటారు. మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ప్రాక్టికల్ శిక్షణ వల్ల అత్యాధునిక మెషీన్ల పనితీరుపై మంచి పట్టు సాధిస్తారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం బాగా పెంపొందించుకుంటారు. వొకేషనల్, ప్రొఫెషనల్ నైపుణ్యాలను సొంతం చేసుకుంటారు. కొత్త మెథడాలజీలపై అవగాహన పెంచుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు వర్కు ఎథిక్స్, కల్చర్తో పాటు నిర్వహణా సామర్థ్యాలను కూడా నేర్చుకుంటారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు కూడా 'నేట్స్' అవకాశం కల్పిస్తోంది.
- విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలను బట్టి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి.
- నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీములో ప్రభుత్వం ఇటీవల ఒక సవరణ చేసింది. ఇంతవరకూ టెక్నికల్ కోర్సులు చేసిన వారికే ఈ స్కీము అందుబాటులో ఉంది. కానీ నాన్ టెక్నికల్ కోర్సులు చదివిన విద్యార్థులకు కూడా ఈ స్కీమును ప్రభుత్వం అందుబాటులోకి తేవడమే ఆ సవరణ. దానికి అనుగుణంగా ఇప్పడు బిఎ, బిఎస్సి, బికామ్ చేసిన వారు కూడా ఈ స్కీము కింద లబ్ది పొందగలరు.

ఫొటో సోర్స్, mhrdnats.gov.in
NATSకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు:
- దరఖాస్తుదారు వయసు 16 ఏళ్ల పైబడి ఉండాలి.
- దరఖాస్తుదారుకు డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
- ప్రభుత్వానికి చెందిన ఇతర స్కిల్ డెవలెప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాములో శిక్షణ పొంది ఉంటే దీనికి అనర్హులుగా పరిగణింపబడతారు.
- దరఖాస్తుదారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండరాదు.
- దరఖాస్తుదారు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు.
- దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి.
- దరఖాస్తుదారుకు వర్కింగ్ అనుభవం ఉండరాదు.
నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీము ఫీచర్లు:
- కేంద్రం, రాష్ట్రం, ప్రైవేటురంగాలలోని మౌలికసదుపాయాలు పుష్కలంగా ఉన్న ఉన్నత సంస్థలు యువతకు ట్రైనింగ్ను అందజేస్తాయి.
- శిక్షణకు విద్యార్థులను ఎంపికచేసుకునేందుకు తరచూ శిక్షణౄ సంస్థలు అప్రెంటిస్షిప్ ఫెయిర్లను నిర్వహిస్తాయి. విద్యార్థులు వీటికి హాజరవుతుండాలి.
- ఈ స్కీము సంస్థ యాజమాన్యాల ఉద్యోగ అవసరాలకు, ప్రతిభావంతులైన విద్యార్థుల నైపుణ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేస్తుంది.
- ఈ స్కీము వల్ల మానవ వనరుల అభివృద్ధి అవసరాలకు కొత్త టాలెంట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
- క్యాంపస్ నుంచి డిగ్రీ పట్టాలు పట్టుకుని అప్పుడే బయటకు వచ్చిన విద్యార్థులకు ఈ స్కీము ఎన్నో సరికొత్త వృత్తి, ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది.

ఫొటో సోర్స్, hrdnats.gov.in
కావలసిన ధ్రువ పత్రాలు:
పాన్ కార్డు, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రెసిడెన్స్ ప్రూఫ్, విద్యార్హత మార్క్ షీట్స్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌట్ డిటైల్స్, ఓటర్ ఐడి కార్డు, పాస్‌పోర్ట్, టెలిఫోను బిల్లులు అవసరమవుతాయి.
NATS శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా
- నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నేట్స్-ఎన్ఎటీఎస్) అఫిషియల్ వెబ్సైట్కు వెళ్లాలి.
- హోమ్ పేజీలో రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి.
- ఎలిజిబిలిటీ చెక్, క్వశ్చనైర్, గైడ్లైన్స్, ఎన్రోల్మెంట్ ఫామ్, ప్రివ్యూ, కన్ఫామ్ సెక్షన్లతో కూడిన పేజి కనిపిస్తుంది. అందులో ఎలిజిబిలిటీ సెక్షన్లో డ్రాప్డౌన్ లిస్టులో 'అ యామ్ స్టూడెంట్' అన్నదానిపై క్లిక్ చేయాలి.
- స్టూడెంట్ సంబంధితమైన ఇతర ప్రశ్నలు ఉంటాయి.
- నేట్స్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ చెక్లోని ప్రశ్నలకు జవాబులు టైప్ చేయాలి.
- ట్రైనింగ్ ప్రోగ్రామ్కు మీరు ఎలిజిబుల్ అయితే ఎన్రోల్ చేసుకోవడానికి అర్హులవుతారు. ఆ మెసేజ్ మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే 'కాదు' అన్న మెసేజ్ కనిపిస్తుంది.
- తర్వాత మీ వివరాలు ఎంటర్ చేయాలి.
- సేవ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయాలి.
- క్వశ్చనైర్, గైడ్లైన్స్ సెక్షన్ కనిపిస్తుంది.
- అందులో పేర్కొన్న మార్గదర్శకాలు , అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు , టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి.
- టర్మ్స్ అండ్ కండిషన్స్కు అంగీకరిస్తున్నానని చెక్ బాక్సును క్లిక్ చేయాలి.
- ఎన్రోల్మెంట్ఫామ్ సెక్షన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ వివరాలు, ట్రైనింగ్ ప్రిఫరెన్సులు ఉంటాయి.
- అవసరమైన వివరాలను సెలక్ట్ చేయాలి. సేవ్ , ప్రివ్యూలను క్లిక్ చేయాలి.
- ఒకసారి నింపిన డిటైల్స్ అన్నీ సరిచూసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
- మీ ఇ మెయిల్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ డిటైల్స్ తో పూర్తి పేజీ కనిపిస్తుంది.
- దాన్ని ఒక ప్రింట్ అవుట్ తీసిపెట్టుకోవాలి.
ఇనిస్టిట్యూషన్ లిస్టు కోసం:
నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇనిస్టిట్యూషన్స్ అప్షన్ ఎంచుకోవాలి. కొత్త పేజీలో ఇనిస్టిట్యూషన్ లిస్టు ఎక్కడ సెర్చ్ చేయాలో కనిపిస్తుంది. లిస్టు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. అందులో ఇనిస్టిట్యూట్ పేరు,కోర్సు, డిస్ట్రిక్ట్, స్టేట్ వివరాలు వెదుక్కోవచ్చు.
(వివరాలకు టోల్ ఫ్రీ నంబరు: +91-33-2337 0750 / 2337 0751, Email: [email protected], వెబ్‌సైట్: https://www.mhrdnats.gov.in)
ఇవి కూడా చదవండి:
- తమిళనాడు 'చదివింపుల విందు': కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- Women's day స్పెషల్: 'మహిళా నవోదయం' - మహిళల కోసం, మహిళలు రాసే వార్తలతో.. మహిళలే నడుపుతున్న పత్రిక
- ఉద్యోగాలు: ఊపందుకుంటున్న యాంటీ-వర్క్ ఉద్యమం.. దీని లక్ష్యాలేమిటి, ప్రభావాలేమిటి?
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











