వాతావరణం: ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన ఓజోన్ రంధ్రం ఏమైపోయింది

ఫొటో సోర్స్, Getty Images
అవి 1970వ దశకం చివరి రోజులు. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే సంస్థలో వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేసే జొనాథన్ షాంక్లిన్ కేంబ్రిడ్జ్‌లోని తన కార్యాలయంలో గంటల తరబడి కూర్చుని పాత సమాచారాన్ని క్రోడీకరిస్తూ గడిపేవారు. దక్షిణ ధృవంలోని అంటార్కిటికా ఖండానికి చెందిన సమాచారమది.
వాతావరణంలోని ఓజోన్‌లో మార్పులను కొలిచే డాబ్సన్ స్పెక్ట్రోఫొటోమీటర్లు నమోదు చేసిన సమాచారం గుట్టల కొద్దీ కాగితాల రూపంలో ఉంటే.. దాన్ని డిజిటల్ రూపంలోకి మార్పే పనిని జొనాథన్ పర్యవేక్షిస్తున్నారు.
కొన్నేళ్లు గడిచాక ఏదో జరుగుతోందని ఆయన గమనించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు నిరంతరం సేకరించిన లెక్కలను చూస్తే.. 1970ల చివర్లో ఓజోన్ స్థాయిలు పడిపోవటం మొదలైనట్లు ఆయన గుర్తించారు.
ఏదో జరుగుతోందని జొనాథన్ ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ ఆయన పై అధికారులు దానిని అంతగా నమ్మలేదు. అది జొనాథన్‌ను నిస్పృహకు గురిచేసేది.
1984 నాటికి అంటార్కిటికాలోని హాలీ బే పరిశోధన కేంద్రం మీది ఓజోన్ పొర.. అంతకు ముందలి దశాబ్దాలతో పోలిస్తే మూడో వంతు పలుచబడింది.
ఆ మరుసటి ఏడాది.. జొనాథన్, ఆయన సహోద్యోగులు జో ఫర్మాన్, బ్రియాన్ గార్డినర్‌లు తమ అధ్యయనాన్ని ప్రచురించారు. ఓజోన్ పొర పలుచబడటానికి, మనిషి తయారుచేసిన క్లోరోఫ్లోరోకార్బన్స్ (సీఎఫ్‌సీస్) అనే రసాయన మిశ్రమానికి సంబంధముందని ఆ అధ్యయనంలో సూచించారు. ఈ సీఎఫ్‌సీలను శీతలీకరణ పరికరాల్లో ఉపయోగిస్తారు. అంటార్కిటికా మీద ఓజోన్ పొర పలుచబడిందని వారు గుర్తించినదే ఓజోన్ హోల్‌గా ప్రచారంలోకి వచ్చింది.
దీని గురించి వార్తలు వ్యాపిస్తుండటంతో ప్రపంచమంతా ఆందోళన ప్రకంపనలు మొదలయ్యాయి. ఓజోన్ పొర ధ్వంసమైతే అది మనిషి ఆరోగ్యం మీద, జీవావరణాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందనే అంచనాలు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి.
దీంతో ఈ అంశంపై మరింత లోతుగా పరిశోధనలు ఊపందుకున్నాయి. దీనిని పరిష్కరించటం కోసం ప్రపంచ దేశాల ప్రభుత్వాలు మునుపెన్నడూ రీతిలో ఏకతాటిపైకి వచ్చాయి.
భూగోళం మీద మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద పర్యావరణ సమస్యల్లో ఒకటిగా ఈ అంశం పతాక స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఈ అంశం దాదాపు మరుగునపడిపోయింది.
ఓజోన్ పొరకు రంధ్రం పడిందని గుర్తించి 30 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడసలు ఆ రంధ్రం పరిస్థితి ఎలా ఉంది?
అదృశ్య రక్షణ...
ఓజోన్ పొర ప్రధానంగా స్ట్రాటోఫియర్‌లో - అంటే భూమి ఉపరితలంలో 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకూ ఉండే రెండో వాతావరణ పొరలో ఉంటుంది. ఈ ఓజోన్ పొర.. సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన అల్ట్రావయొలెట్ రేడియేషన్‌ను శోషించుకుంటూ భూగోళానికి అదృశ్య రక్షణ కవచంగా ఉంటుంది. ఈ పొర లేకపోతే భూమి మీద జీవం పుట్టుకే సాధ్యమయ్యేది కాదు.
బ్రిటిష్ ఆర్కిటిక్ సర్వే తొలుత 1950లలో అంటార్కిటికా మీద ఓజోన్ సాంద్రతలను కొలవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దలకు గానీ ఈ పొరలో సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించలేదు.
ఈ ఓజోన్ పొరను సీఎఫ్‌సీలు ధ్వంసం చేయగలవని సిద్ధాంతీకరిస్తూ 1974లో శాస్త్రవేత్తలు మారియో మొలీనా, ఎఫ్ షెర్రీ రోలండ్‌లు ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. అప్పటివరకూ సీఎఫ్‌సీలు నిరపాయకరమని భావించేవారు. అది తప్పని చెప్పిన మొలీనా, రోలండ్‌ల సిద్ధాంతాన్ని.. సీఎఫ్‌సీ ఉత్పత్తులు సురక్షితమైనవని వాదించే పరిశ్రమ రంగం కొట్టిపారేసింది. శాస్త్రవేత్తల్లో సైతం వారి సిద్ధాంతాన్ని వ్యతిరేకించినవారున్నారు. ఓజోన్ తరిగిపోవటం చాలా తక్కువగానే ఉంటుందని, ఆ పొర 2 నుంచి 4 శాతం మధ్య తగ్గటానికి కొన్ని శతాబ్దాల కాలం పడుతుందని చాలా మంది అంచనాలు కూడా వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఎఫ్‌సీలను నిరవధికంగా ఉపయోగించటం కొనసాగింది. 1970ల నాటికి ప్రపంచమంతా సీఎఫ్‌సీలతో కూడిన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసోల్ స్ప్రే క్యాన్లు, పారిశ్రామిక పారిశుధ్య ఉత్పత్తులు విపరీతంగా పెరిగిపోయాయి.
ఓ శతాబ్దం తర్వాత 1985లో బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే.. ఓజోన్ పొరకు రంధ్రం పడిందని నిర్ధారించింది. దానికి సీఎఫ్‌సీలతో లింకు ఉందనీ సూచించింది. దీంతో మొలీనా, రోలండ్‌ల తొలి సిద్ధాంతం నిజమని రుజువైంది. వారికి 1995లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. అంతేకాదు.. ఓజోన్ పొర పలుచబారటం ఊహించిన దానికన్నా చాలా వేగంగా జరుగుతోంది. ''అది చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది'' అంటారు జొనాథన్. ఆయన ప్రస్తుతం బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేలో ఎమిరైటస్ ఫెలోగా ఉన్నారు.
అప్పటి నుంచీ.. ఓజోన్ పొర ఎందుకు దెబ్బతింటోంది? ఎలా దెబ్బతింటోంది అనేది తెలుసుకోవటం మీద శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.
రసాయన రహస్యం
1986లో అంటార్కిటిక్ శీతాకాలం ముగింపు దశకు చేరుకుంది. ఓజోన్ సమస్యకు జవాబులు అన్వేషిస్తూ.. అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన పరిశోధకురాలు సుసాన్ సొలోమన్ సారథ్యంలో శాస్త్రవేత్తల బృందమొకటి మెక్‌ముర్డో బేస్‌కు వెళ్లింది.
''అదో గొప్ప మిస్టరీగా ఉండేది. సమాచారమంతా కూడా.. మనుషులు సీఎఫ్‌సీలను ఉపయోగించటం వల్ల వాతావరణంలో క్లోరైన్ పెరుగుదలతో పాటు.. ధ్రువప్రాంతంలో శీతాకాలంలో చాలా ఎత్తులో ఏర్పడే స్ట్రాటోఫియరిక్ మేఘాలు కలిసి ఈ పరిస్థితికి కారణమయ్యాయని సూచించింది'' అని చెప్పారు సుసాన్. ఆమె ప్రస్తుతం ఎంఐటీలో అట్మాస్ఫియరిక్ కెమిస్ట్రీ అండ్ క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
శాటిలైట్ పర్యవేక్షణ ద్వారా.. ఓజోన్ పొర పలుచబారటం 2 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించివుందని నిర్ధారణైంది.
ఓజోన్ పలుచబారటం వల్ల కలిగే ముప్పులు - మనుషులకు చర్మ క్యాన్సర్, కాటరాక్టులు; మొక్కలు, వ్యవసాయ పంటలు, జంతువుల పెరుగుదలకు హాని; చేపలు, పీతలు, కప్పలతో పాటు.. సముద్ర ఆహార గొలుసులో అత్యంత ప్రాధమికమైన ఫైటోప్లాంక్టన్ (వృక్షప్లవకాలు)లో పునరుత్పత్తి సమస్యలు - అంతర్జాతీయ సహకారాన్ని ప్రేరేపించాయి.
అయితే.. ఓజోన్ రంధ్రం వల్ల ఎంతో ప్రమాదమని భావించిన ప్రపంచంలో.. ఇప్పుడు దాని గురించి పెద్దగా ఎందుకు వినిపించటం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
''అదిప్పుడు.. అప్పటంత ఆందోళనకరమైన విషయం కాదు'' అంటారు లారా రెవెల్. ఆమె న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాంటరబరీలో ఎన్విరాన్మెంటల్ ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఓజోన్ రంధ్రాన్ని గుర్తించిన తర్వాత.. దానిపై పరిశోధనకు భారీ పెట్టుబడులు, ఆర్థిక వనరులను మళ్లించటంతో పాటు.. అంతర్జాతీయంగా పరస్పర సహకారంతో రాజకీయంగానూ చర్యలు చేపట్టటంతో పరిస్థితి మెరుగుపడింది.
ఈ రంధ్రానికి కారణమైన రసాయనాల వినియోగాన్ని దశల వారీగా ఆపివేయటం ద్వారా ఓజోన్ పొరను రక్షించుకోవాలంటూ 1987లో మాంట్రియాల్ ప్రొటోకాల్‌ను ఆమోదించారు. ఆ రసాయనాల వినియోగాన్ని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు నిలిపివేయటానికి వేర్వేరు కాలపరిమితులను నిర్దేశించుకుంటూ ఒప్పందం చేసుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ లక్ష్యాన్ని నెరవేర్చటానికి సాంకేతికంగా, ఆర్థికంగా సాయమందించటం కోసం ఒక నిధిని కూడా ఏర్పాటు చేశారు.
1990లలో, 2000 దశకం ఆరంభం నాటికి సీఎఫ్‌సీల ఉత్పత్తి, వినియోగం నిలిచిపోయింది. మాంట్రియాల్ ప్రొటోకాల్ ఒప్పందంలో అంగీకరించిన రసాయనాల్లో 98 శాతాన్ని ఉపయోగించటం 2009 నాటికి ఆగిపోయింది. సీఎఫ్‌సీల స్థానంలో ఉపయోగించే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ (హెచ్‌సీఎఫ్‌సీలు), హైడ్రోఫ్లోరోకార్బన్స్ (హెచ్‌ఎఫ్‌సీలు) వంటి రసాయనాల వినియోగం మీద కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చారు.
అయితే.. ఈ రసాయనాలతో ఓజోన్ పొరకు మేలు జరిగినా.. ఇవి వాతావరణానికి కీడు చేస్తున్నాయని తేలింది. అత్యధికంగా ఉపయోగించే హెచ్‌సీఎఫ్‌సీ వల్ల వాతావరణం వేడెక్కటం.. కార్బన్ డయాక్సైడ్ కన్నా దాదాపు 2,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
మాంట్రియాల్ ప్రొటోకాల్ వల్ల వాతావరణానికి చాలా వరకూ మేలు జరిగింది. ఆ ఒప్పందం ఫలితంగా 2010లో 9.7 గిగాటన్నుల నుంచి 12.5 గిగాటన్నుల కార్బన్‌డయాక్సైడ్‌తో సమానమైన ఉద్గారాలను తగ్గించారు. గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించటానికి 1997లో ఆమోదించిన క్యోటో ప్రొటోకాల్‌లో నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా.. 2010లో తగ్గించిన ఉద్గారాలు ఐదారు రెట్లు ఎక్కువ.
హెచ్ఎఫ్‌సీల వినియోగంపై పరిమితులు పెడుతూ 2016లో ఆమోదించిన కిగిలి సవరణ.. 2100 సంవత్సరం నాటికి భూతాపం పెరుగుదలలో 0.5 సెంటీగ్రేడ్లు పెరగకుండా నివారిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
''ఇప్పటివరకూ ప్రపంచ దేశాలు చేసుకున్న వాతావరణ ఒప్పందాల్లో మాంట్రియాల్ ప్రొటోకాల్ అనేది అత్యంత విజయవంతమైన వాతావరణ పరిరక్షణ చట్టమని చెప్పొచ్చు'' అంటారు రెవెల్.
ఆ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచీ.. భూమి మీదున్న ప్రతి దేశమూ దానిపై సంతకం చేసింది. ఇప్పటివరకూ అలా ప్రపంచమంతా అంగీకరించిన ఏకైక ఒప్పందం అదొక్కటే. ఆ ఒప్పందం అంతర్జాతీయ పర్యావరణ సహకార దిగ్విజయమని అందరూ అంగీకరిస్తారు. ఈ ఒప్పందం, దానికి చేసిన సవరణల వల్ల.. ప్రపంచంలో ఏటా 20 లక్షల చర్మ క్యాన్సర్ కేసులు రాకుండా నిరోధించారు. కోట్లాది క్యాటరాక్ట్ కేసులనూ అరికట్టారు.
ప్రపంచం కనుక సీఎఫ్‌సీలను నిషేధించకపోయినట్లయితే.. ఇప్పటికి ఓజోన్ పొర భారీస్థాయిలో తరిగిపోయి ఉండేది. ''2050 నాటికి భూగోళమంతటా ఓజోన్ రంధ్రం వంటి పరిస్థితులు వ్యాపించేవి. ఈ భూమి నివాసయోగ్యం కాకుండా పోయేది'' అంటారు సొలొమన్.
ఇప్పుడు ఓజోన్ రంధ్రం ఇంకా ఉంది. అంటార్కిటికా మీద ప్రతి ఏటా శీతాకాలంలో ఈ రంధ్రం ఏర్పడుతుంటుంది. వేసవి కాలంలో తక్కువ ఎత్తులోని స్ట్రాటోఫియరిక్ గాలి కలవటం వల్ల ఆ రంధ్రం మూసుకుపోతుంది. మళ్లీ శీతాకాలంలో ఆ రంధ్రం ఏర్పడుతుంది. అలా ఈ రంధ్రం తెరుచుకుంటూ, మూసుకుంటూ ఒక వలయంలా సాగుతోంది.
అయితే.. ఈ రంధ్రం కనుమరుగవటం మొదలైందని.. ఊహించిన విధంగా ఎంతోకొంత మెరుగుపడుతోందని చెప్పటానికి ఆధారాలున్నాయని సొలొమన్ తెలిపారు. ఈ శతాబ్దం మధ్య కాలానికల్లా ఓజోన్ పొర 1980ల ముందు నాటి స్థాయికి తిరిగి కోలుకుంటుందని శాస్త్రవేత్తల అంచనాలు చెప్తున్నాయి. ఓజోన్‌ను దెబ్బతీసే రసాయన మిశ్రమాల జీవితకాలం సుదీర్ఘంగా ఉండటం వల్ల.. అది కోలుకోవటం నెమ్మదిగా జరుగుతోంది. కొన్ని రసాయన మిశ్రమాలు క్షీణించిపోవటానికి 50 ఏళ్ల నుంచి 150 సంవత్సరాలు పడుతుంది.
ఇవి కూడా చదవండి:
- రబ్బర్ పురుషాంగం: ఆశా వర్కర్లకు ఇచ్చే కిట్లలో మోడల్ పురుషాంగం.. వివాదం ఏంటి?
- పాకిస్తాన్లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
- ‘నేను మా ఇంటికి రావాలంటే గుర్తింపు కార్డు చూపించాలి.. బంధువులు వస్తే ముందుగా సెక్యూరిటీకి చెప్పాలి’
- కేజీ చికెన్ 1000, ఒక్కో గుడ్డు 35.. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 - ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










