ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరో కాదో కోర్టులు చెప్పగలవా

స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ వ్యవహారం కర్ణాటకలో ఇటీవల చర్చనీయాంశంగా మారింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ వ్యవహారం కర్ణాటకలో ఇటీవల చర్చనీయాంశంగా మారింది
    • రచయిత, జోయా మటీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హిజాబ్‌కు ఇస్లామిక్ సంస్కృతితో సంబంధం ఉన్నా, దాన్ని ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని ఈ వివాదంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది.

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు కాబట్టి, స్కూళ్లు, కాలేజీల్లో ప్రభుత్వం హిజాబ్ ధారణను నిషేధించడం సబబేనని చెప్పింది. అయితే, హిజాబ్‌ నిషేధంపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

బహిరంగంగా మత విశ్వాసాలను ప్రదర్శించడం సర్వ సాధారణమైన దేశంలో ఈ తీర్పుకు అర్థమేంటి అన్నదాన్ని న్యాయ నిపుణులు, పండితులు విశ్లేషించే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ కోర్టు తీర్పు 'తప్పనిసరి' అనే మాట చుట్టూనే తిరిగింది. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు మత సంప్రదాయాల్లో ఏది తప్పనిసరి, ఏది తప్పనిసరి కాదు అన్న అంశాన్నే కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి.

హిజాబ్ పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఆందోళన జరిగాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిజాబ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఆందోళన జరిగాయి.

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరా?

ఈ ప్రశ్నపైనే విచారణ కొనసాగి, 129 పేజీల తీర్పు వెలువడింది. తమను హిజాబ్ ధరించనివ్వడం లేదంటూ కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలోని ఒక ప్రభుత్వ కాలేజీలో కొందరు విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేయగా, తాము నియమాల ప్రకారం వ్యవహరిస్తున్నామని కాలేజీ యాజమాన్యం తేల్చింది. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది.

హిజాబ్‌ను నిషేధించడంతో వివక్షతోపాటూ, భావవ్యక్తీకరణ, మత స్వేచ్ఛ హక్కులకు కూడా భంగం కలుగుతోందని, తమ మత విశ్వాసాల ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరని పిటిషనర్లు వాదించారు.

వీడియో క్యాప్షన్, అల్లా-హు-అక్బర్ అంటూ నినాదాలు చేసిన ముస్లిం యువతి ముస్కాన్ ఇంటర్వ్యూ

మతపరమైన విశ్వాసాలలో హిజాబ్ ధరించడం తప్పనిసరి అన్న విషయం పిటిషనర్లే నిరూపించాలని ప్రభుత్వం దీనిని సవాలు చేసింది. 11 రోజులపాటు వాడివేడి వాదనలు, వాయిదాల అనంతరం పిటిషనర్లు 'ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి' అన్న వాదనను నిరూపించడంలో విఫలమైనట్లు కోర్టు నిర్ధరించింది.

ఈ సందర్భంగా ఖురాన్‌లోని కొన్ని భాగాలను హైకోర్టు ఉదహరించింది. హిజాబ్ ధారణ ఆచారాన్ని అమలు చేయనివారు, హిజాబ్‌ను ధరించనివారు పాపులు అవుతారని, ఇస్లాం తన వైభవాన్ని కోల్పోయి ఒక మతం కాకుండా పోతుందని ఎక్కడా చెప్పలేదని కోర్టు స్పష్టం చేసింది.

అందువల్ల హిజాబ్ లేకుండా యూనిఫాం ధరించాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఈ నియమం మత విశ్వాసాలపై అర్థవంతమైన పరిమితిని విధించడమేనంటూ విద్యార్ధుల అభ్యంతరాలను కోర్టు కొట్టేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మతపరంగా తప్పనిసరి కాని వాటిని ఆందోళనలు, ఉద్వేగభరితమైన వాదనల కోసం 'తప్పనిసరి' చేయలేమని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

అయితే, ఇది కోర్టులు నిర్ణయించాల్సిన అంశం కాదని రాజ్యాంగ నిపుణులు, న్యాయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

''తమకు తక్కువ జ్ఞానం ఉన్న వేదాంతం అనే సబ్జెక్టులోకి లాయర్లు, జడ్జీలు ప్రవేశిస్తున్నారు'' అని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ రెబెక్కా జాన్ అన్నారు.

కర్ణాటక హైకోర్టు స్కూళ్లు, కాలేజీలలో హిజాబ్ ధరించరాదని తీర్పు చెప్పింది

ఫొటో సోర్స్, Getty Images

ఏది 'తప్పనిసరి'

‘‘మతపరమైన ఆచారాలలో ఏదీ ఒకేలా ఉండదు. మీరంతా ఒక మతం అనే గొడుగు కింద ఉన్నా, దాని ఆచరణలో ఎవరికి వారికి ప్రత్యేకమైన విధానం ఉంటుంది'' అన్నారు రెబెక్కా జాన్.

''హిజాబ్‌ను కూడా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఉపయోగిస్తారు. దీన్ని వ్యతిరేకించేవారు ఇది అణచివేతకు ప్రతిక అంటారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా దీనిని ప్రతిఘటనకు చిహ్నంగా ఉపయోగిస్తున్నారు. అందుకే హిజాబ్ అవసరమా కాదా అన్నదాన్ని నిర్వచించలేం. రకరకాల వ్యక్తులు దీన్ని రకరకాల కారణాలకు ఉపయోగిస్తుంటారు'' అన్నారు రెబెక్కా జాన్.

శాంతిభద్రతలు, ఆరోగ్యం, నైతికత అంశాలలో ప్రజల మతవిశ్వాసపు హక్కులపై ఆంక్షలు విధించే అధికారాన్ని భారత రాజ్యాంగం రాష్ట్రాలకు అప్పగించింది.

అయితే, మతపరంగా ఏది తప్పనిసరి అన్నది తేల్చడంతోపాటు అవి మత విశ్వాసాలను ఎంత వరకు రక్షిస్తాయో తేల్చే అంశం మాత్రం కోర్టులలోనే జరుగుతోంది.

వీడియో క్యాప్షన్, కర్నాటక: జై శ్రీరామ్ vs అల్లా హో అక్బర్

1954లో ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది రిలీజియన్ (మతంలో ముఖ్యమైన భాగం) అనే మాటను సుప్రీంకోర్టు మొదటిసారి ఉపయోగించింది.

‘‘ఏ ఆచారాన్ని తొలగించినప్పుడు ఒక మతం తన ప్రాథమికమైన రూపాన్ని కోల్పోతుందో దాన్ని తప్పనిసరి లేదా ముఖ్యమైన అంశం’’ అన్నది గుర్తించింది.

ఇది మతపరమైన సమాజాలకు సాధికారతను ఇచ్చిందని ప్రొఫెసర్ దీపా దాస్ అన్నారు. ఈ కారణంగానే ఏది మార్చాలో, మార్చకూడదో నిర్ణయించే శక్తిని ప్రభుత్వాలకు మించి ఈ కమ్యూనిటీలు సంపాదించాయని దీపా దాస్ అభిప్రాయపడ్డారు.

అయితే, కాలక్రమంలో ఈ విధానాలను వ్యతిరేకించే వారి వాదనలను కోర్టులు వినడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే 'మతపరంగా ఏది తప్పనిసరి' అన్నది కాస్తా 'మతానికి ఏది తప్పనిసరి' అన్న ప్రశ్నగా మారిందని దీపా దాస్ అన్నారు.

విదేశాలలో పరిస్థితి అలా లేదు. ఒక మతాధికారి తమ మతానికి ఇది తప్పనిసరి అని నిర్ధరిస్తే దాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. కానీ, భారత్‌లో కోర్టులు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒక్కోసారి అవి నిర్హేతుకంగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు.

కర్ణాటక హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కర్ణాటక హైకోర్టు

ఛాయిస్‌కు సంబంధించిన ప్రశ్న

2017లో ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది. 1994లో హిందూ ముస్లింల మధ్య ఒక మసీదు భూమి విషయంలో వచ్చిన వివాదాన్ని పరిష్కరించిన సుప్రీంకోర్టు.. ఇస్లాంను పాటించడానికి మసీదు తప్పనిసరి కాదని, నమాజ్ ఎక్కడైనా చేసుకోవచ్చని, అందువల్ల ఈ భూమిని హిందువులకు ఇచ్చేయాలని తీర్పు చెప్పింది.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చని 2018లో తీర్పిచ్చింది.

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరని 2016లో కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. మెడికల్ ఎగ్జామ్‌లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ వెలువడిన ఆదేశాలపై విద్యార్ధులు కోర్టుకెక్కగా ఈ తీర్పు వెలువడింది. కానీ, ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి అన్న వాదనను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది.

''ఒక మతానికి ఏది తప్పనిసరి అని తేల్చే విషయంలో కోర్టులు తరచూ నిర్ణయాలను మారుస్తున్నాయి. ఈ క్రమంలో మత స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవడం లేదు'' అని న్యాయ నిపుణుడు ఫైజాన్ ముస్తఫా 2017లో రాసిన ‘‘ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ ఇన్ ఇండియా’’ అనే పేపర్‌లో పేర్కొన్నారు.

అయితే, ఇలాంటి అంశాలలో నిర్ణయాలు తీసుకోవడానికి సరైన విధానమేంటో మాత్రం నిపుణులు చెప్పలేకపోయారు.

''ఈ విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలు అంటూ ఏమీ లేవు. మనం తయారు చేసుకున్న చట్టాలు, వాటిని నిర్వచించి, అమలు చేసేవారు వీలైనంత నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఉంటారని మనం భావిస్తాం. కానీ, ఇది అన్ని సందర్భాల్లో జరగదు. నిర్దిష్ట ప్రమాణాలను తయారు చేసుకోవడం ద్వారా దీనికి పరిష్కారం దొరుకుతుందని అనుకోలేం'' అన్నారు దీపా దాస్.

''ఒక మహిళ హిజాబ్ ధరించడం మంచి ఆలోచన కాదని చెప్పడానికి మనమెవరం?’’ అని రెబెక్కా జాన్ ప్రశ్నించారు.

కేవలం ఏది తప్పనిసరి అనే అంశంలోకి చూడటం కాకుండా, కోర్టులు సంస్థల అభిప్రాయాలను కూడా తీసుకుంటే బాగుండేదని రెబెక్కా జాన్ అభిప్రాయపడ్డారు.

''యూనిఫాం కచ్చితంగా ధరించాలనడం అందరికీ వర్తింపజేయాలి. బొట్టు పెట్టుకున్న వారిని, చేతులకు మత సంబంధమైన తాళ్లు, దారాలు ధరించిన వారిని ఏమీ అనకుండా, కేవలం హిజాబ్ ధరించిన ఒక వర్గం వారినే తప్పుబట్టడం వివక్ష కిందికి వస్తుంది'' అని రెబెక్కా అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, హిజాబ్ వివాదంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ బీబీసీతో ఏమన్నారంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)