శ్రీలంక: కేజీ చికెన్ 1000, ఒక్కో గుడ్డు 35.. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 - ఈ పరిస్థితికి సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలే కారణమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ తమిళ్
మార్చి 2020లో చాలా దేశాలతో పాటు శ్రీలంక కూడా కోవిడ్ లాక్ డౌన్ లోకి వెళ్ళింది. దీంతో, దేశంలో ప్రధాన పరిశ్రమలైన టీ, వస్త్రాలు, పర్యటకం తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
స్థిరమైన ఆదాయం లేక, దేశ ఆర్ధిక పరిస్థితి బాగా క్షీణించింది. సెంట్రల్ బ్యాంక్ చేతిలో ఉన్న విదేశీ మారక ద్రవ్య విలువలు కూడా బాగా పడిపోయాయి.
ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారడంతో, అమెరికన్ డాలర్లకు సరళమైన విదేశీ మారక రేటును ప్రవేశపెట్టాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. దేశంలో ఏర్పడిన డాలర్ కొరతను సర్దుబాటు చేసేందుకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొరత దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరింది.
దీంతో, విదేశీ మారక ధరలు పెరిగాయి. బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో విదేశాల నుంచి వచ్చే డాలర్ల రాక పెరుగుతుందని భావించింది.
ఈ నిర్ణయం అమలు చేసిన తర్వాత శ్రీ లంకన్ కరెన్సీలో రూ.230 ఉన్న యూఎస్ డాలర్ విలువ రూ. 270 కి పెరిగింది.
దీంతో, శ్రీలంకలో వస్తువులు, సేవల ధరలు కూడా ఊహించని రీతిలో పెరగడం మొదలయింది.
దీంతో పరిస్థితి అదుపులో లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపయ్యాయి. వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. ఇంధన స్టేషన్ల దగ్గర ఇంధనం కోసం కొన్ని వేల వాహనాలు బారులు తీరుతున్నాయి.
1970లలో సిరిమావో బండారు నాయకే ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, శ్రీలంకలో కరువు ఏర్పడిందని చెబుతారు. కానీ, ప్రస్తుతం ఉన్న సంక్షోభం దాని కంటే దారుణంగా ఉందని చాలా మంది అంటున్నారు.
ఈ పరిస్థితి వల్ల పేదవారి నుంచి ధనికుల వరకూ అందరూ ప్రభావితులయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
90% రెస్టారెంట్ల మూసివేత
దేశంలో ఉన్న 90% రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. కర్రల పొయ్యి పై వంట చేసే కొన్ని చిన్న చిన్న రెస్టారెంట్లు మాత్రం నడుస్తున్నాయి. కొంత మంది మాత్రమే గ్యాస్ కొనుక్కోగల్గుతున్నారు.
"మాకు గ్యాస్ దొరకకపోతే, శ్రీలంకలో ఉన్న రెస్టారంట్ లన్నీ మూసేయాల్సిందే" అని ఆల్ శ్రీలంక రెస్టారంటీర్స్ అసోసియేషన్ అధికారి అసేలా సంపత్ చెప్పారు. ఇళ్లల్లో వంటిళ్లలోంచి నిర్వహించే చిన్న చిన్న వ్యాపారాలు కూడా నేరుగా ప్రభావితమయ్యాయి అని ఆయన చెప్పారు.
శ్రీలంకకు వంట గ్యాస్ సరఫరా చేసే లిట్రో గ్యాస్, లాఫ్స్ గ్యాస్ తాత్కాలికంగా సరఫరాను నిలిపేశాయి. శ్రీలంక వంట గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఈ దిగుమతులకు చెల్లించేందుకు యూఎస్ డాలర్లు లేవు.
ఇప్పటి వరకు బకాయిలను తీర్చలేకపోవడంతో, వంట గ్యాస్ ను రవాణా చేస్తున్న నౌకలను తీరంలోనే ఆపేశారు. దీంతో, మరింత కొరత ఏర్పడింది.
మరో వైపు బకాయిలన్నీ తీర్చినట్లు శ్రీలంక అధ్యక్ష కార్యాలయం మీడియా ప్రతినిధులు ప్రకటించారు. మార్చి 17 నుంచి వంట గ్యాస్ సరఫరా తిరిగి మొదలవుతుందని చెప్పారు.
ఇంధన కొరత
కానీ, మార్చి 17న కూడా ఇంధన స్టేషన్ల దగ్గర పొడవైన క్యూలు కనిపించాయి.
పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కొంత మంది ఇంధనం కోసం క్యాన్లు కూడా తెచ్చుకుంటున్నారు.
సునీల్ అనే ఆటో రిక్షా డ్రైవర్ బీబీసీతో మాట్లాడారు.
"నేను రెండు గంటల సేపు గ్యాస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేశాను. కానీ, నాకు గ్యాస్ దొరకలేదు. మేము మార్పు కోరుకున్నాం. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, మాకు మరోసారి మార్పు అవసరమేమో అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే, నాకు భవిష్య తరాల గురించి భయంగా ఉంది" అని సునీల్ చెప్పారు.
విద్యుత్ సరఫరాలో కొనసాగుతున్న కొరత
గ్యాస్ కోసం క్యూ లో వెయిట్ చేస్తున్న జయవర్ధనే అనే మరొక ఆటో రిక్షా డ్రైవర్ కూడా బీబీసీతో మాట్లాడారు.
ఆయన ఇంధనం సంపాదించే సమయానికి కరెంటు పోయింది.
"కరెంటు రాగానే, తిరిగి క్యూలో నిల్చోవాలి. అన్నిటికీ ఇదే క్యూ. ఇదే కొనసాగితే, దేశం వినాశనమవుతుంది. మా పిల్లలకు ఏమి భవిష్యత్ ఉందో కూడా ఊహించలేకపోతున్నాం" అని ఆయన అన్నారు.
ఈ ఆర్ధిక సంక్షోభం నడుమ, శ్రీలంకలో తీవ్రమైన విద్యుత్ కోత కూడా కొనసాగుతోంది
ప్రతి రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరా ఉండటం లేదు.
ఈ పరిస్థితి వల్ల వాణిజ్య కేంద్రాలు, దుకాణాలు, పరిశ్రమలు ప్రభావితమవుతున్నాయి. కరెంటు లేనప్పుడు జెనెరేటర్లను వాడటం సాధారణమే కానీ, డీజిల్ కొరత వల్ల అలా వాడే అవకాశం కూడా ఉండటం లేదు.
చాలా మంది పారిశ్రామికవేత్తలు, చిన్న చిన్న వ్యాపారస్థులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ప్రభావితులయ్యారు.
శ్రీ లంకలో నిత్యావసర వస్తువుల ధరలు (కేజీ/ లీటర్) శ్రీలంక కరెన్సీలో:

శ్రీ లంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభంతో, ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. "ప్రస్తుత పరిస్థితి 1970లలో ఏర్పడిన కరువు కంటే దారుణంగా ఉంది" అని పెరదేనియా యూనివర్సిటీలో ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్ సంగరన్ విజేసంధిరన్ చెప్పారు. దిగుమతుల పై విధించిన నిషేధం వల్ల 70లలో కరువు ఏర్పడితే, ప్రస్తుతం డాలర్ల కొరతతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్.. వందలాది స్పామ్ ట్వీట్లు
- బంగ్లాదేశ్ ఇస్కాన్ టెంపుల్: 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయంపై దాడి, అసలు కథ ఏంటి?
- Zero Debt: అప్పు చేయకపోవడం కూడా తప్పేనా? చేస్తే ఎంత చేయాలి, ఎలా చేయాలి?
- చిన్న జీయర్: ‘పూసుకుని తిరగను, పాకులాడను.. ఎవరితోనూ గ్యాప్స్ ఉండవు. వాళ్లు పెట్టుకుంటే చేసేదేమీ లేదు’
- ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్: ‘యుద్ధంపై మీకు నిజం చెప్పటం లేదు.. భయంకరమైన విషయాలు దాస్తున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















