CIPET: టెన్త్ ఫెయిల్ అయిన వారికి కూడా భోజనం, వసతితో ఉచిత శిక్షణ, కోర్సు పూర్తయిన వెంటనే దేశ, విదేశాల్లో ఉపాధి

సీపెట్

ఫొటో సోర్స్, cipet

    • రచయిత, నాగ సుందరి
    • హోదా, బీబీసీ కోసం

సీపెట్... పేద, వెనుకబడినవర్గాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటు కల్పిస్తోంది. ప్లాస్టిక్ రంగంలో దేశ, విదేశాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.

హైదరాబాద్‌లోని సీపెట్ పదవతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్థులకు ప్లాస్టిక్ ఇంజనీరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. సీపెట్ సెంటర్లు దేశమంతా ఉన్నాయి.

ప్లాస్టిక్స్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు అందివ్వడం దీని ప్రత్యేకత.

సీపెట్ ఏంటి?

నిత్యజీవితంలో ప్లాస్టిక్ అవసరాలు పెరగడంతో పాటు ఈ రంగంలో ఉపాధి అవసరాలు కూడా అధికమయ్యాయి. ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన, వస్తువుల తయారీపై సీపెట్లో ఎంతోమంది యువత శిక్షణ పొందుతున్నారు.

కోర్సుల్లో శిక్షణ పొందుతున్నప్పుడే వారికి వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ప్లాస్టిక్ రంగ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సీపెట్ పూర్తి పేరు 'సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ'. గతంలో దీన్నే 'సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ టెక్నాలజీ'' అనేవారు.

మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కింద స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది.

1968లో చెన్నైలో దీన్ని ఏర్పాటుచేశారు. దీని కింద మొత్తం దేశమంతటా 43 ఆపరేషనల్ సెంటర్లు ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, CIPET: పది ఫెయిలైన వారికి కూడా వసతి, శిక్షణ, ఉపాధి

ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోని వివిధ విభాగాల్లో మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక పరిజ్జానం పెంపొందించే దిశగా కృషి చేయడమే దీని లక్ష్యం. యువతను ఆ దిశగా సీపెట్ తీర్చిదిద్దుతోంది. దేశంలో ఇదొక్కటే ఇలాంటి సంస్థ ఉంది.

హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రీమియర్ ఇనిస్టిట్యూషన్ ఇది. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ రంగం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది.

పాలిమర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అకడమిక్స్‌తో పాటు స్కిల్ డెవలెప్మెంట్ సేవలను కూడా సీపెట్ అందిస్తోంది.

యువతకు ఉద్యోగావకాశాలు వెంటనే కల్పించడంతో పాటు వారు ఎంట్రీప్రిన్యూర్లుగా ఎదిగే సేవలను కూడా అందిస్తోంది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్‌కు డిజైన్, టూలింగ్, ప్లాస్టిక్ ప్రోసెసింగ్, టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తోడ్పాటును, శిక్షణను అందిస్తోంది.

ప్లాస్టిక్ కోర్సులకు సంబందించిన ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశానికి ప్రతి ఏడాది సీపెట్ ప్రవేశపరీక్ష నిర్వహిస్తుంది.

లబ్ డబ్బు

హైదరాబాదులో ఎప్పటి నుంచి?

హైదరాబాద్‌లో సీపెట్ 1987లో ఏర్పాటు చేశారు.

తెలంగాణలో ప్లాస్టిక్స్, సంబంధిత రంగాలలో ట్రైనింగ్, టెక్నికల్ సర్వీసులను సీపెట్ అందిస్తోంది.

ఇక్కడ డిజైన్, క్యాడ్, క్యామ్, టూలింగ్, ప్లాస్టిక్స్ ప్రొసెసింగ్, టెస్టింగ్ డిపార్టుమెంట్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానంతో కూడిన సదుపాయాలు ఉన్నాయి. శిక్షణా సౌకర్యాలు ఉన్నాయి.

క్వాలిటీ ట్రైనింగ్, టెక్నికల్ సర్వీసులు ద్వారా కస్టమర్ అవసరాలను తీరుస్తోంది. అంతేకాదు ఉద్యోగావకాశాలు పెంపొందించే దిశగా నిరుద్యోగ, పేద యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్‌‌ను సీపెట్ అందిస్తోంది.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు యువతీ, యువకులకు అవకాశాలు కల్పిస్తోంది.

అకడమిక్ లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్, స్కిల్ డెవలెప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలెప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్స్‌కి సంబంధించి వివిధ విభాగాల్లో నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దుతోంది. ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా అర్హులైన విద్యార్థులకు దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలు సీపెట్ కల్పిస్తోంది.

సీపెట్

ఫొటో సోర్స్, cipet

ఉచితంగా శిక్షణ

వివిధ సెంట్రల్, స్టేట్ ఏజెన్సీల ద్వారా నిరుద్యోగ, పేద యువతకు ప్లాస్టిక్ రంగంలోని పలు విభాగాల్లో అకడమిక్, స్కిల్ డెవలెప్మెంట్ ప్రోగ్రామ్స్‌ను సీపెట్ ఉచితంగా నిర్వహిస్తోంది.

పెరుగుతున్న ప్లాస్టిక్ అవసరాలు గుర్తించి ఆ రంగంలో ఉపాధి వైపు యువత మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు ఈ రంగంలో శిక్షణ పొందిన యువతకు పలు సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు క్యూ కడుతున్నాయి కూడా.

యువతీయువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.

ప్లేస్‌మెంట్ల పరంగా వివిధ సంస్థలతో సీపెట్ టైఅప్ పెట్టుకుంది. దీంతో కోర్సు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వాటంతటవే వస్తున్నాయి.

వారి అర్హతలను బట్టి దేశ, విదేశాల్లో సైతం ప్లాస్టిక్ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు యువతకు లభిస్తున్నాయి. కోర్సు చేస్తున్నప్పుడే సంపాదిస్తూ యువత ఆ కోర్సులను పూర్తిచేయడం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

అంతేకాదు ఏ సెంటర్లో శిక్షణ పొందుతున్నారో అక్కడ సైతం ఉద్యోగావకాశాలను విద్యార్థులకు కల్పిస్తున్నారు.

ఉపాధి పరంగా చూస్తే ప్లాస్టిక్ పరిశ్రమలు యువత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నాయి. స్టైఫండ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో శిక్షణ పొందిన యువత సొంత బిజినెస్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి.

సీపెట్

ఫొటో సోర్స్, cipet

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. ప్రాక్టికల్ వర్కుకు ఇక్కడ ప్రాధాన్యం ఎక్కువ.

షార్ట్ టర్మ్ కోర్సుల కింద పదవ తరగతి పాస్ లేదా ఫెయిలైన వారికి కూడా స్కిల్ డెవలెప్మెంట్ ఉచితంగా అందిస్తున్నారు. శిక్షణాకాలంలో వీరికి ఉచితంగా బోర్డింగ్, లాడ్జింగ్‌ ఇస్తారు. మూడు లేదా ఆరు నెలల కోర్సులు వీరికి అందిస్తున్నారు. అవి అయిపోగానే వెంటనే వారికి ఉపాధి కల్పన చూపిస్తారు.

వృత్తిలో అనుభవం బాగా గడించిన వారు ఎంట్రీప్రీన్యూర్లుగా వెళుతున్నారు.

వ్యాపారస్తులుగా ఎదగాలనుకునే వాళ్లకు సైతం సీపెట్ ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తుంది.

బ్యాంకులో రుణాలు పొందడంలో కూడా అండగా ఉంటుంది.

స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా స్పాన్సర్‌షిప్ ప్రోగ్రాముల కింద పేద, నిరుద్యోగ యువతకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా శిక్షణ అందిస్తారు. మూడు నెలలు శిక్షణ ఉంటుంది.

ఆధార్ కార్డు, కులం సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్ తెచ్చి సీపెట్లో ఉచిత శిక్షణ పొందవచ్చు.

డిప్లొమా చేయాలంటే పదవ తరగతి అర్హత (పాస్ లేదా ఫెయిల్) ఉంటే చాలు. ఎనిమిదవ తరగతి వరకూ చదివిన వారికి కూడా కొన్ని రకాల శిక్షణను అందిస్తారు.

స్కిల్ డెవలెప్మెంట్ ప్రోగ్రాములలో గ్రామీణ యువతకు పెద్దపీట వేశారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు నేరుగా సీపెట్‌ను సంప్రదించవచ్చు.

వీడియో క్యాప్షన్, భవిష్యత్‌లో రాబోయేవన్నీ టెంపరరీ ఉద్యోగాలేనా?

ఉపాధి అవకాశాల కల్పన

హైదరాబాద్ చర్లపల్లిలోని సీపెట్ శిక్షణా కేంద్రంలో నాలుగు రకాల కోర్సుల్లో యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ప్రముఖ ప్లాస్టిక్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీపెట్‌కు సుధాకర్ పైపులు, పెర్ల్ పెట్, ఎల్జికే, సెంటిని, ఆల్ఫా, నీల్‌కమల్, సుప్రీం వంటి ప్లాస్టిక్ కంపెనీలతో ప్లేస్‌మెంట్ పార్టనర్షిప్ ఉంది.

విద్యార్థుల శిక్షణ ముగిసే సమయానికి ప్లేస్‌మెంట్ కోసం వివిధ ప్లాస్టిక్ కంపెనీలు సీపెట్ క్యాంపస్‌కు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి అక్కడ శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు స్వయం ఉపాధి కోసం వారే కొత్త స్టార్టప్స్‌ను కూడా ప్రారంభించుకోవచ్చు" అని సీపెట్ కో‌‌ఆర్డినేటర్ ఎస్. గోవింద తెలిపారు.

ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: +91-40-27264040, మొబైల్: +91-9677256436

వెబ్‌సైట్: https://www.cipet.gov.in/

ఈమెయిల్: [email protected] /

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)