యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రభావం భారత్‌లో కనిపించడం మొదలైందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్ మీద రష్యా దాడితో, ఆ ప్రభావం నేరుగా భారత్ మీద కూడా పడుతుందా?
ఈ విషయం మీద చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్ మీద ప్రత్యేక సైనిక చర్యల చేపడుతున్నట్లు ప్రకటించింది.
ఆ దాడుల ప్రభావం భారత ఆర్థికవ్యవస్థపై కూడా పడినట్లే కనిపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనమవుతోంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ మార్చి 9న రూ.76.14గా ఉంది. ఇవాళ అంటే మార్చి 17న డాలర్‍తో రూపాయి మారకం విలువ రూ.75.86కు చేరింది.
రూపాయి బలహీనం లేదా బలోపేతం కావడం వల్ల ఆ ప్రభావం నేరుగా ప్రజల జీవితాలపై పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం రూపాయి బలహీనపడ్డానికి కారణం
ప్రపంచంలో మూడు అతిపెద్ద చమురు ఉత్పాదక దేశాలు సౌదీ అరేబియా, రష్యా, అమెరికా.
ప్రపంచ చమురు ఉత్పత్తిలో 12 శాతం రష్యాలో, 12 శాతం సౌదీ అరేబియాలో, 16 నుంచి 18 శాతం అమెరికాలో జరుగుతుంది.
ఈ మూడింటిలో రెండు పెద్ద దేశాల్లో యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడితే, దానివల్ల నేరుగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతుంది.
భారత్ 85 శాతం చమురు దిగుమతి చేసుకుంటుంది. అందులో ఎక్కువగా సౌదీ అరేబియా నుంచి, మిగతాది గల్ఫ్ దేశాల నుంచి జరుగుతుంది.
ప్రపంచంలో ఎక్కువ దేశాలు వస్తువుల క్రయవిక్రయాలు డాలర్లలోనే సాగిస్తాయి. అందుకే డాలర్‌కు ప్రపంచ కరెన్సీ హోదా ఉంది.
భారత్ ఇప్పుడు 85 శాతం చమురు దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని, దానివల్ల భారత విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుందని ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పారు.
మరో విషయం ఏంటంటే, అనిశ్చితి సమయంలో జనం బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అందుకే, ప్రస్తుతం బంగారం దిగుమతి కూడా చాలా పెరుగుతోంది.
భారత్ ఈ రెండింటి మీదా ఇప్పుడు ఎక్కువగా ఖర్చు చేస్తోంది. అందుకే మన రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతోంది.
రూపాయి బలహీనపడితే మీపై పడే ప్రభావం
1. ద్రవ్యోల్బణం పెరుగుతుంది
సులభమంగా అర్థమయ్యేలా చెప్పాలంటే రూపాయి బలహీనపడడం అంటే, భారత్, విదేశాల్లో ఏయే వస్తువులు కొనుగోలు చేస్తోందో వాటన్నింటి ధరలు పెరుగుతాయి.
"ఐఫోన్, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులు, ఆటో పార్ట్స్, విదేశాల్లో విద్యకు అయ్యే ఖర్చు అన్నీ పెరుగుతాయి. పెయింట్ తయారీకి క్రూడ్ ఆయిల్ ఉపయోగిస్తారు. గత నెలగా పెయింట్ ధర 50 శాతం పెరిగింది" అని సీనియర్ జర్నలిస్ట్ ఆలోక్ జోషి చెప్పారు.
వీటితోపాటూ స్థానికంగా దొరికే వస్తువులపై కూడా ఈ ప్రభావం చూడవచ్చు. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు ధరలు పెరగడం వల్ల నేరుగా పెట్రోల్-డీజిల్ ధరల మీద ప్రభావం పడుతుంది.
ఆహార పదార్థాలను పొలాల నుంచి ఫ్యాక్టరీల వరకూ, ఫ్యాక్టరీల నుంచి షాపుల వరకూ చేర్చడానికి వాహనాలు ఉపయోగిస్తారు. అవి డీజిల్, పెట్రోల్‌తో నడుస్తాయి. అందుకే ఆహార పదార్థాలన్నింటి ధరా పెరుగుతుంది. అంటే మీ జేబుపై అదనపు భారం పడుతుంది.
"ముడి చమురు ధరలు పెరగడం వల్ల నేరుగా ఇప్పుడు వంట నూనెలపై ప్రభావం పడుతోంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంధనానికి బదులు వంట నూనెలను ఉపయోగిస్తున్నారు. అంటే భారత్‌లో బ్లెండింగ్ కోసం ఇథెనాల్ ఉపయోగించినట్లే, మిగతా ప్రపంచ దేశాల్లో పామాయిల్ బ్లెండింగ్ చేస్తారు. దీనివల్ల వంట నూనెల ధరలు కూడా పెరుగుతాయి" అని చెప్పారు ఆలోక్ జోషి.
2.పెట్టుబడులు తగ్గుతాయి
ద్రవ్యోల్బణం ప్రభావం పెట్టుబడులపై పడుతుంది. వస్తువుల ధరలు పెరిగితే, పెట్టుబడుల గురించి తక్కువగా ఆలోచిస్తారు. పెట్టుబడులు తగ్గడం వల్ల ఆ ప్రభావం నేరుగా ఉపాధి అవకాశాలపై పడుతుంది.
"ప్రజల దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ కోసం డబ్బులు తక్కువగా ఉంటే, ఉద్యోగాలు తక్కువగా వస్తాయి, ఉద్యోగాలు తగ్గిపోవడం అంటే, దానికి నేరుగా నిరుద్యోగం, దేశ వృద్ధి రేటుతో సంబంధం ఉంటుంది" అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పారు.
3.వృద్ధి రేటు తగ్గుతుంది
ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం వృద్ధి రేటు ప్రభావానికి నేరుగా కింది వర్గాల(పేదలు) ఆదాయానికి సంబంధం ఉంటుంది. వృద్ధి రేటు తగ్గడంతో కింది స్థాయి వారి ఆదాయం చాలా తగ్గిపోతుంది. దాంతో అసంఘటిత రంగంపై అత్యంత ప్రభావం పడుతుంది. కరోనా మహమ్మారి తర్వాత ఏ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించాలని ఆశిస్తున్నారో, అది మరోసారి ప్రభావతం అయ్యే అవకాశం ఉంది.
రూపాయి బలహీనపడటం వల్ల ప్రయోజనాలు ఉంటాయా
డాలర్ బలపడడం వల్ల ఎగుమతిదారులపై సానుకూల ప్రభావం పడుతుందని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పారు. ఆయన దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు.
యుక్రెయిన్, రష్యా ప్రపంచంలో గోధుమలకు అతిపెద్ద ఎగుమతి దేశాలు. రెండింటి మధ్య యుద్ధం రావడంతో భారత గోధుమల ఎగుమతిదారులకు ఇది శుభవార్త కావచ్చు. గోధుమల ధర భారత్‌లో కనీస మద్దతు ధరకంటే ఎక్కువే ఉంది. భారత్ మిగతా దేశాలకు గోధుమలు ఎగుమతి చేస్తే, చెల్లింపులు డాలర్లలో జరుగుతాయి. దానివల్ల వారికి లాభాలు వస్తాయి. కానీ భారత మార్కెట్లో కూడా ధరలు పెరిగితే, దానివల్ల భారత్‌లో కూడా గోధుమల ధరలు పెరుగుతాయి.
రూపాయి బలహీన పడడం వల్ల సామాన్యులపై ఆ ప్రభావం పెద్దగా పడకుండా ప్రొఫెసర్ అరుణ్ కుమార్ కొన్ని చర్యలు కూడా సూచించారు.
"ప్రభుత్వం ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు ఇవ్వాలి, ప్రజల కొనుగోలు సామర్థ్యం పెంచాలి. దానివల్ల ప్రజల ఆర్థిక స్థితి మరింత దారుణంగా మారకుండా ఉంటుంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?
- ‘దండయాత్రపై లెక్క తప్పిన పుతిన్’ యుక్రెయిన్‌పై దాడి తీవ్రతను మరింత పెంచుతారా
- యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను భారత్ ఎందుకు విమర్శించలేకపోతోంది?
- యుక్రెయిన్ తరఫున యుద్ధం చేసేందుకు 8,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తున్న కమెడియన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















