Hijab Row: ‘హిందూ స్టూడెంట్స్ బొట్టు పెట్టుకుంటారు, క్రిస్టియన్లు శిలువ ధరిస్తారు.. హిజాబ్ ధరించే ముస్లిం అమ్మాయిలపై ఎందుకు వ్యతిరేకత?’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, UMESH MARPALLY/BBC
కర్ణాటకలోని స్కూళ్లలో హిజాబ్ తొలగించేందుకు నిరాకరిస్తూ 13 మంది విద్యార్థులు పరీక్షలు రాయకుండా వెనుతిరిగారని ప్రజాశక్తి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఉడుపి, శివమొగ్గ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలకు కొంతమంది విద్యార్థులు హిజాబ్‌తో వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు హిజాబ్ తొలగించాల్సిందేనంటూ ఉపాధ్యాయులు సూచించారు.
ప్రత్యేక గదిని కేటాయిస్తామని, అక్కడ హిజాబ్ తొలగించి పరీక్షలు రాయాలని అనడంతో విద్యార్థులు తిరస్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారిని వాపసు తీసుకువెళ్లారు.
హిజాబ్ తొలగించాల్సిందేనని తమ పిల్లలను పోలీసులతో బెదిరించారని మరికొందరు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని.. విద్యార్థినులను హిజాబ్ తొలగించాల్సిందేనని ఉపాధ్యాయులు హెచ్చరించారని చెప్పినట్లు కథనంలో రాశారు.
హిజాబ్ ధరిస్తే తరగతులకు హాజరుకానివ్వమని, బయట కూర్చుంటారని యాజమాన్యం చెప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
హిజాబ్ ధరిస్తే తప్పేంటి.. విద్యార్థులకి కావాల్సింది విద్య అని అన్నారు. హిందూ విద్యార్థులు కుంకుమ ధరిస్తారని, క్రిస్టియన్లు శిలువ ధరిస్తారని .. అటువంటప్పుడు హిజాబ్ ధరించిన వారిపై ఎందుకు వ్యతిరేకత చూపుతున్నారని అన్నారు.
నిబంధనలు పాటించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారని అన్నారు. విద్యార్థినులు మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు హిజాబ్ లేకుండా పరీక్షలు రాయాలని సూచించారని, తాము వ్యతిరేకించి బయటకు వచ్చేశామని చెప్పారని పత్రిక రాసింది.
విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినులను బెదిరించలేదని, నిబంధనలు పాటించాల్సిందిగా కోరామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నారాయణగౌడ పేర్కొన్నారు.
కాగా, కలబుర్గిలోని జీవర్గి రోడ్డులోగల ఉర్దూ హైస్కూలుకు 10 మంది విద్యార్థినులు హిజాబ్‌తోనే తరగతులకు వచ్చారు. కోర్టు ఉత్తర్వులు పాటించాలన్న ఉపాధ్యాయుల ఒత్తిడి కోరిన మేరకు కొందరు విద్యార్థులు హిజాబ్‌లు తొలగించి ప్రీ-ఫైనల్ పరీక్షల్లో పాల్గొన్నారని పత్రిక వివరించింది.

ఫొటో సోర్స్, Netflix
Money Heist: వెబ్ సిరీస్ చూసి, అచ్చం ప్రొఫెసర్‌లా ప్లాన్ చేసి కిడ్నాప్‌లు.. లక్షల్లో వసూళ్లు... చివరికి పోలీసులకు చిక్కారు
ఒక వెబ్ సిరీస్ నుంచి స్ఫూరిపొంది డబ్బున్న యువకులను కిడ్నాప్ చేస్తున్నఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రచురించింది.
ఓటీటీలో 'మనీ హైస్ట్' వెబ్ సిరీస్‌తో స్ఫూరిపోందాడో యువకుడు. అందులో ఓ ప్రొఫెసర్, కొందరు వ్యక్తులను నియమించి వారి ద్వారా నేరాలను చేయించడం చూసి డబ్బున్న యువకులను కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు.
ఫోన్ చేసేందుకు ఓ యువతిని.. ఆ తర్వాత పథకాన్ని అమలు చేసేందుకు ముగ్గురు యువకులను నియమించుకున్నాడు. ఇప్పటిదాకా ఆరు కిడ్నాప్‌లు చేసి దాదాపు రూ.50 లక్షల దాకా వసూలు చేశాడు.
మంగళవారం పోలీస్ కమిషనరేట్‌లో వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
గుంజగోపు సురేశ్ (27) అలియాస్ సూరి డ్రైవర్. అత్తాపూర్‌లో ఉంటున్నాడు. గతంలోనే నేరచరిత్ర ఉంది. జైలుకెళ్లొచ్చాడు.
'మనీ హీస్ట్' వెబ్ సిరీస్ చూసి కిడ్నాప్‌లతో డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఇందుకు మెహదీపట్నం, భోజగుట్టకు చెందిన యువకులు రోహిత్, నర్సింహులు, కునాల్‌తో పాటు శ్వేతా చారి అనే అమ్మాయిని నియమించుకున్నాడు.
ఎంచుకున్న యువకుడికి శ్వేత ఫోన్ చేసి.. కొన్నాళ్లకు చనువు పెంచుకొని చెప్పిన చోటుకు రప్పిస్తుంది. అప్పటికే అక్కడ ముసుగు తొడుక్కొని మాటు వేసిన నలుగురూ సదరు యువకుడిని కారులో కిడ్నాప్ చేస్తారని పోలీసులు వివరించారని పత్రిక రాసింది.
గుడిమల్కాపుర్ మార్కెట్‌లో పూల వ్యాపారం చేసే ప్రశాంత్ అనే యువకుడు ఈ నెల 5న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు.
మరుసటి రోజు యువకుడి తల్లి ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు మధ్యాహ్నం ప్రశాంత్ సోదరుడు ఆంజనేయులుకు ఫోన్ చేసి ప్రశాంత్‌ను కిడ్నాప్ చేశామని... డబ్బులు ఇస్తేనే వదిలేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు.
కిడ్నాపర్లు చెప్పినట్టే బాధిత కుటుంబీకులు ఔటర్ రింగ్‌రోడ్ వద్ద డబ్బులు అందజేశారు. తర్వాత ప్రశాంత్‌ను వదిలేశారు. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
దీంతో టెక్నాలజీ ఆధారంగా ప్రధాన నిందితుడు సురేశ్ సహా నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలు శ్వేత కోసం గాలిస్తున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, FB/V Srinivas Goud
హైదరాబాద్ టు మేడారం హెలికాప్టర్ జర్నీ రూ.75 వేలు
ఆదివాసీల అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయని వెలుగు పత్రిక వార్త ప్రచురించింది.
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బేగంపేట ఎయిర్ పోర్టులో హెలి టూరిజంను జెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభించింది.
నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో ఇబ్బందిపడ్డ భక్తులు, ప్రజలు ఈసారి మేడారం జాతరకు కుటుంబ సమేతంగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు, పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు నడపనున్నారు. దీని కోసం చార్జీలను కూడా నిర్ణయించారు.
కేవలం మేడారం జాతర ఏరియల్ వ్యూ చూడడానికి చార్జీ రూ.3700గా ఖరారు చేశారు. అలాగే కరీంనగర్, హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్ ప్రయాణ సర్వీసుతోపాటు వసతి సౌకర్యాల కోసం ఒక్కొక్కరికి రూ75వేలు, అలాగే మహబూబ్ నగర్ నుంచి రూ.1 లక్ష వసూలు చేస్తారు.
డిమాండ్‌ను బట్టి హెలికాఫ్టర్ సర్వీసులను ఈనెల 20 వ తేదీ వరకు నడపాలని నిర్ణయించారని పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, fb/Vishnumanchu
ఆహ్వానం వచ్చినా అందకుండా చేశారు-మంచు విష్ణు
ఏపీ సీఎంతో సినీ పెద్దల సమావేశానికి మోహన్‌బాబుకు ఆహ్వానం పంపినప్పటికీ కొందరు దాన్ని అందకుండా చేశారని మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నట్లు ఈనాడు దిన పత్రిక వార్త ప్రచురించింది.
"ఏపీ సీఎంతో సమావేశానికి నాన్న(మోహన్ బాబు)కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆ ఆహ్వానాన్ని కొందరు ఆయనకు అందకుండా చేశారు. అలా చేసిందెవరో.. ఎందుకు చేశారో.. మాకు తెలుసు. దీన్ని ఫిల్మ్ చాంబర్లో మాట్లాడి తేల్చుకుంటాం. నాన్నను సమావేశానికి పిలవలేదనేది దుష్ప్రచారం మాత్రమే" అని మా అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారు.
విష్ణు మంగళవారం సీఎం జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఇరువురూ భోజనం చేస్తూ పలు విషయాలపై చర్చించుకున్నారు.
తర్వాత విజయవాడలోని ఒక హోటల్లో విష్ణు విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారని ఈనాడు రాసింది.

ఇవి కూడా చదవండి:
- ‘యుక్రెయిన్‌లో ఉండొద్దు, ఇండియా వెళ్లిపోండి’ - భారత పౌరులకు రాయబార కార్యాలయం సూచన
- న్యూడ్ వీడియో కాల్స్: ‘మీ ఇంట్లో కలుస్తారా? మా లొకేషన్‌కు వస్తారా…’
- యుక్రెయిన్: రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన ఈ నగరంలో ఇప్పుడు ఏం జరుగుతోంది?
- అరుంధతీ రాయ్: 'బీజేపీ ఒక నియంత పార్టీ, మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని ఫాసిజం వైపు నడిపిస్తోంది'
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









