ఇరాన్: పగలు చిన్న ఉద్యోగం.. రాత్రి పార్ట్ టైమ్ వేశ్యా వృత్తి.. బతకటానికి స్త్రీ, పురుషుల అగచాట్లు

టెహ్రాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో సెక్స్ వర్కర్లు లేనే లేరని ఇరాన్ ప్రభుత్వం ఎంతో కాలంగా చెబుతోంది.
    • రచయిత, అమీర్ నాటేగ్
    • హోదా, బీబీసీ న్యూస్

''నేను చేస్తున్న పని సిగ్గుమాలిన పనే. కానీ నాకు మరో దారేదీ?'' అంటారు నీడా. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నివసిస్తున్నారామె. భర్తతో విడిపోయి కొడుకు బాధ్యతలు చూసుకుంటున్న ఒంటరి తల్లి ఆమె.

పగటి పూట హెయిర్‌డ్రెసర్‌గా పనిచేస్తారు. కానీ ఆ ఆదాయం బతకటానికి సరిపోదు. దీంతో రాత్రిపూట వేశ్యగా రెండో ఉద్యోగం చేయక తప్పటం లేదని ఆమె చెప్తున్నారు. కేవలం రెండు పూట్ల తిండి కోసం.. ఒళ్లు అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు.

''నేను జీవిస్తున్న దేశంలో ఆడవాళ్లకు గౌరవం లేదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ప్రతి దాని ధరలూ ప్రతి రోజూ పెరిగిపోతున్నాయి. నేను ఒంటరి తల్లిని. నా కొడుకును సాకాలి. వేశ్యా వృత్తిలో కాస్త డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కోవాలని ఆలోచిస్తున్నా. ఇది నా జీవితపు విషాదకర వాస్తవం. నేను నా ఆత్మను అమ్ముకుంటున్నాను'' అని ఆమె వివరించారు.

ఇరాన్‌లో వేశ్యా వృత్తి సమస్యను పరిష్కరించటానికి 2012లో ప్రభుత్వం జాతీయ కార్యక్రమాన్ని ప్రకటించింది. కానీ.. అనధికారిక నివేదికలు, ప్రభుత్వేతర సంస్థలు, పరిశోధకులు చెప్తున్న దాని ప్రకారం.. సెక్స్ పరిశ్రమలో పనిచేస్తున్న వారి సంఖ్య తగ్గకపోగా ఇంకా పెరిగింది.

ఇరాన్‌లోని సంప్రదాయవాద మత ప్రభుత్వం.. తమ దేశంలో సెక్స్ వర్కర్లు ఉన్నారనే మాటనే ఎప్పటి నుంచో తిరస్కరిస్తూ వస్తోంది. పైగా దేశంలో ప్రాస్టిట్యూషన్‌ను.. యువతను పాడు చేయటానికి పశ్చిమ దేశాల కుట్రగానో, చెడ్డ మగవాళ్ల చేతుల్లో మహిళలు మోసపోయారనో యంత్రాంగం నిందిస్తుంది.

ఇరానీ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో చిన్నారులను కూడా సెక్స్ వర్కర్లుగా మారుస్తున్న ఉదంతాలు పెరుగుతున్నట్లు అనధికారిక సమాచారం సూచిస్తోంది. వివిధ స్వచ్ఛంద సంస్థల గణాంకాల ప్రకారం.. 2016లో 12 ఏళ్ల వయసు బాలికలు కూడా వేశ్యావృత్తిలో ఉన్నారు.

ఇరాన్‌లో మాదకద్రవ్యాల వినియోగానికి అలవాటుపడిన మహిళలకు చికిత్స చేయటానికి పనిచేసే అఫ్తాబ్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ.. ఒక్క రాజధాని నగరం టెహ్రాన్‌లో దాదాపు 10,000 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండవచ్చునని 2019లో చెప్పింది. అది నగరంలో వివాహిత మహిళల సంఖ్యలో మూడో వంతుకన్నా ఎక్కువే.

అయితే.. రాజధానిలో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందని టెహ్రాన్ యూనివర్సిటీలో సామాజిక సంక్షేమం బోధించే ప్రొఫెసర్ అమీర్ మహమూద్ హరీచి చెప్తున్నారు.

ఇరాన్‌లో పురుషులతో పోలిస్తే మహిళలకు ఉద్యోగ అవకాశాలు లేకపోవటం, లింగ సమానత్వం లేకపోవటం వంటి పరిస్థితుల్లో.. దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్న చాలా మంది మహిళలు డబ్బు కోసం తమ శరీరంతో సెక్స్ అమ్ముకోవాల్సి వస్తోంది. అయితే.. ఈ సెక్స్ వర్క్ వల్ల ఆ మహిళలకు చాలా ప్రమాదాలూ ఉన్నాయి.

''ఇరాన్‌లో వేశ్యా వృత్తి చట్టవ్యతిరేకమని, మహిళలకు దారుణమైన శిక్షలు ఉంటాయని మగవాళ్లకు తెలుసు. దీనిని వారు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు'' అని టెహ్రాన్‌లోని ఒక యూనివర్సిటీలో చదువుకుంటూ, పార్ట్ టైమ్ సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్న మహనాజ్ అనే విద్యార్థి చెప్తున్నారు.

''సెక్స్ కావాలని వచ్చిన విటుడు.. నా శరీరంతో సెక్స్ చేశాక నాకు డబ్బులు ఇవ్వకపోతే.. నేను అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోయాను. ఇలా నాకు పలుమార్లు జరిగింది'' అని ఆమె తెలిపారు.

టెహ్రాన్‌లో నివసించటానికి చాలా ఖర్చవుతుందని, వేరే ఏ పనులు చేసినా బిల్లులు కట్టడానికి సరిపడా డబ్బులు రావని మహనాజ్ చెప్పారు.

ఇరాన్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవటంతో కొందరికి కనీస నిత్యావసరాలూ అందుబాటులో లేకుండా పోయాయి

ప్లెజర్ పెళ్లిళ్లు.. తాత్కాలిక భార్యలు

ఇరాన్‌లో 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం.. కొత్త ప్రభుత్వం అనేక మంది సెక్స్ వర్కర్లకు మరణశిక్ష విధించి చంపేసింది. వేశ్యాగృహాలను మూసివేసింది.

మహిళలను సెక్స్ కోసం ఉపయోగించుకోవటాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా.. 'జావాజ్ అల్-ముతా' అనే విధానం మరింత ఎక్కువైంది. దీనికి అర్థం 'ప్లెజర్ మారియేజ్'. అంటే.. ఆ పెళ్లి బంధం ఎంత కాలం కొనసాగుతుంది, ఆ తాత్కాలిక భార్యకు ఎంత పరిహారం ఇస్తారు అనేది ముందే నిర్ణయించుకుని చేసుకునే కాంట్రాక్టు పెళ్లి.

వీడియో క్యాప్షన్, భారత జాతీయ గీతాన్ని సంతూర్‌పై వాయించిన ఇరానీ అమ్మాయి

ఇరాన్‌లోని షియా ఇస్లామిక్ వ్యవస్థలో ముతా పెళ్లికి అనుమతి ఉంది. దీనిని పడుపువృత్తిగా పరిగణించరు. ప్రపంచం నలుమూలల నుంచీ షియా తీర్థయాత్రికులు ఎక్కువగా సందర్శించే పవిత్ర నగరాలైన మషాద్, కోమ్‌లలో ఈ ఆచారం మరింత ఎక్కువ. ఇరాక్ పురుషులు.. మషాద్‌లో సెక్స్ కావాలని చెప్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అయితే.. వారు తాత్కాలిక పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అధికారులు వాదిస్తారు.

ఇప్పుడు ఇరాన్‌లో ముతా పెళ్లిళ్లు చేయిస్తామని ఆఫర్ చేస్తున్న ఆన్‌లైన్ సర్వీసులు టెలిగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. తమకు ప్రభుత్వ అనుమతి ఉందని కూడా ఆ సర్వీసులు చెప్పుకుంటాయి.

ఇరాన్‌లో వేశ్యా వృత్తి పెరగటం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో.. జీవన వ్యయం పెరగటం ఒకటి. ఆ జీవన వ్యయం అంతగా పెరుగుతుండటానికి ప్రధాన కారణం.. ఇరాన్ మీద అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు. ఇరాన్ అణు కార్యక్రమం పట్ల ఆగ్రహించిన అమెరికా ఈ ఆంక్షలు విధించింది. ఇరాన్‌లో గత ఏడాది కాలంలో ద్రవ్యోల్బణం 48.6 శాతం పెరిగిపోయింది. నిరుద్యోగం కూడా పెరిగింది. ఇక ఉద్యోగాలున్న వారికీ జీతాలు తగినంత లభించవు.

ఈ పరిస్థితుల్లో.. 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు వేశ్యా వృత్తిని ఎంచుకోవటం కూడా పెరిగింది. ఇప్పుడు ఇరాన్‌లోని ప్రధాన నగరాల్లో మగ సెక్స్ వర్కర్లు కూడా పెరుగుతున్నారు.

Iranian woman applying lipstick

ఫొటో సోర్స్, Getty Images

అలాంటి ఒక వ్యక్తి 28 ఏళ్ల కమ్యార్. సూపర్‌మార్కెట్‌లో కాషియర్‌గా పనిచేసే ఈ యువకుడు గత ఏడాది వరకూ తల్లిదండ్రులతో కలిసి నివసించేవారు. తన ఖర్చులకు తన తండ్రి మీద ఆధారపడేవారు. ఇప్పుడతడు సెంట్రల్ టెహ్రాన్‌లో ఒక అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకుని నివసించగలుగుతున్నారు. ఏదో ఒక రోజు విదేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు.

''సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నాకు కస్టమర్లు వస్తారు. ఈ మహిళలు 30లు, 40ల వయసుండే మహిళలు. ఒకసారి 54 ఏళ్ల వయసు క్లయింటును కూడా కలిశాను. వాళ్లు నన్ను బాగా చూసుకుంటారు. మంచి మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు. ఎప్పుడూ రాత్రిపూట వాళ్లున్న చోటే పడుకుంటాను. నోటి మాట ప్రచారం ద్వారా నాకు చాలా మంది క్లయింట్లు వస్తున్నారు'' అని కమ్యార్ వివరించారు.

కమ్యార్ శిక్షణ పొందిన ఇంజనీర్. అతడికి ఎంతో ఇష్టమైన ఈ రంగంలో భవిష్యత్తు ఏమీ కనిపించటం లేదు. ''నేను ఇంజనీర్‌ను కావాలని కోరుకునేవాడిని. కానీ నాకు ఆ ఉద్యోగమే దొరకటం లేదు'' అన్నారాయన.

''నేనొక యువతిని ప్రేమించాను. కానీ నాకు సరైన ఉద్యోగం లేకపోవటం వల్ల మేం పెళ్లి చేసుకోలేకపోయాం. ఇప్పుడు నేను చేస్తున్న పనికి నేనేమీ గర్వపడటం లేదు. డబ్బుకోసం అపరిచిత మహిళలతో పడుకోవచ్చనే ఊహ కూడా నాకెప్పుడూ రాలేదు. నాకు సిగ్గుగా ఉంది. కానీ ఈ పనితో నా ఖర్చులు వెళ్లిపోతున్నాయి. నేనున్న ఈ దేశంలో నా భవిష్యత్తు ఏమిటని ఆలోచిస్తే కేవలం దైన్యమే నా కళ్లకు కనిపిస్తుంది'' అని వివరించారు.

ఈ కథనంలో సెక్స్ వర్కర్ల గుర్తింపులను గోప్యంగా ఉంచటానికి వారి పేర్లు మార్చి రాశాము.

వీడియో క్యాప్షన్, ఇరాన్‌లోని ఇంధ్రధనుస్సు దీవి... ఇక్కడి పర్వతాన్ని రుచి చూడాల్సిందే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)