Modular Kitchen: మీ వంటింట్లో దాక్కున్న ప్రమాదాలు ఎన్నో తెలుసా..

గ్యాస్ స్టవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్యాస్ స్టవ్
    • రచయిత, వెరోనిక్ గ్రీన్‌వుడ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

వంట చేయడం చాలా మందికి ఇష్టమైన పని కావచ్చు. కానీ, అదే ఇష్టం ఒక్కొక్కసారి ఆస్పత్రి వరకు వెళ్లేందుకు కూడా దారి తీయవచ్చు.

వంటింట్లో వాడే కత్తులు, వేడి నీరు, కూరలు వేపేందుకు వాడే కళాయిల వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముంది.

యూకేలో ప్రతి ఏటా వంటింట్లో చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాల్లో గాయపడిన వారిలో 67,000 మంది పిల్లలే ఉన్నారని రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ తెలిపింది. ఇది కేవలం ప్రమాదాల్లో గాయపడిన పిల్లల సంఖ్య.

భారతదేశంలో 2019లో చోటు చేసుకున్న 11,037 అగ్ని ప్రమాదాల్లో 6,364 ప్రమాదాలు నివాస గృహాల్లోనే చోటు చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా నివేదిక చెబుతోంది. అయితే, ఇందులో వంటింట్లో చేసుకున్న ప్రమాదాల గురించి వర్గీకరణ లేదు.

వంటింట్లో పొంచి ఉన్న ప్రమాదాలు మీరు ఊహిస్తున్న దాని కంటే ప్రమాదకరంగా ఉండొచ్చు. మీరు ప్రతి రోజూ ఇంట్లో గడిపే స్థలం నుంచే కాలుష్యం జనిస్తూ ఉంటుంది. దీనిని మీరెప్పుడూ ఊహించి కూడా ఉండరు.

వీడియో క్యాప్షన్, గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరిగిన తరువాత బీమా పొందడం ఎలా

అయితే, గత శతాబ్ధం కాలంలో వంటింటిని సురక్షితంగా చేసేందుకు అనేక మార్పులు చేసుకుంటూ చాలా దూరం ప్రయాణించాం.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వినియోగ వస్తువుల వాడకంలో వచ్చిన మార్పులతో ఇంట్లో ఉన్న ఏ వస్తువుతోనైనా అగ్ని రాజుకునే ప్రమాదం ఏర్పడింది.

ఇంట్లో గృహిణులు, పిల్లలు ధరించే నైలాన్, సింథటిక్ దుస్తుల వల్ల అగ్ని తొందరగా అంటుకోవడం మాత్రమే కాదు, మంటల నుంచి కరిగిన ప్లాస్టిక్ వల్ల దారుణమైన గాయాలను ఏర్పర్చే ప్రమాదం కూడా ఉంది.

వంట చేస్తున్నప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించవద్దని చెబుతూ రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ 1946లో ఒక పోస్టర్ కేంపెయిన్ నిర్వహించింది. పోస్టర్‌లో మంటలు వ్యాపిస్తున్న దుస్తులతో కూడిన పిల్లల చిత్రాన్ని పొందుపరిచారు. మంటలు వ్యాపించకుండా సురక్షత పాటించని పక్షంలోవారి పిల్లలు పోస్టర్‌లో మాదిరిగా మారతారని ప్రచారం చేశారు.

అగ్నినిరోధక చట్టాలు మంటలు అంటుకోని హోమ్ ఫర్నిషింగ్స్‌ ను వాడుకలోకి తెచ్చాయి. కానీ, ఇవి ఎండోక్రైన్ నిరోధకాలుగా పని చేసి హార్మోన్ల పై ప్రభావం చూపిస్తాయని ఆలస్యంగా తెలిసింది.

కొన్ని సార్లు సురక్షితంగా భావించే వస్తువుల వల్ల కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా ఎలక్ట్రిక్ కెటిల్స్‌ను చెప్పవచ్చు.

1920లలోనే వేడెక్కిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆగిపోయే తరహా ఎలక్ట్రిక్ కెటిల్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. తగిన ఉష్ణోగ్రతలు చేరిన తర్వాత ప్లగ్ సహజంగా బయటకు ఊడివచ్చే లాంటి రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

కానీ, ఆ కెటిల్ సింక్ పక్కనే ఉంటే ప్లగ్‌లు నీటితో నిండిన సింక్‌లో పడే ముప్పు ఉంది. అలాంటి పరిస్థితిలో సింక్ దగ్గర నిల్చుని గిన్నెలు తోముతున్నవారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

"ఒకామె సాకెట్‌లో ఏదైనా అడ్డు పడిందేమో అని భావించి ఒక చేతిలో ప్లగ్ పట్టుకుని, విద్యుత్ ప్రవహిస్తున్న సాకెట్‌లో మరో చేతిలో మెటల్ స్క్రూ డ్రైవర్‌ను పెట్టగా ఆ ఘటన ఆమె ప్రాణాలు పోయేంత పరిస్థితికి దారి తీసింది" అని 1956లో ఎఫ్‌ఈ. క్యాంపస్ అనే పథాలజిస్ట్ రాశారు.

ఎలక్ట్రిక్ కెటిల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలక్ట్రిక్ కెటిల్స్

ఇలాంటి ప్రమాదాల బారిన సాధారణంగా వృద్ధ మహిళలు పడతారని 1960లలో బ్రిటిష్ మెడికల్ జర్నల్ పేర్కొంది.

అదృష్టవశాత్తు ఆధునిక ఎలక్ట్రిక్ కెటిల్స్ షాక్ కొట్టే ప్రమాదం లేకుండా ప్రత్యేకమైన సేఫ్టీ స్విచ్ వాడుతున్నాయి.

సురక్షితమైన పరికరాలెన్ని అందుబాటులోకి వచ్చినప్పటికీ వంటింట్లో ఎక్కడో ఒక చోట కనిపించని ప్రమాదం పొంచి ఉంటుంది.

గ్యాస్ స్టవ్‌లు ఆఫ్ చేసి ఉంచినప్పుడు కూడా మీథేన్‌ను విడుదల చేస్తాయని, అవి వెలిగించినప్పుడు కార్బన్‌డయాక్సైడ్‌, నైట్రోజెన్ ఆక్సైడ్‌‌ను విడుదల చేస్తాయని చెబుతున్నారు.

అయితే, వంటింట్లో విడుదలయ్యే ఈ వాయువులు వ్యవసాయం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వాటితో పోల్చి చూస్తే తక్కువ మోతాదులోనే ఉంటాయని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. కానీ, వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులకు వంటిళ్లలోంచి విడుదలయ్యే మీథేన్ కూడా తోడ్పడుతుందని ఈ అధ్యయనం పేర్కొంది.

గ్యాస్ మండినప్పుడు విడుదలయ్యే నైట్రోజెన్ ఆక్సైడ్‌ కి శ్వాసకోశ, హృద్రోగ సమస్యలకు సంబంధం ఉంది.

వీడియో క్యాప్షన్, బెస్ట్ బిఫోర్: ఈ తేదీ దాటిన ఆహారం తినొచ్చా?

వంటింట్లో ఎక్సాస్ట్ ఫ్యాన్ లేకుండా గ్యాస్ స్టవ్ వెలిగిస్తే వంటింట్లో అమెరికాలో నిర్ణయించిన జాతీయ ప్రమాణాల స్థాయి కంటే ఎక్కువగా కాలుష్య కారకాలు విడుదలవుతున్నట్లు స్టాన్ ఫోర్డ్ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం జనవరి 2022లో ప్రచురితమయింది.

ఎలక్ట్రిక్ స్టవ్‌లు వాడుతున్న వారిళ్లలో కంటే గ్యాస్ స్టవ్‌లు వాడుతున్న వారింట్లో పిల్లలు 42 శాతం ఎక్కువగా ఉబ్బసానికి గురయ్యే అవకాశమున్నట్లు వోక్స్ పత్రిక కోసం రాసిన వ్యాసంలో రెబెక్కా లెబెర్ పేర్కొన్నారు.

ఎక్సాస్ట్ ఫ్యాన్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, గ్యాస్ స్టవ్ వల్ల వచ్చే ప్రమాదాలను ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ స్టవ్‌ల వాడకం ద్వారా పూరించుకోవచ్చని లెబర్ చెబుతున్నారు.

కానీ, గ్యాస్ పై వంట చేయడంలో ఉన్న లాభాలను ప్రచారం చేసేందుకు అమెరికాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా నియమిస్తున్నారు.

గ్యాస్‌ను నిషేధించి మరింత సురక్షితమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్న మున్సిపాలిటీల ప్రచారాన్ని కూడా తిప్పి కొట్టేందుకు చూస్తున్నారు.

మరో 20 ఏళ్ల తర్వాత మనకు తెలియకుండా మన చుట్టూ పెంచుకున్న ప్రమాదాల గురించి తలచుకుని ఉలిక్కిపడతామేమో. కానీ, ఈ విషయంలో శాస్త్రీయ దృక్పథం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

మీరు ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ స్టవ్‌ను వాడుతున్నా కూడా వంటింట్లో ఫ్యాన్‌ను ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)