జీరో మైల్ అంటే ఏంటి, భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఎక్కడ ఉంది?

ఫొటో సోర్స్, BSN Malleswara Rao/BBC
- రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణించాలన్నా, దూరం ఎంతో చెప్పాలన్నా ఇప్పుడు చాలామంది జీపీఎస్‌పైన, గూగుల్ మ్యాప్స్ పైన ఆధారపడుతున్నారు. కానీ, ఒకప్పుడు ఇలాంటి మ్యాప్స్ కేవలం రెవెన్యూ అధికారుల వద్దే ఉండేవి. వీటిని చూసేందుకు కూడా చాలామందికి అవకాశం లభించేది కాదు.
ఒక కలెక్టర్ ఏదైనా ప్రాంతానికి ప్రయాణించాల్సి వస్తే తొలుత ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించేవాళ్లు. తర్వాతి కాలంలో రెవెన్యూ కార్యాలయాల్లో ఈ మ్యాప్‌లను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించారు. ఇప్పటికీ చాలా రెవెన్యూ కార్యాలయాల్లో ఆ కార్యాలయ పరిధిని, సరిహద్దులను తెలిపే మ్యాపులు గోడలపై కనిపిస్తూ ఉంటాయి.
‘‘వాస్తవానికి ఇదంతా బ్రిటిష్ ఇండియా కాలంలో మొదలైంది. 17వ శతాబ్దం మొదట్లో ఈస్టిండియా నౌకలు భారతదేశానికి వచ్చాయి.1611వ సంవత్సరంలో బంగాళాఖాతం నుంచి ఆంధ్ర ప్రాంత తీర పట్టణం అయిన మచిలీపట్నం (అప్పట్లో ముసులీపట్నం అని పిలిచేవాళ్లు) చేరుకున్నాయి. 200 ఏళ్ల నాటికి చాలా ప్రాంతాలపై బ్రిటిష్ ఇండియా పట్టు సాధించి, తన పాలన కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తన వ్యాపార, పరిపాలన, భద్రతా అవసరాల రీత్యా దేశం మొత్తాన్ని శాస్త్రీయంగా సర్వే చేయించాలని 1802వ సంవత్సరంలో నిర్ణయించింది’’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీనియర్ సర్వే అధికారుల్లో ఒకరిగా పేరొందిన చిలమకూరి వెంకట సుబ్బారావు బీబీసీతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడెమీ జాయింట్ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.
త్రికోణమితి పద్ధతిలో కన్యా కుమారి నుంచి ఎవరెస్ట్ వరకూ సర్వే చేసిన ఈ గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వే (జీటీఎస్) దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ జీటీ స్టేషన్ల (ప్రామాణికంగా ఏర్పాటు చేసిన సర్వే గుర్తులు)ను ఏర్పాటు చేసిందని వెంకట సుబ్బారావు తెలిపారు. ఎత్తైన కొండలపైన ఏర్పాటు చేసిన ఈ గుర్తులు సర్వేలకు చాలా ముఖ్యమైనవి.

ఫొటో సోర్స్, wikipedia/Survey of India
జీటీఎస్ సర్వే వల్ల ఇప్పుడు ఉపయోగం ఏంటి?
ఇప్పుడు దూరాన్ని కొలిచేందుకు జీపీఎస్, మొబైల్ యాప్స్‌లోని మ్యాప్స్ వాడుతున్నాం. కానీ, రెవెన్యూ రికార్డుల ప్రకారం కొలతలకు మాత్రం ఇప్పటికీ జీటీ స్టేషన్లే ప్రామాణికంగా ఉన్నాయి.
ఒక జిల్లా, తాలూకా, గ్రామం సరిహద్దులను కొలిచి.. వాటిని జీటీ స్టేషన్లకు, తద్వారా గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వేకు అనుసంధానం చేశారు. ఈ సర్వేను ట్రావెర్స్ సర్వే అని పిలుస్తారు. దీని ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఇప్పటికీ సరిహద్దు రాళ్లు ఉంటాయి. ఒకవేళ అవి భౌతికంగా కంటికి కనిపించకపోయినప్పటికీ.. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తప్పకుండా ఉంటాయి.
ఆ రాయి ఆధారంగానే గ్రామం చుట్టుపక్కల ప్రధాన ప్రాంతాల్లో కొన్ని సర్వే రాళ్లు ఉంటాయి. వీటి ఆధారంగానే వ్యవసాయ భూములు, నివాస స్థలాలను సర్వే చేస్తారు. ఇరువురు వ్యక్తులు, రైతుల మధ్య గట్టు తగాదాలు, సరిహద్దు తగాదాలు వచ్చినప్పుడు సర్వే అధికారులు సరిహద్దు రాయి నుంచి కొలతలు వేసి ఆ గొడవలకు పరిష్కారం చూపిస్తుంటారు.
''ఈ ట్రావెర్స్ సర్వే ఆంధ్రప్రదేశ్‌లో బాగా జరిగింది. కానీ, తెలంగాణలో మాత్రం పూర్తిగా జరగలేదు. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, పైగా దీనివల్ల ఆనాటికి ఉపయోగాలు తక్కువ అని ఆనాటి నిజాం పాలకులు భావించడం వల్ల సమగ్రంగా జరగలేదు. అందుకే తెలంగాణలో పలు గ్రామాలకు సరైన రెవెన్యూ రికార్డులు లేవు'' అని సుబ్బారావు చెప్పారు. 'హ్యండ్ బుక్ ఆన్ సర్వే, సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ తెలంగాణ' పుస్తక రచయితల్లో సుబ్బారావు కూడా ఒకరు.

ఫొటో సోర్స్, BSN Malleswara Rao/BBC
కిలోమీటర్లు, మైళ్లు లేకముందు దూరాన్ని ఎలా కొలిచేవాళ్లు?
బెత్తె, జాన, మూర, బార, దండ, కోసు, ఆమడ, యోజనం.. ఇవి ప్రాచీన కాలం నుంచి దూరాన్ని కొలిచేందుకు ఉపయోగిస్తున్న ప్రమాణాలు.
బెత్తె అంటే అరచేతి కొలత.. ఇది సుమారుగా నాలుగు అంగుళాలు ఉంటుంది.
ఇలాంటి మూడు బెత్తెలు కలిపితే ఒక జాన. చేతి బొటనవేలును, చిటికెన వేలును వీలైనంత దూరంగా జరిపితే.. ఆ రెండింటి చివర్ల మధ్య ఉన్న దూరం జాన.
రెండు జానెలు ఒక మూర. చేతి మధ్యవేలి నుంచి చేతి మడమ వరకు ఉండే దూరాన్ని మూర అంటారు.
రెండు మూరలు ఒక గజం. మూడు అడుగులు కూడా ఒక గజంతో సమానం.
12 అంగుళాలు ఒక అడుగు. ఒక మూర 1.5 అడుగులు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
2 గజాలు ఒక బార.
రెండు బారలు ఒక దండం.
వెయ్యి దండాలు ఒక కోసు.
ఐదు కోసులు ఒక యోజనం లేదా ఆమడ.
యోజనం, ఆమడ అంటే సుమారు 8 నుంచి 10 మైళ్లు. అంటే సుమారుగా 12.8 కిలోమీటర్ల నుంచి 16.8 కిలోమీటర్ల దూరం.
4840 చదరపు గజాలు ఒక ఎకరం.
ఒక సాలు లేదంటే నాగలి చాలు అంటే 220 గజాలు. ఇంగ్లీషులో దీనిని ఫర్రో అంటారు. ఒక ఫర్రో దూరాన్ని ఫర్లాంగ్ (ఫర్రో లాంగ్) అని పిలుస్తారు. 8 ఫర్లాంగులు ఒక మైలు. అంటే 1.6 కిలోమీటర్లతో సమానం.
క్రికెట్ పిచ్ 22 గజాలు. ఒక ఫర్లాంగులో పదోవంతు.

ఫొటో సోర్స్, BSN Malleswara Rao/BBC
నాగ్‌పూర్‌లో జీరో మైల్ స్టోన్
గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వేలో భాగంగా చాలా రాష్ట్రాల్లో బ్రిటిష్ సర్వే అధికారులు కొన్ని ప్రాంతాల్లో సర్వే స్టేషన్ల స్థానంలో స్థూపాలు నిర్మించారు. అలాంటి స్థూపాల్లో బాగా ప్రాచుర్యం పొందింది జీరో మైల్ స్టోన్ స్థూపం.
నాగ్‌పూర్‌లో ఇసుక రాయితో 6.5 మీటర్లు ఎత్తైన ఈ స్థూపాన్ని నిర్మించారు. అయితే, దీనిని ఎప్పుడు నిర్మించారు అనేదానిపై స్పష్టత లేదు. ఈ స్థూపం పక్కనే ఉన్న షట్కోణ శిలపై మాత్రం 1907 అని ఉంటుంది. ఆరు కోణాల ఈ రాయి ఆరు మూలలూ ఆరు ప్రాంతాలవైపు ఉంటాయి. ఆ ప్రాంతం ఎంత దూరంలో ఉందో కూడా రాయిపైన పేర్కొన్నారు.
ఈ షట్కోణ శిలపై రాసి ఉన్న ప్రకారం.. దక్షిణ దిక్కులో 62 మైళ్ల దూరంలో కవాథ ఉంటుంది. ఆగ్నేయంగా 318 మైళ్ల దూరంలో హైదరాబాద్ ఉంటుంది. తూర్పున 125 మైళ్ల దూరంలో చందా, 174 మైళ్ల దూరంలో రాయ్‌పూర్ ఉన్నాయి. ఈశాన్యంగా 170 మైళ్ల దూరంలో జబల్‌పూర్ ఉంది. వాయువ్య దిక్కులో 79 మైళ్ల దూరంలో సియోని, 83 మైళ్ల దూరంలో చింద్వార ఉన్నాయి. పశ్చిమాన 101 మైళ్ల దూరంలో బైటుల్ ఉంది.
ఇక్కడే సున్నా మైలు రాయి కూడా ఉంది. దాని ప్రకారం.. హైదరాబాద్ 485 కిలోమీటర్ల దూరంలోను, కన్యా కుమారి 1600 కిలోమీటర్ల, వారణాసి 729 కిలోమీటర్ల దూరంలోను, జబల్‌పూర్ 273 కిలోమీటర్ల దూరంలోను ఉన్నాయి.
నాగపూర్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం, విధాన సభ సమీపంలో ఈ జీరో మైల్ స్టోన్ ఉంది. ఈ పేరుతో ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఈ పేరుతో ఈ ప్రాంతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పలు షాపులు కూడా ఉన్నాయి. అయితే, చారిత్రకంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రాయిని, ప్రాంతాన్ని నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఇసుక రాయి స్థూపం వద్ద పగిలిపోయిన బీరు బాటిళ్లు, చుట్టూ పెరుగుతున్న ముళ్ల పొదలు, స్థూపానికి జరుగుతున్న డ్యామేజీ చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, katni.nic.in
భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువుఇదేనా?
''భారతదేశ భౌగోళిక కేంద్రాన్ని సూచించే జీరో మైల్ స్టోన్ ప్రకారం నాగ్‌పూర్ ఖచ్చితంగా దేశం మధ్యలో ఉంది. బ్రిటిష్ పాలకులు నాగ్‌పూర్‌ను భారతదేశానికి కేంద్రంగా భావించారు. అందుకే దీనికి సూచనగా జీరో మైల్ స్టోన్ ఇక్కడ నిర్మించారు. దేశానికి కేంద్రంగా ఉండటంతో నాగ్‌పూర్‌ని దేశ రెండో రాజధాని చేయాలని కూడా అనుకున్నారు'' అని నాగ్‌పూర్ జిల్లా అధికారి వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
భారతదేశంలోని మెట్రో నగరాలైన దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ముంబయిలకు మధ్యలో ఉన్న పెద్ద నగరంగా నాగ్‌పూర్‌ను పరిగణించొచ్చు. ఇక్కడి నుంచి ఆయా నగరాలకు నేరుగా వెళ్లడానికి రోడ్డు, రైలు మార్గాలు కూడా ఉన్నాయి. అయితే, భారతదేశానికి కచ్చితంగా కేంద్ర స్థానం ఇదే అని మాత్రం చెప్పలేం.
వాస్తవానికి భారతదేశానికి భౌగోళికంగా కేంద్ర బిందువు కేంద్ర పర్యాటక శాఖ మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్ని జిల్లాలోని కరౌండి గ్రామ శివారులో ఉన్న మనోహరగావ్‌ను గుర్తిస్తూ.. దానిని మెగా టూరిజం సర్క్యూట్‌లో కూడా చేర్చింది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు కూడా కేటాయించింది.
''భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల మీదుగా ప్రయాణించే కర్కాటక రేఖ కూడా ఈ గ్రామం నుంచి వెళ్తుంది. వింధ్యాచల్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ గ్రామాన్ని భారతదేశ గుండె అని కూడా పిలుస్తారు. 1956లో జబల్‌పూర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ ప్రాంతాన్ని భారతదేశ భౌగోళిక కేంద్ర బిందువుగా గుర్తించారు. 1987లో అప్పటి ప్రధాన మంత్రి చంద్రశేఖర్ ఈ గ్రామానికి వచ్చారు. అప్పుడే ఇక్కడ ఒక స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు'' అని కట్ని జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
నాలుగు దిక్కులవైపు కూర్చుని చూస్తున్న నాలుగు సింహాలు.. వాటికి మధ్యలో ఒక స్థూపంపైన నాలుగు సింహాలు, అశోక చక్రం గుర్తు, కింద భారతదేశ పటాన్ని చెక్కారు.
ఇవి కూడా చదవండి:
- టెన్త్ ఫెయిల్ అయిన వారికి కూడా భోజనం, వసతితో ఉచిత శిక్షణ, కోర్సు పూర్తయిన వెంటనే దేశ, విదేశాల్లో ఉపాధి
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- సావర్కర్ బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరాలని గాంధీ చెప్పారా? - BBC Fact Check
- వ్లాదిమిర్ పుతిన్: ‘అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటును ఆయుధంగా ఎలా మార్చుకున్నారు?’
- ఎస్.ఎస్.రాజమౌళి: యాడ్ ఫిల్మ్ మేకర్ నుంచి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దాకా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














