రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో 'డీప్‌ఫేక్' ప్రెసిడెంట్స్ ఎవరు, వారు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, OTHER
- రచయిత, జేన్ వేక్‌ఫీల్డ్
- హోదా, బీబీసీ టెక్నాలజీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శాంతి ప్రకటన చేస్తున్నట్లు ట్విటర్లో షేర్ అవుతున్న ఒక వీడియో ఇటీవల తెర పైకి వచ్చింది. మరోవైపు, రష్యాకు లొంగిపోతున్నామని యుక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్న వీడియో కూడా వైరల్ అయింది.
అయితే, ఇవి నిజమైన వీడియోలు కావు. అచ్చం ఆయా దేశాల అధ్యక్షులే మాట్లాడుతున్నట్లుగా తయారు చేసిన నకిలీ వీడియోలు. వీటిని డీప్ ఫేక్ వీడియోలని అంటారు. మెటా, యూట్యూబ్ సంస్థలు ఈ వీడియోలను తమ ఫ్లాట్‌ఫామ్‌ల లోంచి తొలగించాయి.
ఇలాంటి వీడియోలు రెండు వైపుల నుంచీ వస్తున్నాయి. యుద్ధానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ఇలాంటి వీడియోలు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి?
జనం వాటిని నిజంగా నమ్ముతున్నారా?
నిజానికి, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ వీడియో ఏమాత్రం నమ్మదగినట్లుగా లేదు. ఈ ఫేక్ వీడియో చాలా మంది యుక్రెయిన్లకు నవ్వు తెప్పించింది.
ఇందులో వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఒక పోడియం వెనక ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందులో ఆయన యుక్రెయిన్లు తమ ఆయుధాలు దించేస్తారని చెబుతున్నారు. వీడియోలో తల ఆయన శరీరం కంటే మరీ పెద్దదిగా, ఎక్కువ పిక్సిల్స్‌తో ఉన్నట్టుంది. ఆయన గొంతు ఎక్కడో లోపల వినిపిస్తున్నట్లుంది..
తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక అసలు వీడియోలో జెలియెన్‌స్కీ దీనిని 'రెచ్చగొట్టే పిల్లచేష్ట' అని వ్యాఖ్యానించారు.
తమ సైన్యం లొంగిపోయేలా చేయడానికి రష్యా ప్రభుత్వం ఈ డీప్ ఫేక్ వీడియోలను ఉపయోగించవచ్చని యుక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ హెచ్చరించింది.

ఫొటో సోర్స్, OTHER
సోషల్ మీడియాలో సంచలనం రేపడానికి అడ్డదారి
తారుమారు చేసి, తప్పుదారి పట్టించే మీడియాకు వ్యతిరేకంగా తమ విధానాలను ఉల్లంఘించడంతో డీప్ ఫేక్‌ను త్వరగా పరీక్షించి, తొలగించామని మెటా సెక్యూరిటీ పాలసీ హెడ్ నథానియెల్ గ్లీషెర్ ఒక ట్విటర్ త్రెడ్‌లో చెప్పారు.
యూట్యూబ్, మెటా కూడా తమ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ వీడియోలను తొలగించామని చెప్పాయి.
సోషల్ మీడియా సంస్థలు ఎక్కువమందిని ఆకట్టుకోడానికి ఇలాంటి తప్పుడు దారులు తొక్కుతున్నాయని డీప్ ఫేక్స్ పుస్తకం రచయిత నినా షిక్ చెప్పారు. ఎందుకంటే ఈ వీడియోను చూడగానే తెలిసిపోతోందని, కొత్త వీక్షకులు తప్ప అది ఫేక్ అని ఎవరైనా సులభంగా గుర్తించవచ్చన్నారు.
"మిగతా తప్పుడు సమాచారాల గురించి పెద్దగా పట్టించుకోని ఈ ప్లాట్‌ఫాంలు వీటి గురించి మాత్రం చాలా గోల గోల చేస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇంకా ఎన్నో రూపాల్లో తప్పుడు సమాచారం వస్తోంది. కానీ వాటిని మాత్రం అవి తొలగించడం లేదు" అన్నారు.
"ఈ వీడియోలు అరకొర నాణ్యతతో ఉంటాయి. అయినా, ఇలాంటివి విశ్వసనీయమైన మీడియాపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రతిదాన్నీ ఫేక్ చేయవచ్చని జనం నమ్మడం మొదలెట్టారు. వీడియో దృశ్యాలతో తప్పుడు సమాచారం వ్యాపించేలా చేయడానికి ఇదొక కొత్త, బలమైన రూపం. దీన్ని ఎవరైనా చేయచ్చు అంటారు" నినా.

ఫొటో సోర్స్, MYHERITAGE
డీప్ ఫేక్ టెక్నాలజీలో ఎన్నో ముఖాలు
యూజర్లు తమ బంధువుల పాత ఫొటోలతో వీడియోలు చేసుకోడానికి మై హెరిటేజ్ అనే కంపెనీ డీప్ ఫేక్ టూల్ సృష్టించింది. అది ఇప్పుడు అది లైవ్ స్టోరీ అనేది జోడించింది. ఇందులో ఆ వీడియోలకు మాటలు కూడా యాడ్ చేయవచ్చు.
గత ఏడాది దక్షిణ కొరియా టీవీ నెట్‌వర్క్ ఎంబీఎన్ తాము డీప్ ఫేక్ న్యూస్ రీడర్ కిమ్ జూ-హాను ఉపయోగిస్తున్నట్లు ప్రకటించగానే దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.
కొందరు అది నిజం న్యూస్ రీడర్‌లాగే ఉందని ఆశ్చర్యపోయారు, మరికొందరు కిమ్ జూ-హా తన ఉద్యోగం కోల్పోతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవలి ఏళ్లలో యూజర్లు తమ నగ్నచిత్రాలు పెట్టడానికి అనుమతించే వెబ్‌సైట్ల సంఖ్య పెరగడంతో ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని పోర్నోగ్రఫీ సృష్టించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
దీనిని వ్యంగ్యంగా కూడా ఉపయోగిస్తున్నారు. గత ఏఢాది ఒక క్రిస్మస్ సందేశం ఇవ్వడానికి చానల్ ఫోర్ ఒక డీప్ ఫేక్ క్వీన్ వీడియోను సృష్టించింది.
వీటితో పోలిస్తే, రాజకీయాల్లో డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించడం అరుదుగా ఉంది.
కానీ, ఈ టెక్నాలజీ పవర్ ఏంటో చూపించడానికి డీప్ ఫేక్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను సృష్టించారు.
గుర్తించడంలో పొరపాటు జరిగితే
"జెలియెన్‌స్కీ వీడియో డీప్ ఫేక్ సమస్యకు ఒక చక్కని ఉదాహరణ. అది ఏమీ బాగో లేదు. దాన్ని చూసిన వెంటనే అది నకిలీదని సులభంగా గుర్తించవచ్చు" అని విట్‌నెస్.ఆర్గ్.ప్రోగ్రామ్ డైరెక్టర్ శామ్ గ్రెగరీ అన్నారు.
యుక్రెయిన్ ఆ వీడియోను తోసిపుచ్చింది. జెలియెన్‌స్కీ సోషల్ మీడియాలో దానిని ఖండించారు. దాంతో ఆ వీడియోను తొలగించడం ఫేస్‌బుక్‌కు సులభమయ్యింది.
కానీ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు తమ దగ్గర డీప్ ఫేక్‌ను గుర్తించగలిగే టూల్స్ గానీ, వాటిని తొలగించగలిగే సామర్థ్యం గానీ లేకపోవడంతో భయపడుతున్నారు.
వీటిని గుర్తించగలిగే టూల్స్, ఆ వీడియోలో ఒక వ్యక్తి ఎలా కదులుతున్నాడో విశ్లేషిస్తాయి. లేదంటే డీప్ ఫేక్ సృష్టించడంలో మెషిన్ లెర్నింగ్ ప్రక్రియ కోసం వెతుకుతాయి.
కానీ, గత ఏడాది వేసవిలో ఒక ఆన్‌లైన్ డిటెక్టర్ మియన్మార్‌లో ఒక సీనియర్ నేత తన అవినీతిని ఒప్పుకుంటున్నట్లు కనిపించే అసలు వీడియోను డీప్ ఫేక్‌గా చెప్పింది.
అది నిజమైన ప్రకటనా, లేక బలవంతంగా దానిని ఒప్పుకునేలా చేశారా అనేదానిపై ఇఫ్పటికీ చర్చ జరుగుతోంది.
"వంద శాతం ఆధారాలు లేకపోవడం, అది డీప్ ఫేక్ వీడియోనే అని ప్రజలు నమ్మాలనుకోవడం వాస్తవిక ప్రపంచంలో డీప్ ఫేక్‌కు ఉన్న సవాళ్లను ప్రతిబింబిస్తుంది" అని గ్రెగరీ చెప్పారు.
"కొన్ని వారాల క్రితం అధ్యక్షుడు పుతిన్ డీప్ ఫేక్ చేశారు. దానిని చాలా మంది వ్యంగ్యంగా చేశారని భావించారు. కానీ వ్యంగ్యానికి, తప్పుడు సమాచారానికి మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది" అంటారాయన.
డీప్ ఫేక్ ప్రమాదకరం కావచ్చు
విశ్లేషణ - షయాన్ సర్దారిజాదే, బీబీసీ మానిటరింగ్
బుధవారం యుక్రెయిన్ టీవీ నెట్‌వర్క్, 'యుక్రెయినా 24'లో లైవ్ సమయంలో టిక్కర్ మీద జెలియెన్‌స్కీ డీప్ ఫేక్ ట్రాన్స్‌స్క్రిప్ట్ మొదట కనిపించింది. తర్వాత ఆ చానల్ వెబ్‌సైట్‌లో ఒక స్క్రీన్ షాట్, ఆ మొత్తం ట్రాన్స్‌స్క్రిప్ట్ కనిపించింది.
తర్వాత తమ టిక్కర్, వెబ్‌సైట్ హాక్ అయ్యాయని, చాలా సమయం పాటు వాటిని యాక్సెస్ చేయలేకపోయామని యుక్రెయినా 24 చెప్పింది.
జెలియెన్‌స్కీ ఈ డీప్ ఫేక్ వీడియో రష్యలో టెలిగ్రాం, ఫేస్‌బుక్ లాంటి వేదిక అయిన వీకేలో విస్తృతంగా షేర్ అయింది.
అక్కడ నుంచి ఇది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ లాంటి ప్లాట్‌ఫాంలలోకి చేరింది.
యుద్ధాలతోపాటూ, కొంతకాలంపాటు డీప్‌ఫేక్‌లు ప్రమాదకరం కావచ్చని హెచ్చరికలు కూడా కనిపించాయి.
కానీ, నమ్మకం కలిగించే డీప్ ఫేక్ సృష్టించడం అనేది చాలా ఖరీదైన విషయం, దానికి చాలా సమయం కూడా పడుతుంది.
పాత వీడియోలు, తారుమారు చేసిన మీమ్స్ ఈ యుద్ధంలో అతి సాధారణ, ప్రభావవంతమైన తప్పుడు సమాచార వ్యూహాలుగా నిలిచాయి.
ఏది ఏమైనా, జెలియెన్‌స్కీ వీడియో నేను చూసిన డీప్ ఫేక్ వీడియోల్లో అత్యంత చెత్త వీడియో. సరిగా చేయడం రాలేదు. నిజమోనేమో అని నమ్మడానికీ ఏమాత్రం ఆస్కారం కూడా లేదు.
అయితే, ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు యుద్ధ సమయంలోనూ డీప్ ఫేక్ వీడియోలు వస్తున్నాయి. రేపు రాబోయే వీడియోలు మరీ ఇంత చెత్తగా ఉండకపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌లో మేయర్లను మార్చేస్తున్న రష్యా సైన్యం.. నకిలీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోందన్న జెలియెన్‌స్కీ
- యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?
- ‘దండయాత్రపై లెక్క తప్పిన పుతిన్’ యుక్రెయిన్‌పై దాడి తీవ్రతను మరింత పెంచుతారా
- యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను భారత్ ఎందుకు విమర్శించలేకపోతోంది?
- పాకిస్తాన్ తమ దేశంలో పడిన భారత మిసైల్‌ను రివర్స్ ఇంజనీరింగ్‌తో కాపీ కొడుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












