కాంగ్రెస్ పార్టీ దారెటు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది 2014 లోక్‌సభ ఎన్నికల నాటి సంగతి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో కాంగ్రెస్ ఓటమి పాలు కావడానికి ఏడాది ముందు జరిగిన ఘటన. పార్టీ వర్కింగ్ స్టైల్ మార్చాలని రాహుల్ గాంధీ భావించారు.
లోక్‌సభ అభ్యర్ధుల ఎంపిక కోసం 16 నియోజక వర్గాలలోని కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆయన అనుకున్నారు. అందులో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పోటీ చేసే చాందినీ చౌక్ లోక్‌సభ స్థానం కూడా ఒకటి.
ఈ విషయం తెలిసి కపిల్ సిబల్ వెంటనే రాహుల్-సోనియా-ప్రియాంక వద్దకు పరిగెత్తారు. ఆ జాబితా నుంచి తన సీటు పేరును తొలగించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు అదే కపిల్ సిబల్ పార్టీ నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుండగా, రాహుల్ గాంధీని అసలు నాయకుడిగా కాంగ్రెస్ నేతలు భావిస్తుంటారు.
కపిల్ సిబల్ కాంగ్రెస్ అధిష్టానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న సమయంలోనే సోనియా గాంధీ యాక్షన్‌లోకి దిగారు. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నుండి రాజీనామాలు కోరారు. దీంతో వారంతా రాజీనామా చేశారు.
బీజేపీ లో కూడా ఇదే ధోరణి ఉన్నప్పటికీ రాజీనామాలు మాత్రం కనిపించేవి కావు. కాంగ్రెస్‌లో కూడా లేకపోయినా, 2014 నుంచి ఇలా కోరడం ఒక సంప్రదాయంగా వస్తోంది.

ఫొటో సోర్స్, TWITTER/INC
ఓటమిలో రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యత ఎంత ?
వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర అధ్యక్షుడిని రాజీనామా చేయమని కోరడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. అయితే, ఒక్క గోవా అధ్యక్షుడు తప్ప ఏ రాష్ట్ర అధ్యక్షుడూ తనకు తానుగా రాజీనామా చేయడానికి ముందుకు రాకపోవడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం.
''ఓటమి ఆ పార్టీని కుంగదీస్తోంది. ఇంటి దీపాల వంటి వారే ఆ ఇంటిని తగలబెట్టారు. అలాంటి వారిలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఒకరు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అజయ్ లల్లూ స్వయంగా ఓడిపోయారు. ఉత్తరాఖండ్‌కు చెందిన హరీశ్ రావత్ రెండు రాష్ట్రాల్లో పార్టీకి నష్టం కలిగించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న ఒకచోట బీజేపీ అధికారంలోకి రాగా, పంజాబ్ ఏకపక్షంగా ఆమ్‌ఆద్మీ చేతిలోకి వెళ్లిపోయింది. దీనికి హరీశ్‌రావత్‌నే బాధ్యుడిని చేయాలి'' అని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ అన్నారు.
హరీశ్ రావత్ ఐదు రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడు కానప్పటికీ, గతఏడాది అక్టోబర్ వరకు పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తన స్థానాన్ని కూడా కాపాడుకోలేకపోయారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత రాష్ట్ర అధ్యక్షులదేనని వినోద్ శర్మ అభిప్రాయపడ్డారు. కానీ ఆయన ఓ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈ ప్రతినిధులంతా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినవారే కదా ? పార్టీ కేంద్ర నాయకత్వమే కదా వారిని ఆ పదవిలో కూర్చోబెట్టింది. కేంద్ర నాయకత్వం 'టాలెంట్ హంట్'ని ఉపయోగించి అధ్యక్షులను ఎంపిక చేస్తుంది. మరి ఆ ఎంపిక సరికాదని తేలితే దానికి బాద్యత వహించాల్సింది ఎవరు?’’ అని వినోద్ శర్మ అన్నారు.
ఈ రాజీనామాలు కోరిన తర్వాత ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వినోద్ శర్మ అడుగుతున్న ప్రశ్నే చాలామంది కాంగ్రెస్ నేతల మదిలో ఉంది. కాకపోతే, కపిల్ సిబల్ తన మనసులో మాటను పత్రికలకు బహిరంగంగా చెప్పారు.
యూపీ పార్టీ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ స్వయంగా నిర్ణయం తీసుకున్నారా అనే ప్రశ్నను కూడా కొందరు అడుగుతున్నారు. ప్రియాంక గాంధీ తనను తాను ఉత్తర్‌ప్రదేశ్ లో కాంగ్రెస్ ఫేస్‌గా చెప్పుకున్న తర్వాత, ఓటమికి ఆమె బాధ్యత వహించలేదు. ఎందుకంటే రాజీనామాలు ప్రధాన కార్యదర్శులు , రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లకు వర్తించవు.

ఫొటో సోర్స్, ANI
తొలి రాజీనామా తర్వాత కాంగ్రెస్‌లో ఏం జరిగింది?
ఇలాంటి ప్రశ్న అడిగే వారిలో సీనియర్ జర్నలిస్టు ఔరంగజేబ్ నక్ష్‌బందీ కూడా ఉన్నారు. ఔరంగజేబ్ కాంగ్రెస్ పార్టీ వార్తలను కవర్ చేస్తుంటారు.
''రాష్ట్ర అధ్యక్షులకంటే ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు ఎక్కువ. రాష్ట్ర అధ్యక్షుడు అన్ని నిర్ణయాలను ఇంఛార్జ్ పర్యవేక్షణలోనే తీసుకుంటారు. అధ్యక్షులు ఓటమికి బాధ్యత వహించినప్పుడు, యూపీ వ్యవహారాలు మొత్తం తానే చూసిన ప్రియాంక కు బాధ్యత లేదా'' అని ఔరంగజేబ్ అన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల అనంతర రాజీనామాల గురించి కూడా ఔరంగజేబు ఇక్కడ గుర్తు చేశారు.
2010లో బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా మెహబూబ్ అలీ కైసర్ కూడా రాజీనామా చేసినప్పటికీ 2013 వరకు ఆయన కేర్‌టేకర్‌గా కొనసాగారు.
అదే విధంగా గోవా రాష్ట్ర అధ్యక్షుడు గిరీశ్ చోడంకర్ ఇంతకు ముందు రెండుసార్లు రాజీనామా చేశారు. 2019 లో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత తొలిసారి, 2020 లో జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత మరోసారి రాజీనామా సమర్పించారు. మరి ఆయన నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయా?
2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పటి వరకు పార్టీ కీలక నిర్ణయాల్లో ఎవరి పాత్ర ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రియాంక-రాహుల్ ల సంగతేంటి?
అయితే, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా 'పెద్ద చర్య'గా పలువురు నిపుణులు భావిస్తున్నారు. సిద్ధూ వెనక ప్రియాంక, రాహుల్‌లు ఉన్నారని, ఆయన స్వయంగా పోస్ట్ చేసిన ఫొటోలనుబట్టి తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా కార్యకర్తలకు పార్టీ సందేశం పంపిందని ఔరంగజేబ్ అంటున్నారు.
పార్టీ లేదా దాని నాయకత్వం బలహీనంగా ఉన్నప్పుడు, పార్టీలో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ జరగదని వినోద్ శర్మ చెప్పారు. ఓటమి చవిచూసినందున, పార్టీ క్యాడర్‌లో స్పిరిట్ దెబ్బతినకుండా నాయకత్వం ఏదో ఒకటి చేసేలా చూడాలన్నారు.
గాంధీ కుటుంబం కాంగ్రెస్‌కు ఎంత బలమో అంత బలహీనత అని కూడా జర్నలిస్ట్ వినోద్ శర్మ అభిప్రాయపడ్డారు.
‘‘గాంధీ కుటుంబం నాయకత్వం కొనసాగిస్తుంటే ఆ పార్టీ చీలిపోయే అవకాశాలు తక్కువ అన్నది లాభదాయకమైన అంశం. ఇక నాయకత్వం వహించే సమర్ధత ఉన్నవాళ్లు పార్టీలో ఎవరూ లేరు. పీవీ నరసింహారావు, సీతారామ్ కేసరిల కాలంలో జరిగింది అదే. ఇక హానికరం అని ఎందుకు అనుకోవాలంటే, వారి నాయకత్వంలో ఉన్న పార్టీలో ప్రతిభావంతులు, అర్హులకు అందలాలు దక్కవు. నిర్ణయాలు తీసుకునే శక్తి ఎవరికీ ఉండదు’’ అన్నారు శర్మ.
అందుకే, ఇప్పుడు రబ్బర్ స్టాంప్‌గా మారిన సీడబ్ల్యూసీలో ప్రతిభావంతులకు చోటు కల్పించాలని, నిర్ణయాలు తీసుకునేలా పార్టీ యంత్రాంగం మారాల్సి ఉంటుందని వినోద్ శర్మ అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరును అంచనా వేయడానికి ఓట్ల శాతాన్ని పరిశీలించడం కూడా ముఖ్యం. ఓట్లు బాగానే వచ్చాయి కానీ, సీట్లు రాలేదని చెప్పుకునే అవకాశం కూడా కాంగ్రెస్‌కు లేదు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటు శాతం 3.91 నుంచి 2.33 శాతానికి పడిపోయింది. పంజాబ్‌లో ఆ పార్టీ అత్యధిక సీట్లను కోల్పోయింది. గోవాలో కాంగ్రెస్ ఓట్ల శాతం 4.89 శాతం తగ్గగా, మణిపూర్‌లో 18.28 శాతం తగ్గింది. కాంగ్రెస్ ఓట్ల శాతం 4.42 శాతం పెరిగిన ఏకైక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.
ఈ కారణంగానే పార్టీ అధ్యక్షులు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని జర్నలిస్ట్ ఔరంగజేబ్ అన్నారు. పార్టీ పునరుద్ధరణ ప్రణాళిక ఇప్పుడు అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
''కొత్త వాళ్లు ఎప్పుడు వస్తారో, దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో తెలియదు. గతంలో రాజీనామాలు జరిగినప్పుడు కొత్త వారిని నియమించడానికి రెండు మూడేళ్లు పట్టింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక ఇంత వరకు జరగలేదు'' అని ఔరంగజేబ్. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలను త్వరగా పూర్తి చేసుకోవాలని వినోద్ శర్మ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
రాష్ట్ర అధ్యక్షుల రాజీనామాలో జీ-23 నేతల హస్తం?
ఇక్కడ మరో విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అది రాజీనామాల సమయం. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రెండు రోజుల తర్వాత ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.
మంగళవారంనాడు కపిల్ సిబల్ ఇంటర్వ్యూ దినపత్రికలో వచ్చింది. రాష్ట్ర అధ్యక్షులు రాజీనామా చేయాలని ఆ రోజు సాయంత్రం ఆదేశాలు వెళ్లాయి. ఇటు బుధవారం నాడు జీ-23 నేతలు కొందరు గులాంనబీ ఆజాద్ ఇంట్లో సమావేశమయ్యారు.
అంటే, ఆగ్రహంతో ఉన్న నేతల భేటీకి కాస్త ముందుగా రాష్ట్ర అధ్యక్షుల రాజీనామాల కోరడం ద్వారా పార్టీ అధిష్టానం ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటోందా?
''కాంగ్రెస్ పార్టీ నిత్యం యధాతథ స్థితిని కోరుకునే పార్టీ. దీని లబ్ధిదారులు జీ-23 నేతలు. వీరిలో చాలామంది నాయకులు రాజ్యసభ సభ్యులు. కానీ, వీరిలో ఎందరు క్రియాశీలక నాయకులు? వీరు ప్రతిభావంతులే. ప్రభుత్వం ఏర్పాటు చేశాక విధాన నిర్ణేతలుగా వ్యవహరించగలరు. కానీ, వారి పార్టీలో వారికి అంత పట్టుందా? అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలవగలరా? వారిలో ఎవరైన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇవి ఇంకా సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలు'' అన్నారు వినోద్ శర్మ.
జీ-23లో అవకాశవాద రాజకీయాలు చేసేవారు ఎక్కువమంది ఉన్నారని, ప్రస్తుతం వారంతా ఒత్తిడిలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని, ఏదో ఒక పదవి ఇస్తే ఆ వర్గం నుంచి బైటికి వస్తారని ఔరంగజేబు అన్నారు.
ఇక ఇప్పుడు అందరి కళ్లు కపిల్ సిబల్‌పై పడ్డాయి. ఆయన పై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- చైనాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, పలు నగరాల్లో లాక్డౌన్
- నా కొడుకుని వెనక్కు తీసుకురావాలంటే నేనెవరి తలుపు తట్టాలి?: రష్యా సైనికుడి తల్లి ఆవేదన
- డాలర్ల గ్రామంలోని తండ్రీకొడుకులు కోట్ల రూపాయలు ఎలా కొల్లగొట్టారంటే...
- పాకిస్తాన్లోకి భారత్ మిస్సైల్: జర్మనీతో మాట్లాడిన పాకిస్తాన్.. అమెరికా, చైనాల రియాక్షన్
- మీ వంటింట్లో దాక్కున్న ప్రమాదాలు ఎన్నో తెలుసా..
- 365 మంది మహిళలతో డేటింగ్ తన టార్గెట్ అంటున్న యువకుడి అసలు లక్ష్యం ఏంటి?
- హాజీ మస్తాన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- నాటోకు రష్యా భయపడుతుందా, యుక్రెయిన్‌ను ఎందుకు చేర్చుకోవద్దంటోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












