సూడాన్: సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం

సూడాన్ నిరసనలు

సూడాన్‌లో సాయుధ దళాలు తిరుగుబాటు ప్రారంభించిన తర్వాత దానికి వ్యతిరేకంగా నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు.

సైనిక చర్యను నిరసిస్తూ దేశ రాజధాని ఖార్టూమ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

తిరుగుబాటు నాయకుడు జనరల్ అబ్దెల్ ఫతా బుర్హా... పౌర పాలనను రద్దు చేసి, రాజకీయ నేతలను నిర్బంధించారు. దేశంలో అత్యయిక పరిస్థితికి పిలుపునిచ్చారు.

సైనికులు, ప్రజలపై జరిపిన కాల్పుల్లో పది మంది మరణించినట్లు సమాచారం.

ఈ తిరుగుబాటుపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుందని దౌత్యవేత్తలు, ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

రాజకీయ అంతర్గత వివాదాల పరంగా తమ చర్య సరైనదేనని జనరల్ అబ్దెల్ ఫతా బుర్హా సమర్థించుకున్నారు. సైనికులు, ఖార్టూమ్‌లోని ప్రతీ ఇంటింటికి వెళ్లి స్థానిక నిరసన నాయకులను అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.

నగరంలోని విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్‌తో పాటు చాలా ఫోన్ లైన్ల సర్వీసులను కూడా సైనికులు నిలిపివేశారు.

సెంట్రల్ బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగడంతో పాటు, సైన్యం నిర్వహించే ఆసుపత్రుల్లో పనిచేసేందుకు దేశవ్యాప్తంగా వైద్యులు నిరాకరిస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది.

2019లో సూడాన్ అధ్యక్షుడు ఒబర్ అల్- బషీర్ గద్దె దిగినప్పటి నుంచి ప్రజాస్వామ్య నాయకులకు, మిలిటరీ అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

''సూడాన్ శాంతియుత విప్లవానికి సైనిక చర్య ద్రోహం చేసిందని'' అమెరికా కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ అన్నారు. 700 మిలియన్ డాలర్ల (రూ. 5, 253 కోట్లు) సహాయాన్ని అమెరికా నిలిపివేసింది.

రాత్రంతా నిరసనలు చేసిన తర్వాత కూడా, దేశంలో పౌర పాలనను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన కారులు మంగళవారం ఉదయం వీధుల్లోకి వచ్చారు.

''ప్రజల ఎంపిక- పౌర పాలన'' అంటూ నినాదాలు చేస్తూ టైర్లు కాల్చి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ''మిలిటరీ పాలన వద్దు'' అంటూ చాలా మంది మహిళలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సోమవారం నిరసనకారులపై సైన్యం కాల్పులు జరిపినప్పటికీ, ఈ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

గాయపడిన ఒక నిరసనకారుడు విలేకరులతో మాట్లాడుతూ 'మిలిటరీ ప్రధాన కార్యాలయం వెలుపల సైన్యం తన కాలుపై కాల్చిందని' చెప్పారు. సైన్యం తొలుత స్టెన్ గ్రెనెడ్లను, తర్వాత లైవ్ అమ్యునేషన్‌తో కాల్పులు జరిపిందని మరొక వ్యక్తి వెల్లడించారు.

''ఇద్దరు వ్యక్తులు చనిపోవడం నేను కళ్లారా చూశాను'' అని అల్ తయ్యబ్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు.

సైనిక కాంపౌండ్ వెలుపల ఘోరమైన కాల్పులు జరిగాయని సూడాన్ డాక్లర్ల యూనియన్‌తో పాటు సమాచార మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌లో ప్రకటించింది.

నగరంలోని ఒక ఆసుపత్రికి సంబంధించిన చిత్రాల్లో రక్తసిక్తమైన దుస్తులు, గాయాలతో ఉన్న ప్రజలు కనిపించారు.

సూడాన్ నిరసనలు

ఫొటో సోర్స్, SUPPLIED

ఫొటో క్యాప్షన్, చాలా మంది మహిళలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సైనిక తిరుగుబాటు వార్తలపై ప్రపంచ నాయకులు వెంటనే స్పందించారు.

గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధంగా ఉన్న రాజకీయ నాయకులను వెంటనే విడుదల చేయాలని అమెరికాతో పాటు బ్రిటన్, ఈయూ, ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికన్ యూనియన్‌లకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు.

సూడాన్ ప్రధాన మంత్రి అబ్దల్లా హమ్‌దోక్, ఆయన భార్యతో పాటు క్యాబినెట్ మంత్రులు, ఇతర రాజకీయ నాయకులను సైన్యం నిర్బంధించింది.

''సైన్యానికి చెందిన ప్రత్యేక భద్రతా దళం సోమవారం ఉదయం ప్రధాన మంత్రి నివాసానికి వెళ్లింది. తిరుగుబాటుకు సహకరించాల్సిందిగా హమ్‌దోక్‌ను కోరింది. కానీ దానికి ఆయన నిరాకరించారు'' అని బీబీసీ అరబిక్ ప్రతినిధి మొహమ్మద్ ఉస్మాన్ చెప్పారు.

సూడాన్‌లో ప్రజాస్వామ్య పాలన ఏర్పాటు చేయడానికి 2019లో సైన్యానికి, ప్రజాప్రతినిధులకు మధ్య ఒప్పందం జరిగింది. కానీ దీనికి వ్యతిరేకంగా అనేకసార్లు సైన్యం తిరుగుబాటు చేసింది. చివరగా, గత నెలలో కూడా సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నించింది.

''2023 జూలైలో ఎన్నికలు జరగనున్నందున ప్రజాస్వామ్య పాలనకు మారడానికి సూడాన్ ఇప్పటికీ కట్టుబడి ఉందని'' అధికార బదలాయింపు మండలికి అధ్యక్షుడైన జనరల్ అబ్దెల్ ఫతా బుర్హా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)