మహిళల శారీరక, మానసిక సమస్యలకు టెక్నాలజీతో పరిష్కారాలు సాధ్యమేనా... ఫెమ్‌టెక్ అంటే ఏంటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
కేరళకు చెందిన డాక్టర్ మాయాదేవీ కురుప్ గైనకాలజీ సమస్యలకు రోబోటిక్స్ ద్వారా శస్త్రచికిత్స చేసినందుకు వార్తల్లో నిలిచారు. మహిళలు ఎదుర్కొనే ఓవరేయిన్ సిస్ట్స్, ఎండోమెట్రియాసిస్, క్యాన్సర్ వంటి సంక్షిష్ట రోగాలకు సాధారణ, లాప్రోస్కోపిక్ చికిత్సల కన్నా రోబోటిక్స్‌తో సమర్థవంతంగా సర్జరీలు చేయవచ్చన్నది డాక్టర్ మాయాదేవి అభిప్రాయం.
ప్రస్తుతం ఇలాంటి సర్జరీలు తక్కువగా జరుగుతుండడంతో దాని వ్యయం మామూలు సర్జరీలకన్నా ఎక్కువ ఉంది. కానీ దీనివల్ల లాభాలని తెలుసుకుని ఎక్కువ మంది ముందుకొస్తే వీటి ఖర్చులు తగ్గవచ్చని ఆమె అన్నారు.
మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. వాటికి టెక్నాలజీ ద్వారా పరిష్కారాలు కనుగొనడానికి, ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనూ ఎన్నో టెక్ స్టార్టప్‍లు మొదలవుతున్నాయి. వాటి ముందు చాలానే సవాళ్ళున్నా గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల ఆరోగ్య సమస్యలు - అనుమానాలు
కుటుంబంలోని అందరి ఆరోగ్య బాధ్యతలూ దాదాపుగా మహిళలే చూసుకుంటుంటారు. కానీ, అటు ఇంటిపని, ఇటు ఆఫీస్ పని మధ్యన వాళ్ళు తమ ఆరోగ్యానిిక ఎక్కవగా ప్రాధాన్యం ఇవ్వరు. "నీకన్నా ముందు కుటుంబం గురించి ఆలోచించాలి" అని నూరిపోసే కండిషనింగ్ ఒక కారణమైతే, మహిళల శరీరంలోని సంక్లిష్టతల గురించి, ప్రత్యేక పరిణామాల గురించి సరైన అవగాహన, ఆరోగ్యకరమైన చర్చలు లేకపోవడం ఇంకో కారణం.
అందుకే, చదువుకున్న అర్బన్ మహిళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్, హిస్టరెక్టమీ, ఓవరియన్ సిస్ట్స్ ఆలస్యంగా బయటపడుతుంటాయి. ఇక, చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యానికి సంబంధించిన పీరియడ్స్ లాంటివి మాట్లాడడం కూడా ఇంకా టాబూగా పరిగణిస్తారు.
అసలు అమెరికా లాంటి ఆధునిక దేశంలో కూడా 1972 వరకూ టీవీలలో మెన్‍స్ట్రువేషన్‍కి సంబంధించిన యాడ్స్ వేయడానికి అడ్డంకులు ఉండేవంటే, మహిళల శరీరాల చుట్టూ సిగ్గు, గోప్యత ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఉందో అర్థమవుతుంది.
ప్రస్తుతం ఫిట్‍నెస్, హెల్త్ రిలేటడ్ టెక్నాలజీలో పేరున్న కంపెనీలు, వాటి ప్రాడక్ట్స్ కూడా మహిళల శారీరక, మానసిక ఆరోగ్య అవసరాలకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు మొదటిగా.
2019లో వచ్చిన ఈ ఆర్టికల్ ప్రకారం ఫిట్సెన్ యాప్స్ కూడా మొదట మగవారి శరీర ప్రవర్తనలకి అనుగుణంగానే తయారు చేశారు. మెన్‍స్ట్రువల్ సైకిల్ లో మహిళల గుండె చప్పుళ్ళల్లో జరిగే మార్పులని పరిగణించకుండానే హార్ట్ బీట్ రేట్‍లని ఆ వాచ్‍లు చెప్పేవి. ఇలా మహిళల ఆరోగ్యాన్ని విస్మరించడం ద్వారా అనేక బిలియన్ డాలర్ మార్కెట్ వదులుకోవడం అవుతుందని గ్రహించాకే ఆ దిశగా దృష్టి పెట్టాయి పెద్ద కార్పొరేట్ సంస్థలు.

ఫొటో సోర్స్, Getty Images
ఫెమ్టెక్ - మహిళల కోసం మహిళలు
"ఫెమ్ టెక్" అన్న మాటను మొదట 2016లో డెన్‍మార్క్ కి చెందిన వ్యాపారవేత్త ఇదా టిన్ ప్రవేశపెట్టారు. మహిళ శారీరక మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటి కోసం ప్రత్యేకించి చేసే టెక్ పరిష్కారాలని ఈ పేరుతో పిలుస్తున్నారు.
అదే ఏడాది ఆమె "క్లూ" అనే పీరియడ్ ట్రాకింగ్ కంపెనీ మొదలుపెట్టారు. మగ ఇన్వెస్టర్లు ఇలాంటి మహిళల బహిష్టుకి సంబంధించిన ప్రాడక్ట్స్ లో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతున్నారని గ్రహించిన ఆమె ఇలాంటి విషయాల గురించి టెక్ ఇండస్ట్రీలోనూ చర్చలు జరగాల్సిన అవసరం గుర్తించి దానికో పేరు పెట్టారు.
ఫెమ్-టెక్ కిందకి గర్భధారణ, పీరియడ్ ట్రాకింగ్, మహిళల సెక్సువల్ ఆరోగ్యం, సంతానోత్పత్తి ఆరోగ్యం అన్నీ వస్తాయి. ఈ అంశాలని ట్రాక్ చేసి, డయాగ్నిసిస్ చేయడానికి వాడే వేరబుల్స్ (ఫిట్స్నెస్ వాచులు వంటివి), ఇంటర్నెట్ తో అనుసంధానమయ్యే డివైజులు, మొబైల్ ఆప్స్, హైజీన్ ప్రాడెక్ట్స్ అన్నీ ఫెమ్‍టెక్ లో భాగమే.
డిజిటల్ హెల్త్ చాలా పాత కాన్సెప్ట్ అయినా ఎలక్ట్రానిక్ హెల్త్, మొబైల్ హెల్త్ 2000-2015 మధ్యన గణనీయంగా పెరిగాయి. కానీ వాటిల్లో మహిళల ఆరోగ్యాన్ని పరిగణించలేదన్నది గమనించదగ్గ విషయం.
మహిళల కోసం స్టార్టప్‍లు - సొల్యూషన్లు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫెమ్‍టెక్ రంగంలో స్టార్టప్‍లు పరిష్కరిస్తున్న కొన్ని సమస్యలు: పీరియడ్ ట్రాకింగ్, బర్త్ కంట్రోల్ ఆప్స్, ఇంటర్నెట్‍కి కనెక్ట్ అయ్యే బ్రెస్ట్ పంపులు (తల్లి పాల కోసం), సెక్స్ టాయ్స్, ఫర్టిలిటి ట్రాకింగ్ కోసం ఆప్స్. వీటితో పాటుగా పెల్విక్ ఏరియా ఆరోగ్యానికి సంబంధించిన, సానిటరీ పాడ్స్ టాంపూన్స్ కాకుండా బ్లీడింగ్ కోసం కొత్త ఆవిష్కరణల పై పనులు జరుగుతున్నాయి. ఈ కంపెనీలలో ఎక్కువగా మహిళా వ్యవస్థాపకులే ఉంటున్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలపై మహిళలకే ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి ఆ యాప్స్, డివైజుల డిజైన్‍ల విషయంలో కూడా మహిళలే చూసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ రంగంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడానికి కూడా చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. 2025 నాటికి ఇది $50 బిలియన్ల మార్కెట్ కాగలదని ఒక అంచనా. మగవారి కన్నా ఆడవారే ఇంటర్నెట్ పై ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం వెతుకుతారని, వారే ఎక్కువ డిజిటల్ టూల్స్ కొనే అవకాశముందని కూడా విశ్లేషకులు అంటున్నారు. దానికి తోడు ప్రపంచ వ్యాప్తంగా మహిళలు సంపాదన కూడా పెరుగుతుండడంతో కూడా ఈ రంగంలో పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి.
ఇండియాలో ఫెమ్‍టెక్
పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే భారత్‌తో పాటుగా దక్షిణాసియాలో ఫెమ్‍టెక్ నెమ్మదిగా వృద్ధిలోకి వస్తుంది. ఇక్కడి దేశాల్లో మహిళల సమస్యల గురించి ఆరోగ్యకరమైన చర్చలు లేకపోవడం, అక్షరాస్యులైన విద్యావంతులైన మహిళలు తక్కువగా ఉండడం కూడా అందుకు కారణం.
ఇక్కడి ఇన్వెస్టర్లు కూడా ఇలాంటి కంపెనీలలో డబ్బు పెట్టడానికి అంత సుముఖంగా లేకపోవడం కూడా ఒక సమస్యగానే ఉంది. అయితే, ఈ పరిస్థితిలో కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తోంది. కొన్ని కంపెనీలు ఈ రంగంలో విశేష కృషి చేస్తూ గొప్ప ఫలితాలు సాధిస్తున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
డాక్టర్ గీతా మంజునాథ్, నిధి మాథుర్ స్థాపించిన నిరామయి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (ఏ.ఐ) వాడి బ్రెస్ట్ క్యాన్సర్ కనుగొనడానికి ఆల్గోరిథమ్స్ సృష్టిస్తున్నారు. సెర్వికల్ కాన్సర్ కనిపెట్టడం అంత్యంత కష్టం. సెర్వ్ అస్త్ర అనే మెడ్‍టెక్ కంపెనీ పాప్-స్మియర్ టెస్ట్ లో ఉండే అవకతవకలను కనిపెట్టేందుకు ఏఐ వాడుతోంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో కూడా ఈ పరికరాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కేర్ మథర్ అనే కంపెనీ గర్భవతులు, బాలింతల కోసం ఇంటికి వచ్చి చేసే మెడికల్ టెస్టులు, మెడికల్ కిట్లు అందిస్తున్నారు.
ఇవే కాకుండా, మహిళలు తమ ఆరోగ్యం గురించి, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోడానికి, పంచుకోడానికి సోషల్ నెట్‍వర్కింగ్ గ్రూపులు అందించడం, మెనోపాజ్, వయసు మళ్ళిన స్త్రీలలో వచ్చే ఆరోగ్య సమస్యలపై మరికొన్ని పరిష్కారాలు దృష్టి పెడుతున్నాయి.
అయితే, ఈ పరిష్కారాలు కూడా జనాల్లోకి అంతగా చొచ్చుకుపోవడం లేదు.
అవగాహనరాహిత్యం, మార్పుకి సుముఖంగా లేకపోవడం, ఖర్చులు భరించలేకపోవడం వీటికి కొన్ని కారణాలు. భారతదేశంలో అర్బన్ మహిళలు 78% సానిటరీ మెన్‍స్ట్రువల్ ప్రాడక్ట్స్ వాడితే కేవలం 48% గ్రామీణ మహిళలు మాత్రమే వాడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది.
ఇలాంటి ప్రాడక్ట్స్ పై ప్రభుత్వ పాలసీలు, రెగ్యులేషన్స్ వల్ల కూడా ధరలు తగ్గించడానికి కుదరడం లేదు. ఇవ్వనీ కలిసి అవసరమైన మహిళలకు ఈ పరిష్కరాలని దూరంగానే ఉంచుతున్నాయి. ఇండియాలో ఫెమ్‍టెక్ ఊపందుకోవాలంటే ఇంకా చాలా పని జరగాల్సి ఉంది.
విమర్శలు - విపత్తులు
ఫెమ్‍టెక్‍లో పరిష్కారాలు దాదాపుగా మహిళల ఆరోగ్యం గురించి నిరంతరంగా డేటాను ట్రాక్ చేయడం మీద ఆధారపడతాయి. అయితే, ఈ డేటా చాలా సున్నితమైంది. లీక్‍లు, బ్రీచ్‍లు అయితే మహిళలకు కుటుంబ పరంగా, సామాజిక పరంగా చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆ భయం ఉండడం వల్లే మహిళలు ఎక్కువగా ఈ పరిష్కారాలను వినియోగించడం లేదు. సైబర్ సెక్యూరిటీ ఎక్కడైనా చాలా ముఖ్యం. ఇంకా ఇలాంటి యాప్స్ కి మరింత భద్రత ఉండాలి.
భవిష్యత్తు
ఫెమ్‍టెక్ మహిళలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉన్న రంగం. ఇది ఎంతగా ఎదిగితే మహిళలకు అంత మంచిది. మహిళలతో ఆగకుండా ఈ రంగం LGBTQ+ వారికి కూడా తమ పరిష్కరాలని విస్తరించవచ్చు. అదింకా మంచి పరిణామాలకు దారి తీస్తుంది.
అయితే, ఈ రంగంలో ఉన్న మహిళా వ్యవస్థాపకులకు తగినంత ప్రోత్సాహం, ఆదరణ ఉండాలి. డబ్బులు పెట్టేవారు ముందుకి రావాలి. ఈ పరిష్కారాల విలువ తెల్సుకుని వాటికి వీలైనంత ప్రచారం కలిపించాలి. అప్పుడే స్త్రీల ఆరోగ్య సమస్యలు ముందుగానే పసిగట్టి తగిన సమయంలో సరైన వైద్యం చేసే వీలు కుదురుతుంది.
ఇవి కూడా చదవండి:
- క్లిటోరిస్ అంటే ఏంటి? సెక్స్‌లో మహిళల లైంగిక ఆనందానికీ, దీనికీ లింకేంటి?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- దానిశ్ ఆజాద్ అన్సారీ: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని ఏకైక ముస్లిం మంత్రి ఎవరు?
- జొరాస్ట్రియనిజం: మృతదేహాలను పక్షులకు ఆహారంగా వదిలిపెట్టే ఈ మతం ఏంటి?
- యుక్రెయిన్: భారత అలీన విధానం ఒత్తిడిని ఎదుర్కొంటోందా? తటస్థ వైఖరి భారత్‌కు ఇబ్బందికరంగా మారిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











