యుక్రెయిన్: బాంబుల మోత మధ్య కొవ్వొత్తుల వెలుగులో ప్రసవించిన మహిళ

ఫొటో సోర్స్, Anna Tymchenko
- రచయిత, అబ్దుజలీల్ అబ్దురసులోవ్
- హోదా, బీబీసీ న్యూస్, కీయెవ్
అన్నా టెంచెంకో హడలిపోయారు. ఆమె అనేక గంటల పాటు పురిటినొప్పులు పడ్డారు. అదేసమయంలో ఆమె ఉన్న పట్టణం మొత్తం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. బాంబుల శబ్దానికి ఆమె ఉంటోన్న అపార్ట్‌మెంట్ తలుపులు, కిటికీలు కదులుతున్నాయి. కరెంట్ కోత, నీటికొరతతో పాటు వైద్యసదుపాయం అందుబాటులో లేని ఆ ఇంట్లో ఆమెతో పాటు ఆమె భర్త చిక్కుకుపోయారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణమైన 'బుచా'పై బాంబుల వర్షం కురుస్తూనే ఉంది.
21 ఏళ్ల అన్నా, తన భర్త, సోదరునితో కలిసి తొలుత అపార్ట్‌మెంట్ బ్లాకుల్లో ఏర్పాటు చేసిన బేస్‌మెంట్‌లో తలదాచుకున్నారు. కానీ విద్యుత్ కోతల కారణంగా బేస్‌మెంట్ చిమ్మచీకటిగా మారిపోయింది. హీటర్లు పనిచేయక చలి భరించలేని స్థాయికి పెరిగింది.
ఈ పరిస్థితుల్లో బుచా పట్టణంలో ఉండాలో లేక అక్కడినుంచి వెళ్లిపోవాలో తెలియక అన్నా భర్త వొలొదిమీర్ మీమాంసలో పడిపోయారు. చివరకు వారు కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించిన సమయంలో... రష్యా సైనికుల వాహన శ్రేణి తమ దారిలో వస్తున్నట్లు తెలియడంతో మళ్లీ వెనక్కి తిరిగి అదే ఇంటికి చేరుకున్నారు.
''ఆ తర్వాతే మేం అపార్ట్‌మెంట్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాం'' అని బీబీసీతో అన్నా చెప్పారు.
''బిడ్డకు జన్మనివ్వడానికి నేను ధూళి, దుమ్ముతో కూడిన బేస్‌మెంట్ కంటే అపార్ట్‌మెంట్‌నే ఎంచుకున్నాను. నాకు గాలి పీల్చుకోవడం కష్టమైంది. నా ఊపిరితిత్తులూ దెబ్బతిన్నాయి'' అని ఆమె అన్నారు.
మార్చి 7 రాత్రి సమయంలో ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. సహాయం కోసం పొరుగువారిని పిలిచారు. సహాయం చేసేందుకు వారు ముందుకు వచ్చినప్పటికీ, వారెవరికీ కాన్పు చేసిన అనుభవం లేదు.
ఆ ఘటన గురించి బీబీసీతో అన్నా పొరుగింటి మహిళ, 49 ఏళ్ల విక్టోరియా జబ్రోద్‌స్కాయా మాట్లాడారు. ''ఒకవేళ ఏదైనా జరిగితే ఏం చేయాలో మాకు ఏమీ తెలియదు. అందుకే మేం చాలా ఆందోళన చెందాం'' అని ఆమె చెప్పారు.
గదిలో కొవ్వొత్తుల వెలుతురు మాత్రమే ఉంది. బాటిళ్లలో అందుబాటులో ఉన్న నీరు కూడా గడ్డకట్టేంత చల్లటి స్థితిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Anna Tymchenko
''అలాంటి పరిస్థితుల్లో నేను ప్రసవిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. అది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇదే నాకు తొలి కాన్పు. అందుకే ప్రసవం గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు'' అని ఆమె చెప్పారు.
ఏమీ తోచని పరిస్థితుల్లో ఫోన్ ద్వారా వైద్య సిబ్బందితో మాట్లాడేందుకు అక్కడున్న మహిళలు ప్రయత్నించారు. కానీ ఫోన్ సిగ్నల్ అందలేదు. బాల్కనీలోకి వెళ్లి ప్రయత్నించిన తర్వాత వారు అతికష్టమ్మీద ఒక గైనకాలజిస్టుతో మాట్లాడగలిగారు. ప్రసవం చేయడానికి వస్తానని చెప్పిన ఆయన ఆ తర్వాత రాలేదు.
మరుసటి రోజు ఆయన క్షమించమని కోరుతూ సందేశం పంపారు. రష్యన్ బలగాలు ఆపివేశాయని, ఫోన్‌ను పగులగొట్టారని ఆయన రాలేకపోవడానికి గల తన పరిస్థితిని వివరించారు.
అన్నా ఇరుగుపొరుగువారే చివరకు ఆమెకు ప్రసవం చేయాల్సి వచ్చింది. అందులో ఇరీనా యజోవా అనే ఒక మహిళకు మాత్రమే వైద్యంలో కాస్త ప్రవేశం ఉంది.
''బిడ్డ తల బయటకు వచ్చినప్పుడు మేం చాలా భయపడ్డాం. శిశువు నీలం రంగులో కనిపించింది. మాకేం చేయాలో తెలియదు. అప్పుడు ఇరీనా బిడ్డ తలను కాస్త కదలించడంతో ఆమె పూర్తిగా బయటకు వచ్చింది. తొలుత పాప ఏడవలేదు. దీంతో మేం ఆమెను వీపుపై కొట్టడం ప్రారంభించాం. ఆ తర్వాత పాప ఏడుపు వినిపించింది. మాకు చాలా సంతోషం కలిగింది'' అని విక్టోరియా చెప్పుకొచ్చారు.
పాప అలీషాను చూసిన తర్వాతే అన్నా భర్త వొలొదిమీర్‌కు ఉపశమనం కలిగింది. ఆయన ఆనందంతో ఏడ్చారు. మార్చి 8న అంటే అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజునే అలీషా జన్మించింది.
ఇది జరిగిన రెండు రోజుల అనంతరం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, యుక్రెయిన్ ప్రభుత్వం అంగీకరించిన తరలింపు కారిడార్లలో బుచా పట్టణం కూడా ఉన్నట్లు ప్రకటన వచ్చింది.
''సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలా? వద్దా? అని ఒక రాత్రంతా ఆలోచించాం'' అని అన్నా చెప్పారు.
చివరకు తమ నవజాత శిశువుతో కలిసి బుచా పట్టణాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వెళ్లే దారి సురక్షితమేనా అని అందర్నీ తెలుసుకుంటూ వారు ప్రయాణం సాగించారు. ఫోన్‌లో ప్రాంతాలకు సంబంధించిన మ్యాపులను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Anna Tymchenko
21 కార్లు, రాజధాని కీయెవ్ వైపు నడిచాయి. ప్రసవంలో అన్నాకు సహాయం చేసిన విక్టోరియా కారు వారి వాహనశ్రేణిలో ముందు నడిచింది. కారుపై తెలుపు రంగు జెండాను ఏర్పాటు చేసుకున్నారు. దానిపై పిల్లలు ఉన్నారనే సంకేతాన్ని ఏర్పాటు చేశారు.
''దారిలో మేం భయంకరమైన పరిస్థితులను చూశాం'' అని అన్నా చెప్పారు.
''సినిమాల్లో తప్ప నిజ జీవితంలో అలాంటి సీన్లను చూడాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు. రోడ్లపై శవాలు పడి ఉన్నాయి. ఇళ్లన్నీ ధ్వంసం అయ్యాయి. రష్యా యుద్ధ ట్యాంకులు పార్క్ చేసి ఉన్నాయి. వాటి బ్యారెల్స్ గురి రోడ్లవైపే ఉంది. మేం ఆ దారిలో ప్రయాణిస్తున్నప్పడు వారు కాల్చివేస్తారేమోనని మేం చాలా భయపడ్డాం'' అని ఆమె వివరించారు.
కొన్ని గంటల తర్వాత శరణార్థులంతా రష్యా చెక్ పాయింట్లు అన్నీ దాటుకొని సురక్షితంగా కీయెవ్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
''మేం అక్కడి నుంచి బయటపడిన తర్వాత నేను నవ్వకుండా ఉండలేకపోయాను. మేం తప్పించుకోగలిగామనే సంగతిని నేను నమ్మలేకపోయాను'' అని అన్నా చెప్పారు.
తల్లిగా కొత్త జీవితాన్ని అన్నా ఆస్వాదిస్తున్నారు. చిన్నారిని తన తల్లిదండ్రులకు పరిచయం చేయాలని ఆమె ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె బంధువుల్లో చాలామంది ఇప్పటికే దేశం వదిలి వెళ్లిపోయారు. కానీ అన్నా, ఆమె భర్త దేశాన్ని వదల్లేరు. ఇంకా పూర్తిగా సురక్షితంగా ఉన్న భావన తనకు రావట్లేదని అన్నా చెప్పారు.
''బుచాలో ఏం జరుగుతోంది? దేశం పరిస్థితి ఏంటి? అనే అంశం చుట్టే నా ఆలోచనలన్నీ తిరుగుతున్నాయి. ఇది నమ్మశక్యంగా లేదు. కానీ త్వరలోనే మేం మా ఇంటికి తిరిగి వెళ్తామని నేను నమ్ముతున్నా'' అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటే ధరలు తగ్గుతాయా
- పవన్ కల్యాణ్: జనసేనాని 'జన నేత' ఎందుకు కాలేకపోతున్నారు? జనసేన పార్టీ ఎందుకు ఎదగడం లేదు?
- గుండె, కిడ్నీ మార్పిడికి ఇక వేచి చూడక్కర్లేదా? మనుషులకు పందుల అవయవాలు సెట్ అయినట్లేనా?
- జంగారెడ్డిగూడెంలో 18 మంది మృతి: ఇవి నాటుసారా కల్తీ మరణాలా? సహజ మరణాలా?
- ‘అనుభవం ఉందా’ అని అడిగే కంపెనీలకు ఆన్సర్ NATS
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











