ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి తల్లిని హత్య చేసిన 17 ఏళ్ల కూతురు.. ఏం జరిగిందంటే..

హత్య ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రభురావ్ ఆనందన్
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడులోని టుటికోరిన్ (తూతుకుడి) జిల్లాలో 17 ఏళ్ల ఒక అమ్మాయి తన మగ స్నేహితులతో కలసి సొంత తల్లిని హత్య చేసింది.

అబ్బాయిలతో ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుతున్నావంటూ తల్లి మందలించినందుకే ఆ అమ్మాయి ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. టుటికోరిన్ జిల్లాలోని మేళషన్ముగాపురంలో ఈ హత్య జరిగింది. మృతురాలి పేరు మునియలక్ష్మి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త పేరు మాదసామి. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు సంతానం.

భర్తతో సమస్యలు తలెత్తడంతో ఆమె తన పిల్లలతో కలసి వేరుగా జీవిస్తోంది.

ఆమె కుమార్తెల్లో ఒకరైన 17 ఏళ్ల యువతి పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది.

ముతియాపురంకు చెందిన తంగకుమార్, ముల్లుక్కాడుకు చెందిన కణ్ణన్‌లతో ఆమె స్నేహం చేస్తోంది. వాళ్లతోనే తరచుగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఈ విషయంపైనే మునియలక్ష్మి పలుమార్లు కుమార్తెను కసురుకున్నారు.

తల్లి తనను మందలించడంతో కోపం తెచ్చుకున్న ఆ అమ్మాయి తన మగ స్నేహితులను ఇంటికి పిలిచింది. వాళ్ల సహాయంతో తల్లిని కత్తితో పోడిచి చంపింది.

మునియలక్ష్మి
ఫొటో క్యాప్షన్, మునియలక్ష్మి

తల్లిని చంపిన తర్వాత ఏం జరిగింది?

మునియలక్ష్మి మరణించిన తర్వాత ఆ అమ్మాయే పోలీసులకు ఫోన్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో దొంగతనానికి వచ్చారని, నగల కోసం తన తల్లిని హత్య చేశారని చెప్పింది.

అయితే, పోలీసులు ఆమెను లోతుగా విచారించారు. ఈ సందర్భంగా ఆ యువతి తికమకగా సమాధానాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు.

అబ్బాయిలతో స్నేహం చేయొద్దని, ఈ స్నేహాలు మానుకోవాలని తల్లి చెప్పడంతో ఆగ్రహించి తానే హత్య చేశానని పోలీసు స్టేషన్‌లో ఆ యువతి అంగీకరించింది.

దీంతో ఆ యువతిని, ఆమెకు సహకరించిన మగ స్నేహితులు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

టుటికోరిన్ (తూతుకుడి) జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బాలాజీ శరవణన్
ఫొటో క్యాప్షన్, టుటికోరిన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బాలాజీ శరవణన్

టుటికోరిన్ (తూతుకుడి) జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బాలాజీ శరవణన్ బీబీసీ తమిళ్‌తో మాట్లాడుతూ.. ''మునియలక్ష్మి కూతురు కొంతమంది మగ పిల్లలతో స్నేహం చేస్తోంది. వాళ్లు ఆమెతో పాటు పనిచేసే అబ్బాయిలే. వారితోనే గంటలకొద్దీ ఫోన్లో మాట్లాడేది. ఇదంతా మానుకోవాలని మునియలక్ష్మి కుమార్తెకు చెప్పింది. కానీ, ఆ యువతి తల్లి మాట వినలేదు. దీంతో మునియలక్ష్మి ఇతరుల ముందు కూతుర్ని పట్టుకుని కొట్టింది. తల్లి అలా చేయడం కూతురిని మానసికంగా బాధించింది. దీంతో, ఆ అమ్మాయి తన మగ స్నేహితుల సహాయంతో తల్లిని హత్య చేసింది.''

టుటికోరిన్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ శరవణన్ బీబీసీతో అన్నారు.

అన్ని మహిళా పోలీసు స్టేషన్లలోనూ, పబ్లిక్ ప్లేసుల్లోనూ 'మార్పు దిశగా' అనే పేరుతో ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.

మొబైల్ ఫోన్లను సురక్షితంగా ఎలా వాడుకోవాలి అన్నదే ఈ అవగాహనా కార్యక్రమాల ఉద్దేశ్యమని చెప్పారు.

''కరోనా మహమ్మారి తర్వాత 18 ఏళ్లలోపు పిల్లలు కూడా మొబైల్ ఫోన్లు వాడాల్సిన పరిస్థితులు వచ్చాయి. వాళ్లు అనవసరమైన యాప్స్ వాడకుండా తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ ఉండాలి'' అని ఎస్పీ శరవణన్ తెలిపారు.

అలాగే పిల్లలు సైతం సోషల్ మీడియా యాప్స్‌లో తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను పోస్టు చేయడం మానుకోవాలని, అలా చేయడం ద్వారా ముక్కూమొహం తెలియని వ్యక్తులకు కూడా తమనుతాము పరిచయం చేసుకోకుండా ఆపుకోవచ్చని అన్నారు.

వీడియో క్యాప్షన్, యాదాద్రి: అలనాటి అనుభూతిని కలిగించే ఆధునిక నిర్మాణం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)