IndvsPak టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలవడానికి 10 కారణాలివే...

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తొలిసారిగా భారత్‌పై ఆధిపత్యం చాటుకుంది. వరల్డ్ కప్ టోర్నీలో ఇన్నాళ్లు కొరకరాని కొయ్యగా ఉన్న భారత్‌పై మొదటిసారి విజయాన్ని సాధించి టైటిల్ వేటను అద్భుతంగా ప్రారంభించింది.
మరోవైపు ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ బరిలో దిగిన టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. పొరుగు దేశం చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడింది. మ్యాచ్ ముందు వరకు అంతా సక్రమంగానే ఉన్నప్పటికీ, బరిలోకి దిగాక భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. భారత్ నుంచి మ్యాచ్‌ను దూరం చేసిన, పాకిస్తాన్‌కు కలిసొచ్చిన పది అంశాలను పరిశీలిస్తే...
1.హార్ధిక్ పాండ్యాను నమ్ముకోవడం
హార్దిక్ పాండ్యా గాయపడినప్పటి నుంచి బౌలింగ్ చేయడం లేదు. అతని బౌలింగ్ లేకపోవడంతో జట్టులో సమతుల్యత లేకుండా పోయింది. హార్దిక్ బౌలింగ్ చేయకపోవడంతో భారత్ అయిదుగురు బౌలర్లతో వెళ్లాల్సి వచ్చింది.
ప్యాండ్యా ఐపీఎల్‌లో కూడా అద్భుతాలు చేయలేకపోయారు. బ్యాటింగ్ ప్రాతిపదికన చూస్తే, రిషబ్ పంత్ కంటే ముందు అతన్ని దింపి ఉండాల్సింది. జట్టును తిరిగి ట్రాక్‌లో పెట్టడానికి విరాట్, పంత్ చేసిన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో పాండ్యా పూర్తిగా విఫలమయ్యారు.
హార్దిక్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చి ఉంటే మరింత మెరుగైన ఫలితం వచ్చే అవకాశం ఉండేది. ఠాకూర్ అంతకు ముందు మ్యాచ్‌లలో వికెట్ తీయడమే కాకుండా, దూకుడుగా బ్యాటింగ్ చేశారు.
గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన ఇదే విషయాన్ని రుజువు చేశారు. హార్దిక్ స్థానంలో శార్దూల్‌తో జట్టు మరింత సమతూకంగా ఉండేదన్నది నిజం.
2. అశ్విన్‌ను పట్టించుకోలేదు
రవిచంద్రన్ అశ్విన్ దేశానికి నంబర్ వన్ స్పిన్నర్ అని మనందరికీ తెలుసు. ఈ కారణంగానే చాలా సంవత్సరాల తర్వాత ఈ ఫార్మాట్‌లో ఎంపికయ్యారు.
పాకిస్తాన్‌తో ఆడుతున్నప్పుడు ఆటగాళ్లలో కొంత టెన్షన్ ఉండటం సహజం. ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓటమికి కారణం అనిపించుకోవాలని ఎవరూ కోరుకోరు.
వార్మప్ మ్యాచ్‌లో చేసిన బౌలింగ్ మాదిరి బౌలింగ్ చేయాలని అశ్విన్ కోరుకున్నారు. కానీ జట్టు మేనేజ్‌మెంట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని సద్వినియోగం చేసుకోవాలని భావించింది.
కానీ, వరుణ్ కూడా టెన్షన్ తట్టుకోలేకపోయారు. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 33 పరుగులు ఇచ్చారు.
అశ్విన్‌కు చోటివ్వకపోవడం ఒక తప్పయితే దేశంలో అత్యంత సక్సెస్‌ఫుల్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ని ఎంపిక చేయకపోవడం మరో పెద్ద తప్పు అని నిరూపణ అయ్యింది.
అవసరమైనప్పుడు వికెట్లు తీయగల సత్తా చాహల్‌కు ఉంది. పైగా ఐపీఎల్‌లో కూడా బాగా బౌలింగ్ చేశారు.
చివరి నిమిషంలోనైనా బీసీసీఐ చాహల్‌కు అవకాశం ఇస్తుందని అనుకున్నారు.కానీ, అలా చేయకపోవడంతో ఎటాకింగ్‌లో జట్టు బలహీనపడింది.
జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ లేకపోవడం కూడా ఒక లోపమే. ఈ విషయంలో భారత్ కంటే ముందున్న పాకిస్తాన్..ఆరంభంలోనే భారత జట్టును కట్టడి చేయగలిగింది.

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP VIA GETTY IMAGES
3.భువి లో ‘లయ’ లేదు
భువనేశ్వర్ కుమార్ ఓపెనింగ్ ఓవర్లలో వికెట్ టేకర్ అని పేరు తెచ్చుకున్నారు. డెత్ ఓవర్‌లో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే సత్తా కూడా అతనికి ఉంది. కానీ చాలా కాలంగా గాయం సమస్యలతో ఇబ్బందిపడిన భువనేశ్వర్ మునుపటిలాగా ఆడలేకపోయారు.
ఐపీఎల్ లో కూడా అతని ప్రదర్శన గొప్పగా లేదు. దీంతో పాకిస్తాన్ మీద భారత జట్టు ఒత్తిడి తీసుకురాలేక పోయింది. బుమ్రా, షమీ లు కూడా రిజ్వాన్, బాబర్ ఆజం లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయారు.
4. కేఎల్ రాహుల్ ఔట్ పై సందిగ్ధత
భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్ (3) అవుటయ్యారు. ఇది సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. షహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో రాహుల్ బౌల్డయ్యారు. కానీ అనంతరం టీవీల్లో చూపిన రీప్లే వీడియోలో మాత్రం బంతి వేసినప్పుడు షహీన్ కాలు గీత దాటినట్లుగా కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అది నోబాల్‌కు దగ్గరగా ఉందంటూ, దానిని మళ్లీ పరిశీలించాలని సోషల్ మీడియాలో పలువురు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్న అభిమానులు నోబాల్ కారణంగా రాహుల్ అవుటయ్యాడంటూ బాధ వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, STU FORSTER/GETTY IMAGES
5. మంచు ప్రభావం
భారత బ్యాట్స్‌మెన్ తడబడిన చోట...పాకిస్తాన్ ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ్ చెలరేగారు. వీరిద్దరు అలవోకగా షాట్లు ఆడుతుంటే భారత బౌలర్లు చేష్టలుడిగిపోయారు. ఈ జంటను విడదీసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేకపోయింది.
అరే.. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోతున్నారే అని యావత్ భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనికి ముఖ్య కారణం పిచ్‌పై కురిసిన మంచు.
పగలంతా వేడిగా ఉండే యూఏఈ పిచ్‌లపై రాత్రి మంచు కురుస్తుంది. ఈ మంచు ప్రభావం కారణంగా బౌలర్లకు, ఫీల్డర్లకు బంతిపై పట్టు దొరకదు. బంతిని సంధించే క్రమంలో బౌలర్లకు పట్టు చేజారుతుంది. దీంతో వారు అనుకున్నంత ప్రభావవంతంగా బంతిని వేయలేకపోతారు.
పాక్‌తో మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లకు ఇదే జరిగింది. ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకున్న బాబర్ ఆజమ్, రిజ్వాన్ చెలరేగిపోయారు.
బంతిపై మంచు ప్రభావాన్ని తొలిగించేందుకు భారత ఆటగాళ్లు టవల్‌తో పదేపదే తుడిచినప్పటికీ అది పనిచేయలేదు. ఇదే వేదికలపై కొద్ది రోజుల క్రితమే జరిగిన ఐపీఎల్ టోర్నీల్లో కూడా ఈ మంచు అంశం చర్చల్లో నిలిచింది.
మంచు కారణంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన జట్టు ఓడిపోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, AAMIR QURESHI
6. అలసట
మైదానంలో భారత ఆటగాళ్ల కదలికలు అంత చురుగ్గా లేవన్నది నిజం. ఫీల్డింగ్ సమయంలో వారి బాడీ లాంగ్వేజ్ గమనించిన వారెవ్వరికైనా ఇది అర్థం అవుతుంది.
కళ్లు చెదిరే క్యాచ్, విస్మయపరిచే స్టంపింగ్, మెరుపు వేగంతో బౌండరీ వైపు దూకడంలాంటి ఒక్క ఘటన కూడా భారత ఆటగాళ్లు నుంచి కనిపించ లేదు. బౌండరీ వైపు బంతి వెళ్తుంటే అలా చూస్తుండటం తప్ప ఏం చేయలేకపోయారు. దీనికి అలసట కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.
ఇటీవలి కాలంలో భారత క్రికెటర్లు విపరీతమైన క్రికెట్ ఆడారు. కరోనా ఉన్నప్పటికీ భారత్ టోర్నీలు ఆడుతూనే ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కోసం ఇంగ్లండ్ వెళ్లింది. ఆ సుదీర్ఘ పర్యటన తర్వాత భారత క్రికెటర్లు ఇళ్లకు చేరకుండానే, ఐపీఎల్ రెండో దశ పోటీల కోసం యూఏఈ చేరారు.
ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రపంచ కప్‌కు సన్నద్ధమయ్యారు.
సంవత్సరంలోని 365 రోజుల్లో కనీసం 300 రోజులు క్రికెటర్లు ఆడుతూనే ఉంటారు. ఇలా విశ్రాంతి లేకుండా ఆడటం ఆటగాళ్ల శరీరంపై ప్రభావం చూపిస్తుంది.
ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత ఆటగాళ్లు నీరసంగా కనిపించారు. వారిలో పాక్‌తో ఆడినప్పుడు సాధారణంగా కనిపించే ఉత్సాహం, ఉద్వేగాలు కనిపించలేదు. ప్రపంచకప్ టైటిల్ గెలవాలనుకుంటే మాత్రం, టీమిండియా ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోక తప్పదు.

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC
7. పాకిస్తాన్ సామర్థ్యం గురించి తెలియకపోవడం
భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చాలా కాలంగా ఈ రెండు జట్లు మైదానంలో తలపడటం లేదు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్ సుముఖంగా లేదు. పాక్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడలేరు. భారత ప్లేయర్లు పీఎస్‌ఎల్‌లో ఆడరు.
దీంతో పాక్ ఆటగాళ్ల బలాబలాలు, బలహీనతల గురించి భారత ఆటగాళ్లు తెలుసుకునేందుకు ఒకే మార్గం యూట్యూబ్. యూట్యూబ్ ద్వారా పాక్ ఆటగాళ్లు ఎలా ఆడతారు, వారి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలం ఏంటనే అంశాల గురించి తెలుసుకోగలుగుతారు.
బౌలర్ షహీన్ షా ఆఫ్రిది, గత మూడేళ్లుగా అన్ని ఫార్మాట్‌లలో పాకిస్తాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ట్వంటీ 20 లలో బాబర్ ఆజమ్-రిజ్వాన్ ఓపెనింగ్ జోడీ సత్తా చాటుతోంది. భారత స్టార్ కోహ్లితో బాబర్‌ను పోల్చుతుంటారు.
పాకిస్తాన్ క్రికెట్‌లో ఎప్పుడు కూడా అద్భుత ఆటగాళ్లకు కొదవ లేదు. కానీ నిలకడ లేమి అనేది ఆ జట్టుకు ప్రధాన బలహీనత. ఇలా ప్రస్తుత పాకిస్తాన్ జట్టు బలాబలాలను పసిగట్టడంతో భారత్ వెనుకబడినట్లు అనిపించింది.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్‌లతో ప్రపంచకప్ కోచింగ్ బృందాన్ని పాకిస్తాన్ పటిష్టం చేసుకుంది. విధ్వంసకర, బలమైన అటాకింగ్ హేడెన్ సొంతం. ఆదివారం భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆటతీరు దీన్ని ప్రతిబింబించింది.
ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ బట్టి క్రమశిక్షణతో కూడిన కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం ఫిలాండర్ స్టయిల్. పాక్ బౌలర్లు కూడా ఇదే తరహాలో భారత్‌ను దెబ్బ తీశారు.

ఫొటో సోర్స్, MATTHEW LEWIS-ICC
8. అతి విశ్వాసం
ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఘనమైన రికార్డుంది. ప్రపంచకప్ టైటిల్ గెలుపొందేందుకు భారత్-పాక్ మ్యాచ్ అనేది ఒక సమీకరణంగా మారిపోయింది. అది వన్డే ప్రపంచకప్ కావచ్చు లేదా టి20 ఫార్మాట్ అవ్వొచ్చు... పాక్‌తో మ్యాచ్ అంటే గెలుపు మాత్రం భారత్‌దే అనే ముద్ర స్థిరపడింది. ఇదే ఆతి విశ్వాసం తాజా మ్యాచ్‌లో భారత్ కొంపముంచింది.
ఆత్మవిశ్వాసంగా మ్యాచ్ బరిలో దిగిన సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ కీలక సమయంలో వికెట్ పారేసుకున్నారు. పూర్తి ఫిట్‌గా లేని హార్దిక్ పాండ్యా... బంతికి, బ్యాట్‌కు కనెక్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అతను బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఇది స్పష్టంగా తెలిసింది. వెన్నునొప్పి కారణంగా హార్దిక్ బౌలింగ్ కూడా చేయలేకపోయాడు. హార్దిక్‌కు బదులుగా పూర్తి ఫిట్‌గా ఉన్న మరో ప్లేయర్‌ను ఆడించి ఉంటే ఫలితం కాస్త వేరేలా ఉండేదేమో..
పాకిస్తాన్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఇది బౌలర్లు కాపాడుకోగలిగే లక్ష్యమే. కానీ భారత బౌలర్లెవరూ దీన్ని కాపాడలేకపోయారు. ధారాళంగా పరుగులివ్వడంతో పాటు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. బాబర్-రిజ్వాన్ జోడీని విడగొట్టేందుకు భారత బౌలింగ్ దళం వద్ద సరైన వ్యూహమేదీ లేదని మ్యాచ్‌లో స్పష్టంగా తెలిసింది.

ఫొటో సోర్స్, MATTHEW LEWIS-ICC/ICC VIA GETTY IMAGES
9. పాకిస్తాన్ సొంత మైదానంలా యూఏఈ
స్వదేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా యూఏఈ వేదికగా పాకిస్తాన్ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇలా ఒక రకంగా యూఏఈ, పాకిస్తాన్‌కు హోం గ్రౌండ్‌గా మారింది.
దుబాయ్, అబుదాబి మైదానాల్లో ఆడటంలో పాకిస్తాన్ ప్లేయర్లకు విశేష అనుభవం ఉంది. దీంతో ప్రపంచకప్ టోర్నీని సొంత మైదానాల్లోనే ఆడుతున్నట్లుగా పాక్ క్రికెటర్లు అనుభూతి చెందుతున్నారు.
మైదానాల్లో పిచ్‌ల ప్రవర్తన తీరు, మైదానం సైజు , ఇక్కడి వాతావరణ పరిస్థితులపై పాక్ క్రికెటర్లకు లోతైన అవగాహన ఉంది. కొత్త వాతావరణ పరిస్థితుల్లో ఆడినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులేం వారికి లేవు.
యూఏఈ లోని వేడి వాతావరణంలో అలసటకు గురికాకుండా, శక్తిని కాపాడుకుంటూ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. పిచ్ పై మంచు ప్రభావాన్ని అడ్డుకోవడంలోనూ వారికి అవగాహన ఉంది.
భారత ఆటగాళ్లు ఈ వేదికలపై ఐపీఎల్ ఆడినప్పటికీ, ఇక్కడి పరిస్థితులపై పాక్ క్రికెటర్లకు ఉన్నంత అవగాహన టీమిండియా క్రికెటర్లకు లేదు.
10.సంసిద్ధత లేకపోవడం
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉండగా, చాలా జట్లు చాలా కాలంగా సన్నద్ధమవుతున్నాయి.
పాకిస్థాన్ జట్టు ధాటిని చూస్తుంటే.. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లపై స్పష్టమైన వ్యూహం రచించారని అనిపిస్తుంది. కానీ అలాంటి వ్యూహం ఏదీ లేకపోవడం భారత బౌలర్లలో లేదని స్పష్టంగా అర్ధమైంది.

ఫొటో సోర్స్, MATTHEW LEWIS-ICC/ICC VIA GETTY IMAGES
ఏ దశలోనూ కోలుకోలేక పోయాం: విరాట్ కోహ్లి
''వారు కచ్చితంగా మాకన్నా బాగా ఆడారు. అందులో సందేహం లేదు. అందుకే 10 వికెట్లతో గెలిచారు. మ్యాచ్‌లో మాకు ఏ దశలోనూ గెలిచే అవకాశం లభించలేదు. వారు చాలా ప్రొఫెషనల్‌గా ఆడారు. మ్యాచ్ క్రెడిట్ అంతా వారికే దక్కాలి'' అని మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''మా అత్యుత్తమమైన ఆట ఆడేందుకు ప్రయత్నించాం. వారిపై ఒత్తిడి పెంచాలని చూశాం. కానీ మా ప్రతీ సవాలుకు వారు అద్భుతంగా జవాబిచ్చారు. మన కన్నా ఒక జట్టు చాలా బాగా ఆడిందని అంగీకరించడం సిగ్గుపడాల్సిన అంశమేమీ కాదు’’ అన్నారాయన.
మైదానంలో దిగాక ఇరు జట్లకు గెలిచేందుకు సమాన అవకాశాలు ఉంటాయనీ, ప్రతీ మ్యాచ్ మేమే గెలుస్తామని అనుకోవడానికి వీలు లేదని కోహ్లీ అన్నారు. అలాగాని, ఏదో సరదాగా వెళ్లి ఆడి రాలేమని అన్న ఆయన, ప్రపంచ కప్‌లో ఇదే తొలి మ్యాచేనని, ఆఖరు మ్యాచ్ కాదని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 వరల్డ్ కప్ సూపర్ 12: బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం
- IndvsPak-T20 World Cup: ‘బ్లాంక్ చెక్‌లో నచ్చిన అంకె రాసుకోండి, కానీ భారత్‌ను ఓడించండి’
- దళితుడిని నరికి, బ్యారికేడ్‌కు వేలాడదీసిన ఘటనకు ముందు, తర్వాత ఏం జరిగింది? - గ్రౌండ్ రిపోర్ట్
- మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే వెయ్యి మరణాలు.. టీకాలు వేయించుకోకపోవడం వల్లనేనా?
- భారత్‌లో పిల్లలకు కోవిడ్ వ్యాక్సీన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- 'ఏపీలో విద్యుత్ కొరత లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









