ఇస్లామోఫోబియా: ఐక్యరాజ్య సమితి తీసుకున్న నిర్ణయంపై భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షకీల్ అక్తర్
- హోదా, బీబీసీ ఉర్దూ ప్రతినిధి
ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ అసెంబ్లీ మంగళవారం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏడాది మార్చి 15వ తేదీని 'యాంటీ-ఇస్లామోఫోబియా డే'గా పాటించాలని ప్రకటించింది.
దీనిపై భారత్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఒక మతం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, దానికోసం ఇంటర్నేషనల్ డే పాటించే పరిస్థితి తలెత్తిందని భారత్ వ్యాఖ్యానించింది.
వివిధ మతాలపై విభిన్న మార్గాల్లో భయాన్ని సృష్టిస్తున్నారని పేర్కొంది.
ముస్లింలపై ద్వేషం, హింసను అరికట్టేందుకు తీసుకొచ్చే తీర్మానాలను భారత్‌లాంటి దేశం ఎందుకు వ్యతిరేకిస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఈ తీర్మానం ఏం చెబుతోంది?
అంతకుముందు, 193 సభ్యదేశాలు ఉన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ (ఓఐసీ) తరఫున మాట్లాడారు.
ప్రతీ ఏటా మార్చి 15వ తేదీని ఇస్లాం భయంపై పోరాట దినంగా 'ఇంటర్నేషనల్ డే టు కంబాట్ ఇస్లామోఫోబియా'గా జరుపుకోవాలని ఆయన ప్రతిపాదన తెచ్చారు.
ఓఐసీలోని 57 సభ్య దేశాలతో పాటు చైనా, రష్యా వంటి మరో 8 దేశాల మద్దతుతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై హింస, వివక్ష, ద్వేషాన్ని ఆపేందుకుగానూ ఈ తీర్మానాన్ని అమోదించినట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, REUTERS/CARLO ALLEGRI
ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్..''ఇస్లామోఫోబియా ఒక నిజం. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రవృత్తి పెరిగిపోతోంది. ఈ నిజాన్ని గుర్తుంచుకోవాలి'' అని అన్నారు.
''ముస్లింలపై వివక్ష చూపడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వంటి రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా కనిపిస్తోంది. హింస, వివక్ష, విద్వేషపూరిత ప్రవర్తన అంటే ముస్లింల మానవహక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే. ఇది ముస్లిం దేశాల్లో అశాంతిని సృష్టిస్తుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా తీర్మానం... ఒక నిర్దిష్ట మతం పట్ల తన స్వరాన్ని వినిపిస్తుందని, అదే సమయంలో ఇతర మతాలపై జరుగుతోన్న అకృత్యాలను విస్మరిస్తుందని భారత్ నమ్ముతోంది.
''హిందువులు, బౌద్దులు, సిక్కులు వంటి ఇతర మతాల వారిపై జరిగే హింస, వివక్ష, విద్వేషాన్ని తాజా తీర్మానం విస్మరిస్తుంది'' అని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు.
''ఒక మతం గురించి నొక్కి చెప్పడం, ఉద్ఘాటించడం ఒక రకమైన అంశం. అలా కాకుండా ఒక నిర్దిష్ట మతంపై విద్వేష వ్యతిరేక దినం పాటించడం దీనికి పూర్తిగా భిన్నమైన అంశం. ఈ తీర్మానం మిగతా అన్ని మతాలు ఎదుర్కొంటోన్న విద్వేషం, హింసల తీవ్రతను అణచివేసే అవకాశం ఉంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
హిందువులు, బౌద్దులు, సిక్కులపై విద్వేష ఘటనలను ఆయన ప్రస్తావించారు.
''1.2 బిలియన్ల మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. బౌద్ధాన్ని పాటించేవారు 53.5 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల కంటే ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు. ఒక మతానికి బదులుగా అన్ని మతాల పట్ల చెలరేగుతోన్న భయాన్ని అర్థం చేసుకోవాల్సిన తరుణమిది. మతపరమైన అంశాలకు అతీతంగా ఐక్యరాజ్య సమితి నిలబడాలి'' అని తిరుమూర్తి అన్నారు.
''జుడాయిజం, క్రిస్టియానిటి, ఇస్లాంలకు వ్యతిరేకంగా జరిగే ఏ చర్యనైనా భారత్ ఖండిస్తుంది. కానీ విద్వేషం కేవలం ఈ మతాలకే పరిమితం కాలేదు. ఇతర మతాల వారు కూడా దీని బారిన పడినట్లు ఆధారాలు ఉన్నాయి. మతాలు అంటే భయపడే వాతావరణం పెరిగిపోయింది'' అని అన్నారు.
మతం పేరిట చెలరేగిన హింసల్లో చనిపోయిన వారి స్మారకార్థం 2019 నుంచి ఆగస్టు 22ను ప్రత్యేక దినంగా జరుపుకుంటోన్న సంగతిని ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు మరిచిపోకూడదని ఆయన గుర్తు చేశారు.
భారత్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, విశ్లేషకులు హర్‌తోష్ సింగ్ ఈ అంశంపై మాట్లాడారు.
''యూఎన్ తీర్మానం ఒక మంచి చర్య. కానీ దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే రేపు దీనిపై భారత్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది''
''భారత్ ఓవైపు మత సమానత్వం, ప్రజాస్వామ్యం, సహనం గురించి మాట్లాడుతుంది. మరోవైపు మతపరమైన వివక్ష చూపే సీఏఏ వంటి చట్టాలను చేస్తుంది. మతపరమైన మెజారిటీ ప్రకారం ప్రజాస్వామ్యాన్ని సవరిస్తోంది. అదే సమయంలో ఐక్యరాజ్యసమితిలో సహనం గురించి మాట్లాడుతుంది'' అని అన్నారు.
ఈ విషయంలో భారత్ అసాధారణ వైఖరి తీసుకుందని బీబీసీతో హిందూ పత్రిక జర్నలిస్టు అమిత్ బరువా అన్నారు.
''ఇస్లామోఫోబియా చాలా తీవ్రమైన సమస్య. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వేదికగా చర్చనీయాంశం కావడం శుభ పరిణామం. ఇస్లామోఫోబియాపై గతంలో చర్చ జరగకపోవడానికి ప్రధాన కారణం ఉగ్రవాదం'' అని ఆయన అన్నారు.
ఐక్యరాజ్య సమితి తీర్మానం కన్నా కూడా ప్రపంచ దేశాలన్నీ తమ తమ దేశాల్లో ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా కఠిన నిబంధనలు ప్రవేశపెట్టడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
''తమ దేశ ప్రజలకు సందేశం పంపడం కోసమే భారత్ తాజా వైఖరిని అవలంభించిందని'' ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ముస్లింలు దేశ జనాభాలో 14 శాతం ఉన్నారు. ఇండోనేసియా, పాకిస్తాన్ దేశాల తర్వాత భారత్‌లోనే ముస్లింల జనాభా ఎక్కువ.
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలపై వివక్ష, హింస, మతపరమైన విద్వేషం వేగంగా పెరిగిందని మానవ హక్కుల సంఘాలు, నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో ముస్లింలపై విద్వేషం పెరగడం పట్ల ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, అమెరికా, అరబ్ దేశాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్.. వందలాది స్పామ్ ట్వీట్లు
- బంగ్లాదేశ్ ఇస్కాన్ టెంపుల్: 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయంపై దాడి, అసలు కథ ఏంటి?
- Zero Debt: అప్పు చేయకపోవడం కూడా తప్పేనా? చేస్తే ఎంత చేయాలి, ఎలా చేయాలి?
- చిన్న జీయర్: ‘పూసుకుని తిరగను, పాకులాడను.. ఎవరితోనూ గ్యాప్స్ ఉండవు. వాళ్లు పెట్టుకుంటే చేసేదేమీ లేదు’
- ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్: ‘యుద్ధంపై మీకు నిజం చెప్పటం లేదు.. భయంకరమైన విషయాలు దాస్తున్నారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












