Zero Debt: అప్పులు చేయొచ్చా, చేయకూడదా? బ్యాంక్ లోన్ ఎంత ఉండాలి? క్రెడిట్ స్కోర్ ఎలా బ్యాలెన్స్ చేయాలి?

అసలు అప్పుల్లేకపోవడం గొప్పకాదని నిపుణులు అంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అసలు అప్పుల్లేకపోవడం గొప్పకాదని నిపుణులు అంటున్నారు

అప్పు చేయడం కొందరికి తప్పనిసరి కావచ్చు. కానీ, అలా చేయడం ఎక్కువమందికి ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా చూస్తే ఇది మంచి ఆలోచనే. కానీ, ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ విషయానికి వస్తే మాత్రం సరైన వ్యూహం కాదు. పెట్టుబడుల కోసం అప్పు చేయడం మంచి ఆలోచనని నిపుణులు అంటున్నారు.

నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలు సంపన్న దేశాలే. వాటి అప్పుల స్థాయి చాలా తక్కువగా ఉంది. కానీ, అవి మార్కెట్‌లో రుణాలు తీసుకోక పోయినట్లయితే, ధనిక దేశాలుగా మారే అవకాశాన్ని కోల్పోయేవి.

''అప్పు ఉండటం గొప్పా కాదు, తప్పూ కాదు. అది ఒకదేశం ఆర్ధిక వనరులను పొందగలిగే పరిస్థితులను బట్టి ఉంటుంది'' అని ఆర్థిక సేవలు అందించే ఫాల్కామ్ అసెట్ మేనేజర్‌ సంస్థలో ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్న హ్యూగో ఒసోరియో బీబీసీతో అన్నారు.

అధిక పొదుపు, స్వల్పలోటు, ఆర్థిక ఖాతాలు సవ్యంగా నిర్వహించే దేశాలకు 'జీరో డెట్'(సున్నారుణం) కలిగి ఉండటం అంత మంచిదేమీ కాదంటున్నారు ఆర్ధిక నిపుణులు.

అయితే అప్పులు, వడ్డీలు మెడకు బిగిసి ఉన్న దేశానికైనా, వ్యక్తికైనా రుణాలు తీసుకోవడం మంచిది కాదని, అలాంటి వారు జీరో రుణాలను లక్ష్యంగా పెట్టుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు భారీ రుణ స్థాయిలను తట్టుకోగలవు. ఎందుకంటే మార్కెట్‌లకు వాటిపై విశ్వాసం ఉంటుంది. క్రెడిట్ రేటింగ్ బాగుంటే ఆ దేశాలను నిశ్చింతగా నిద్రపోవచ్చు.

అమెరికా, చైనాల తర్వాత మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ జపాన్‌ ను ఉదాహరణగా తీసుకుంటే, అభివృద్ధి చెందిన దేశాలలో అదే ఎక్కువ రుణాలున్న దేశం. ఆ దేశ ప్రభుత్వ రుణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 256%కి చేరుకుంటుంది. అంటే ఆ దేశం దివాలా తీయబోతోందా? ఎంత మాత్రం కాదు.

మిగిలిన ప్రపంచమంతా ఆ దేశపు స్థిరత్వాన్ని నమ్ముతుంది. జపాన్‌కు రిస్క్ రేటింగ్ ఎక్కువగా ఉంది.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

అప్పుల్లో అమెరికా

అమెరికా అప్పులు దాని జీడీపీలో 133% ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆ దేశానికి మంచి పేరుంది. దాని మార్కెట్లపై విశ్వాసం ఉంది. పెట్టుబడులకు స్వర్గధామంగా పేరు తెచ్చుకుంది. యుక్రెయిన్‌ సంక్షోభంలో పాలుపంచుకుంటున్నా, దానిపై నమ్మకం తరగలేదు.

1835లో అమెరికా తన అప్పులన్నింటినీ తీర్చేసింది. రుణరహిత దేశమైంది. కానీ, దాని తర్వాత పరిస్థితులు మారిపోయాయి. తర్వాత వచ్చిన ఏ అధ్యక్షుడు మళ్లీ ఇలాంటి ఆలోచన చేయలేదు.

అప్పటికే దేశంలోని రాజకీయపక్షాలు అప్పుల్లేకుండా దేశాన్ని నడిపించడం ఎలా, అప్పులు లేకపోతే ఆర్ధిక వ్యవస్థకు కలిగే నష్టాలేంటి అన్నదానిపై విస్తృతంగా చర్చించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అమెరికా రుణాలు తీసుకునే వేగం పెరిగింది. ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రభావం నుంచి తట్టుకోవడానికి రెస్క్యూ ప్యాకేజీలపై ఆ దేశం ఎక్కువగా ఖర్చు పెడుతోంది.

అఫ్గానిస్తాన్‌‌కు అప్పులు తక్కువ ఉన్నా, ఆర్ధిక పరిస్థితి బాగాలేదు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌‌కు అప్పులు తక్కువ ఉన్నా, ఆర్ధిక పరిస్థితి బాగాలేదు

ఒక దేశానికి అప్పు ఎంత ఉండాలి?

ఇది ఒక్కో దేశంపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ తాజాగా వెల్లడించిన డేటా ప్రకారం అర్జెంటీనాకు తన జీడీపీలో 102% నికర రుణాలున్నాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, దాని ప్రమాద స్థాయి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

మరోవైపు సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్, హైతీ వంటి దేశాలకు అప్పులు ఎక్కువగా లేవు. అయితే, వాటి ఆర్ధిక పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఇలాంటి పరిస్థితి ఆయా దేశాల ఆర్ధిక శ్రేయస్సుకు అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, రష్యా, అమెరికా సంఘర్షణల్లో యూరప్ ఎవరివైపు ఉంటుంది? కారణాలేంటి?

సిస్టమ్ ఎలా పని చేస్తుంది?

ఫైనాన్సింగ్ పొందడానికి రుణదాతకు నిర్ణీత గడువులోగా వడ్డీ చెల్లిస్తామనే నిబద్ధతతో దేశాలు రుణాన్ని సేకరిస్తాయి. ఫైనాన్సింగ్ కోసం ఎక్కువగా ఉపయోగించే సాధనాల్లో బాండ్ల జారీ ఒకటి. వీటిని వ్యక్తులు, పెట్టుబడి సంస్థలు, ఇతర దేశాల నుంచి లేదంటే ఆ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ద్వారా సేకరించవచ్చు.

బ్యాంకు లేదా అంతర్జాతీయ సంస్థ నుండి రుణం అడగటానికి బదులుగా, పెట్టుబడిదారుడికి తిరిగి ఇచ్చేలా ఆయా దేశాలు బాండ్లను మార్కెట్‌లో ఉంచుతాయి. ఈ నిధులతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం చేయవచ్చు, విద్యలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా ఖజానా నుండి వనరులను పంపిణీ చేసి ఏదైనా ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

లేదంటే మెరుగైన నిబంధనలతో ప్రస్తుత రుణాన్ని రీఫైనాన్సింగ్ చేయవచ్చు. అంటే రెన్యువల్ చేయవచ్చు.

బాండ్లు, ఇతర రుణాలు ఇచ్చే సాధనాల లాగే, పన్నులు లేదా పబ్లిక్ కంపెనీల నుండి వచ్చే ఆదాయం వంటి ద్వారా డబ్బును సేకరించడం మరొక మార్గం.

ఒకదేశం అధిక రిస్క్‌ లెవెల్‌లో ఉంటే రుణదాతకు ఎక్కువ వడ్డీని చెల్లిస్తుంది. ఒకవేళ దేశం విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థ అయితే, రిస్క్‌ తక్కువ కాబట్టి బాండ్లపై వడ్డీ రేటును కూడా తక్కువగా చెల్లిస్తుంది.

ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఒక దేశం రుణ బాండ్లను జారీ చేస్తుందంటే, దాని దగ్గర సేవింగ్స్‌ లేవని కాదు.

‘‘ప్రభుత్వాలు వృద్ధి రేటును పెంచాలనుకుంటే, రుణ బాండ్లను జారీ చేస్తాయి" అని కన్సల్టింగ్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ లో లాటిన్ అమెరికా గ్లోబల్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ విభాగం సీనియర్ ఆర్థికవేత్త ఎలిజా ఒలివెరోస్-రోసెన్ బీబీసీతో అన్నారు.

జీరోడెట్

ఫొటో సోర్స్, Getty Images

''సమతుల్యత సాధించాలి"

చాలామంది తమ ఇంటి రుణం తీరిపోగానే, ఆస్థి సొంతమైందని సంతోష పడిపోతుంటారు. కానీ, చాలామందికి అప్పు విలువ తెలియదని ఆర్ధిక నిపుణులు, స్పెయిన్‌లోని ఐఈ బిజినెస్ స్కూల్‌లో ఫైనాన్షియల్ సెక్టార్ డైరెక్టర్‌గా పని చేస్తున్న మాన్యువల్ రోమెరా అంటారు.

ఇంటి అప్పు తీరిపోగానే, ఇంటిని తనఖా పెట్టి, ఆ డబ్బుతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినవారున్నారని రోమెరా అన్నారు.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో తాము చేసిన అప్పుకంటే ఎక్కువ సంపాదించగలుగుతారని, సొంత ఇంట్లో ఉండటంతో పాటు అదనపు రాబడి కూడా సాధిస్తారని రోమెరా అభిప్రాయపడ్డారు.

అందుకే రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ముఖ్యమంటారు రోమెరా. ‘‘అసలు అప్పు తీసుకోకపోవడం గొప్ప విషయం కాదు. కానీ, అధికంగా అప్పులు చేయడం మాత్రం ప్రమాదకరమే’’ అన్నారు.

వీడియో క్యాప్షన్, భవిష్యత్‌లో రాబోయేవన్నీ టెంపరరీ ఉద్యోగాలేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)