పవన్ కల్యాణ్: జనసేనాని 'జన నేత' ఎందుకు కాలేకపోతున్నారు? జనసేన పార్టీ ఎందుకు ఎదగడం లేదు?

ఫొటో సోర్స్, @JanaSenaParty
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి ముందొకమాట స్పష్టంగా చెప్పుకోవాలి. అది ఆయన తరగని జనాకర్షణ. తెలుగు రాష్ట్రాల్లో ఇంతగా జనాకర్షణ ఉన్న నాయకులు అరుదనే చెప్పాలి. లారీ బస్సులు పెట్టి తోలకపోయినా, బిరియానీలు, క్వార్టర్ బాటిల్ పంచకపోయినా, పవన్ సభలకు జనం, ముఖ్యంగా యువకులు, పెద్ద ఎత్తున తరలి వస్తారు.
ఎనిమిదేళ్ల కిందట 2014 మార్చిలో జనసేన పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో ఆయన క్రేజ్ తరగ లేదు. ఆయన్ను వేదిక మీద చూసినప్పటినుంచి అరుపులు కేకలు చప్పట్లు మొదలవుతాయి. 'పవన్ సీఎం' నినాదం వినపడుతుంది. ఎటొచ్చి చిక్కేమిటంటే ఈ ప్రేక్షకులకి 'జనసేన నేత'కి సంబంధం లేదు. ఆయన చెప్పేవాటిని వాళ్లెవరూ వినడం లేదని ఏ సభని చూసినా అర్థమవుతుంది. వాళ్ల దారి వాళ్లది, పవన్ దారి పవన్ ది. వాళ్లంతా 'పవర్ స్టార్'ను చూడ్డానికి వస్తున్నారు తప్ప, ఒక రాజకీయ నాయకుడి కోసం, ఆయన చెప్పేది వినడం కోసం వస్తున్నట్లు లేరు.
అందుకే వాళ్లెవరూ సభ నుంచి 'జనసేన పార్టీ'ని ఇంటికి తీసుకెళ్లడం లేదు. సినిమా ప్రిరిలీజ్ పంక్షన్‌కి వచ్చినట్లు వస్తున్నారు. వెళ్లిపోతున్నారు. ఎందుకిలా జరుగుతూ ఉంది? ఒక రాజకీయకుడిగా, రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆరాటపడుతున్న నేతగా వాళ్ల మనసుల్లో ఎందుకు పవన్ కల్యాణ్ ముద్రవేయలేకపోతున్నారు? ఆయనకు, ఆయన అభిమానులకు మధ్య సినిమా పెద్ద గోడలాగా తయారయింది. ఎందుకిలా జరగుతున్నది? సినిమా గోడ ఛేదించి ఆయన రాజకీయాల్లోకి రాలేకపోయేందుకు కారణం ఏమిటి?

ఫొటో సోర్స్, @JanaSenaParty
పవన్ అలాగే కాపు కులాన్ని వదలుకోలేరు, ఆయనలో కొంత సామాజిక నిస్పృహ కూడా ఉన్నందున పూర్తిగా పూసుకోనూ లేరు. ఈ ఎనిమిదేళ్లలో ఆయన కాపు లీడర్‌గా దిగలేకపోతున్నారు. పత్యామ్నాయ రెబెల్‌గా ఎదగలేకపోతున్నారు. పవన్ పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చి 15 యేళ్లవుతా ఉంది. మంచి సోషల్ క్యాపిటల్ ఉన్నా, బలమైన కులం నుంచి వచ్చినా, మంచి ఆర్థిక బలం ఉన్నా, ప్రేక్షక బలగం ఉన్నా తనేమిటో చెప్పలేకపోవడమే పవన్ కల్యాణ్ వైఫల్యానికి కారణం. ఇంత నిరాకార పార్టీ దేశ రాజకీయాల్లో ఎపుడూ రాలేదు.
ఆయన రాజకీయాలను సినిమా కొనసాగింపులాగానే నడిపారు. వాటికొక పార్టీ రూపం ఇచ్చి ఒక నేత కావాలనుకున్నట్లు లేదు. అందుకే ఆయన చేపట్టిన సమస్యలు- రాయలసీమకు అన్యాయం, ఆంధ్రాకు ప్రత్యేక హోదా, శ్రీకాకుళం కిడ్నీ సమస్యలు, ఇసుక స్మగ్లింగ్- అన్నీ అసంపూర్ణ ప్రాజెక్టులుగా నినాదాలుగా మిగిలిపోయాయి. ఏ ఒక్కటీ ఉద్యమ రూపం తీసుకోలేదు. అడ్‌హాకిజం పవన్ పాలసీ లాగా కనిపిస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రాంతీయ పార్టీల సక్సెస్‌కు కారణం.. స్పష్టత
భారత దేశంలో ప్రాంతీయ పార్టీలు విజయవంతం కావడానికి తామేమిటో, ఏ విలువల కోసం నిలబడుతున్నామో ఈ పార్టీ నేతలు స్పష్టంగా చెప్పడమే కారణం. తమకంటూ ఒక ముద్ర ఒక కారణం.
ఉదాహరణకు జనతాదళ్ విచ్ఛిన్నమయ్యాక చాలా ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాది పార్టీ, బీహార్ లాలూ ప్రసాద్ ఆర్‌జెడి, ఒరిస్సా బిజూ జనతాదళ్, కర్నాటక జనతా దళ్ (ఎస్) లు కాంగ్రెస్ దెబ్బకి, ఊపందుకుంటున్న బిజెపి దెబ్బకి మట్టికొట్టుకుపోవాలి. కానీ, ఇవన్నీ బలమయిన ప్రాంతీయ పార్టీలుగా రూపొందాయి. కారణం ప్రజలు అర్థం చేసుకునేలా వాళ్లు తమ పార్టీల గురించి వివరించి (సిద్ధాంతీకరణ) చెప్పడమే. దాన్ని ప్రజలూ అర్థం చేసుకున్నారు.
జనతా దళ్ పార్టీల పరిణామం తర్వాత విజయవంతమయిన మరొక పార్టీ 'ఆమ్ ఆద్మీ పార్టీ' (ఆప్). ఆప్ ఎందుకు వచ్చిందో కేజ్రీవాల్ చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలూ ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చూశారు. బాగా అర్థం చేసుకున్నారు. ఈ మధ్యలో మరొక పార్టీ గురించి చెప్పుకోవాలి. అది పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ తృణమూల్ పార్టీ. మమతా బెనర్జీ చాలా స్పష్టంగా అపుడు దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. పార్టీ స్థాపించిన ఆరు నెలల్లోనే బెంగాల్ లోనే కాదు, భారత దేశమంతా గుర్తింపు సంపాదించారు. తర్వాత్తర్వాత విజయమూ సాధించారు.
ఇక్కడ ఉదహరించిన పార్టీల నేతలు చాలా స్పష్టంగా తామేమిటో ఎటుపోవాలో తేల్చుకున్నారు. ప్రజల మద్దతు కోరారు. ప్రజల అండ సంపాదించారు. ఆ పార్టీలన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా బలమయిన శక్తులుగా ఉన్నాయి. అంతేకాదు, వీటి నాయకత్వం రెండో తరానికి విజయవంతంగా బదిలీ అవుతూఉంది. ఇక తెలంగాణ రాష్ట్రసమితి, ఝార్ఖండ్ ముక్తిమోర్చా వంటివి ఒక ప్రాంతీయ ఉద్యమం కోసం పుట్టిన పార్టీలు వాటి ఐడియాలజీ చాలా స్పష్టం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఐడియాలేజీ లేని ఏకైక పార్టీ ఇదేనా?
ఇటీవలి కాలంలో భారీ అంచనాలతో రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టి, చతికిల పడ్డ వ్యక్తి ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమేనా అనిపిస్తుంది. ఆయన స్థాపించిన పార్టీ ఎదగడంలేదు. సైద్ధాంతికంగా ఆయనలో కూడా ఎదుగుదల కనిపించడం లేదు. ఇపుడు ఏ పరిస్థితి వచ్చిందంటే ఏదో ఒక పార్టీ పొత్తు ఉంటే తప్ప సొంతంగా ఈద లేని బలహీనత ఆయనది. ఎన్నోకొన్ని ఓట్లు తెస్తాడులే అనుకునే పార్టీలే ఆయన పొత్తుకోరుతున్నాయి. పవన్ కల్యాణ్ ఒక మమతా బెనర్జీ, ఒక నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్, తేజస్వీయాదవ్, కేజ్రీవాల్ కాలేకపోతున్నారంటే కారణం భయంకరమయిన కన్‌ఫ్యూజన్.
2022 నాటికి కూడా పవన్ కల్యాణ్‌కు తనేమిటో, తనెటు పోవాలో, తన సిద్ధాంతమేమిటో తెలియదు. ఫలితంగా ఆయనకు ఏ సమస్య మీదా నిలకడయిన అభిప్రాయం ఏర్పడలేదు. భారతీయ రాజకీయ చారిత్రక సందేశం అవగతం అయినట్లు లేదు.

ఫొటో సోర్స్, @PawanKalyan
సినిమా నుంచి బయటకు రాలేకపోతున్న పవన్...
పవన్ కల్యాణ్ చాలా కాలం సినిమా ఇమేజ్ లోనే జీవించారు. ఆయన సినిమాలు యాంటి ఎస్టాబ్లిష్‌మెంట్ రెబెల్ సినిమాలు. బాగా విజయవంతమయ్యాయి. ఆ పాత్రలు ఆయనకు బాగా సూటయ్యాయి. మంచి నటుడు. డైలాగ్ డెలివరీ బాగుంటుంది. ఆయన కుర్రదనం మసకబారడమేలేదు. సినిమాల్లో ఆయనను అభిమానించకుండా ఉండటం కష్టం. గబ్బర్‌సింగ్‌లో ఆయన డైలాగ్ "నాక్కొంచెం తిక్కుంది. కానీ, దానికో లెక్కుంది. ఆ తిక్కేంటో చూపిస్తా. అందరిలెక్కలు తేలుస్తా" అనేది తెలుగు ప్రేక్షకలోకాన్ని బాగా కుదిపేసింది.
అయితే, ఈ యాంగ్రీ యంగమాన్ ఇమేజ్ ఆపాదించుకుంటూ ఆయన రాజకీయాల్లో రెబెల్ కావచ్చనుకున్నారు. మొదట్లో చే గువేరా పేరు వాడుకున్నారు. ఇజమ్ పేరుతో ఆయన నాసిరకం పుస్తకం విడుదల చేశారు. అట్టహాసంగా కవర్ పేజీతో ఉండే ఈ పుస్తకం ద్వారా జనసేన ఐడియాలజీ ఏమిటో చెప్పాలనుకున్నారు. తర్వాత ఈ పుస్తకం ప్రస్తావనే లేదు. జనసేన ఐడియాలజీ (మై క్వెస్ట్ ఫర్ ఏన్ ఐడియాలజీ) అన్వేషణ ఆగిపోయింది. మరొక పుస్తకం వస్తుందన్నారు. అలాంటి విన్యాసం మళ్లీ చేసినట్లు లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
బీజేపీతో, మోదీతో కలిశారు.. తర్వాత తిట్టారు..
అనంతపురంలో సభ పెట్టి మావోయిస్టు విప్లవపంథాలో పయనించిన కమ్యూనిస్టు యోధుడు తరిమెళ్ల నాగిరెడ్డి పేరు వాడుకున్నారు. అనంతపురం కోసం ఫైట్ చేస్తానన్నారు. అక్కడొక ఆఫీస్ పెడతానన్నారు. పోటీ కూడా చేస్తానన్నారు. ఇవన్నీ ఆనాలోచితంగా జనం ఈలలు కేకలు విని చేసిన ప్రతిపాదనలనిపిస్తుంది. మాటాలెలా ఉన్నా 2014లో బిజెపి, టిడిపిలతో కలసి నడిచారు.
2016 నాటికి ఆయన మళ్లీ బిజెపి నుంచి దూరం జరగడం మొదలయింది. తెలుగు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ వచ్చారు. దీని తొలి రూపం ఆ యేడాది ఆగస్టులో తిరుపతిలో జరిగిన సభలో చూడవచ్చు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తెలుగు వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని విపరీతమైన ఆవేశంతో విమర్శించారు. దీని మీద మౌనంగా ఉండటం న్యాయమా అని ఆయన తెలుగుదేశం పార్టీని కూడా ప్రశ్నించారు.
2019 ఎన్నికల నాటికి ఆయన వైఖరి తెలుగు వాళ్ల ఆత్మగౌరవం నుంచి సామాజిక న్యాయం వైపు వెళ్లింది. బిఎస్‌పి, కమ్యూనిస్టులతో కలసి పొత్తు కట్టారు. దీనికి ఉపోద్ఘాతంగా ఆయన బిజెపి ఉత్తర భారత పెత్తనం, దక్షిణ భారతం మీద వివక్ష అంటూ తన మోదీ వ్యతిరేకతని నాటకీయ స్థాయికి తీసువెళ్లారు. దక్షిణ భారతదేశం ఉత్తర భారత దేశం నుంచి విడిపోతుందా అనేంతగా నినదాలిచ్చారు. సభల్లో మాట్లాడారు. ప్రధాని మీద ట్వీట్ యుద్ధం ప్రకటించారు.
ఈ ఆవేశం ఎన్నికల్లో పనిచేయలేదు. పార్టీ ఘోరంగా పరాజయం పాలయింది. పార్టీకి ఒకే ఒక్క సీటు వచ్చింది. ఆయనను రెండు నియోజకవర్గాలలో ప్రజలు తిరస్కరించారు. ఆయన భాష ప్రజలకు అర్థం కాలేదు. పార్టీల్లో ప్రజలేం చూస్తారో ఆయనకూ అర్థం కాలేదు. అదీ సమస్య.

ఫొటో సోర్స్, @JanaSenaParty
ఎటు గాలివీస్తే అటు...
ఇపుడాయన బిజెపి మనిషి అని అర్థం వచ్చేలా ఆయనే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలసి పోటీచేస్తారని మీడియా రాస్తున్నది. అంతేకాదు, బిజెపి ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందని కూడా చెబుతున్నారు. ఈ నేథ్యంలో నడుస్తున్న పార్టీ ఆవిర్భావ సభకు ఆయన ఒక నాటి కాంగ్రెస్ నేత, నిజాయితీకి మారుపేరయిన మేధావి దామోదరం సంజీవయ్య పేరు వాడుకున్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా పేరు పెడతామని ప్రకటించారు.
ఏ ఊరిలో సభలో ఉంటే అక్కడి లోకల్ హీరో పేరు వాడుకుంటూ వచ్చారు. అయితే, ఈ పేర్లతో, ఊర్లతో, సమస్యలతో ఆయనొక ఉన్నత రాజకీయ సిద్ధాంతం రూపొందించుకోలేకపోతున్నారు. ఎటు గాలివీస్తే అటుపోతున్నారు. నిజానికి ఇపుడాయన వైఫల్యాల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. స్వతంత్ర మనుగడ కష్టం చేసుకున్నారు. ఏదో శక్తి వచ్చి కాపాడాలి. ఎంతవరకు కాపాడుతుందో ఏమో కానీ ఆ శక్తి అయితే బిజెపి రూపంలో వస్తున్నట్లుంది.

ఫొటో సోర్స్, @JanaSenaParty
పవన్‌కు మిగిలింది కూడా రైట్ టర్నే...
బిజెపితో పొత్తులు పెట్టుకోవటం ద్వారా తన భారాన్ని చాలా వరకూ దించేసుకోవచ్చు. జనసేన ఇప్పటికీ ఒక్కరి చుట్టూ తిరుగుతూ పోతున్నది తప్ప మార్పు దూతగా, సూచనగా ప్రజాస్వామ్యం కాలేకపోతున్నది. నడుస్తున్నదంతా 'వన్ మ్యాన్ షో'నే. పార్టీలో ఒక పది మంది గట్టి నేతల పేర్లు చెప్పమంటే పది సార్లు పవన్ పేరు రాయాల్సి వస్తుంది. ప్రతి పార్టీ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తోంది కదా అనొచ్చు. అంటే జనసేన కూడా వాటిలో ఒకటా?
ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, రాష్ట్రంలో ఏ డెవలప్‌మెంట్ జరిగినా సినిమా హీరోలాగా స్పందిస్తున్నది పవన్ మాత్రమే. ఇతరులెరూ స్పందించలేని పార్టీ అది. ఎందుకంటే, పవన్ అభిమానులు ఇతరులెవరినీ సీరియస్‌గా తీసుకోరు. వాళ్లు ఇతర పాత్రలను అంగీకరించరు.
కమలం పార్టీకి గ్రామస్ధాయి నుండి రాష్ట్రస్ధాయి వరకూ కార్యవర్గాలున్నాయి కాబట్టి పార్టీ పరంగా ఇబ్బంది లేదు. బిజెపి మంచి ఎజండా ఇస్తుంది. ఇంతవరకు తానే నమ్ముకుని మోసుకొచ్చిన సెక్యులరిజాన్ని ఉతికి ఆరేయవచ్చు. హిందూ నినాదాలు నోరార వల్లించవచ్చు. ఎన్నికల భారాన్ని బాగానే దించుకోవచ్చు.
అదొక్కటే జనసేనకు ప్రత్యామ్నాయంగా మిగిలిందా, అందుకే ఆయన బిజెపి మంత్రం పఠిస్తున్నారా, ఏమో, అందుకే పవన్‌కు మిగిలింది రైట్ టర్నేనేమో!
ఇవి కూడా చదవండి:
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తే ఏమవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- ‘అనుభవం ఉందా’ అని అడిగే కంపెనీలకు ఆన్సర్ NATS
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














