'దేశమా.. లేక మతమా ఏది ముఖ్యం'... మద్రాస్ హైకోర్టు వ్యాఖ్య - ప్రెస్ రివ్యూ

మద్రాస్ హైకోర్ట్
ఫొటో క్యాప్షన్, మద్రాస్ హైకోర్ట్

దేశంలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌పై మ‌ద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

క‌ర్నాట‌క‌లో హిజాబ్ వివాదం చెల‌రేగుతున్న నేప‌థ్యంలో .. గురువారం ఒక పిల్‌పై హైకోర్టు యాక్టింగ్ సీజే ఎంఎన్ భండారి స్పందిస్తూ.. 'దేశం ముఖ్య‌మా లేక మ‌తమా' అని ప్ర‌శ్నించారు. ఏది స‌ర్వోన్న‌త‌మ‌ని ఆయ‌న అడిగారు.

డ్రెస్ కోడ్‌కు సంబంధించిన పిల్‌పై ద్విస‌భ్య ధ‌ర్మాసనం గురువారం విచార‌ణ చేప‌ట్టింది. ఆ స‌మ‌యంలో సీజే భండారి షాక్ వ్య‌క్తం చేశారు.

కొంద‌రు హిజాబ్ వేసుకుంటున్నారు, కొంద‌రు టోపీలు ధ‌రిస్తున్నారు, కొంద‌రు వారికి న‌చ్చిన దుస్తులు వేసుకుంటున్నార‌ని, ఇంత‌కీ ఇది ఒకే దేశ‌మా లేక మ‌తం ఆధారంగా విభ‌జ‌న‌కు గురైందా లేక ఇంకామైనానా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంద‌న్నారు.

భార‌త్ సెక్యుల‌ర్ దేశ‌మ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే, దేశాన్ని మ‌తం ఆధారంగా విభ‌జించే ప్ర‌య‌త్నం జరుగుతున్న‌ట్లు తెలుస్తోంద‌ని యాక్టింగ్ సీజే అన్నారు.

తిరుచురాప‌ల్లి జిల్లాకు చెందిన రంగ‌రాజ‌న్ న‌ర‌సింహ‌న్ అనే వ్య‌క్తి పిల్ వేశారు. ఆ పిల్‌ను మ‌ద్రాస్ హైకోర్టు విచారించింది.

ఆల‌యాల‌కు వెళ్లే భ‌క్తుల‌కు క‌ఠిన‌మైన డ్రెస్ కోడ్‌ను అమ‌లు చేయాల‌ని, హిందువులు కాని వారికి ఆల‌య ప్ర‌వేశాన్ని నిషేధించాల‌ని ఆ పిల్‌లో కోరారు.

హిందువులు కానివారిని ఆల‌యాల‌కు రాకుండా చేసేందుకు గుళ్ల వ‌ద్ద డిస్‌ప్లే బోర్డులు పెట్టాల‌న్నారు. అయితే నిర్ధిష్ట‌మైన‌ డ్రెస్ కోడ్ లేన‌ప్పుడు ఎలా డిస్‌ప్లే బోర్డులు పెడుతార‌ని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించిందని పత్రిక వివరించింది.

సోనియాగాంధీ

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ నివాసానికి అద్దె బాకీ పడ్డ సోనియా-కేంద్రం

దిల్లీలో ఉంటున్న తన అధికారిక నివాసానికి సోనియాగాంధీ అద్దె బాకీ ఉన్నారని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం, సోనియాగాంధీ అధికారిక నివాసం సహా మరికొందరు కాంగ్రెస్‌ నేతలు ఉంటున్న భవనాలకు ఏళ్లుగా అద్దె చెల్లించలేదని కేంద్రం తెలిపింది.

కాంగ్రెస్‌ కార్యాలయానికి సంబంధించి గత పదేళ్ల అద్దె రూ.12,69,902 బకాయి ఉంది. సోనియా గాంధీ అధికారిక నివాసం అద్దె బాకీ రూ.4,610 ఉండగా, సోనియా వ్యక్తిగత కార్యదర్శి నివాసం అద్దె బకాయి రూ.5,07,911 ఉంది.

సుజిత్‌ పటేల్‌ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది.

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం.. దిల్లీ అక్బర్‌ రోడ్‌లోని 26వ నంబరు భవనంలో ఉంది. 2012 డిసెంబర్‌ తర్వాత ఆ భవనం అద్దె చెల్లించలేదు.

జాతీయ, రాష్ట్ర పార్టీలకు ప్రభుత్వ భవనాల కేటాయింపునకు స్పష్టమైన నిబంధనలున్నాయి. ఆయా పార్టీలు సొంత భవనం నిర్మించుకొనేందుకు మూడేళ్లు సమయం ఇస్తారు.

ఆ తర్వాత ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. 2010 జూన్‌లోనే దిల్లీ రౌజ్‌ ఎవెన్యూలో కాంగ్రెస్‌ పార్టీకి భూకేటాయింపు జరిగింది. అయినా.. భవన నిర్మాణం పూర్తి కాలేదు.

2013లోనే అక్బర్‌ రోడ్‌ కార్యాలయాన్ని కాంగ్రెస్‌ ఖాళీ చేయాల్సి ఉంది. అయితే.. అనేక సార్లు ఆ గడువు పొడిగించాలని ఆ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది.

జన్‌పథ్‌ రోడ్‌లోని 10వ నెంబర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఉంటున్నారు. 2020 సెప్టెంబర్‌ నుంచి ఆ భవనం అద్దె కూడా చెల్లించలేదని పత్రిక రాసింది.

చాణక్యపురిలోని ది-11/109 భవనంలో సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్‌ జార్జ్‌ ఉంటున్నారు. ఆ భవనం అద్దెను 2013 ఆగస్టు నుంచి చెల్లించలేదు. ఈ ఇంటిపై ఏకంగా రూ.5,07,911 అద్దె బాకీ ఉందని ఈనాడు వివరించింది.

రహానే

ఫొటో సోర్స్, Getty Images

నా క్రెడిట్ వేరేవాళ్లు కొట్టేశారు- అజింక్య రహానే

ఆసీస్ మీద చారిత్రక టెస్ట్ సిరీస్ విజయంలో తన క్రెడిట్‌ను మరొకరు చెప్పుకున్నట్లు రవిశాస్త్రిపై అజింక్య రహానే పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌లోని విపత్కర తరుణంలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అజింక్యా రహానె జట్టును ఎంత అద్భుతంగా నడిపించాడో అందరికీ తెలిసిందే.

రెండో టెస్ట్‌లో తాను సెంచరీ చేయడంతోపాటు జట్టుకు చారిత్రక విజయం అందించడంలో కీలక భూమిక పోషించాడు. ఆ ఊపులో మూడో టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్‌..నాలుగో టెస్ట్‌లో గెలిచి ఏకంగా సిరీస్‌ పట్టేసింది.

కానీ మెల్‌బోర్న్‌ టెస్ట్‌తోపాటు ఆ సిరీస్‌ విజయం ఖ్యాతి రహానెకు కాకుండా మరెవరికో దక్కింది. 'బ్యాక్‌స్టేజ్‌ విత్‌ బోరియా' అనే కార్యక్రమంలో ఆ విషయమై అజింక్యా కీలక వ్యాఖ్యలు చేశాడు.

'చారిత్రక టెస్ట్‌ సిరీస్‌ విజయం సాధించాం. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో నేను ఏం చేశానో నాకు తెలుసు. వాటిని చాటుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఆ గెలుపు నా క్రెడిట్‌ అని గొప్పలు చెప్పుకొనే మనస్తత్వం నాదికాదు. కానీ మైదానంలో, డ్రెస్సింగ్‌ రూంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలున్నాయి. వాటి క్రెడిట్‌ తమదని మరొకరు చెప్పుకొన్నారు' అని రహానె అన్నాడు.

ఆ వ్యక్తి ఎవరనేది అజింక్యా వెల్లడించకున్నా..నాటి హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రినుద్దేశించి పరోక్షంగా ఆ వ్యాఖ్యలు చేశాడని ఆంధ్రజ్యోతి రాసింది.

క్వారంటైన్ అవసరం లేదు

ఫొటో సోర్స్, Getty Images

ఏడు రోజుల క్వారంటైన్ అవసరం లేదు-కేంద్రం

ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రమాదం అంచున ఉన్న దేశాలను తప్పించి మిగతా దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది.

ఇక నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్లు క్యారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, కేవలం 14 రోజుల స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని పేర్కొంది.

అయితే ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు నిరంతరం మార్పు చెందుతున్న ఈ కోవిడ్‌ -19 వైరస్‌ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది.

కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ కోరినట్లు సాక్షి రాసింది.

కొత్త మార్గదర్శకాలు.

  • విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్‌లైన్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి
  • తప్పనిసరిగా ప్రయాణ తేదీ నుండి 72 గంటలలోపు నిర్వహించబడిన ప్రతికూల ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షను కూడా అప్‌లోడ్ చేయాలి.
  • రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి.
  • వ్యాక్సిన్‌ ప్రోగ్రాంలో భాగంగా భారత్‌ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి.

ఆయా దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయని పత్రిక వివరించింది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)