చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, పలు నగరాల్లో లాక్‌డౌన్

చైనాలో కోవిడ్ మహమ్మారితో ప్రభావితమైన ప్రాంతాల్లో జిలిన్ ప్రావిన్స్ ఒకటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో కోవిడ్ మహమ్మారితో ప్రభావితమైన ప్రాంతాల్లో జిలిన్ ప్రావిన్స్ ఒకటి
    • రచయిత, జుబైదా అబ్దుల్ జలీల్, అనబెల్ లియాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

చైనాలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జిలిన్ ప్రావిన్సులో రికార్డు సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెప్పారు.

దీంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది చైనా. దేశంలో మల్టీ నేషనల్ కంపెనీల వ్యాపార కార్యకలాపాలు నిలిపివేసింది. లాక్‌డౌన్ ప్రభావానికి గురైన సంస్థల్లో టొయోటా, ఫోక్స్‌వాగన్, యాపిల్ సప్లయర్ ఫాక్స్‌కాన్ ఉన్నాయి.

మంగళవారం రికార్డు స్థాయిలో దేశంలో 5 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదైనట్లు చైనా చెప్పింది. వీటిలో ఎక్కువ కేసులు జిలిన్‌లోనే బయటపడ్డాయి.

ఈ ప్రావిన్సులోని మొత్తం 2.40 కోట్ల మంది క్వారంటైన్‌లో ఉండాలని సోమవారం ఆదేశాలు ఇచ్చారు.

వుహాన్, హిబేలో కరోనా మహమ్మారి మొదలైన తర్వాత చైనాలో ఒక ప్రావిన్స్ అంతటా లాక్‌డౌన్ విధించడం ఇదే మొదటిసారి.

జిలిన్ ప్రావిన్స్‌లో ప్రజలను బయట తిరగకుండా నిషేధించారు. ఆ ప్రాంతం వదిలి వెళ్లాలనుకునేవారికి పోలీసుల అనుమతిని తప్పనిసరి చేశారు.

కోటీ 25 లక్షల మంది నివసించే షెంజెన్ నగరంలో ఐదు రోజుల లాక్‌డౌన్ విధించిన తర్వాత జిలిన్ ప్రావిన్సులో తాజా ఆదేశాలు జారీ చేశారు. నగరంలో బస్సులు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేశారు.

చైనాలో 12 నుంచి 17 ఏళ్ల మైనర్లకు కరోనా టీకాలు వేస్తున్నారు

ఫొటో సోర్స్, Getty Images

మంగళవారం రాజధాని బీజింగ్‌తో సరిహద్దులు ఉన్న లాంగ్‌ఫాంగ్ సిటీలో, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులోని డాంగ్వాన్‌లో కూడా లాక్‌డౌన్ విధించారు.

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, ఇతర నిత్యావసర వస్తు సేవలు మినహా అన్ని వ్యాపారాలు మూసివేయాలని లేదా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు.

సోమవారం యాపిల్ కోసం ఐఫోన్స్ తయారుచేసే ఫాక్స్‌కాన్ సంస్థ షెంజెన్‌లో తమ కార్యకలాపాలు నిలిపివేసింది. స్థానిక ప్రభుత్వం సూచనల ప్రకారం మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ తెలియజేస్తామని చెప్పింది.

కానీ ఈ సంస్థకు చైనాలో చాలా ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. లాక్‌డౌన్ ప్రభావాన్ని తగ్గించడానికి తమ ఉత్పత్తి లైన్‌లో సర్దుబాట్లు చేసినట్లు ఆ సంస్థ బీబీసీకి చెప్పింది.

ఝెంగ్జౌలో ఆంక్షల ప్రభావం లేకపోవడంతో అక్కడున్న ప్రపంచంలోని అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ప్లాంట్ తెరిచే ఉంది.

టయోటా జిలిన్ ప్రావిన్సులోని చాంగ్చన్ నగరంలోని తమ ఫ్యాక్టరీని మూసేసింది. కార్యకలాపాలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో అది చెప్పలేదు.

జపాన్‌కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ తమ సప్లయర్లపై పడే ప్రభావం, ఉద్యోగుల భద్రత కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బీబీసీతో చెప్పింది.

జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వాగన్ కూడా చాంగ్చన్‌లో తమ కార్యకలాపాలు నిలిపివేసింది. ఫోక్స్‌వాగన్, ఆడీ కార్లు, వాటి విడిభాగాల ఉత్పత్తిపై ప్రభావం పడిందని, గురువారం తమ ఫ్యాక్టరీని మళ్లీ తెరవగలమని అనుకుంటున్నట్లు చెబుతోంది.

షాంఘాయ్ కాంపోజిట్

ఫొటో సోర్స్, Getty Images

మంగళవారం షాంఘాయ్ కాంపోజిట్ 5 శాతం, ఎన్నో చైనా టెక్నాలజీ జెయింట్స్ లిస్టయిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 6 శాతానికి పైగా పడిపోయింది. అయితే, ఈ సంస్థలు ఈ అవాంతరాలను తట్టుకోగలవని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ఇలాంటి లాక్‌డౌన్లు ముందు కూడా విధించారు. కోవిడ్ కేసులు అదుపులోకి రాగానే నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్లు ఎత్తివేశారు" అని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ య్యాంగ్ చెంగ్ లింగ్ చెప్పారు.

"షెంజెన్ సప్లయర్లకు ప్రధాన ఉత్పత్తి కేంద్రం కాదు. కానీ, ఈ లాక్‌డౌన్ నోట్‌బుక్స్, సర్వర్లు, స్మార్ట్ డివైస్‌ల తయారీ హబ్ అయిన షాంఘై, దాని చుట్టుపక్కల ప్రాంతాలవరకూ విస్తరిస్తే అది ఆందోళనకరమే అవుతుంది" అని యూబీఎస్ విశ్లేషకులు గ్రేస్ చెన్ అన్నారు.

గ్రే లైన్

'చైనా వెనక్కు వెళ్లింది..'

షాంఘై ప్రతినిధి రాబిన్ బ్రాంట్ విశ్లేషణ

చైనా ఇక్కడ మొదట్లో మహమ్మారి ప్రారంభమైన సమయానికి, రెండేళ్లు వెనక్కు వెళ్లినట్టు అనిపిస్తోంది.

వైరస్‌ను నియంత్రించడానికి మళ్లీ భారీ స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఒక ప్రావిన్స్ అంతా లాక్‌డౌన్ విధించారు.

జిలిన్‌లోని లాక్‌డౌన్ అది చాలావరకూ 2020 ప్రారంభంలో మహమ్మారి ప్రారంభమైనప్పుడు హుబే ప్రావిన్సులో విధించిన లాక్‌డౌన్‌లానే ఉంది.

ప్రపంచంలో ముఖ్యమైన టెక్నాలజీ హబ్ షెంజెన్(ఐపాడ్ ఎక్కువగా ఇక్కడే తయారవుతుంది) సిటీ కూడా లాక్‌డౌన్‌లో ఉంది.

షాంఘైలో 2 కోట్ల 40 లక్షల మంది ఉన్నారు. అక్కడ ఆందోళనకరంగా ఉంది. అన్ని స్కూళ్లూ మూసేశారు. పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు పెట్టారు. ఎక్కువ మంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు.

కొన్ని కాలనీల్లోకి ప్రవేశంపై కఠిన నిబంధనలు విధించారు. డెలివరీలు తీసుకొస్తుంటే గేట్ల దగ్గర మళ్లీ క్రిమిసంహారకాలు కొడుతున్నారు.

ఇవన్నీ చైనా జీరో కోవిడ్ వ్యూహాన్ని మళ్లీ అమలు చేసే భాగంగా జరుగుతున్న ప్రయత్నాలు.

కేసులు భారీగా బయటపడినప్పుడల్లా వేగంగా లాక్‌డౌన్ అమలు చేయడం, సామూహిక పరీక్షలు, ప్రయాణాలపై ఆంక్షలు లాంటి చర్యల వల్ల చైనా తన జీరో కోవిడ్ విధానంలో తక్కువ కేసులు నమోదయ్యేలా చూసుకుంది.

వీడియో క్యాప్షన్, నియోకోవ్ వేరియంట్: ముగ్గురిలో ఒకరు చనిపోతారా.. ఏంటీ ప్రచారం.. ఇందులో నిజమెంత?

అయితే ఒమిక్రాన్ వేరియంట్లో మార్పులు వచ్చాయి. అందుకే పాత పద్ధతులను కొనసాగించి, వైరస్‌ను నియంత్రించడం చైనాకు ఇప్పుడు సవాలుగా మారింది.

చైనాలో 2021లో వెలుగుచూసిన మొత్తం కేసుల కంటే, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎక్కువ కేసులు నమోదవుతూ వచ్చాయి.

"గత రెండేళ్లుగా కోవిడ్‌తో ఎంతో పోరాటం చేశాం. కానీ మనం ఇప్పటికీ వైరస్ ఘోరంగా పెరిగే ప్రారంభ దశలో ఉన్నాం" అని చైనా ఇన్ఫెక్షియస్ డిసీస్ ఎక్స్‌పర్ట్ ఝాంగ్ వెన్హాంగ్ ఇటీవల చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

"మహమ్మారిని అదుపు చేయడానికి చైనా తన జీరో కోవిడ్ వ్యూహాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దానర్థం లాక్‌డౌన్, సామూహిక పరీక్షల వ్యూహాన్ని ఇలా ఎప్పటికీ అమలు చేస్తూనే ఉండాలని కాదు" అని అన్నారాయన.

వీడియో క్యాప్షన్, కోవిడ్ శరీరంలోని కొవ్వులో తిష్ఠ వేస్తుందా? స్థూలకాయులకు ఇది ప్రాణాంతకమా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)