ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన మద్యం ధరలు.. స్మగ్లింగ్ పెరగటంతో సర్కారు నిర్ణయం - Press Review

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.
ఏపీలో మీడియం, ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు తగ్గాయి. గత నెలలో చీప్‌లిక్కర్ ధరలు తగ్గించి.. మీడియం, ప్రీమియం మద్యం ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటినీ గణనీయంగా తగ్గించింది.
తగ్గించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని పత్రికలో రాశారు.
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వీటి ధరలు ఎక్కువ కావడం, స్మగ్లింగ్ పెరిగి, విక్రయాలు తగ్గి ఆదాయానికి గండి పడుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగింది.
తాజాగా ప్రభుత్వం చేపట్టిన ధరల సవరణలతో అన్ని స్థాయిల్లోనూ మద్యం రేట్లు తగ్గించినట్లయింది.
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ప్రతిపాదనల మేరకు ఈ ధరల సవరణ చేపట్టినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ గురువారం ఉత్తర్వులు జారీచేశారని కథనంలో చెప్పారు.
క్వార్టర్ రూ. 200 కంటే ఎక్కువ ధర ఉండే మద్యం రకాల్లో క్వార్టర్‌పై రూ. 100-250, హాఫ్‌పై రూ.200-500, ఫుల్‌పై రూ. 400-1,000, లీటర్‌పై రూ.540-1,350 వరకూ ధరలు తగ్గించారు. మొత్తం ఎనిమిది విభాగాల్లో ధరలు తగ్గాయి.
ఈ ఏడాది మే 3న మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. పొరుగునున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ రేట్లు ఎక్కువ కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం స్మగ్లింగ్ భారీగా పెరిగిందని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం కొనుగోళ్లకు కరోనా దెబ్బ
కరోనా వల్ల బంగారం డిమాండ్ తగ్గిపోయిందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.
కరోనా వైరస్ ప్రభావం దేశీయ పసిడి మార్కెట్‌పైనా పడింది. ఈ జూలై-సెప్టెంబర్ (క్యూ3)లో 30 శాతం కొనుగోళ్లు పడిపోయినట్లు గురువారం విడుదల చేసిన నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలియజేసింది.
కొవిడ్-19 పరిస్థితులకుతోడు మార్కెట్‌లో అధిక ధరలు సైతం కొనుగోలుదారులను దూరం చేశాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ పీటీఐకి తెలిపారు.
అయితే ఏప్రిల్-జూన్‌తో పోల్చితే పెరిగాయని, నాడు 64 టన్నుల కొనుగోళ్లే జరిగాయని వివరించారు. ఆగస్టులో లాక్‌డౌన్ సడలింపులు, కాస్త ధరలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చాయన్నారు.
కాగా, కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు ప్రముఖ సంస్థలు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యతనిచ్చారని, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)కూ ఆదరణ పెరిగిందని చెప్పారు.
అయితే ఆర్థిక మాంద్యంతో ప్రభావితమైన 2009 లోనూ బంగారం డిమాండ్ భారీగా పడిపోయిందని, అయినప్పటికీ తర్వాతి సంవత్సరాల్లో ఒక్కసారిగా పుంజుకున్నదని సోమసుందరం గుర్తుచేశారు.
అలాగే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పసిడి కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారని పత్రిక చెప్పింది.
అంతర్జాతీయంగానూ బంగారం డిమాండ్ అంతంతమాత్రంగానే ఉన్నది. గ్లోబల్ గోల్డ్ డిమాండ్ ఈ జూలై-సెప్టెంబర్‌లో 19% క్షీణించి 892.3 టన్నులుగా నమోదైంది. 2009 క్యూ3 నుంచి ఇదే అత్యల్పం అని నమస్తే తెలంగాణ వివరించింది.

ఏపీలో మూడు దశల్లో తెరుచుకోనున్న స్కూళ్లు
నవంబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు ప్రారంభిస్తారని సాక్షి కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు.
కోవిడ్ వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తరగతుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు.
దీని ప్రకారం.. నవంబర్ 2 నుంచి 9, 10, 11/ఇంటర్ మొదటి సంవత్సరం, 12/ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు.. హాఫ్‌డే మాత్రమే నిర్వహిస్తారు.
ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో తరగతులు ఉంటాయి.
నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులకు బోధన మొదలవుతుంది. డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను ప్రారంభిస్తారు.
1 నుంచి 8వ తరగతి వరకు కూడా రోజు విడిచి రోజు, హాఫ్‌డే మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని సాక్షి వివరించింది.
అల్లుడిని నరికి చంపి.. పోలీసులకు లొంగిపోయిన అత్త
అల్లుడితో వివాహేతర సంబంధం బెడిసికొట్టడంతో ఒక అత్త అతడినే నరికి చంపిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.
తన ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తనకు దూరమవుతాడనే ఉద్దేశంతో అతడికి తన కూతురునే ఇచ్చి వివాహం జరిపించి ఆమె గొంతు కోసింది.
కూతురు ఆత్మహత్య కేసు నుంచి బయటపడేలా చేయమంటూ అల్లుడుగా మారిన ప్రియుడు కొన్నాళ్లుగా వేధించడంతో అతడిని కత్తితో నిర్ధాక్షిణ్యంగా నరికి చంపిందని పత్రిక రాసింది.
ఆ నిందితురాలు వేలూరి అనిత (38). రామంతాపూర్ శ్రీనగర్ కాలనీలో గురువారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.
అనిత వృత్తి కేటరింగ్. మనస్పర్థలు రావడంతో భర్త బాబురావుతో చాన్నాళ్ల క్రితం విడిపోయింది. ముగ్గురు పిల్లలతో కలిసి మీర్‌పేటలోని అల్మా్‌సగూడలో ఉండేది.
వంటల పనుల్లో పరిచయమైన పేరం నవీన్ కుమార్ (32) అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
నవీన్‌తో తన సంబంధం శాశ్వతంగా ఉండాలని, అతడు ఎప్పుడూ తన ఇంట్లోనే ఉండాలనే ఉద్దేశంతో డిగ్రీ చదువుతున్న పెద్ద కుమార్తె వందన (19)ను అతడికిచ్చి అల్లుడిని చేసుకోవాలనుకుంది.
తల్లి కుట్ర తెలియని వందన, నవీన్‌తో పెళ్లికి ఒప్పుకొంది. గత ఏడాది డిసెంబరు 1న వందన, నవీన్ పెళ్లి జరిగింది. తర్వాత కొన్నాళ్లకే తన భర్తతో తల్లికి ఉన్న సంబంధం గురించి తెలియడంతో వేరు కాపురం పెడతామని నవీన్‌ను వందన కోరింది.
ఇది తెలిసి.. ఇంట్లో నుంచి నవీన్ వెళితే తాను చచ్చిపోతానంటూ అనిత బెదిరించింది. దిక్కుతోచని స్థితిలో వందన, సూసైడ్ నోట్ రాసి మార్చి 14న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తన చావుకు తల్లి, భర్తే కారణమని నోట్‌లో ఆమె పేర్కొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనిత, నవీన్‌పై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చాక నవీన్ విజయవాడ వెళ్ళిపోగా.. కుటుంబసభ్యులు దూరం పెట్టడంతో అనిత, సికింద్రాబాద్ పార్శిగుట్టలో ఉంటోంది.
15 రోజుల క్రితం ఇద్దరు కలుసుకున్నారు. రామంతాపూర్ శ్రీనగర్‌కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీనవం చేస్తున్నారు.
వందన ఆత్మహత్య కేసు విషయంలో కుటుంబీకులతో మాట్లాడి రాజీ కుదిరేలా చూడాలని అనితపై నవీన్ ఒత్తిడి తెచ్చాడు.
ఇదే విషయంలో వారం రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్లు స్థానికులు చెప్పారని కథనంలో రాశారు.
నవీన్ ప్రవర్తనతో విసిగిపోయిన అనిత, అతడిని ఎలాగైనా చంపాలని పథకం వేసింది. గురువారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న నవీన్‌పై చెట్లు నరికే పొడవాటి కత్తితో ముఖం, ఇతర శరీర భాగాలపై విచక్షణా రహితంగా దాడి చేసింది.
గాయాలతో పడుకున్నచోటే అతడు మృతిచెందాడు. అనంతరం తన ఒంటిపైన రక్తపు మరకలు ఉన్న దుస్తులను మార్చుకొని,
ఇంటికి తాళం వేసి ఉదయం 7:30 గంటల సమయంలో నేరుగా ఉప్పల్ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనితపై కేసు నమోదు చేశారని ఆంధ్రజ్యోతి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్కు మందు కనిపెట్టడంలో దారి చూపుతున్న 14 ఏళ్ల తెలుగమ్మాయి
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- సంజయ్ గాంధీకి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఇందిర భయపడిన రోజు..
- దళిత సర్పంచ్‌కు అవమానం: ''సమావేశాల్లో నేలపై కూర్చోమన్నారు.. జెండానూ ఎగురవేయనివ్వరు''
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- అజర్బైజాన్, అర్మేనియా: కాల్పుల విరమణను అజర్బైజాన్ సైనిక సన్నాహాలకు ఉపయోగించుకుందా
- పాకిస్తాన్‌లోని హిందూ ఆలయంలో విగ్రహాల ధ్వంసం
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








