"నా భార్య మహిళ కాదు.. పెళ్లై 6 ఏళ్లు దాటినా ఇంకా మేం కలవలేదు" - విడాకులు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన భర్త

మంచంపై యువతీయువకుడు

ఫొటో సోర్స్, iStock/BBC

మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తికి 2016లో వివాహమయింది. పెళ్లయి 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ భార్య భర్తల మధ్య శారీరక కలయిక జరగలేదు. తన భార్య స్త్రీ కాదని ఆయన చెబుతున్నారు.

తన భార్య తనను మోసం చేయడంతో తనకు విడాకులిప్పించమని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

అందుకు తగిన వైద్య నివేదికలను కూడా ఆయన జతపరిచారు. ఆయన భార్యకు పురుష జననేంద్రియాలున్నాయని ఆయన పిటిషన్‌లో తెలిపారు.

ఆయన గతంలో మధ్యప్రదేశ్ హై కోర్టులో కూడా భార్య పై ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే, కేవలం నోటి మాటలతో, తగిన వైద్య ఆధారాలు లేకుండా దీనిని చీటింగ్ కేసుగా పరిగణించలేమని చెబుతూ కోర్టు తీర్పునిచ్చింది.

ఈ తీర్పును ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో సవాలు చేసారు.

ఫిర్యాదుదారు సమర్పించిన ప్రాధమిక ఆధారాలను బట్టీ సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. సదరు పిటిషన్‌కు నాలుగు వారాలలోగా సమాధానం చెప్పమని కోర్టు ఆయన భార్యకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసును జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారిస్తోంది.

ఈ కేసులో ఫిర్యాదుదారు సమర్పించిన వైద్య నివేదికలు ఆమెకు అండాశయం ఉన్నప్పటికీ అవిచ్చిన్నమైన కన్నెపొరతో (ఇంపెర్‌ఫోరేట్ హైమెన్) పాటు, బాహ్య పురుష జననాంగం కూడా ఉందని చెబుతున్నాయి. దీనినే కంజెనిటల్ అడ్రినల్ హైపర్ ప్లేసియాగా పేర్కొన్నాయి.

డాక్టర్ విమీ బింద్రా

ఫొటో సోర్స్, DR VIMEE BINDRA

ఫొటో క్యాప్షన్, డాక్టర్ విమీ బింద్రా

ఇంపెర్‌ఫోరేట్ హైమెన్ అంటే ఏంటి?

యోనికి సాధారణంగా ఉండే కన్నెపొర లేకపోవడం లేదా మూసుకుపోయి ఉండటాన్ని ఇంపెర్‌ఫోరేట్ హైమెన్ అని అంటారు. అంటే ఇది విచ్చిన్నం కాదని హైదరాబాద్ అపోలో హెల్త్ సిటీలో ఎండోమెట్రియోసిస్ సర్జన్ డాక్టర్ విమీ బింద్రా చెప్పారు.

"కొంత మందికి పుట్టుకతోనే యోని మూసుకుపోయి ఉంటుంది. కొందరికి గర్భాశయం కూడా ఉండదు. యోని మూసుకుపోయి ఉండటం వల్ల అటువంటి వారు సెక్స్ లో పాల్గొనలేరు. దీంతో, ఇటువంటి సమస్య ఉన్నవారు పిల్లల్ని కనడం సాధ్యం కాదు".

దీనినే మేయర్ రోకిటాన్ స్కీ కస్టర్ హౌజర్ సిండ్రోమ్ అని అంటారని చెప్పారు.

"కొందరికి గర్భాశయం ఉంటుంది కానీ, యోని మాత్రం మూసుకుపోయి ఉంటుంది. ఇటువంటి వారికి రుతుస్రావం వచ్చినప్పుడు రక్తస్రావం జరగడం ఇబ్బంది అవుతుంది".

శస్త్ర చికిత్స ద్వారా ఈ సమస్యను సరిచేయవచ్చు అని డాక్టర్ విమీ బింద్రా చెప్పారు.

డాక్టర్ పూజిత దేవి సూరనేని

ఫొటో సోర్స్, DR PUJITA SURANENI

ఫొటో క్యాప్షన్, డాక్టర్ పూజిత దేవి సూరనేని

కంజెనిటల్ అడ్రినల్ హైపర్‌ప్లేసియా అంటే ఏంటి?

"ఇదొక జన్యుపరమైన రుగ్మత. ఇందులో రెండు రకాలుంటాయి. ఈ లక్షణం పుట్టుకతోనే మొదలవుతుంది. వీరు పుట్టడం అమ్మాయిగానే పుడతారు కానీ, పురుష హార్మోన్లు అత్యధికంగా విడుదల కావడం వల్ల యోని మార్గం మూసుకుపోయి ఉంటుంది" అని హైదరాబాద్‌ కిమ్స్‌లో సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ పూజిత దేవి సూరనేని చెప్పారు.

"ఇలాంటి పరిస్థితి ఉన్నవారికి కొన్ని సార్లు గెడ్డం, మీసాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది పుట్టుకతోనే రావచ్చు, లేదా కాస్త వయసు పెరిగాక కూడా రావచ్చు" అని చెప్పారు.

"వీరికి పొటాషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. కొందరికి మధుమేహం లక్షణాలు కనిపిస్తాయి" అని డాక్టర్ పూజిత చెప్పారు.

"కంజెనిటల్ అడ్రినల్ హైపర్‌ప్లేసియా ఉన్నవారిలో క్లిటోరిస్ సాధారణ పరిమాణం కంటే పెద్దదిగా ఉంటుంది. దీని ప్రకారం బాహ్య జననేంద్రియాలు బాలుడిలా కనిపిస్తాయి. నిజానికి ఇవి పురుష జననాంగాలు కావు" అని డాక్టర్ విమీ అన్నారు.

దీనికి పరిష్కారం ఏంటి?

ఇంపెర్‌ఫోరేట్ హైమెన్ ‌ శస్త్ర చికిత్స ద్వారా సరి చేయవచ్చని వైద్యులు సూచించారు.

"యోని మూసుకుపోయి ఉన్నవారికి వజైనాప్లాస్టీ ద్వారా ఈ సమస్యను సరిచేయవచ్చు. వారిని కుటుంబ జీవితం గడిపేందుకు తగిన విధంగా చేయవచ్చు" అని అని డాక్టర్ పూజిత చెప్పారు.

కంజెనిటల్ అడ్రినల్ హైపర్‌ప్లేసియా ఉన్నవారికి అదనంగా స్టెరాయిడ్లు ఇవ్వవలసి ఉంటుందని డాక్టర్ విమీ చెప్పారు.

వీడియో క్యాప్షన్, భార్యకు ఇష్టంలేకుండా భర్త ఆమెతో సెక్స్‌లో పాల్గొనొచ్చా?

ఇలాంటి పరిస్థితి ఉన్నవారు గర్భం దాల్చగలరా?

"వజైనాప్లాస్టీ చేసిన తర్వాత పిల్లలు పుడతారా లేదా అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఇది ఆయా వ్యక్తుల శారీరక నిర్మాణం పై ఆధారపడి ఉంటుంది" అని పూజిత చెప్పారు.

గర్భాశయం ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు పుట్టే అవకాశాలు కొంత వరకు ఉంటాయని డాక్టర్ విమీ చెప్పారు.

అత్యాచారం

చట్టం ఏమి చెబుతుంది?

తమ వివాహం శారీరక కలయికకు దారి తీయనందున హిందూ వివాహ చట్టంలోని 12(1) (ఏ) ప్రకారం విడాకులు ఇప్పించమని కోరుతూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చట్టం శారీరక కలయికను, పిల్లల్ని కనే సామర్ధ్యాన్ని వివాహ బంధాన్ని కొనసాగించేందుకు ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తుందని హైదరాబాద్‌కు చెందిన మ్యాట్రిమోనియల్ లాయర్ బిందు నాయుడు అన్నారు.

పెళ్ళైన తర్వాత భాగస్వామి సెక్స్ లో పాల్గొనకపోవడాన్ని, శారీరక సుఖాన్ని ఇవ్వలేకపోవడాన్ని కోర్టులు సాధారణంగా క్రూరత్వంగానే పరిగణిస్తున్నాయి.

అయితే, చట్టంలో క్రూరత్వానికి పూర్తి నిర్వచనం లేదు. వివాహ బంధంలో క్రూరత్వాన్ని నిర్ణయించే తీరు పూర్తిగా న్యాయమూర్తి పరిగణించే తీరు పై ఆధారపడి ఉంటుందని అన్నారు.

సాధారణ, సంతోషకరమైన వివాహంలో లైంగిక సంబంధం ఉండటం ఆరోగ్యకరమైన వివాహ బంధానికి ప్రాతిపదిక అని శకుంతల కుమారి వెర్సస్ ఓం ప్రకాష్ ఘాయ్ కేసులో 1981 జస్టిస్ లీలా సేథ్ చెప్పారు.

1964లో అవినాష్ వెర్సస్ చంద్ర మోహిని కేసులో భాగస్వామికి లైంగిక ఆనందాన్ని ఇవ్వలేకపోవడం మానసిక, నైతిక క్రూరత్వం కిందకు వస్తుందని అలహాబాద్ హై కోర్టు చెప్పింది .

ప్రతీకాత్మక చిత్రం

భరణం లభిస్తుందా?

భరణం, మెయింటెనెన్సు విషయం పూర్తిగా కేసు విచారణ పై ఆధారపడి ఉంటుందని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల చెప్పారు. ఆమె మోసం చేసినట్లు, మహిళ అని తనను తానూ నిరూపించకోలేకపోయిన పక్షంలో ఆమెకు ఎటువంటి మెయింటెనెన్సు లేదా భరణం లభించకపోవచ్చు అని చెప్పారు.

2016లో అంకిత్ భార్గవ వెర్సస్ నీరా శర్మ కేసులోరాజస్థాన్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పులో పురుషులకు, స్త్రీలకూ సెక్స్ వల్ల జరిగే మేలును వివరించారు.

సెక్స్ "రోగ నిరోధక శక్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచి రక్త పోటును తగ్గిస్తుందని, మెరుగైన నిద్ర పట్టి ఒత్తిడి తగ్గుతుందని, స్త్రీలలో మూత్రాశయ నియంత్రణకు సహాయపడుతుంది. వీటన్నిటితో పాటు జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. సెక్స్ లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు ఆత్మ విశ్వాసం కోల్పోవడం, తిరస్కారానికి గురైనట్లు భావించడం లాంటివి జరిగి ఆరోగ్యంతో పాటు జీవన ప్రమాణాల పై కూడా ప్రభావం చూపిస్తుంది" అని పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం ఇదేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)