చిన్నజీయర్: సమ్మక్క సారలమ్మపై మాట తూలారా, మనసులో ఉన్నదే చెప్పారా... ఆయన వ్యాఖ్యల మర్మమేంటి?

చిన్న జీయర్

ఫొటో సోర్స్, chinnajeeyar.org

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగి వచ్చారా? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో గ్రామ దేవత. సరే చేసుకోని అక్కడుండే వారు. చదువుకున్న వారు, పెద్ద వ్యాపారస్తులు.. ఆ పేరున బ్యాంకులు పెట్టేశారు. దట్ బికేమ్ ఎ బిజినెస్ నౌ. ఎంత అన్యాయమో చూశారా అండీ?''

శ్రీవైష్ణవ మఠాధిపతి చిన్న జీయర్ స్వామి ఒక వీడియోలో చెప్పిన మాటలివి. ఆ వీడియో మా టీవీలో దాదాపు పదేళ్ల క్రితం ప్రసారం అయింది. ఇప్పుడు కొందరు దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు.

దశాబ్ద కాలం తరువాత ఈ మాటలు ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీడియో వైరల్ అయింది. దీనిపై ఆదివాసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులూ అందరూ మండిపడుతున్నారు. మీడియాలో తిట్లే కాదు, బయట కూడా ఆదివాసీ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. దిష్టిబొమ్మలు కాల్చారు. చెప్పుల దండలు వేశారు.

Presentational grey line

చిన జీయర్ వివరణ

తెలంగాణలోని ఆదివాసీ వనదేవతలు సమ్మక్క, సారలమ్మల గురించి 20 ఏళ్ల కిందట తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు పనిగట్టుకుని పెద్ద ఇష్యూగా చేసి, ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

Presentational grey line

సమ్మక్క సారలమ్మల కోయ తెగకే చెందిన మేడారం ప్రాంత ఎమ్మెల్యే సీతక్క దీనిపై స్పందించారు.

''ఓ ఆంధ్రా చిన్న జీయర్ స్వామి, మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మల మీద ఎందుకు ఈ అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలు చేశారు? బేషరతుగా మీరు తెలంగాణ సమాజానికీ, ఆదివాసీ సమాజానికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ జాతర వైభవాన్ని, ఆ దేవతల కీర్తిని తగ్గించేలా చేసిన అహంకారంతో అన్న మాటలు బేషరతుగా వెనక్కు తీసుకోవాలి'' అని సీతక్క డిమాండ్ చేశారు.

''మా దేవతలు ప్రకృతి దేవతలు. అక్కడ టికెట్లు, రియల్ ఎస్టేట్ లేదు. ప్రజలందరికీ అందరికీ దర్శనం ఉంటుంది. మీరు 120 కిలోల బంగారంతో సమతా మూర్తి పేరు పెట్టి, స్వప్రయోజనం కోసం జనం రావడం కోసం 150 రూపాయల టికెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు. మేడారంలో వ్యాపారం లేదు. ప్రజల విశ్వాసాలకు తగ్గట్టుగా జాతర జరుగుతోంది. తల్లుల కీర్తికి సహించలేక జీయర్ మాట్లాడిన దుర్మార్గపు మాటలు వెనక్కు తీసుకోవాలి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించాలి. ప్రభుత్వ వైఖరి తెలియజేయాలి'' అన్నారు సీతక్క.

సమ్మక్క సారలమ్మల జాతర
ఫొటో క్యాప్షన్, సమ్మక్క సారలమ్మల జాతర

నిజానికి చిన్న జీయర్ స్వామి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదలు కాదు. ముఖ్యంగా రామానుజుల విగ్రహ ప్రతిష్ట సమయంలో కూడా ఆయన పాత వీడియోలు వైరల్ అయ్యాయి. మాంసం తినే వాళ్లు ఏ మాంసం తింటే ఆ జంతువులా తయారవుతారు అనడం, కులాలు పోకూడదు అని చెప్పడం అప్పట్లో వివాదాలు అయ్యాయి.

అయితే, హిందూ మతేతర సంస్థలే కాదు, హిందూ మతంలోని వేరే శాఖలు వారు కూడా జీయర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా అద్వైత శాఖ, శంకరాచార్యులపై జీయర్ కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ దానిపై శృంగేరీ పీఠం తెలుగు రాష్ట్రాల వ్యవహారాలు చూసే వ్యక్తులు స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు తగవన్నారు.

ఇక కాకినాడ శ్రీపీఠానికి చెందిన అద్వైత సంప్రదాయ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి కూడా ఈ విషయంలో చిన్న జీయర్ ను తప్పు పట్టారు. అయితే వాటన్నిటికంటే తాజా గొడవ కాస్త తీవ్రంగా ఉంది.

మేడారం జాతరకు కేవలం ఆదివాసీలే కాకుండా మిగిలిన హిందూ మతాన్ని పాటించే వారు కూడా పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. పైగా ఆ జాతరను తెలంగాణ వైభవ చిహ్నంగా ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిలో భాగంగా భావించే ఈ జాతర గురించి మాట్లాడుతూ, ఈ జాతరలో పూజలందుకునే వారు అసలు దేవతలే కాదంటూ చిన్న జీయర్ వ్యాఖ్యానించడం చాలా మంది ఆగ్రహానికి కారణమైంది.

''ఆత్మార్పణ చేసిన వారిని పూజించి, గౌరవించే సంప్రదాయం ఉంది. అందుకే, కాకతీయులపై పోరాడిన వీర వనితలు వన దేవతలయ్యారు. ఈ జాతరకు ఇంతమంది రావడం వెనుక ఒక మానవీయ, తెగ సంబంధం ఉంది. కానీ ,ఈ సంస్కృతినీ లాగేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రామానుజులు మనిషిగానే పుట్టారు. బ్రహ్మ లోకం నుంచి రాలేదు. సమ్మక్క, సారలమ్మలూ మనిషిగానే పుట్టారు. వన దేవతలు ప్రజల కోసం పోరాడారు. రామానుజులు ప్రజలకు మంచి మాటలు చెప్పారు. (తేడా ఏంటి?). ఇదంతా చూస్తుంటే, ఆదివాసులనూ, ఇతరత్రా తెగలు, కులాలకు చెందిన వారిని వారి సంప్రదాయాలకు, వారి వారి ఆరాధనా పద్ధతులకు దూరం చేసి కేవలం శిష్ట దైవాలను కొలిచేలా చేయడానికి గీస్తోన్న విభజన రేఖగా ఈ చిన్న జీయర్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి'' అన్నారు చరిత్ర పరిశోధకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు.

వీడియో క్యాప్షన్, కొండచిలువను దత్తత తీసుకున్న విశాఖ యువతి

రాజకీయ ప్రభావం

ఈ అంశం ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా యాదాద్రి నిర్మాణంలో చిన్న జీయర్ కీలక భూమిక పోషించారు. కానీ, తెలంగాణ సెంటిమెంటు ఇంతలా హర్ట్ అయిన నేపథ్యంలో మార్చి నెలాఖరులో జరగబోయే యాదాద్రి నూతన ఆలయ ప్రారంభ పూజల్లో చిన్న జీయర్ పాత్ర ఉంటుందా? ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. అలాగే, ఈ వీడియోను ఎవరైనా యాదృచ్ఛికంగా చూసి సోషల్ మీడియాలో పెట్టారా లేకపోతే ఇంకెవరైనా రాజకీయ ఉద్దేశంతో పెట్టారా అనే ప్రశ్న కూడా చర్చలో ఉంది.

సమ్మక్క సారలమ్మల భక్తులు
ఫొటో క్యాప్షన్, సమ్మక్క సారలమ్మల భక్తులు

గ్రామ దేవతలు వర్సెస్ పౌరాణిక దేవతలు

గ్రామీణ ప్రాంతాల్లో జనం పూజించే గ్రామ దేవతలు, అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలు పూజించే వన దేవతలకూ, హిందూ మతంలో ప్రధాన స్రవంతిలో ఉండే పురాణాల్లో పేర్కొన్న దేవతల ఆరాధనలో చాలా తేడా ఉంటుంది. పూజా పద్ధతులు, ఆచారాలు, పూజలు చేసే వ్యక్తుల కులాలు.. అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి.

ప్రస్తుతం హిందువులు రెండు రకాల దేవాలయాలకూ వెళుతుంటారు. అలాగే, గ్రామ దేవతలను కూడా శక్తి దేవత ప్రతిరూపాలుగా చూడడం ప్రారంభమైంది. దీంతో పౌరాణిక మతంలో పార్వతి, దుర్గ, కాళి పేర్లతో ఉండే అమ్మవారే గ్రామ దేవతలుగా కూడా ఉన్నారని చెప్పే సంస్కృతి ప్రారంభం అయింది.

వీడియో క్యాప్షన్, అమెజాన్ అడవుల్లో ఉండే అతి పెద్ద ఆకు ఇప్పుడు కడపలో

అలా క్రమంగా కొన్ని గ్రామ దేవతల ఆలయాల్లో బ్రాహ్మణ కులానికి చెందిన అర్చకులను నియమించి ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చేయడమైంది. హైదరాబాద్ జుబిలీహిల్స్ లోని పెద్దమ్మ దేవాలయం దానికి ఒక ఉదాహరణ.

అయితే, అలా గ్రామ దేవతల పూజా విధానాన్ని ప్రధాన స్రవంతి హిందూ పూజా విధానంగా మార్చడాన్ని తప్పు పట్టే వారూ ఉన్నారు. ఆయా జానపద సంస్కృతులను పరిరక్షించకుండా, ఒకే సంస్కృతిని వారిపై రుద్దడం సరికాదని వారి వాదన.

హిందూ మతంలోని వేర్వేరు శాఖలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు గ్రామ దేవతల విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గ్రామ దేవతల ఆరాధనను సమర్థించిన పీఠాధిపతులూ ఉన్నారు.

చిన్న జీయర్ వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు
ఫొటో క్యాప్షన్, చిన్న జీయర్ వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు

కంచి పీఠానికి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి తమ దగ్గరకు వచ్చిన వారికి, సందర్భాన్ని బట్టి గ్రామ దేవతలకు పూజలు చేయాలని సూచించిన సందర్భాలు ఉన్నట్టు కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ తెలిపింది.

''నేను శ్రీవైష్ణవాన్ని పాటిస్తాను. శ్రీ వైష్ణవానికి చెందిన అహోబిల మఠం కానీ, పరకాల మఠం కానీ, అద్వైత ఆమ్నాయ మఠాలు కానీ (కంచి, శృంగేరి వంటివి) ఎప్పుడూ ఇలా చెప్పలేదు. ఆయన ఈ మాటలు ఎప్పుడు చెప్పినా, అవి తప్పే. నాస్తికుడు అలాంటి మాటలు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయనొక మత గురువు. సన్యాసిగా ప్రకటించుకున్న వ్యక్తికి, యతికి ఉండకూడని లక్షణం వాచాలత్వం. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అంటారు. అంటే మన దేవుడిని ఆరాధించు, మిగతా వారిని ఆదరించు, గౌరవించు అని. కానీ దానికి దూరం జరిగారు చిన్న జీయర్. అసలు రామానుజులదే మధ్యే మార్గం. రామానుజ పరంపరకు చెందిన ఈయన ఇలా నోరు పారేసుకోవడం తప్పు. ఇది ఒక రకమైన అహంకారం. మరో విషయం, మేడారంలో వ్యాపారం అన్నారు. మరి ఈయన చేస్తోంది వ్యాపారం కాదా?'' అని నల్సార్ యూనివర్శిటీలో రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ హారతి వాగీశన్ అన్నారు.

శ్రీ వైష్ణువుల్లో సాధారణంగా తమ మతం పట్ల అభిమానం ఉంటుంది. కానీ,వారు ఇతర దేవతలను ఇలా విమర్శించరని వాగీశన్ అభిప్రాయపడ్డారు.

ఇటీవలే చిన్నజీయర్ రాజమానుచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవలే చిన్నజీయర్ రాజమానుచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు

సమ్మక్క జాతరలో హిందూ ఆచారాలు లేవు: మేడారం పూజారి

మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మల జాతర పూర్తి ఆదివాసీల సంప్రదాయ జాతర అనీ, దానికి హిందూ సంప్రదాయాలతో సంబంధం లేదని చెబుతున్నారు అక్కడి పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్.

''ఒకప్పుడు ఆదివాసీలు మాత్రమే వచ్చేవారు. అమ్మవారి మహిమల వల్ల, కోరికలు నెరవేరడం వల్ల క్రమక్రమంగా ఇతరులు కూడా జాతరకు వస్తున్నారు. జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ హైందవ సంప్రదాయాలు కనిపించవు. ప్రకృతిని పూజించే వారు ఆదివాసీలు. మేం అమ్మవారికి ఒక రూపాన్ని అంగీకరించం. వీరు ప్రకృతి సిద్ధంగా వెలిశారు. ఇక్కడ ధూప, దీప, నైవేద్యాలు, హారతి, అర్చన ఉండదు. అమ్మ వారికి విప్ప పువ్వు, విప్ప సారా నివేదిస్తాం. బలి ఇస్తాం. రక్తాభిషేకం జరగాల్సిందే'' అంటూ అక్కడి పూజా పద్ధతులు వివరించారు అరుణ్ కుమార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)