సెక్స్‌లో మహిళల భావప్రాప్తికి, కటి భాగానికి సంబంధం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాక్వెల్ లీరోస్ రోడ్రిగెజ్
- హోదా, ది కన్వర్జేషన్
మహిళల భావప్రాప్తి అనేది అనే విశ్వాసాలు, కల్పితాల చుట్టూ అల్లుకుని ఉంటుంది. అయితే, ఆధునిక కాలంలో వీటినెవరూ అంగీకరించడం లేదు.
ఇంకా చెప్పాలంటే భావప్రాప్తి అనేది మానసిక, శారీరక ఆరోగ్యంలో స్త్రీ, పురుషులిద్దరికీ సమానంగా ఉపయోగపడుతుందన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు.
అదే సమయంలో స్త్రీలకు కూడా భావప్రాప్తి పొందే హక్కు ఉంటుందన్న అంశంపై చర్చ పెద్దగా వినిపించదు.
అందుకే కేవలం వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాల మీద కాకుండా, స్త్రీ భావప్రాప్తి గురించి సెక్సాలజిస్టులు మహిళలకు శాస్త్రీయంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
యోనితోనే భావప్రాప్తి నిజం కాదు
యోనిలో భావప్రాప్తి, యోని వల్ల కలిగే భావప్రాప్తి - రెండు మాటల్లోనే పూర్తి అర్ధం కనిపిస్తుంది. యోని వల్లనే భావప్రాప్తి కలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు.
బయట ఎలాంటి ఉద్దీపనలు లేకుండానే, కేవలం సంభోగంతో మాత్రమే భావప్రాప్తి కలుగుతుందనేది ఒక నమ్మకం. కానీ, దీనికి శాస్త్రీయమైన ఆధారం లేదు. ఎందుకంటే యోని కేవలం ఒక సున్నితమైన అవయవం మాత్రమే.
భావప్రాప్తికి కారణమయ్యే ఏ శరీర సంబంధమైన నిర్మాణం ఇందులో ఉండదు. మహిళల్లో పుట్టుకతో వచ్చే యోని, కృత్రిమ యోనిల మధ్య లైంగిక ప్రతి స్పందనల్లో పెద్దగా తేడా ఉండకపోవడం దీనికి మంచి ఉదాహరణ.
పుట్టుకతో వచ్చిన యోని, కృత్రిమ యోని ఉన్న స్త్రీలలో సాధారణంగా జరిగేదేంటంటే, భావప్రాప్తికి చేరువైన సమయంలో యోని కండరాలు సంకోచానికి గురవుతాయి. అందరు స్త్రీలలో ఇది జరుగుతుంది.
ముఖ్యంగా బుల్బోకావెర్నోసస్,ఇస్ఖియో కావెర్నోసస్ అనే కండరాలు ఇలా సంకోచానికి గురవుతాయి. యోని మధ్య భాగానికి ఇరువైపులా ఈ రెండు కండరాలు ఉంటాయి.
భావప్రాప్తికి చేరువైన సమయంలో ఈ రెండు కండరాలు నిత్యం సంకోచిస్తూ ఉద్రేకంగా మారతాయి. చివరకు అవి స్త్రీ స్ఖలనానికి కారణమవుతాయి.
అయితే, స్త్రీలలో తరచూ కనిపించే మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధుల కారణంగా వారి లైంగిక ఆసక్తులు తగ్గే అవకాశం ఉంది. దాదాపు 40శాతం మంది స్త్రీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
లైంగిక ఆసక్తి తగ్గడం, యోని పొడిబారడం, భావప్రాప్తిలో తీవ్రత తగ్గడంలాంటివి వీటివల్ల ఎదురయ్యే పరిణామాలు. పూర్తి స్థాయి లైంగిక సంతృప్తిని పొందే క్రమంలో ఇవి తరచూ ఎదురయ్యే అవాంతరాలు.
భావప్రాప్తికి, కటి భాగానికి ఉన్న సంబంధమేంటి?
హైపోటోనియా లేదా పెల్విక్ ఫ్లోర్(కటి భాగం) బలహీనంగా ఉండటం వల్ల మహిళలు మూత్రం ఆపుకోలేని స్థితి ఏర్పడుతుంది. ఇది నేరుగా స్త్రీల లైంగిక ఆసక్తుల మీద ప్రభావం చూపిస్తుంది.
మూత్రం విడుదల కావడం అనేది అంగప్రవేశ సమయంలో, భావప్రాప్తి సమయంలో లేదంటే రెండు సందర్భాలలో జరిగే అవకాశం ఉంది.
అంగప్రవేశం జరిగే సమయంలో యోని కండరాలు స్థానభ్రంశం చెందడం వల్ల మూత్రం లీకేజ్‌కు మరింత అవకాశం ఏర్పడుతుంది.
అందువల్ల పెల్విక్ ఫ్లోర్ (కటి భాగం)ను కొన్ని వ్యాయామాల ద్వారా బలమైనదిగా మార్చడం వల్ల మహిళలు ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
కటి భాగంలోని కండరాల కారణంగానే మహిళలకు సెక్స్ సమయంలో ఉద్రేకం కలుగుతుందన్నది వాస్తవం. వీటివల్లే అంగ ప్రవేశ సమయంలో భాగస్వామికి గట్టిగా పట్టేసినట్లు ఉండటం, సుఖప్రాప్తి సాధ్యమవుతుంది.
లయబద్ధంగా సాగే పెల్విక్ ఫ్లోర్ సంకోచాల వల్ల ఉద్రేకం కలుగుతుంది. ఈ కారణంగానే చాలామంది స్త్రీలు భావప్రాప్తికి చేరుకోగలుగుతారు.
పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు కండరాల పటిష్టతను, కటి అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కటి భాగంలోని చిన్న కండరాలకు ఇది చాలా ముఖ్యమైనది.
స్త్రీలు ఉద్రేకానికి లోనైనప్పుడు క్లిటోరిస్ ఉబ్బెత్తుగా మారడంలో ఈ కండరాలు కీలక పాత్ర పోషిస్తాయి.
అందువల్ల యోని కండరాల సంకోచ, వ్యాకోచాలు ఆరోగ్యకరమైన స్థితిలో కొనసాగాలన్నా, లైంగిక ఆనందాన్ని పొందాలన్నా ఈ కటి భాగంలోని కండరాలను సరైన వ్యాయామాల ద్వారా సరైన విధంగా ఉంచాలి.
ఉదాహరణకు కెగెల్ అనే ఎక్సర్‌సైజ్‌లో కండరాలకు వ్యాయామం ఎక్కువ కలుగుతుంది. దీనివల్ల అవి బలంగా మారతాయి.
వాజినిస్మస్ (సంభోగ సమయంలో కండరాల ఒరిపిడి వల్ల కలిగే బాధ) అనే రుగ్మతకు ఈ ఎక్సర్‌సైజులు ప్రభావవంతమైన నివారణ మార్గంగా గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిజియోథెరపీ-లైంగిక ఆరోగ్యం
ఫిజియోథెరపీ లైంగిక అనాసక్తికి చికిత్స చేయడంలో, నిరోధించడంలో ఎలా సహాయపడుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. యోని లోపలి కండరాలకు ఎక్సర్‌సైజ్‌తో కలిగే ప్రయోజనాలతోపాటు, చైనీస్ బాల్స్ లాంటి సున్నితమైన సాధనాలతో కలిగించే ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్స్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.
సామాజిక ఆరోగ్య నిపుణులుగా ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పడం, అవగాహన కల్పించడంలో ఫిజియోథెరపిస్ట్‌లు ఎప్పుడూ ముందుంటారు.
లైంగిక ఆరోగ్యం అనేది సాధారణ ఆరోగ్యంలో అంతర్భాగమైనందున, వివిధ స్థాయిలలో ఫిజియోథెరపిస్టులు లైంగిక ఇబ్బందులను నివారించడంలో, చికిత్స అందించడంలో కీలకపాత్ర పోషిస్తారు.
అయితే, ఈ సమస్యను నివారించడానికి, సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించడం చాలా అవసరం. ఈ సమస్య సిగ్గు, బిడియాలతో ముడిపడి ఉన్నందున చాలామంది బాధితులు తమ సమస్యలను ఆరోగ్య నిపుణులతో పంచుకోలేకపోవచ్చు.
ఇక ఆరోగ్య నిపుణులు కూడా ఈ సమస్య పట్ల అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. బాధితుల నుంచి సమస్య తీవ్రతను, లక్షణాలను సమర్ధవంతంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఇందుకోసం బాధితులు తమ సమస్యను బిడియం లేకుండా, స్వేచ్ఛగా చెప్పుకోగలిగే వాతావరణాన్ని కూడా ఆరోగ్య నిపుణులు సృష్టించాలి.
(రాక్వెల్ లీరోస్ రోడ్రిగెజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన లియాన్ యూనివర్శిటీ నుంచి ఫిజియోథెరపీలో పీహెచ్‌డీ చేశారు. ఈ కథనం ముందుగా ది కన్వర్జేషన్‌లో ప్రచురితమైంది. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద ఇక్కడ అందిస్తున్నాం)
ఇవి కూడా చదవండి:
- Milk Day- ‘పచ్చి పాలు కాదు, మరగబెట్టినవీ కాదు.. ఇలా తాగితే ఆరోగ్యం’ - BBC News తెలుగు
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు- కేసీఆర్ జనం ఆకాంక్షలు తీర్చారా-
- రెజ్లర్ల నిరసన- ‘ప్రధానికే చెబుతావా- ఎంత ధైర్యం- పెద్ద ప్లేయర్ అయిపోయానని అనుకుంటున్నావా- అంటూ బెదిరించారు’
- స్టాలిన్గ్రాడ్ యుద్ధం: హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన ఈ యుద్ధంలో ఏం జరిగింది? ఎలా ముగిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















