జంగారెడ్డిగూడెంలో 18 మంది మృతి: ఇవి నాటుసారా కల్తీ మరణాలా? సహజ మరణాలా?

కల్తీ సారా ఘటనపై ఆందోళన చేస్తోన్న మహిళలు
ఫొటో క్యాప్షన్, కల్తీ సారా ఘటనపై ఆందోళన చేస్తోన్న మహిళలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది ప్రాణాలు పోయాయి. వాళ్లంతా ఒకే విధమైన లక్షణాలతో మరణించారు. అందరికీ ఉన్నట్టుండి వాంతులు, కడుపునొప్పి రావడం, పల్స్ రేట్ పడిపోయి హఠాత్తుగా ప్రాణం పోయినట్టు మృతుల బంధువులు, వైద్యులు చెబుతున్నారు.

ఈ మరణాలకు కారణం నాటుసారాలో కల్తీ జరిగిందనే అభిప్రాయం స్థానికుల నుంచి వస్తోంది. బాధిత కుటుంబాలు కూడా అదే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రభుత్వం వీటిని తోసిపుచ్చుతోంది. ఆధారాలు లేవంటూ కొట్టిపారేస్తోంది. కోవిడ్ తర్వాత తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలే ఈ మరణాలకు కారణమని చెబుతోంది.

చింతపల్లి సూరిబాబు
ఫొటో క్యాప్షన్, చింతపల్లి సూరిబాబు

సారా తాగడం వల్లే..

చింతపల్లి సూరిబాబు స్థానికంగా థియేటర్‌లో పనిచేస్తారు. నెలకు రూ.9 వేలు జీతం వచ్చేది. భార్య కూడా కూలీ పనులకు వెళుతోంది. వీరికి ఇద్దరు బిడ్డలు. ఒకరు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పెద్ద కొడుకు చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు. ఈ కుటుంబం జంగారెడ్డిగూడెంలోని మదర్ థెరీసా వీధిలో పూరిగుడిసెలో జీవిస్తోంది. సూరిబాబు మార్చి 8న రోజువారీ డ్యూటీలో భాగంగా సినిమా థియేటర్ వద్ద పనికి వెళ్లి రాత్రి 12 తర్వాత ఇంటికి చేరారు. అప్పటికే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వివిధ జాతరలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా, అనేక మంది మద్యం ప్రియులు నాటుసారా తాగుతున్నారు."మా ఆయన కూడా చాలా కాలంగా మందు తాగుతున్నారు. నాటుసారానే ఎక్కువగా దొరుకుతుంది. అందుకే అది తాగుతున్నారు. ఆ రోజు కూడా రోజూ మాదిరిగా తాగి వచ్చారు. పడుకున్న తర్వాత కొంత సేపటికి వాంతులు అయ్యాయి. కడుపు నొప్పి వస్తోందని అరిచారు. మాకు ఏమీ అర్థం కాలేదు. మామూలు నొప్పే అనుకున్నాం. ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ దారిలోనే ఆయన ప్రాణం పోయింది. మాకున్న ఆధారం కోల్పోయాం. పిల్లలిద్దరూ ఒంటరి అయిపోయారు. ఆ తర్వాత తెలిసింది మా ఆయనతోపాటు ఊళ్లో చాలా మంది ఇలానే చనిపోయారని..." అంటూ సూరిబాబు భార్య రత్నకుమారి కన్నీటిపర్యంతమయ్యారు.

మార్చి 9న సూరిబాబు మరణించారు. అదే సమయంలో జంగారెడ్డిగూడెంలోని వివిధ ప్రాంతాల్లో 16 మంది మరణించారు. ఆ తర్వాత 11, 12 తేదీల్లో మరో ఇద్దరు మరణించారు. ఇలాంటి లక్షణాలతోనే వారంతా చనిపోయారు. అందరూ సామాన్యులే. వీరిలో రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, లారీ క్లీనర్లు ఉన్నారు.

బండారు శ్రీను
ఫొటో క్యాప్షన్, బండారు శ్రీను

ఎప్పుడు కావాలంటే అప్పుడే సారా

సూరిబాబు మాదిరే బండారు శ్రీను కూడా మరణించారు. ఆయన భవన నిర్మాణ కూలీ. సారా తాగి తన భర్త చనిపోయాడని ఆయన భార్య లక్ష్మి బీబీసీతో చెప్పారు. పోలీసులు, అధికారుల విచారణలో కూడా ఆమె ఈ విషయం చెప్పారు.

"పనిలోంచి వచ్చినప్పుడు తాగి వచ్చేవారు. ఆ తర్వాత మళ్లీ రాత్రి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి సారా తాగేవారు. సారా ఎక్కడపడితే అక్కడే దొరికేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేవారు. చాలా రోజులుగా సారానే తాగుతున్నారు. రోజువారీ సారానే కదా అనుకున్నాం. కానీ 9వ తేదీ తెల్లవారుజామున వాంతులు చేసుకున్నారు. పొద్దున్నే ఆటోలు దొరకకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. చివరకు ఆస్పత్రిలో చేర్చాం. కోలుకుంటున్నట్టే కనిపించారు. కానీ హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. మాకు దిక్కెవరిప్పుడు" అంటూ లక్ష్మి వాపోయారు.

అసెంబ్లీ వద్ద టీడీపీ ఆందోళన
ఫొటో క్యాప్షన్, అసెంబ్లీ వద్ద టీడీపీ ఆందోళన

సారా అమ్మకాలకు అడ్డులేదు..

జంగారెడ్డిగూడెం ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉంటుంది. పైగా, ఏజెన్సీ పరిధిలో ఉంటుంది. నాటుసారా విక్రయాలు చాలా పెరిగాయని స్థానికులు అంటున్నారు. ఎక్సైజ్, పోలీస్ అధికారుల దాడులు కూడా నామమాత్రంగా మారాయని ఆరోపిస్తున్నారు.

భారీ లాభాల కోసం ఆశపడి అమ్మోనియా సహా వివిధ రకాల ప్రమాదకర పదార్థాలు కలిపి అమ్మడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయని స్థానిక న్యాయవాది ఎం.రవి బీబీసీతో అన్నారు.

"బ్రాందీ షాపులు సిండికేట్ల చేతుల్లో ఉన్నప్పుడు వాళ్లు సారా ఆపేందుకు కొంత ప్రయత్నించేవారు. వారి ఒత్తిడితో అధికారులు కూడా కదిలేవారు. కానీ ఇప్పుడు రైడ్స్ జరగడం లేదు. పట్టణంలోనే సారా అమ్మకాలు చాలా పెరిగాయి. అధికార పార్టీ నేతల అనుచరులలో ఇలాంటి సారా వ్యాపారులు ఉన్నారు. సారా వ్యాపారంలో లాభాల కోసం ప్రమాదకరమైన రసాయనాలు కలిపేస్తున్నారు. అదే ప్రాణాల మీదకు వచ్చింది" అని ఆయన ఆరోపించారు.

అధికార పార్టీ అనుచరుల్లో సారా వ్యాపారులు ఉన్నారనే ఆరోపణలను వైసీపీ ఖండించింది. పండుగల సమయంలో సారా అమ్మకాలు పెరగడం వల్ల తయారీ త్వరగా జరగాలని ఇలాంటి రెడీమేడ్ యత్నాలు చేశారని, వాటి వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అనుకుంటున్నామని న్యాయవాది రవి చెప్పారు.

మీడియాలో అప్పుడప్పుడూ కథనాలు వస్తే అరకొరగా చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత యథాస్థితిలో కొనసాగడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, ఖర్జూర కల్లు: చెట్టు మీంచి కుండ దించక ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు

పూడ్చిన మృతదేహం వెలికితీసి శవపరీక్ష

మార్చి 9 తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది మరణించగా, వారిలో 16 మంది శవాలను దహనం చేశారు. ఇద్దరి మృతదేహాలను ఖననం చేశారు. వారిలో మడిచర్ల అప్పారావు అనే వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసి, నాటుసారా వల్లే చనిపోయారనే ఆరోపణల దృష్ట్యా పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. నివేదిక రావాల్సి ఉందని వైద్యులు బీబీసీకి తెలిపారు.

ఈ మరణాలపై జంగారెడ్డిగూడెం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలతో బీబీసీ మాట్లాడింది.

"నాటుసారాలో రసాయనాలు కలపడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. హఠాత్తుగా అది ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం చనిపోయిన వారిలో ఇద్దరిని మాత్రం మా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మొదట చికిత్సకు బాగా స్పందించడంతో కోలుకున్నారని భావించాం. కానీ హఠాత్తుగా ప్రాణం వదిలారు. రెండో వ్యక్తిని ఏలూరుకు పంపించాం. మార్గం మధ్యలోనే ఆయన కూడా మృతి చెందారు. మేమే కార్డియాక్ సమస్యలుగా నిర్ధరించాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ) కాకపోవడంతో పోస్ట్ మార్టం చేయలేదు. వీరంతా నాటుసారా కారణంగా ఇలాంటి స్థితికి చేరారని మేం ఆ రోజు భావించలేదు" అని ఆమె తెలిపారు.

నాటు సారా

ఫొటో సోర్స్, Getty Images

భిన్నమైన వాదనలు చేస్తున్న ప్రభుత్వం

జంగారెడ్డిగూడెం మరణాలపై ఆరోగ్యశాఖ, ఎక్సైజ్‌శాఖ మంత్రులు భిన్నంగా స్పందించారు. 18 మంది మృతుల్లో ముగ్గురికే నాటుసారా తాగే అలవాటు ఉందని మంత్రి ఆళ్ల నాని చెబుతున్నారు. మృతుల్లో ఐదుగురి కుటుంబాలను బీబీసీ సంప్రదించింది. మరణాలకు నాటుసారాయే కారణమని ఆ ఐదు కుటుంబాల్లోని బాధితుల బంధువులు ఆరోపించారు.

"నిష్పక్షపాతంగా విచారణ చేశాం. ఒకరికి మాత్రమే పంచనామా చేయడానికి అవకాశం దొరికింది. శాంపిల్స్‌ విజయవాడలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాం. వారి నివేదిక తర్వాత అనుమానాలు తీరుతాయి. చనిపోయిన 18 మందిలో 15 మంది అనారోగ్య కారణాల వల్ల చనిపోయారని వైద్యారోగ్యశాఖ అధికారులు నివేదించారు. అదీకాక ఈ మరణాలన్నీ ఒకరోజు సంభవించినవి కావు. ఎక్కడ తాగారు అన్నదానికి ఎలాంటి ఆధారాలూ లేవు. అయినా సరే, ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు" అని ఆళ్ల నాని చెప్పారు.

ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి మాత్రం ఈ మరణాలన్నీ పోస్ట్ కోవిడ్ సమస్యలతోనేనని వ్యాఖ్యానించారు. ఓవైపు ఈ మరణాలకు నాటుసారా కారణం కాదని చెబుతూనే, మరోవైపు నాటుసారా నియంత్రణ చర్యలను అధికారులు చేపడుతున్నారు.

జంగారెడ్డిగూడెం ఘటన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బంది హడావుడి మొదలైంది. వరుసగా పలు చోట్ల సారా తయారీ, విక్రయాలపై దాడులు చేస్తున్నారు.

గత వారంలోనే 47 కేసులు నమోదు చేసినట్టు ప్రకటించారు. 48 మందిపై కేసులు నమోదయినట్టు జంగారెడ్డిగూడెం ఆర్డీవో తెలిపారు. ఈ దాడుల్లో 466 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, మూడు వాహనాలను సీజ్‌ చేసినట్టు వెల్లడించారు. 9,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు.

జంగారెడ్డిగూడెం మరణాలపై సమగ్ర విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీపీఎం సీనియర్ నేత పి.మధు మార్చి 13న బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని, సారా అమ్మకాలు అదుపు చేయాలని డిమాండ్ చేశారు.

మార్చి 14న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జంగారెడ్డిగూడెంలో పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పయనమయ్యారు. మద్యం నియంత్రణలో ప్రభుత్వం విఫలమయ్యిందని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

54 వేల మందిలో 90 మంది చనిపోవడమనేది సహజమే అన్న జగన్మోహన్ రెడ్డి

జంగారెడ్డి గూడెంలో జరిగినవి సహజ మరణాలేనని, అవి కల్తీ సారా వల్ల జరిగినవి కావని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది.

కల్తీ సారా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అక్రమంగా రవాణా చేసే వారిని ఉక్కు పాదంతో అణచివేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

జంగారెడ్డి గూడెంలో ప్రస్తుతం సుమారు 54 వేల జనాభా ఉండొచ్చని, ఇంత జనాభాలో సజహంగానే 90 మంది వరకు చనిపోతారని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)