యుక్రెయిన్‌ పట్ల ఉన్న ఆందోళన... యుద్ధాలతో ధ్వంసమవుతున్న మరో ఆరు దేశాలపై ఎందుకు లేదు? ప్రపంచంలో సుదీర్ఖంగా సాగుతున్న యుద్ధాలివే...

ఇథియోపియాలోని టిగ్రే సంఘర్షణలో ఇరు పక్షాలూ దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇథియోపియాలోని టిగ్రే సంఘర్షణలో ఇరు పక్షాలూ దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి
    • రచయిత, డేనియెల్ గాలాస్
    • హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్

యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచమంతటా పత్రికలు, టీవీ చానళ్లు, డిజిటల్ మీడియాలో పతాక శీర్షికల్లో ఉంది. ఏ దేశమూ యుక్రెయిన్‌కు సైన్యాన్ని పంపకపోయినా.. ఆ దేశానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనిక మద్దతు, మానవతా సాయం అందుతోంది.

అమెరికా, యూరప్ దేశాలు రష్యా మీద కొన్ని రోజుల్లోనే ఎన్నడూ ఏ దేశమూ కనీవినీ ఎరుగని స్థాయిలో ఆంక్షలు విధించాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే వందలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మందికి పైగా తమ ఇళ్లు వదిలి పారిపోయినట్లు అంచనాలు చెప్తున్నాయి. యుక్రెయిన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

అయితే.. యుక్రెయిన్ యుద్ధం కన్నా మరిన్ని ఎక్కువ మరణాలు, ప్రజలు మరింత ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితులున్న యుద్ధాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలకు యుక్రెయిన్ కన్నా తక్కువ ప్రచారం, ఆ యుద్ధాల బాధితులకు తక్కువ అంతర్జాతీయ సాయం అందుతోంది.

ఉదాహరణకు యెమెన్‌లో సంఘర్షణ 11 సంవత్సరాలుగా సాగుతోంది. అక్కడి లెక్కలు దిగ్భ్రాంతిగొలుపుతాయి. ఇప్పటికే 2 లక్షల 33 వేల మందికి పైగా చనిపోయారు. చిన్నారులు 23 లక్షల మంది తీవ్ర పోషకాహార లోపంతో సుష్కించుకుపోతున్నారు. ప్రజలకు తాగటానికి నీళ్లు లేవు. వైద్య సదుపాయాలూ లేవు.

ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవ సంక్షోభం ఇప్పుడు యెమెన్‌లో నెలకొని ఉందని ఐక్యరాజ్యసమితి వర్గీకరించింది.

ఇక 2020 నవంబర్‌లో ఇథియోపియాలో.. కేంద్ర ప్రభుత్వానికి, టిగ్రే ప్రాంతంలోని ఒక రాజకీయ పార్టీకి మధ్య మొదలైన యుద్ధంలో కూడా ఇప్పటి వరకూ 90 లక్షల మంది ఇథియోపియన్లు మానవ సంక్షోభంలో కూరుకుపోయారు. పౌరుల హత్యలు, సామూహిక అత్యాచారాల వంటి యుద్ధ నేరాలూ నిత్యకృత్యంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, ఇథియోపియా: యుద్ధం మిగిల్చిన విషాదం.. రోడ్లపై సగం కాలిన మృతదేహాలు

''కొందరు ఇతరులకన్నా ఎక్కువ సమానులు''

యుక్రెయిన్‌లో యుద్ధం చెలరేగిన తర్వాత.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇటువంటి సంఘర్షణల్లో నలిగిపోతున్న జనం ఆశ్చర్యపోయారు. ఇలాంటి సంఘర్షణల విషయంలో అంతర్జాతీయ సమాజ వైఖరిలో ఎందుకంత తేడా ఉందంటూ ప్రశ్నిస్తున్నారు.

''ఆఫ్రికాలోని చాలా సంఘర్షణలను పట్టించుకోవడం లేదు. అయితే, అన్ని సాయుధ సంఘర్షణలనూ ఒకే రకంగా విస్మరించకపోవటం పట్ల.. మా ఖండంలోని జనంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది'' అని కెనడియన్-అల్జీరియన్ జర్నలిస్ట్ మహర్ మెజాహి బీబీసీకి రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. యుక్రెయిన్ పర్యవసానాలను.. ఇథియోపియా, కామెరూన్‌లలో పరిణామాలను పోలుస్తూ ఆయన ఆ వ్యాసం రాశారు.

''అవును.. ఆఫ్రికా సంఘర్షణల విషయంలో ఆందోళనలు ప్రకటించటం, అంతర్జాతీయ దౌత్యవేత్తలు రాయబారాలు నడపటం జరిగాయి. కానీ 24 గంటలూ అవే వార్తలు అందించటం, ప్రపంచ నాయకులు ప్రత్యక్ష ప్రసారాల్లో మాట్లాడటం. ఉత్సాహంగా సాయం అందించటం వంటివేవీ లేవు'' అన్నారామె.

''మనమంతా సమానమే కానీ కొందరు ఇతరులకన్నా ఎక్కువ సమానులు'' అని వ్యాఖ్యానించారు.

ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో మానవ సంవేదన నెలకొని ఉండటం ఆందోళనకరమని.. అంతర్జాతీయ అజెండాలో దీనికి అగ్రస్థానం ఉండాలని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అధ్యక్షుడు కంఫర్ట్ ఎరో బీబీసీ న్యూస్ బ్రెజిల్‌తో పేర్కొన్నారు.

ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణలను గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం దృష్టి కేంద్రీకరించాల్సిన 10 అంతర్జాతీయ సంఘర్షణల జాబితాను ఈ ఏడాది ఆరంభంలో రూపొందించింది. అందులో యెమెన్, ఇథియోపియా, మయన్మార్‌లు ఉన్నాయి.

అయితే.. క్రైసిస్ గ్రూప్ కూడా జాబితాలో అగ్రస్థానంలో యుక్రెయిన్‌ను నిలిపింది. ఇతర ప్రాంతాల్లో కన్నా ఇక్కడ మరణాలు, మానవ సంక్షోభం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ సంఘర్షణ ప్రపంచ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ఇది ప్రధమ స్థానంలో ఉంటుందని వివరించింది.

వార్తల్లో ప్రముఖంగా కనిపించని.. మానవ ప్రాణ నష్టాన్ని, కష్టాన్ని భారీ స్థాయిలో కలిగిస్తున్న ఆరు కీలక సంఘర్షణలు ఇవీ...

ఇథియోపియాలో 16 నెలలుగా సాగుతున్న యుద్ధం వల్ల 9 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇథియోపియాలో 16 నెలలుగా సాగుతున్న యుద్ధం వల్ల 9 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు

1. ఇథియోపియా

ఇథియోపియాలో 2020 నవంబర్‌లో యుద్ధం మొదలైంది. దీనివల్ల తొమ్మిది లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని అమెరికా ప్రభుత్వం అంచనా. దేశంలో 90 లక్షల మందికి పైగా ప్రజలకు ఏదో విధంగా ఆహార సాయం అవసరమని తిరుగుబాటుదార్లు చెప్తున్నారు.

ఈ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కిరాతకమైన సంఘర్షణల్లో ఒకటని.. పౌరుల హత్యలు, సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.

మూడు దశాబ్దాలుగా కలిసి జీవించటానికి ప్రయత్నిస్తున్న వేర్వేరు జాతి ప్రజల మధ్య వివాదం.. ఈ సంఘర్షణకు మూలం. ఇథియోపియాలో 1994 నుంచి సమాఖ్య వ్యవస్థ ప్రభుత్వం ఉంది. దీనిని జాతుల సమాఖ్యగా కూడా పిలుస్తుంటారు. ఈ వ్యవస్థలో దేశంలోని 10 ప్రాంతాలను వేర్వేరు జాతుల వారు నియంత్రిస్తుంటారు.

ఆ పది ప్రాంతాల్లో టిగ్రే ఒకటి. ఈ ప్రాంతం.. పాపులర్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్ ఆఫ్ టిగరే అనే రాజకీయ పార్టీ నియంత్రణలో ఉంది. టిగ్రే జాతి ప్రజలు ఈ పార్టీలో ఉంటారు. ఈ పాపులర్ ఫ్రంట్ పార్టీ సారథ్యంలోని నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం 1991 నుంచి ఇథియోపియాను పరిపాలించింది.

వీడియో క్యాప్షన్, ఇక్కడున్న పిల్లల్లో 40 శాతం మంది ఆకలితో అల్లాడుతున్నారు

ఈ సంకీర్ణం పాలనలో ఇథియోపియా కొంత ప్రగతి సాధించింది. మరింత సుస్థిరమైంది. అయితే మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిస్థితులపై ఆందోళనలు కూడా పెరిగాయి. ఇవి నిరసనల రూపం తీసుకోవటంతో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణకు దారితీసింది. ఆ క్రమంలో అబియ్ అహ్మద్ అలీ ప్రధానమంత్రి అయ్యారు.

అబియ్ రాజకీయాలను సరళీకృతం చేశారు. ప్రాస్పరిటీ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అవినీతికి, అణచివేతకు పాల్పడుతున్నారని ఆరోపణలున్న ఉన్నత స్థాయి ప్రభుత్వ నేతలను తొలగించారు. పొరుగుదేశమైన ఎరిత్రియాతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించి 2019లో నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకున్నారు.

అయితే.. అబియ్ సంస్కరణలు అధికారాన్ని కేంద్రీకృతం చేసేవిగా, ఇథియోపియా సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేసివిగా పరిగణించారు టిగ్రే రాజకీయ నాయకులు. 2020లో టిగ్రే స్థానిక ఎన్నికలను నిర్వహించింది. కానీ అవి చట్టవ్యతిరేకమని అబియ్ వ్యతిరేకించారు. దీంతో ఆ ఏడాది నవంబర్‌లో సంఘర్షణ మొదలైంది.

ఇథియోపియా ప్రభుత్వంతో జట్టుకట్టిన ఎరిత్రియా సైనికులు కూడా టిగ్రేలో తిరుగుబాటుదారులతో యుద్ధం చేస్తున్నారు. ఈ సంఘర్షణలో ఇరు పక్షాలూ పౌరులపై అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ సంఘర్షణ ముగుస్తుందనే సూచనలు ఇప్పటికైతే లేవు. ఆ దిశగా కనీసం చర్చలు కూడా జరగటం లేదు.

యెమెన్‌లో ప్రస్తుత పరిస్థితి ప్రపంచంలో కెల్లా అత్యంత ఘోరమైన మానవ విపత్తు అని ఐరాస చెప్తోంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, యెమెన్‌లో ప్రస్తుత పరిస్థితి ప్రపంచంలో కెల్లా అత్యంత ఘోరమైన మానవ విపత్తు అని ఐరాస చెప్తోంది

2. యెమెన్

యెమెన్‌లో యుద్ధం దిగ్భ్రాంతికరమైన స్థాయిలో, ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవ సంక్షోభాన్ని సృష్టించిందని ఐక్యరాజ్యసమితి చెప్తోంది. ఈ సంఘర్షణలో ఇప్పటికే 2,33,000 మంది చనిపోయారు. వారిలో 1,31,000 మంది తిండి లేకపోవటం, చికిత్స అందకపోవటం వంటి పరోక్ష కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరు ప్రత్యక్ష ఫలితంగా 10,000 మందికి పైగా చిన్నారులు బలయ్యారు.

ఈ ఘర్షణ వల్ల 40 లక్షల మందికి పైగా జనం తమ ఇళ్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఇక రెండు కోట్ల మందికి పైగా జనం (దేశ జనాభాలో 71 శాతం మంది) కనీసం బతకాలంటే ఏదో విధమైన మానవతా సాయం, రక్షణ అవసరమవుతోంది.

ప్రస్తుతం 50 లక్షల మంది యెమెన్ ప్రజలు తీవ్ర కరవులో మునిగిపోయే ప్రమాదంలో ఉన్నారని.. దాదాపు 50,000 మంది ఇప్పటికే కరవు తరహా పరిస్థితులను చవిచూస్తున్నారని ఐక్యరాజ్యసమితి చెప్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారులు 23 లక్షల మంది తీవ్ర పోషకాహర లోపంతో కృశించిపోతున్నారని.. వారిలో 4,00,000 మంది చికిత్స అందక చనిపోయే ప్రమాదంలో ఉన్నారని ఆందోళన వ్యక్తంచేస్తోంది.

దేశంలోని 3,500 వైద్య కేంద్రాల్లో కేవలం సగం మాత్రమే పూర్తిగా పనిచేస్తున్నాయి. 20 శాతం జిల్లాల్లో వైద్యులెవరూ అందుబాటులో లేరు. దీంతో రెండు కోట్ల మంది జనానికి సరైన వైద్య సేవలు అందుబాటులో లేకుండాపోయాయి. సగం మంది జనానికి కనీసం తాగు నీరు కూడా దొరకటం లేదు.

అరబ్ వసంతంలో భాగంగా వచ్చిన 2011 యెమెనీ విప్లవం వల్ల.. సుదీర్ఘ కాలంగా నిరంకుశ పాలన సాగిస్తున్న అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ అధికారాన్ని ఉపాధ్యక్షుడు అబ్ద్ రబ్బూ మన్సూర్ హాదీకి అప్పగించాల్సి వచ్చింది. దేశంలో సుస్థిరతను తీసుకువచ్చే ఉద్దేశంతో మొదలైన ఆ రాజకీయ ప్రక్రియ విఫలమవటం యెమెన్‌లో సంఘర్షణను రాజేసింది.

యెమెన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సౌదీ నేతృత్వంలో జరిగిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యెమెన్‌లోని సనాకు చెందిన బాలిక (2017 నాటి చిత్రం)

దేశాధ్యక్షుడిగా హాదీ అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. జిహాదీల దాడులు, దక్షిణాన వేర్పాటువాద ఉద్యమం, సలేహ్‌కు విధేయులుగా కొనసాగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలతో పాటు.. అవినీతి, నిరుద్యోగిత, ఆహార అభద్రత వంటి సమస్యలూ చుట్టుముట్టాయి.

కొత్త అధ్యక్షుడి బలహీనతను ఉపయోగించుకుని హౌతీ ఉద్యమం బలపడింది. యెమెన్‌లోని జాయిది షియా ముస్లిం మైనారిటీలకు చెందిన హౌతీలు.. గత దశాబ్ద కాలంలో సలేహ్ మీద జరిగిన అనేక తిరుగుబాట్లతో పోరాడారు. 2014 ఆరంభంలో ఉత్తర మధ్య ప్రాంతమైన సదాహ్ ప్రావిన్స్‌ను స్వాధీనం చేసుకుని దక్షిణం వైపు కదలటం మొదలుపెట్టారు. ప్రభుత్వం పట్ల విసుగు చెందిన చాలా మంది సాధారణ యెమెన్ ప్రజలు వారికి మద్దతిచ్చారు. అలా మద్దతిచ్చిన వారిలో సున్నీలు కూడా ఉన్నారు. దీంతో 2014 చివర్లో తిరుగుబాటుదార్లు రాజధాని సనా మీద దండెత్తారు.

హౌతీలు, సలేహ్‌కు విధేయులైన భద్రతా బలగాలు మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవటానికి మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకోవటానికి ప్రయత్నించారు. దీంతో హాదీ 2015 మార్చిలో దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

ఈ సంఘర్షణలోకి ప్రాంతీయ ప్రత్యర్థులైన ఇరాన్, సౌదీ అరేబియాలు కూడా దిగాయి. ప్రాంతీయ షియా దేశం, తమ ప్రత్యర్థి అయిన ఇరాన్ సైనిక మద్దతుతో హౌతీ బృందం బలపడుతోందని ఆందోళన చెందిన సౌదీ అరేబియా, మరో ఎనిమిది సున్నీ అరబ్ దేశాలు.. హౌతీలను ఓడించటం, యెమెన్‌లో ఇరాన్ ప్రాబల్యానికి ముగింపు పలకటం, హాదీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించటం లక్ష్యంగా గగనతల దాడులు ప్రారంభించాయి.

ఈ కూటమికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల నుంచి సదుపాయాలు, నిఘా సమాచారం రూపంలో మద్దతు లభించింది. ఈ యుద్ధం కొన్ని వారాల్లో ముగుస్తుందని విశ్లేషకులు భావించారు. కానీ ఎనిమిదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో హింస ఇంకా పెరిగిపోయింది కూడా.

మయన్మార్‌లో నిరసనలు అంతర్యుద్ధం దశకు చేరుకున్నాయని పరిశీలకులు అంటున్నారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మయన్మార్‌లో నిరసనలు అంతర్యుద్ధం దశకు చేరుకున్నాయని పరిశీలకులు అంటున్నారు

3. మయన్మార్

రాజకీయ, జాతిపరమైన ఉద్రిక్తతలు ఏళ్ల తరబడి చవిచూస్తున్న మరో ప్రాంతం మయన్మార్. ఈ దేశంలో అంతర్యుద్ధం తీవ్రంగా కొనసాగుతోందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవలి నెలల్లో ఇక్కడ హింస మరింతగా పెరిగింది.

మయన్మార్‌ సాధారణ ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూచీ పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత.. 2021 ఫిబ్రవరి 1న తాత్మాదా సైన్యం కుట్ర పన్ని అధికారాన్ని స్వాధీనం చేసుకుంది.

ఈ కుట్రకు వ్యతిరేకంగా సమ్మెలు, సామూహిక నిరసనలు నిర్వహించటం ద్వారా ప్రతిపక్ష ఉద్యమకారులు పౌర సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాలను చెదరగొట్టటానికి సైన్యం హింసను ప్రయోగించింది. పౌర సహాయనిరాకరణ మరింత ముమ్మరమై అసలైన అంతర్యుద్ధం దశకు చేరుకుంది.

'ప్రజా పరిరక్షణ దళాలు'గా చెప్పుకుంటున్న స్థానిక సాయుధ బృందాలు.. మిలటరీ కాన్వాయ్‌ల మీద దాడి చేసి అధథికారులను చంపాయి.

ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ మిన్ ఆంగ్ హ్లాయింగ్ అధికారం చేపట్టారు. జాతిపరంగా మైనారిటీల మీద సైనిక దాడుల్లో ఆయన పాత్రకు గాను మిన్‌ను ఖండిస్తూ పలు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. మయన్మార్‌లో అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 'స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన' ఎన్నికలను నిర్వహిస్తామని సైన్యం హామీ ఇచ్చింది.

సైన్యం అధికారం చేపట్టినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల వల్ల.. 2021లో 2,20,000 మంది నిర్వాసితులయ్యారని ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ అంచనా వేసింది.

దేశంలో 1.40 కోట్ల మందికి (జనాభాలో నాలుగో వంతు) ఏదో ఒక విధమైన మానవతా సాయం అవసరమని ఆ సంస్థ పేర్కొంది. ఈ సంఘర్షణలో గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ 10,000 మందికి పైగా జనం చనిపోయారు.

సిరియాలో టాడిఫ్ వంటి నగరాలు యుద్ధ బీభత్సానికి ప్రతీకలుగా కొనసాగుతున్నాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సిరియాలో టాడిఫ్ వంటి నగరాలు యుద్ధ బీభత్సానికి ప్రతీకలుగా కొనసాగుతున్నాయి

4. సిరియా

సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు వ్యతిరేకంగా 2011లో తొలుత శాంతియుతంగా మొదలైన నిరసనలు.. పూర్తిస్థాయి అంతర్యుద్ధం స్థాయికి చేరుకున్నాయి. ఆ అంతర్యుద్ధం దశాబ్ద కాలంగా కొనసాగుతోంది.

ఈ సంఘర్షణలో 3,80,000 మందికి పైగా చనిపోయారు. నగరాలు నేలమట్టమయ్యాయి. ఈ పోరులో ఇతర దేశాలూ పాలుపంచుకుంటున్నాయి. మరో 2,00,000 మందికి పైగా జనం ఆచూకీ తెలియటం లేదు. వారు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

అరబ్ వసంతం స్ఫూర్తితో 2011 మార్చిలో దక్షిణాది నగరమైన దారాలో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. ఆ వ్యతిరేకతను అణచివేయటానికి సిరియా ప్రభుత్వం కిరాతక బలాన్ని ప్రయోగించింది. దీంతో అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశమంతటా నిరసనలు రాజుకున్నాయి.

ఈ హింస వేగంగా పెరిగిపోయ దేశం అంతర్యుద్ధంలో కూరుకుపోయింది. వందలాదిగా తిరుగుబాటు బృందాలు పుట్టుకొచ్చాయి. అనతికాలంలోనే అస్సాద్‌కు అనుకూలమైన సిరియన్లు, వ్యతిరేకులైన సిరియన్ల మధ్య పోరాటంగా మారిపోయింది.

వీడియో క్యాప్షన్, అలన్

రష్యా, అమెరికా, బ్రిటన్ వంటి విదేశీ శక్తులు ఏదో ఒక పక్షాన చేరాయి. డబ్బులు, ఆయుధాలు, సైనికులను కూడా పంపించటం మొదలుపెట్టాయి. పరిస్థితి విషమించటంతో ఐఎస్ఐఎస్, అల్‌ కాయిదా వంటి అతివాద జిహాదీ సంస్థలు తమ సొంత అజెండాలతో రంగంలోకి దిగాయి.

ఇటీవలి సంవత్సరాల్లో భూగోళం మీద అత్యంత రక్తిసిక్తమైన సంఘర్షణల్లో సిరియా సంక్షోభం ఒకటిగా మారింది. ఈ సంఘర్షణలో 20 లక్షల మందికి పైగా జనం ఏదో రకంగా గాయపడ్డారు. యుద్ధానికి ముందు 2.20 కోట్ల మందిగా ఉన్న దేశ జనాభాలో సగం మందికి పైగా ఇళ్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. చాలా మంది ఇంకా స్వదేశంలోనే నిరాశ్రయులుగా ఉంటే.. లెబనాన్, జోర్డాన్, టర్కీ దేశాలు చాలా మంది శరణార్థులకు ఆశ్రయమిచ్చాయి.

దేశంలోని చాలా భూభాగంపై అసద్ పైచేయి సాధించటంతో ఈ యుద్ధం తీవ్రత కొంత తగ్గింది. కానీ చాలా ప్రాంతాల్లో ఇంకా ప్రతిఘటన కొనసాగుతోంది. ఈ సంఘర్షణ అంతమవటానికి దరిదాపుల్లోకి కూడా రాలేదని అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు. ఇది రాబోయే సంవత్సరాల్లో మరిన్ని మరణాలు, మరింతగా మానవ సంక్షోభానికి దారితీస్తుందని చెప్తున్నారు.

ఆఫ్రికాలో హింస పేట్రేగుతున్న ప్రాంతాల్లో మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో ఒకటి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఆఫ్రికాలో హింస పేట్రేగుతున్న ప్రాంతాల్లో మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో ఒకటి

5. ఆఫ్రికాలో ఇస్లామిక్ మిలీషియాలు

మధ్య ఆసియాలో 2017లో ఇస్లామిక్ స్టేట్‌ను కూలదోసిన తర్వాత.. మిలిటంట్ ఇస్లామిక్ గ్రూపులు ఆఫ్రికా వైపు వెళ్లటం పెరిగిపోయింది. వీరి ప్రభావాన్ని అక్కడి బలహీన ప్రభుత్వాలు ఎక్కువగా ప్రతిఘటించలేకపోతున్నాయి. మాలి, నైగర్, బుర్కినా ఫాసో, సోమాలియా, కాంగో, మొజాంబిక్ వంటి పలు దేశాల్లోని వివిధ ప్రాంతాల్లో పైచేయి సాధించటానికి జిహాదీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

మొజాంబిక్‌లో.. కాబో డెల్గాడోలోని ఒక సాయుధ బృందానికి ఐఎస్ గ్రూపుతో సంబంధాలున్నట్లు భావిస్తారు. కాబో డెల్గాడో భూముల్లో సంపన్నమైన సహజ వాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని వెలికితీయటానికి బహుళజాతి ఇంధన సంస్థలతో కలిసి పనులు చేస్తున్నారు. కానీ పేదరికం తీవ్ర స్థాయిల్లో ఉండటం, భూ వివాదాలు, పనుల పంపకంపై వివాదాల కారణంగా.. చాలా మంది ఇస్లామిక్ మిలీషియాల్లో చేరుతున్నారు.

ఆ మిలీషియా గ్రూపుల దాడులు గత ఏడాది గణనీయంగా పెరిగాయి. ఉత్తర మొజాంబిక్‌లో మిలీషియాలు తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారని మానవ హక్కుల సంస్థలు చెప్తున్నాయి. హత్యలు, శిరచ్ఛేధనాలు, అపహరణలకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఒక ఉదంతంలో.. ఓ వారంతం నాడు ఫుట్‌బాల్ మైదానంలో 50 మంది జనాన్ని తలనరికి చంపారు.

తిరుగుబాటు పెరుగుతుండటంతో.. మొజాంబిక్ ప్రభుత్వం తమ స్థానిక బలగాలకు శిక్షణ ఇవ్వాలంటూ అమెరికా సైనిక సలహాదారులను ఆహ్వానించింది. రువాండా నుంచి, ప్రాంతీయ కూటమి అయిన సదరన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ నుంచి సైనిక బలగాలను రంగంలోకి దింపటానికి మొజాంబిక్ ప్రభుత్వం గత ఏడాది అంగీకరించింది. తిరుగుబాటుదార్లు సాధించిన విజయాలను ఈ బలగాలు దెబ్బతీశాయి. అయితే.. ఆ మిలీషియాలు మళ్లీ బలపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ సంఘర్షణ సుదీర్ఘంగా కొనసాగుతుందని, లెక్కలేనన్ని మరణాలకు, మానవ సంక్షోభానికి దారితీస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌ సంక్షోభం: ‘మానవ హక్కులు, పేదరికం గురించి మాట్లాడే దేశాలు ఎక్కడ?’

6. అఫ్గానిస్తాన్

అమెరికా మీద 2001 సెప్టెంబర్ 11 దాడుల అనంతరం.. ప్రపంచంలో అత్యధిక ప్రచారం పొందిన సంఘర్షణ అఫ్గానిస్తాన్.

ఆ దాడుల వెనుక తాలిబాన్లు ఉన్నారని ఆరోపిస్తూ అఫ్గానిస్తాన్ మీద దండెత్తింది అమెరికా. రెండు దశాబ్దాల పాటు తీవ్ర సంఘర్షణ.. వేలాది మరణాల తర్వాత 2021 ఆగస్టులో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు.

దేశంలో హింస స్థాయి గణనీయంగా తగ్గిపోయింది. కానీ ప్రపంచంలో చాలా దేశాలు విధించిన ఆంక్షలు, ఆ దేశాన్ని ఏకాకిగా చేయటం వల్ల.. ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రమైన మానవ సంక్షోభాన్ని అఫ్గాన్ ఎదుర్కొనవచ్చునని ఎన్‌జీఓలు హెచ్చరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)