సికింద్రాబాద్ కంటోన్మెంట్: ‘నేను మా ఇంటికి రావాలంటే గుర్తింపు కార్డు చూపించాలి.. బంధువులు వస్తే ముందుగా సెక్యూరిటీకి చెప్పాలి’

- రచయిత, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
"మా బస్తీకి చెందిన వాళ్లు ఎవరైనా ఆస్పత్రిలో చనిపోతే వారి శవాన్ని తీసుకొచ్చే అంబులెన్సు ఇంటి ముందు వరకు రాలేదు. కొంత దూరం నుంచి మేం మోసుకొని రావాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పు లేదు. వేరే దారులు మూసివేశారు. నేను మా ఇంటికి రావాలంటే గుర్తింపు కార్డు చూపించాలి. ఎవరైనా బంధువులు వస్తే, సెక్యూరిటీ వారికి ముందుగా చెప్పాలి.’’
‘‘ఇంటి పునర్నిర్మాణ పనులు లేదా ఏవైనా పెద్ద మరమ్మతులు చేసుకోవాలంటే సంవత్సరాల తరబడి పర్మిషన్ కోసం వేచి చూడాలి. మా బస్తీలో చాలా మంది ఇళ్లలో పనికి వెళ్తారు. వారు ఇంటికి నడిచి రావాలంటే చుట్టూ తిరిగి రావాలి. సుమారు 150 ఏళ్లుగా, నాలుగు తరాలుగా ఇక్కడే ఉంటున్నాం. కానీ మాకు ఇంకా స్వేచ్ఛ రాలేదేమో అనిపిస్తోంది'' అని బీబీసీతో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని 108 బజార్ పూల్‌బాగ్‌లో ఉంటున్న పేరు చెప్పడానికి ఇష్టపడని దంపతులు చెప్పారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది.
కంటోన్మెంట్‌కు నీళ్లు, కరెంట్ బంద్ చేస్తామంటూ తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల చేసిన హెచ్చరికలతో ఇది మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
దీనిపై రాజకీయ పార్టీలు వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. ఈ అంశం పార్లమెంట్ వరకు చేరింది.
కంటోన్మెంట్ ప్రాంతంలో మిలిటరీ వాళ్లు ఎప్పుడు, ఎక్కడ ఏ రోడ్లు మూసివేస్తారో తెలియట్లేదని స్థానికులు చెబుతున్నారు.
''ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. దీన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఎందుకు కలపకూడదు'' అని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
అసలు ఈ వివాదం ఏమిటి? కంటోన్మెంట్‌లో నివాసముంటున్న వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలు ఏమంటున్నారు? కంటోన్మెంట్ అధికారుల వాదన ఏమిటి?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అంటే ఏంటి?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది సికింద్రాబాద్ సైనిక నివాస ప్రాంతానికి చెందిన పౌర పరిపాలనా సంస్థ. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో విస్తరించి ఉంది.
భారతదేశంలో భటిండా సైనిక నివాస ప్రాంత మండలి తర్వాత రెండో అతిపెద్ద ప్రాంత సంస్థగా సికింద్రాబాద్ సైనిక నివాస ప్రాంత మండలి గుర్తింపు పొందింది.
ఎనిమిది వార్డులు ఉన్న ఈ ప్రాంతంలో సుమారు 4 లక్షల జనాభా ఉంటుంది. ఇది రక్షణ శాఖ పరిధిలో ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 2,17,910. ఇప్పుడు సుమారు నాలుగు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సైనిక శిబిర పౌర ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్వహణను సైనిక శిబిర పౌర పరిపాలన మండలి చూసుకుంటుంది. 2006 సైనిక శిబిర పౌర ప్రాంతాల చట్టం ప్రకారం, దీన్ని మొదటి తరగతి సైనిక శిబిర పౌర ప్రాంతంగా వర్గీకరించారు.
చరిత్ర ఏం చెబుతోంది?
1800 ప్రారంభంలో బ్రిటిష్ కాలం నాటి మిలిటరీ ఉనికిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం తెలుపుతుంది. అక్కడ బ్రిటిష్ అధికారులు సాధించిన పురోగతి గౌరవార్థం క్లాక్ టవర్ నిర్మాణానికి 1862లో బ్రిటిష్ ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ వద్ద 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
1948లో పోలీసు చర్యకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం, హైదరాబాద్ నిజాంకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కంటోన్మెంట్ బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది. తర్వాత ఇది భారత రక్షణ శాఖ నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఒకప్పటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యాన్ని తిరుమలగిరి ప్రాంతంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంచారు.

కంటోన్మెంట్ ప్రజల సమస్యలేంటి?
తమ ఇబ్బందులపై స్థానిక ప్రజలు చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.
"మేం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. మా చుట్టూ ఉన్న ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మా పరిస్థితి 'అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు' అన్నట్టుగా తయారైంది. కంటోన్మెంట్ బోర్డు కారణంగా ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. మూడు నాలుగు రోజులకు మాకు నీళ్లు వస్తాయి. పెరుగుతున్న జనాభాకు తగినట్లు రోడ్లు వెడల్పు చేయాలి. ముందే ఇరుకుగా ఉన్న రోడ్లు ఎప్పుడు మూసేస్తారో తెలియదు. స్కూళ్ళు, ఆసుపత్రులు కరువయ్యాయి. టౌన్ ప్లానింగ్ ఊసే లేదు" అని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ బాబు చెప్పారు.
22 ఏళ్లుగా తాను కూడా ఈ సమస్యలపై పోరాటం చేస్తున్నానని ఆయన బీబీసీతో చెప్పారు. ఈ స్వచ్ఛంద సంస్థను గత ఏడాది ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ సమస్య కేవలం ఒక్కరిదో ఇద్దరిదో కాదు. ఇక్కడ చాలామంది ఇలానే పోరాడుతూ తమ జీవితాల్లో మార్పు రావాలని వివిధ సంఘాలుగా, స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పడ్డారు.
అందులో ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. దీనికి ప్రధాన కార్యదర్శి సురానా జితేందర్. ఆయన బీబీసీతో మాట్లాడారు.
"ఈ సమస్య సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోనే కాదు, దేశంలో దాదాపు అన్ని కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఉంటున్న సామాన్య ప్రజలది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నగర నడిబొడ్డున ఉండి కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. మాకు ఇక్కడ సామాన్య పౌరులకు ఉండే హక్కులు కూడా లేవు. ఎనిమిది వార్డుల్లో జరగాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు 2020 నుంచి జరగనే లేదు.
ఫిబ్రవరిలో రక్షణ శాఖ వారు వెరైటీ బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. అందులో ఆర్మీ అధికారులు ఉన్నారు గానీ, సామాన్యులకు ప్రాతినిధ్యం దక్కలేదు. ఇక్కడ ఎన్నికలు జరిగినా, ఓటు హక్కు లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసే మాకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 2006 నాటి కంటోన్మెంట్ చట్టం ప్రకారం డోర్ నంబర్లు లేని వారు ఓటుకి అర్హులు కారు" అని అన్నారు.
ఇక్కడ మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిన పనికి 7-9 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది అని జితేందర్ చెప్పారు.
''హైటెక్ సిటీలో పని చేసి రాత్రి షిఫ్టుల్లో వచ్చే వారు రోడ్లు మూసేయడంతో నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లకు వెళ్లాలన్నా పిల్లలు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. రోడ్డు మూసివేసి ఉండటం వల్ల ఒకసారి మహిళా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన గర్భిణిని దగ్గర్లోని మరో ఆసుపత్రిలో చర్చించాం. కరోనా సమయంలో కూడా ప్రజలు స్వేచ్ఛగా ఆసుపత్రికి వెళ్లలేకపోయారు'' అని జితేందర్ చెప్పుకొచ్చారు.

కంటోన్మెంట్ రాజకీయ అంశంగా ఎలా మారింది?
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 22 ఎకరాల జింఖానా గ్రౌండ్స్, 33 ఎకరాలు ఉన్న బైసన్ పోలో గ్రౌండ్లలో కొత్త సచివాలయం కట్టాలని అనుకున్నారు. అయితే అవి ఎంత ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి రాలేదు.
కంటోన్మెంట్ ప్రాంతం సమస్యలపై కొంతకాలం క్రితం ఒక వార్తా కథనాన్ని కేటీఆర్ ట్వీట్ చేస్తూ- ఏం చేద్దాం అని ప్రజలను అడిగారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే సమాధానం ఎక్కువగా వచ్చింది. అప్పటి నుంచి కేటీఆర్ దీనిపై ట్విటర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో బ్యానర్లు కూడా దర్శనమిస్తున్నాయి.
ఇటీవల కేటీఆర్ హెచ్చరికలతో కంటోన్మెంట్ వివాదం మరింత ముదిరింది. వీటిపై బీజేపీ నేతలు స్పందిస్తూ ''ఆర్మీ గురించి ఇలా మాట్లాడడం అంటే ఆర్మీని, దేశాన్నిఅవమానించడమేనని, అలాంటి వారిని దేశ ద్రోహులుగా చూడాల్సి వస్తుంది'' అని వ్యాఖ్యానించారు.
ఈ విషయం పార్లమెంట్‌కు చేరింది. లోక్‌సభ జీరో అవర్‌లో టీఆర్ఎస్ ఎంపీ భీమ్‌రావ్ బశ్వంత్‌రావ్ పాటిల్ మాట్లాడారు. కంటోన్మెంట్ ప్రాంతం సికింద్రాబాద్ నగరంలో ఉత్తరం వైపున ఎక్కువగా విస్తరించి ఉందన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి మేజర్ రోడ్లు కనెక్ట్ అయ్యాయని, నాగ్‌పూర్, చంద్రాపూర్ రోడ్లు ఆ మార్గంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ దృష్ట్యా కంటోన్మెంట్ ప్రాంతంలో కొంత వరకు రోడ్లను విస్తరించినా.. అక్కడి అధికారుల చొరవ లేక రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టిందని, ట్రాఫిక్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇదే అంశాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించారు.
కంటోన్మెంట్ అధికారులు ఏం చెబుతున్నారు?
ఈ అంశంపై బీబీసీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్ రెడ్డిని సంప్రదించింది.
"దీనిపై ప్రస్తుతం స్పందించలేను. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దీనిపై సమీక్షిస్తున్నాం. రక్షణ అంశం, అలాగే సామాన్య ప్రజల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. 21 లేదా 22 రోడ్లను మూసేశాం అని చెప్పడంలో వాస్తవం లేదు. మూసివేసిన రోడ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మేం చూపిస్తున్నాం. ఇది చాలా ఏళ్లుగా ఉన్న సమస్య. దీనిపై దృష్టి సారించాం'' అని అజిత్ రెడ్డి చెప్పారు.
రాజకీయ పార్టీలకు అంత చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు తీసుకురావట్లేదు? అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపై చాలా హామీలు ఇచ్చారని వారు గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు దీనిపై చలనం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రాజకీయాలు కాదు పరిష్కారం కావాలని అడుగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- వ్లాదిమిర్ పుతిన్: ‘అమెరికా చేసిన అత్యంత దారుణమైన పొరపాటును ఆయుధంగా ఎలా మార్చుకున్నారు?’
- ‘అమ్మవారు’ (చికెన్ పాక్స్) వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- ఇస్లామోఫోబియాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానంపై భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది
- తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్.. వందలాది స్పామ్ ట్వీట్లు
- Zero Debt: అప్పు చేయకపోవడం కూడా తప్పేనా? చేస్తే ఎంత చేయాలి, ఎలా చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















