ఈ చిత్రం సూడాన్‌ ప్రభుత్వాన్ని షేక్ చేసింది, ఎందుకు?

మైఖేలాంజెలో గీసిన 'క్రియేషన్ ఆఫ్ ఆడమ్' చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మైఖేలాంజెలో గీసిన 'క్రియేషన్ ఆఫ్ ఆడమ్' చిత్రం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

సూడాన్‌లోని పాఠశాలల సిలబస్‌లో తీసుకొచ్చిన మార్పులు వివాదాస్పదమయ్యాయి.

సూడాన్‌లో ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రాజకీయ పరిస్థితుల మధ్య.. తరువాతి తరం ఏం నేర్చుకోవాలనే అంశంపై వివాదాలు చెలరేగాయి. వివిధ రాజకీయ, సామాజిక భావజాలం ఉన్న వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఖార్తూంలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ కరికులం అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్‌’ స్కూళ్లకు ఒక కొత్త సిలబస్‌ను ప్రతిపాదించింది. ఇటలీ చిత్రకారుడు మైఖేలాంజెలో గీసిన ‘క్రియేషన్ ఆఫ్ ఆడమ్’ చిత్రాన్ని చరిత్ర పుస్తకాల్లో చేర్చాలని కూడా అందులో సిఫార్సు చేశారు.

దానిపై పలువురు ఇస్లాం మతాధికారులు అభ్యతరం వ్యక్తం చేశారు. ఆ చిత్రం ఇస్లాం మతానికి విరుద్ధమని, పిల్లల పాఠ్య పుస్తకాల్లో దాన్ని చేర్చడం సబబు కాదని వారు అంటున్నారు.

లౌకికవాదులు మాత్రం అందులో తప్పేమీ లేదని అంటున్నారు.

నిరసన

ఫొటో సోర్స్, Getty Images

సూడాన్ రాజధాని ఖార్తూంలోని మసీదులో ఇటీవల శుక్రవారం జరిగిన ప్రార్థనల్లో ఒక ఇమాం "అల్లా అల్లా అల్లా" అని బిగ్గరగా ప్రార్థిస్తూ, పాఠ్య పుస్తకాల్లో చిత్రాన్ని చేర్చాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

సూడాన్ మాజీ అధ్యక్షుడు బషీర్ మద్దతుదారుడైన ఇమాం మొహమ్మద్ అల్-అమీన్ ఇస్మాయిల్.. ఈ చిత్రం ఇస్లాం మత ధర్మాలకు విరుద్ధమని అన్నారు. ఈ కొత్త సిలబస్ ద్వారా నాస్తికత్వాన్ని, విశ్వాసరాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇమాం మొహమ్మద్ అల్-అమీన్ ఇస్మాయిల్ పిలుపుతో బషీర్ మద్దతుదారులైన అనేకమంది ఇమాంలు కలిసి కొత్త బోధనా ప్రణాళికపై, ఒమర్ అల్-ఖర్రేపై కూడా వ్యతిరేక ప్రచారాలు ప్రారంభించారు.

లౌకికవాద గ్రూపు సభ్యుడైన అల్-ఖర్రే ఈ కొత్త సిలబస్‌ను సమర్థిస్తున్నారు. దాంతో, చంపుతామంటూ తమకు బెదిరింపులు వచ్చాయని అల్-ఖర్రే కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ అంశంపై వివాదం చెలరేగుతుండటంతో కొత్త బోధన ప్రణాళిక అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సూడాన్ ప్రధాని అబ్దల్లా హందోక్ ప్రకటించారు.

ప్రధాని నిర్ణయం పట్ల 'రిపబ్లికన్ బ్రదర్‌హుడ్‌' గ్రూపుకు చెందిన ఖర్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని తనను, ఇతర రాజకీయ వర్గాలను విస్మరిస్తూ ఇస్లాం అతివాదుల డిమాండ్లకు తలొగ్గారని విమర్శించారు.

కొత్త సిలబస్‌కు వ్యతిరేకంగా కొందరు టీచర్లు నిరసన తెలిపారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త సిలబస్‌కు వ్యతిరేకంగా కొందరు టీచర్లు నిరసన తెలిపారు

కొత్త సిలబస్ నిలిపివేయడంపై ఎలాంటి స్పందనలు వచ్చాయి?

గతంలో బషీర్ పాలనతో సంబంధాలు కలిగి ఉన్న కొన్ని తిరుగుబాటుదారుల సంఘాలు ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించాయి.

జస్టిస్ అండ్ ఈక్వాలిటీ మూవ్‌మెంట్ (జేఈఎం)కు చెందిన సులేమాన్ సాండల్ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మరో వైపు, ప్రభుత్వ నిర్ణయంపై పలువురు విమర్శలు గుప్పించారు.

ఇటీవలే సూడాన్ ఆర్థిక మంత్రిగా నియమితులైన జిబ్రిల్ ఇబ్రహీం పిల్లలు బ్రిటన్‌లో లౌకికవాదాన్ని భోదించే కరికులంలో చదువుకుంటున్నారని, ఇక్కడ సూడాన్‌లో మాత్రం మతపరమైన విద్యాబోధనవైపు మొగ్గు చూపుతున్నారని.. ఇది హిపోక్రిసీ అని విమర్శించారు.

ముస్లిం చట్టమైన షరియాను తొలిసారిగా 1983లో సూడానీస్ చట్టాలలో చేర్చారు. దక్షిణ సూడాన్‌తో సుదీర్ఘకాలం పాటూ సాగిన అంతర్యుద్ధానికి కారణం ఇదే.

తరువాత, మూడేళ్ల పాటూ షరియాను రద్దు చేశారు. మళ్లీ 1989లో బషీర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చట్టాన్ని పునరుద్ధరించారు.

బషీర్ అధికారం కోల్పోయిన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం షరియా చట్టం అంశాన్ని పరిష్కరించడానికి మొగ్గు చూపలేదు.

అయితే, కొత్త ప్రభుత్వం లౌకికవాదాన్ని అనుసరించాలని కొన్ని ప్రముఖ తిరుగుబాటుదారుల బృందాలు డిమాండ్ చేశాయి.

ఈ తిరుగుబాటు సమూహాలు.. ముఖ్యంగా క్రిస్టియన్లు, ముస్లిమేతరులు ఉన్న ప్రాంతాలనుంచీ పని చేస్తాయి. రాజకీయంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న మైనారిటీ వర్గాల హక్కుల కోసం వీరంతా పోరాడుతున్నారు.

కాగా, కొత్త ప్రభుత్వం మైనారిటీలకోసం కొన్ని ముఖ్యమైన చట్టాలను తీసుకొచ్చింది. ఆరు నెలల కిందట, ముస్లిమేతరులు మద్యం సేవించడాన్ని నిషేధించే చట్టాలను తొలగించింది.

అయితే, ప్రభుత్వం లౌకికవాదాన్ని అవలంబించడం ద్వారానే ముస్లిమేతరుల హక్కులకు రక్షణ కలుగుతుందని రెబల్ గ్రూప్ నాయకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం పాఠశాలల్లో కొత్త బోధన ప్రణాళిక విషయంలో..సూడాన్ ప్రభుత్వం.. భిన్న అస్తిత్వాలకు, సమూహాలకు ప్రతినిధిగా ఉండడం కన్నా సాంప్రదాయ, మతవాదుల అభిప్రాయాలకే ప్రాముఖ్యనిస్తున్నట్లు తోస్తోంది అని పలువురు భావిస్తున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)