బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు పట్టాలి? పాలు బాగా పడాలంటే ఏం తినాలి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, శిరీష పాటిబండ్ల
- హోదా, బీబీసీ కోసం
"బిడ్డకు వాళ్ళమ్మ రొమ్ము పట్టించారా?" ఈవెనింగ్ రౌండ్స్‌లో సిస్టర్‌ని అడిగితే నేల చూపులు చూశారేగానీ, జవాబు చెప్పలేదు. మరో మాట అడిగే లోపే బెడ్డు ప్రక్కనే కూర్చున్న బాలింత అమ్మగారు చొరవ తీసుకుంటూ, "అబ్బే ఇంకా లేదండీ, పెద్దాపరేషన్ కదా, అప్పుడే ఎలా కుదురుతుందండి? మూడో రోజు ఇద్దామని నేనే చెప్పాను" అన్నారు.
"మరి తెల్లవారుజాము నుంచీ బిడ్డకు ఆహారం ఏమిటి ఉమా?" కాస్త గట్టిగానే అడిగాను సిస్టర్‌ని.
"వాళ్లేమో, పొద్దుటే ఫ్లాస్కులో ఆవు పాలు తెచ్చుకున్నారండీ, పాల సీసాతో అవే తాగిస్తున్నారు, నేనెంత చెప్పినా వినడం లేదు" అన్నారు ఉమ.
నా కోపానికి తాళింపు వేయడానికి చంటి బిడ్డ అమ్మమ్మ గారు మళ్లీ రంగంలోకి దూకారు.
"అసలు మా రాధకి మొదటిసారి కూడా పాలు పడలేదండీ. పెద్దాడికి ఆవు పాలే పట్టించాం. వాతం చేయకుండా నీళ్లు కూడా కలిపి మరిగించేదాన్ని. మగపిల్లాడు కదండీ.. బాగానే ఆకలిసేది. మూడు నెలల వయసుకే చక్కగా పూటకు రెండు సీసాలు పట్టేవాళ్ళం. ఈసారీ నాకు డౌటే. అందుకే మా పాలబ్బాయికి చెప్పి ఆవు పాలు తెప్పించాను" అన్నారు.
పైగా, చూశారా నేనెంత సూపర్ ప్లానింగ్‌తో ఉన్నానో అన్నట్టు మొహం పెట్టారు.
వయసుతో పాటు అనుభవమే కాదు మూర్ఖత్వమూ పెరగవచ్చు అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.

అపోహలు
ఆ పెద్దావిడ మాటలు (అపోహలు) మనం మరొక్కసారి గుర్తు చేసుకుందామా?
1. సిజేరియన్ కాబట్టి అప్పుడే పాలు రావు (మూడో రోజు సెంటిమెంట్)
2. అప్పుడే పాలు పట్టలేం (తల్లిని కదపలేం కాబట్టి)
3. ముందు కాన్పులో కూడా పాలు లేవు (కారణాలేమిటో?)
4. ఆవు పాలు మంచివి (మరి వాత మేమిటి? నీళ్లు కలపడమేమిటి?)
5. మగ పిల్లలు ఎక్కువ పాలు తాగుతారు (వాళ్ళెంత పసి వారైనా ఆడ, మగ భేదం తప్పదు)
6. ఈసారి కూడా పాలు రావు (ప్రత్యామ్నయం కూడా వెతికేసుకోవాలి)
7. పాల సీసా వాడేయొచ్చు (అస్సలేం పర్వాలేదు)
ఒక్కొక్క అపోహను విపులంగా చూద్దాం.
1. సిజేరియన్‌లోనే కాదు, సాధారణ కాన్పులో కూడా వెంటనే పాలు ధార కట్టవు. కానీ, పుట్టిన మొదటి గంటలోపు బిడ్డకు తల్లి రొమ్ము పట్టించాలి.
ఒక్కో చుక్క వచ్చినా ముర్రుపాలు అమృతతుల్యం. బిడ్డకు అది మొదటి టీకా. అలా బిడ్డ రొమ్ము చీకడం వల్ల పాల ఉత్పత్తి ఇంకా త్వరగా జరుగుతుంది. తల్లి నొప్పులకు కాస్త ఉపశమనం దొరుకుతుంది. బిడ్డకు తల్లి స్పర్శ వెచ్చదనం దొరుకుతుంది.
2. ఆపరేషన్ తర్వాత తల్లి వెల్లికిలా పడుకొని ఉంటుంది కాబట్టి బిడ్డ పాలు తాగడానికి అనువుగా ఉండదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు.
సాధారణ కాన్పు తర్వాత మెత్తని బట్టలో చుట్టిన బిడ్డను తల్లి ఛాతీ పైన బోర్లా పడుకోబెట్టుకోవచ్చు. ఆపరేషన్ అయితే కనీసం గంటకోసారి అయినా తల్లి ఎదపై బోర్లా పడుకోబెట్టి మరొకరి సహాయంతో పాలు పట్టొచ్చు. కాస్త నొప్పి, ఇబ్బంది తప్పవు మరి.
3. ముందు కాన్పులో తల్లి పాలు ఇవ్వలేక పోవడానికి కారణాలేమిటో ఆలోచించారా? డాక్టర్ తో చర్చించారా?
ఒకసారి వచ్చిన సమస్య ప్రతిసారీ తలెత్తుతుందనుకోవడం పెద్ద అపోహ.
4. ఆవు పాలు మంచివే, కానీ తల్లిపాల కంటేనా?
గేదె పాలతో పోల్చితే ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువ. అందువల్ల కేలరీలు తక్కువ. వంద గ్రాములు ఆవు పాల కేలరీలు వంద గ్రాముల తల్లి పాల కేలరీలతో సమానం (67cal).
అంతకుమించి తల్లి పాలకు, ఆవు పాలకు ఎటువంటి సారూప్యం లేదు. నీళ్లు కలపడం వలన మరిన్ని అనర్ధాలు కూడా.
5. ఆకలికి ఆడ, మగ భేదం ఉండదు. పసిపిల్లలైనా, ఎదిగిన పిల్లలైనా, పెద్దవారైనా సరే... ఎవరి ఆకలి వారిదే.
6. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి తల్లి పాల ప్రాముఖ్యత, బిడ్డ పోషణ, ఆరోగ్యం తదితర విషయాల్లో ఆమెకు తగినంత అవగాహన కల్పిస్తూ ఆ దిశలో కాబోయే తల్లిని ప్రోత్సహించటం మనందరి బాధ్యత.
అంతేగానీ, మనమే ముందుగా నిరుత్సాహ పరచడం, ఆమె తరపున నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు.
7. ఇక పాల సీసాల వల్ల వచ్చే అనర్ధాలు అన్నీ ఇన్నీ కావు. పొలమారడం, ఎక్కువ గాలి మింగేయడం అందువల్ల కడుపునొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్లు రావడం లాంటి ప్రమాదాలు అనివార్యం. పైగా బోలెడంత ఖర్చు, శ్రమ.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాలిచ్చే తల్లుల్లో ఎదురయ్యే సమస్యలు
ఇవి ప్రధానంగా మూడు రకాలు.
మొదటిది, ఎక్కువ శాతం మందికి ఉండే సమస్య.. చనుమొనలు సరిగ్గా లేకపోవడం. లోపలికి పూడుకు పోయినట్లున్నా, బాగా కురచగా లేదా బాగా లావుగా ఉన్నా (retracted nipples & short nipples) చనుమొనలు బిడ్డ అందుకోవటం చాలా కష్టమవుతుంది(difficult to latch).
తల్లికి పాల ఉత్పత్తి సరిగ్గా ఉన్నా బిడ్డ రొమ్ము పట్టడంలేదని, సునాయాసంగా ప్రత్యామ్నాయ మార్గం (పాల సీసా) ఎన్నుకుంటారు.
ఇక్కడ మనకు కావలసిందల్లా ఓపిక. కొన్ని సులభమైన టెక్నిక్ (syringe technique)లతో అలాంటి చనుమొనల్ని బిడ్డ పట్టడానికి అనువుగా సరిచేయవచ్చు.
గైనకాలజిస్ట్, ప్రసూతి నర్స్ కాన్పుకు ముందే ఇలాంటి సమస్యల్ని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రసవం తరువాత పరిష్కారం నేర్పాలి.
కొందరికి పాలిచ్చేటప్పుడు బిడ్డను సరైన పద్ధతిలో పట్టుకోకపోవడం వల్ల, మరీ లాగినట్లయి చనుమొనలు చిట్లినట్లు అవుతాయి. తొలిసారి తల్లి అయిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దానికోసం తాత్కాలికంగా నిపుల్ షీల్డ్ వాడొచ్చు.
అనుభవజ్ఞులైన నర్సులు బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ నేర్పుతారు. తద్వారా తల్లీబిడ్డలిద్దరికీ కూడా సులువుగా ఉంటుంది. బిడ్డ తక్కువ శ్రమతో తృప్తిగా పాలు తాగితే కనీసం రెండు గంటలు నిద్రపోతాడు.
మొదటి రెండు నెలల్లో బిడ్డకు ప్రతి రెండు గంటలకొకసారి పాలు పట్టాలి (రాత్రులైన సరే). నెలలు నిండే కొద్దీ పాలిచ్చే నిడివి కొంచెం పెంచుకుంటూ పోవచ్చు.
సిజేరియన్ అయింది కాబట్టి తల్లికి రెస్ట్ కావాలి అని రాత్రిళ్లు పోతపాలు పట్టే వారున్నారు. రాత్రిళ్లు పాలు ఇవ్వడం వల్ల తల్లి మెదడు నుంచి ప్రొలాక్టిన్ (prolactin hormone) ఎక్కువ స్రవిస్తుంది. ఇది పాల ఉత్పత్తికి కావల్సిన అతి ముఖ్యమైన హార్మోను. ఎంత రాత్రయినా తల్లి పాలివ్వడం బిడ్డకు క్షేమం.
బిడ్డ బరువు మరీ తక్కువగా (1.5Kg కంటే తక్కువ) ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా తల్లి పాలు పిండి ఇవ్వడం ఎంతో అవసరం.
ఇలాంటప్పుడు తల్లి ఆందోళనలను తగ్గించే విధంగా డాక్టర్లు, కుటుంబం తనకు ఆసరానివ్వాలి. తన పాలే బిడ్డకు అన్నింటికంటే ముఖ్యమైన మందు అని తల్లి సైతం భావించాలి.
తల్లి పాలు సులభంగా పిండటానికి ఇప్పుడు చాలా ఆధునాతన బ్రెస్ట్ పంప్స్ లభిస్తున్నాయి. నిస్సంకోచంగా వాటిని వాడవచ్చు. మెటర్నటీ లీవ్ తక్కువగా ఉండే ఉద్యోగస్తులు సైతం వీటిని ఉపయోగించవచ్చు.
అనారోగ్యంగా ఉన్న బిడ్డకు ఆస్పత్రిలో అయితే ట్యూబ్ ద్వారా పాలు పడతారు. పిండిన పాలు గది ఉష్ణోగ్రతలో 6 గంటలు, సాధారణ ఫ్రిడ్జిలో ఒకరోజు పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు పిండి ఉంచిన పాలు ఉగ్గు గిన్నెలో పట్టొచ్చు.
సాధారణ జలుబు నుంచి హెచ్. ఐ. వి. ఇన్ఫెక్షన్ వరకూ ఎటువంటి జబ్బులు ఉన్నా బిడ్డకు పాలివ్వడం ఆపనవసరం లేదు.
కరోనా సోకినా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని తల్లి పాలివ్వచ్చు. రొమ్ములో చీము (mastitis/breast abscess) గడ్డకడితే తాత్కాలికంగా ఆవైపు పాలివ్వడం ఆపాలి.
కేవలం కొన్ని రకాల కేన్సర్ మందుల వాడకంలో పాలు ఇవ్వకూడదు.
పాలు పడకపోవడం
ఇకపోతే రెండో సమస్య, అసలు పాలు రాకపోవడం. ఇది చాలా అరుదు. దీనికి కారణాలు తల్లికి ఉండే వివిధ అనారోగ్యాలే.
తీవ్ర రక్తహీనత, కాన్పు సమయంలో అతిగా రక్తస్రావం, అధిక రక్తపోటు, ఏదైనా మానసిక అనారోగ్యం లాంటివి ఉంటే పాలు రాకపోవచ్చు. ఇందులో కొన్నింటికి సరైన చికిత్స ద్వారా కొంతయినా పరిష్కారం దొరుకుతుంది.
లేని పక్షంలో చంటి బిడ్డల కోసం రూపొందించిన మంచి బ్రాండ్ ఫార్ములా మిల్క్ (డబ్బా పాలు) ఎంచుకోండి. ఎందుకంటే, పలు పరిశోధనల తర్వాత హ్యూమన్ బేబీ కోసం ప్రత్యేకంగా రూపొందించినవి ఇవి.
వీటిల్లో సగటు పసిబిడ్డకు ఏ పోషకాలు ఎంత పాళ్ళలో ఉండాలో అలా ఉంటాయి. ఏ ఊరెళ్లినా, కూడా తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. కానీ రోగనిరోధక శక్తినివ్వడంలో ఇవి తల్లిపాల కెన్నడూ సాటి రావు. వీటికైనా ఉగ్గు గిన్నె మాత్రమే వాడాలి. చాలా ఖర్చు, చాలా సమయం వెచ్చించాలి కూడా.
బాలింతలు ఏం తినాలి? ఏం తినకూడదు?
ఇక మూడో సమస్య, ఏమి తినాలి, ఏమి తినకూడదు?!
పాలిచ్చే తల్లులు అతి ముఖ్యంగా రోజుకు 4-5 లీటర్లు నీరు తీసుకోవాలి. అర లీటరు వరకు మంచి పాలు కూడా. నెయ్యి, పప్పు, గుడ్డు, మాంసం, చేప సుష్టుగా తినొచ్చు.
ఏదైనా సరే తాజాగా, వేడిగా, ఇంట్లోనే తయారుచేసినదై తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. పచ్చి వెల్లుల్లి రెబ్బలు, పాలు, బొప్పాయి పండు, మాంసం పాల ఉత్పత్తికి ఎంతో మంచిది.
పప్పు తినకపోవడం, తక్కువ నీరు తీసుకోవడం, పాలు తాగకపోవడం వల్ల జరిగే అనర్థమే ఎక్కువ. కడుపులో మంట, మలబద్ధకం వస్తాయి. బిడ్డకు కడుపులో నులినొప్పి(evening colic) కలుగుతుంది. ప్రసూతి గాయాలు సైతం త్వరగా మానవు.
అందుకే చంటి బిడ్డలకు తల్లి పాలే ముద్దు. ఈ విషయంలో ఎటువంటి అపోహలకూ తావు లేదు. మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలు చాలు.
ఆ తర్వాత పై ఆహారం (complimentary diet) ఇస్తూ రెండేళ్ల వరకూ పాలు కొనసాగించవచ్చు. తల్లి పాలు తాగే పిల్లల్లో అధిక బరువు, స్థూల కాయం కూడా ఉండవు. మెదడు పనితీరు కూడా చురుకుగా ఉంటుంది. బాల్యంలో వచ్చే ఇన్ఫెక్షన్లే కాదు, భవిష్యత్తులో బి.పి, షుగర్లు కూడా దూరంగా ఉంటాయి.
అపోహలతో, అరకొర జ్ఞానంతో తల్లి పాల విషయంలో తొందరపడి ప్రత్యామ్నయాలు వెతక్కండి. తల్లీబిడ్డల మధ్య అడ్డుగోడలు కాకండి.
సరైన సమయంలో నిపుణుల సలహా తీసుకోండి. పట్టణాల్లో అయితే ఇప్పుడు లాక్టేషన్ కౌన్సిలర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. తల్లులు కూడా సందేహ నివృత్తి కోసం సంకోచించకండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునిసెఫ్ సంయుక్తంగా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తాయి. కాబోయే తల్లుల్లో, సమాజంలో తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్గించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం.
(రచయిత వైద్యురాలు.వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం.)
ఇవి కూడా చదవండి:
- తల్లి పాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయా... పాలిచ్చే తల్లి మద్యం తాగవచ్చా?
- గర్భిణులు ఏం తినాలి, ఎంత బరువు ఉండాలి? అపోహలు, వాస్తవాలు
- తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు
- 175 ఏళ్ల కిందట అనెస్థీషియా ఎలా పుట్టింది? పూర్వకాలంలో మత్తు మందు లేకుండా ఆపరేషన్లు ఎలా చేసేవాళ్లు? తొలినాళ్లలో వాడిన 4 మత్తు మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 'వృద్ధాప్యం ఒక వ్యాధి, దాన్ని నయం చేయవచ్చు' -హార్వర్డ్ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లెయిర్
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- కాన్పు నొప్పులను తట్టుకొనేందుకు వీఆర్ హెడ్సెట్
- గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి కండరాలు... పుట్టిన తరువాత ఏమై పోతున్నాయి...
- అండ దానం: ‘కొన్ని కుటుంబాల ఆశలు నామీదే ఉన్నాయి’
- సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- ‘ఈ ఆహారం తీసుకుంటే మతిమరుపు రాదు, మెదడు చురుగ్గా పని చేస్తుంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











