యుక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుంటే రష్యన్లు ఎందుకు తమ దేశం విడిచి వెళుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
యెవజినీ లియామిన్ జార్జియా పార్లమెంట్ వెలుపల యుక్రెయిన్‌కు వెళుతున్న ట్రక్కులో దుస్తులు, ఆహార పదార్థాల డబ్బాలను పెడుతున్నారు. యుక్రెయిన్‌పై దాడి తర్వాత స్వదేశం విడిచి జార్జియా చేరుకున్న దాదాపు 25,000 మంది రష్యన్లలో లియామిన్ ఒకరు.
జార్జియా ప్రధాన నగరాల్లో నివసించడానికి సరైన స్థలాలను గుర్తించడానికి రష్యా నుంచి వలస వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది తమ సూట్‌కేసులు, పెంపుడు జంతువులతో రాజధాని టిబిలిసి వీధుల్లో తిరుగుతూ కనిపిస్తారు.
లియామిన్ కోటు మీద నీలం, పసుపు రంగు రిబ్బన్లు కనిపిస్తాయి. యుక్రెయిన్ జెండా రంగులు కూడా ఇవే. యుక్రెయిన్‌పై దాడి జరిగిన మరుసటి రోజు యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో జరిగిన నిరసన సమయంలో ఈ రిబ్బన్ల కారణంగా ఆయనను అరెస్టు చేశారు.
''పుతిన్ పాలనకు వ్యతిరేకంగా రష్యాను విడిచిపెట్టడమే ఉత్తమమని అర్ధమైంది. యుక్రెయిన్ ప్రజలకు నేను చేయగలిగినంత చేయడం నా బాధ్యత" అని పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన 23 ఏళ్ల లియామిన్ అన్నారు.
రష్యాను నుంచి వస్తున్న వారు కేవలం జార్జియాకు మాత్రమే పరిమితం కాలేదు. యూరోపియన్ యూనియన్, యూఎస్, యూకే కెనడా దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసేశాయి. కాబట్టి వారంతా టర్కీ, మధ్య ఆసియా, దక్షిణ కారకాస్ వంటి ప్రదేశాలకు వెళుతున్నారు.
అక్కడ ఇప్పటికీ రష్యా విమానాలను నిషేధించలేదు. చాలామంది అర్మేనియాకు కూడా వెళ్లారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 200,000 మంది పౌరులు దేశాన్ని విడిచిపెట్టినట్లు రష్యా ఆర్థికవేత్త ఒకరు అంచనా వేశారు.
బెలారుస్ ప్రజలు కూడా అదే బాటలో ఉన్నారు. అలెగ్జాండర్ లుకాషెంకో ప్రభుత్వం అణచివేత విధానాలు అనుసరించడం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సహాయం చేస్తుండటం., దీనివల్ల పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావడంతో విసిగి పోయిన బెలారుస్ పౌరులు ఇతర దేశాలలో ఆశ్రయం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.
దీని ప్రభావం వల్ల విమాన ఛార్జీలు పెరగడమే కాకుండా ఇస్తాంబుల్, అర్మేనియా రాజధాని యెరెవాన్ వంటి పెద్ద నగరాలలో వసతి కోసం అధిక ధరలు చెల్లించవలసి వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''ఇస్తాంబుల్‌కు వెళ్లే విమానం వన్-వే ఛార్జీ కోసం నా జీతం, నా భర్త జీతం మొత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చింది'' అని అన్య అనే ఒక రష్యన్ మహిళ వెల్లడించారు. భద్రత కోసం ఆమె పేరును మార్చాం.
దేశద్రోహానికి సంబంధించి రష్యాలో కొత్త చట్టం వచ్చినప్పుడు అన్య రష్యాను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం యుక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే వారికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. తాను కూడా టార్గెట్ అవుతానేమోనని అన్య భయపడ్డారు.
''సరిహద్దులు మూసేస్తారన్న భయం, రాజకీయ అణచివేత, బలవంతంగా ఆర్మీ సర్వీస్ చేయడం అనేవి మా డీఎన్‌ఏలోనే ఉన్నాయి. స్టాలిన్ కాలంలో ఎలాంటి భయానక వాతావరణంలో జీవించారో మా అమ్మమ్మ మాకు కథలు కథలుగా చెప్పడం గుర్తుంది" అని ఆమె వెల్లడించారు.
దేశం విడిచి వెళ్లే వారిలో ఎక్కువ మంది టెక్నాలజీ రంగంలో పని చేస్తున్నారు. వారు దూర ప్రాంతాల నుంచి కూడా పని చేయగలరు.
టిబిలిసిలోని ఒక కేఫ్‌లో నేను ఒక వీడియో గేమ్ డెవలపర్‌ను కలుసుకున్నాను. తాము రష్యా విధానాలతో విభేదిస్తున్నామని ఆయన, ఆయన స్నేహితులు కొందరు వెల్లడించారు. ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టినా తీవ్రంగా అణచివేస్తున్నారని అన్నారు.

రష్యాను వదిలేయడం నిరసనలో భాగం
''నిరసన తెలపడానికి మాకున్న ఏకైక మార్గం దేశం విడిచిపెట్టడం. మా డబ్బు, నైపుణ్యాలను మాతో తీసుకెళ్లడం. మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అలాంటి నిర్ణయమే తీసుకున్నారు'' అని ఇగోర్ (అసలు పేరు కాదు) అన్నారు.
అయితే, ఇగోర్ కూడా ఇక్కడ పరిస్థితులు బాగా లేకపోవడంతో జార్జియా రాజధానిని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నారు.
అయితే, హోటళ్లు, లాడ్జ్‌లు కొన్ని బెలారస్, రష్యా పౌరులకు వసతి కల్పించడానికి నిరాకరించినట్లు రిపోర్టులు వచ్చాయి. ఓ హోటల్ యజమాని బెలారుస్ జంటతో ''నేను రష్యన్లు, బెలారుసియన్లకు హోటల్‌ను ఇవ్వలేను. మీరు సెలవులు తీసుకుని యాత్రలకు వెళ్లడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఇది సమయం కాదు'' అని వ్యాఖ్యానించారు.
''ఆపిల్ పే ఇక్కడ పని చేయనందున మేం రష్యా నుంచి పారిపోతున్నామని వారు అనుకుంటున్నారు. కానీ, మేం విహార యాత్రకు వెళ్లడం లేదు. మా దగ్గర ఉన్నవన్నీ కోల్పోయాం. పుతిన్ రాజకీయకాంక్షల కారణంగా మేం శరణార్ధులుగా మారాం'' ఇగోర్ అన్నారు.
టిబిలిసి పబ్లిక్ సర్వీస్ హాల్‌కు వచ్చిన కొత్త వ్యక్తులు వ్యాపారం లేదా ఇల్లు కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
బెలారుస్ రాజధాని మిన్స్క్‌కు చెందిన ఐటీ స్పెషలిస్ట్ క్రిస్టినా నికితా పారిశ్రామికవేత్తగా నమోదు చేసుకున్నారు. దీని ద్వారా ఆమె జార్జియా బ్యాంకులో అకౌంట్ తెరవగలుగుతారు.
''మేము మా ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వలేం. అందుకే పారిపోయి వచ్చాం. ఇక్కడ సురక్షితంగా ఉండాలనుకుంటున్నాం. కానీ మా పౌరసత్వం కారణంగా వేధింపులు తప్పడం లేదు. నేను నా దేశం పేరును దాచిపెట్టాల్సి రావడం చాలా ఇబ్బందిగా ఉంది'' అన్నారు క్రిస్టినా
యుక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన వెంటనే, టిబిలిసి లో యుక్రెయిన్‌కు మద్దతుగా భారీ ర్యాలీలు జరిగాయి. యుక్రెయిన్‌లో జరిగే యుద్ధం రష్యాతో తమకున్న యుద్ధం లాంటిదని 87 శాతం మంది జార్జియన్ పౌరులు విశ్వసిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది.
కానీ, జార్జియాలోని చాలామంది పౌరులకు తమ దేశానికి ఇంత పెద్ద సంఖ్యలో రష్యన్‌లు రావడం ఇష్టంలేదు. ఎందుకంటే జార్జియాపై రష్యా దాడి జరిగి 14 ఏళ్లు కూడా కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశాల్లో నివసిస్తున్న రష్యా పౌరులకు రక్షణ అవసరమని అధ్యక్షుడు పుతిన్ వాదిస్తారని కూడా కొందరు భయపడుతున్నారు. ఇదే సాకుతో 2008లో తన సైన్యాన్ని జార్జియాలోని దక్షిణ ఒస్సేటియాకు పంపడాన్ని పుతిన్ సమర్థించుకున్నారు. ఈ రోజు వరకు జార్జియా భూభాగంలో 20 శాతం రష్యా ఆధీనంలో ఉంది.
అయితే, రష్యన్ ప్రజల రాక జార్జియాకు ప్రయోజనకరంగా ఉంటుందని టెక్ వ్యవస్థాపకుడు లెవ్ కలాష్నికోవ్ అభిప్రాయపడ్డారు. ఇలా వలస వస్తున్న వారి కోసం ఆయన ఒక గ్రూప్‌ను సృష్టించారు.
"నేను క్యూలో నిలబడ్డప్పుడు నా ముందు 50, వెనుక 50 మంది ఉన్నారు. ఈ వ్యక్తులు నా గ్రూప్‌లో మొదటి సబ్‌స్క్రైబర్లు అయ్యారు. ఇప్పుడు మా గ్రూపులో దాదాపు 4000 మంది సభ్యులు ఉన్నారు" అని కలాష్నికోవ్ వెల్లడించారు.
ఇళ్లు ఎక్కడ దొరుకుతాయి, బ్యాంకు ఖాతా ఎలా తెరవాలి, ఓపెన్ ప్లేసులలో రష్యన్ భాష మాట్లాడటం మంచిదేనా లాంటి విషయాలను ఈ గ్రూప్‌లో చర్చిస్తారు. యవ్జెనీ లియామిన్ జార్జియన్ భాష మాట్లాడటం, రాయడం నేర్చుకుంటున్నారు.
"నేను పుతిన్‌కు వ్యతిరేకిని, యుద్ధానికి వ్యతిరేకిని. ఇప్పటికీ నా రష్యన్ బ్యాంక్ ఖాతా నుండి డబ్బు తీసుకోలేను. నేను యుక్రెయిన్ ప్రజల బాధల గురించే మాట్లాడుతున్నాను'' అని లియామిన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కర్ణాటక హైకోర్టు: హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదు
- యుక్రెయిన్ శరణార్థుల ఆకలి తీర్చి, ఆదుకుంటున్న భారతీయులు- గ్రౌండ్ రిపోర్ట్
- 365 మంది మహిళలతో డేటింగ్ తన టార్గెట్ అంటున్న యువకుడి అసలు లక్ష్యం ఏంటి?
- హాజీ మస్తాన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- కాకినాడ, చెన్నై మధ్య రోజూ వందల పడవలు తిరిగిన జలమార్గానికి ఇప్పుడేమైంది
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












