10th క్లాస్/BTech ఫెయిల్ అయ్యారా? ఎక్కడా ఉద్యోగం దొరకట్లేదా? ఈ ట్రైనింగ్‌తో జాబ్ గ్యారెంటీ..

ఫొటో సోర్స్, facebook/SkillIndiaOfficial
- రచయిత, నాగ సుందరి
- హోదా, బీబీసీ కోసం
పదవతరగతి వరకే చదివారా? ఉత్తీర్ణత పొందలేదా? నిరుద్యోగంతో సతమతమవుతున్నారా? కన్‌స్ట్రక్షన్ రంగంలో బోలెడు అవకాశాలు మీకోసం ఉన్నాయి. నిర్మాణరంగంలోని వివిధ విభాగాలలో ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలను యువతీయువకులకు అందిస్తోంది హైదరాబాద్‌లోని ప్రభుత్వ సంస్థ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్).
"ఉపాధి మీది..శిక్షణ మాది" అంటూ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(న్యాక్) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద, ఉపాధి కొరవడిన, పదవతరగతి కూడా పూర్తిచేయని యువతీ యువకుల మొదలు ఇంజనీరింగ్ చేసిన యువత దాకా పలువురికి ఉపాధి అవకాశాలు చూపెడుతోంది. ఎంతోమంది యువతకు ఉచిత శిక్షణ అందిస్తోంది.
నిర్మాణ రంగంలో మానవ వనరులను బాగా అభివృద్ధి చేసే లక్ష్యంతో సంబంధిత విభాగాలలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కోర్సులను న్యాక్ అందిస్తోంది. నిర్మాణ రంగంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవాంటే సంబంధిత విభాగాలలో యువతకు మంచి నైపుణ్యం అవసరం. అందుకే నిర్మాణ రంగంలోని వేరు వేరు విభాగాల్లో యువతీయువకులకు న్యాక్ ఉచిత శిక్షణను అందిస్తోంది.
శిక్షణ ఎవరికి?
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పదవ తరగతి వరకూ చదువుకున్న వారు, డిగ్రీ, బిటెక్ ఉత్తీర్ణత పొందిన వారికి ఉచిత ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలను న్యాక్ కల్పిస్తోంది. డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణత పొందని వారు కూడా శిక్షణ పొందడానికి అర్హులే.
నిర్మాణ రంగానికి చెందిన పది విభాగాలలో న్యాక్ శిక్షణ అందిస్తోంది. 8, 10, ఇంటర్ చదివి దరఖాస్తు చేసుకున్న యువతకు చిన్న చిన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఉచిత శిక్షణతో పాటు వసతి సదుపాయాలు కూడా కల్పించి ఆయా రంగాలలో నైపుణ్యం సాధించేలా యువతీ యువకులను మలుస్తారు.
కోర్సులను బట్టి మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా ఉచిత శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలంలో విద్యార్థులు పైసా ఖర్చు పెట్టనవసరం లేదు. స్కిల్ డెవలెప్మెంట్ ట్రైనింగ్‌లో భాగంగా న్యాక్ ఖర్చు అంతా పెట్టుకుంటుంది. కోర్సుల్లో శిక్షణ పొందేవారి వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
బ్యాచుకు 30 మంది యువతీ యువకులను తీసుకుని శిక్షణ అందిస్తారు. శిక్షణా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంటుంది. అందుకే ప్రతి నెలా ఒకటవ తేదీ లేదా 16 వ తేదీల్లో యువతీ యువకులు నేరుగా కోర్సుల్లో చేరి శిక్షణ తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, facebook/National Academy of Construction
ఉపాధి అవకాశాలు ఎన్నో
చిన్న కోర్సులకు శిక్షణ 90 రోజుల పాటు అంటే మూడు నెలల పాటు ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తారు. శిక్షణ పొందిన వారు సంబంధిత విభాగాలలో ఉద్యోగాల్లో చేరడమే కాకుండా తాము సాధించిన నైపుణ్యంతో సొంతంగా బిజినెస్ సైతం చేసుకుంటూ తమ కాళ్ల మీద తాము నిలబడే స్థాయికి ఎదుగుతున్నారు.
ఈ శిక్షణనందించడంలో ముఖ్యంగా గ్రామీణ యువతీ యువకులకు పెద్ద పీట వేస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన యువత హైదరాబాదులోనే కాకుండా పలు ఇతర రాష్ట్రాలలో, దేశాలలో సైతం మంచి ఉపాధి అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటివరకూ న్యాక్ లక్షలాది మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 1998లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) 46 ఎకరాల్లో నిర్మించింది.
నిర్మాణరంగంలో ఉద్యోగ అవకాశాలు బాగా ఉండడంతో ఇందులో పది కోర్సులకు 2000 సంవత్సరంలో శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ న్యాక్‌లో 4.30 లక్షల మంది శిక్షణ పొందారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత లక్షమంది శిక్షణ పొందారు.
కోర్సులు ఏమిటి?
స్కిల్ డెవలెప్మెంట్‌లో భాగంగా యువతీయువకులకు కన్‌స్ట్రక్షన్ రంగంలోని వివిధ ట్రేడ్స్ లో శిక్షణను న్యాక్ ప్రారంభించింది. అవి..

ఉచిత శిక్షణ
శిక్షణ ఉచితం. వసతి సదుపాయాలు ఉచితం. శిక్షణ పొందుతున్న నిరుపేద యువతీయువకులు తమ జేబుల నుంచి పైసా తీసి ఖర్చు చేయనవసరం లేదు. ఫీజులేమీ కట్టనక్కర్లేదు. ఈ కోర్సుల్లో చేరాలంటే తెల్లరేషన్ కార్డు ఉండి, పదో తరగతి నుండి డిగ్రీ, బిటెక్ పాస్ లేదా ఫెయిల్ అయినా కూడా వారికి అవకాశం ఉంటుంది.
శిక్షణా కాలం మూడు నెలలు. సైట్ సూపర్‌వైజర్ కోర్సుకు మాత్రం శిక్షణా కాలం ఆరు నెలలు ఉంటుంది. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బోర్డింగ్, లాడ్జింగ్ ఉచితం. యువతీ యువకులు విడి విడిగా ఉండేలా హాస్టల్ సదుపాయాలు ఉన్నాయి. విద్యార్థులకు ఉదయం పూట సాధారణ క్లాసులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి.
న్యాక్ ప్రత్యేకత ఏమిటంటే శిక్షణ పూర్తిచేసుకున్న అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్లు అందజేయడంతో పాటు సంబంధిత కంపెనీల్లో ఉపాధి కల్పిస్తుంది. శిక్షణ పొందిన వారికి ప్లేస్‌మెంట్లు కల్పించే విషయంలో న్యాక్ పలు కంపెనీలతో ఎప్పటికప్పుడు సంబంధాలు పెంచుకుంటూ వాటిని సంప్రదిస్తూ శిక్షణ పొందిన యువతీ యువకులకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటుంది.
ఇప్పటివరకూ 500 కంపెనీలు న్యాక్‌లో శిక్షణ పొందిన యువతను ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. న్యాక్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ 4.30 లక్షల మంది యువత తమ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసుకుని పలుచోట్ల ఉద్యోగాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, facebook/SkillIndiaOfficial
ఉపాధి హామీలో పనిచేసేవారికి స్పెషల్ ఛాన్స్
న్యాక్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న యువతీయువకుల కుటుంబ సభ్యులు 2018-19 సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పనిచేసి ఉంటే వారికి 'ఉన్నతి స్కీమ్' వర్తిస్తుంది. అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలెప్మెంట్ ఏజన్సీ ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రతి రోజూ 240 రూపాయలను న్యాక్ అధికారులు అందజేస్తారు. శిక్షణా కాలం పూర్తయేంతవరకూ ఈ సహాయాన్ని అందజేస్తారు.
‘ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ మధ్యలో మానేశా, ఆ తర్వాత...’
''ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ మధ్యలో మానేశాను. న్యాక్‌లో నిర్మాణరంగానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తారని నా స్నేహితురాలు చెప్పింది. అలా ఇందులో చేరాను. సైట్ సూపర్‌వైజర్ కోర్సు లో శిక్షణ పొందాను. ఈ కోర్సుకు ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి" అని ప్రస్తుతం న్యాక్‌లో శిక్షణ పొందుతున్న సూపర్‌వైజర్ స్టూడెంట్ ఎస్. రవళి చెప్పారు.
‘నెలకు 36 వేల జీతం వస్తోంది..’
"న్యాక్‌లో సైట్ సూపర్‌వైజర్ శిక్షణ పొందాను. ఇపుడు ప్లేస్‌మెంటులో భాగంగా ఒక ప్రైవేటు కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేరా. ప్రస్తుతం నెలకు 36 వేల జీతం సంపాదిస్తున్నాను" అని చందా నగర్ కు చెందిన గిరి గౌడ్ చెప్పారు.
ఉపాధి అవకాశాలు ఎన్నో..
"నిర్మాణరంగానికి సంబంధించిన పలు ట్రేడ్స్‌లో మేం ఉచిత శిక్షణ అందిస్తున్నాం. ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్న కన్‌స్ట్రక్షన్ రంగంలో యువత మెరుగైన అవకాశాలు అందుకునేలా వివిధ కోర్సుల్లో నైపుణ్యాన్ని పెంచుతున్నాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ సువర్ణావకాశాన్ని యువతీయువకులందరూ సద్వినియోగం చేసుకోవాలి' అని న్యాక్ డైరక్టర్ జనరల్ బిక్షపతి చెప్పారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్), హైదరాబాద్ కాంటాక్ట్ నంబరు: 04023111916
వెబ్‌సైట్: www.nac.edu.in
ఈమెయిల్: [email protected]
ఇవి కూడా చదవండి:
- వ్లాదిమిర్ పుతిన్: ‘అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటును ఆయుధంగా ఎలా మార్చుకున్నారు?’
- క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- ‘అమ్మవారు’ (చికెన్ పాక్స్) వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానంపై భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది
- బిర్యానీ తింటే వీర్యకణాలు తగ్గిపోయి, నపుంసకత్వం వస్తుందా? ఈ ప్రచారంలో నిజమెంత?
- Zero Debt: అప్పు చేయకపోవడం కూడా తప్పేనా? చేస్తే ఎంత చేయాలి, ఎలా చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















