తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: పోరు గెలిచారు, పాలనలో గెలిచారా

KCR

ఫొటో సోర్స్, kcr/facebook

    • రచయిత, కర్లి శ్రీనివాసులు
    • హోదా, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ

తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. 2023 జూన్ 2న తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతోంది.

ఈ తొమ్మిదేళ్లలో ఆశించిన విజయాలూ దక్కాయి, కొన్ని నిరాశలూ ఎదురయ్యాయి.

దశాబ్దానికి పైగా సాగిన ఉద్యమ సమయంలో ఇచ్చిన రాజకీయ (పార్టీ) వాగ్దానాలు, ప్రజల అంచనాలు, ప్రభుత్వ పని తీరు, సాధించిన విజయాలతో దశాబ్దపు ప్రయాణం ఎలా సాగిందో తరచి చూసుకునేందుకు ఇది సరైన సమయం.

ఆలె నరేంద్ర, కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ఉద్యమం.. ఆకాంక్షలు, వాగ్దానాలు

కోస్తా ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడి ఉందన్న వాదనతో ప్రత్యేక తెలంగాణ కావాలని డిమాండ్ చేసినప్పటికీ, దీనికి ప్రధాన మూలం సంస్కృతుల్లో తేడా అని చెప్పుకోవచ్చు.

ఆంధ్రాలో కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయన్న వాదన ఉన్నప్పటికీ, తెలంగాణ ఉద్యమానికి హేతువు, విశేషంగా వచ్చిన మద్దతు, భారీ సంఖ్యలో జనాన్ని ఉద్యమం వైపు ఆకర్షించిన అంశాలను మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

భాష ప్రాతిపదికన తెలుగు రాష్ట్రం (1956-2014) ఏర్పడి అర్ధ శతాబ్దానికి పైనే గడిచినా భావ, సాంస్కృతిక, సామాజిక వ్యత్యాసాలు, పరిమితులు ఉన్నాయనడం అతిశయోక్తి కాదు.

ఈ వ్యత్యాసాల గుర్తింపు, దానిపై అసంతృప్తి 1960లలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లల్లోను, తరువాతి కాలంలోనూ వ్యక్తమైంది. రాయలసీమలోనూ కాలానుగుణంగా ఇదే విషయం తెరపైకి వస్తూ ఉంది.

ప్రత్యేక తెలంగాణ కావాలన్న డిమాండ్‌కు ప్రధాన ప్రాతిపదికలు.. నీటిపారుదల, విద్య రంగాల్లో తెలంగాణ వెనుకబాటుతనం, ఆర్థిక వనరుల కేటాయింపులో నిర్లక్ష్యం, ఉపాధిలో సముచిత వాటా లేకపోవడం, తెలంగాణ రాజకీయ ప్రముఖులకు అధికారంలో వాటా ఇవ్వకపోవడం మొదలైనవి.

ఈ అంశాలన్నిటినీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదికలో ప్రస్తావించారు. 1960లలో, 1990ల తరువాత ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసినప్పుడల్లా ఈ అంశాలను లేవనెత్తారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ఉద్యమానికి.. వివిధ అంశాలతో కూడిన సంక్లిష్టత, సంస్థాగత మ్యాప్, పార్టీ, పార్టీయేతర భాగస్వామ్యం, రాజకీయ ఎన్నికల పరంగా చాలా కోణాలు ఉన్నాయి.

ఉద్యమంలో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధి అంశాల ప్రస్తావన ఉంది. పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రస్ఫుటంగా కనిపించినప్పటికీ, సీపీఎం మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఉద్యమానికి మద్దతు పలికాయి.

ఇదే కాకుండా, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యార్థి, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ, కళాకారుల సంఘాలు, సంస్థలు కూడా భాగం పంచుకోవడం వలన ఉద్యమ విశిష్టత పెరిగింది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం నిరంతరంగా, స్థిరంగా, విభిన్నంగా, బహుళ స్వరాలతో సాగింది. చివరకు ప్రజల అభీష్టం నెరవేరింది.

ఉద్యమ వాగ్దానాల దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తీరును ప్రశంసించాల్సిందే. అంటే, ప్రాంతీయ గుర్తింపు, స్వయంప్రతిపత్తి, వ్యవసాయం, నీటిపారుదల విస్తరణ, ఉపాధి కల్పన, ప్రజల సాధికారత, ప్రజాస్వామ్యయుతమైన భాగస్వామ్యం, పౌర సమాజానికి చోటివ్వడం మొదలైన అంశాల్లో తెలంగాణ గణనీయంగా అభివృద్ధి సాధించిందనే చెప్పాలి.

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్ర ఆవిర్భావం, టీఆర్ఎస్ విధానం

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, వాటిని చెల్లించిన పనితీరు ఆధారంగా ఈ పార్టీ దశాబ్దపు పాలనను సమీక్షించాలి.

తెలంగాణ ప్రధానంగా వ్యవసాయాధారిత సమాజం. ఎక్కువ వర్షాధారిత భూములు కావడం వలన తెలంగాణ ఉద్యమంలో ప్రస్తావించిన అంశాలలో నీటిపారుదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

ఆధిపత్య ఆంధ్ర రాజకీయ, ఆర్థిక ప్రముఖుల పక్షపాతం కారణంగా తెలంగాణకు సాగునీరు అందట్లేదన్న అంశంపై ఉద్యమాన్ని నడిపించారు.

పద్నాలుగో శతాబ్దంలో కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో నీటి ట్యాంకులు ఉండేవి. అవి తెలంగాణ ప్రాంతమంతా ఒకదానికొకటి అనుసంధానించి ఉండేవి. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ అధికారులైన పట్వారీ, పటేల్‌లకు అప్పగించేవారు.

1960లలో హరిత విప్లవం ప్రారంభం కావడం, తదనంతరం 1980లలో పట్వారి-పటేల్ వ్యవస్థను తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామ ట్యాంక్ వ్యవస్థకు మద్దతుగా ఉన్న వ్యవసాయ పద్ధతులు, పాలనా వ్యవస్థ దాదాపుగా కుప్పకూలింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వలన మైక్రో ఇరిగేషన్ లేదా బోరు బావుల కింద అసాధారణ రీతిలో పంటసాగు పెరిగింది.

రాష్ట్రంలో నీటిపారుదల, తాగునీటి అవసరాలను తీర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు చేపట్టింది.

మిషన్ కాకతీయ లక్ష్యం ట్యాంక్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థను పునరుద్ధరించడం. మిషన్ భగీరథ లక్ష్యం రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయడం.

ఇవే కాక అనేక భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం చేపట్టింది.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు సమాజానికి మద్దతుగా రైతు బీమా, రైతు బంధు పథకాలు అమల్లోకి వచ్చాయి. రైతు బంధు అనేది నగదు బదిలీ పథకం. దీని ద్వారా రైతులకు రెండు పంటలకు, రెండు విడతల్లో కొంత వ్యవసాయ పెట్టుబడిని అందిస్తారు. రైతు బీమా కింద నమోదు చేసుకున్న 18 నుంచి 59 ఏళ్ల రైతులకు, మరణానంతరం రూ. 5 లక్షలు చెల్లిస్తారు.

ఈ పథకాలు టీఆర్ఎస్‌కు రైతు పక్షపాతిగా గుర్తింపును తెచ్చిపెట్టాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి

ఫొటో సోర్స్, KCR/FACEBOOK

అయితే ఈ పథకాలు కౌలు రైతుల కంటే భూమి యజమానులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నాయని, రాష్ట్ర ఖజానాపై భారం మోపుతున్నాయన్న విమర్శలూ లేకపోలేదు.

ప్రభుత్వ విధానాల్లో తాజాగా వచ్చి చేరినది దళిత బంధు పథకం. షెడ్యూల్ కులాలవారికి సాధికారత సాధించే దిశలో ఆర్థిక సహాయం అందించడం దీని ఉద్దేశం.

ఆర్థికాభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల విస్తరణ దిశగా కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. హైదరాబాద్ మూలంగా ఐటీ రంగానికి ప్రాధాన్యమిస్తూ, పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడే ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలను వివిధ జిల్లాల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం జరిగింది.

అయితే, ఉపాధి విషయంలో ఉద్యమ సమయంలో ఊరించిన అంచనాలను అందుకోలేకపోయిందన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.

నయా ఉదారవాద పాలన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయినట్లయితే, ప్రైవేట్ రంగంలో విద్యావంతులకు అవకాశాలు గణనీయంగా పెరగాలి. కానీ, అలా జరగలేదు. సేవారంగంలో కొంత విస్తరణ జరిగినప్పటికీ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగలేదు. అందుకే, తెలంగాణలో ప్రధానంగా విద్యావంతులైన నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది.

తెలంగాణ

ఫొటో సోర్స్, KCR/FACEBOOK

జనాకర్షక సంక్షేమ పథకాలు

టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు, తన స్థావరాన్ని పటిష్టం చేసుకునేందుకు ప్రజాదరణ కూడగట్టుకునే పాలనా విధానాన్ని అనుసరించింది.

ఒక రూపాయికి కిలో బియ్యం పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు 'ఆసరా' పేరుతో పింఛను వంటి ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టింది.

వృత్తిపరమైన, కులపరమైన పథకాలు కూడా ప్రవేశపెట్టింది. బీడీ కార్మికులు (వీరిలో ఎక్కువ మంది మహిళలు), చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు ఆర్థిక సహాయం, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల, కుర్మ వర్గాలకు గొర్రెల పంపిణీ, ముతరాసి, బెస్త, గంగపుత్రుల కోసం చేపల పంపిణీ పథకాలు, హిందు, ముస్లిం మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టింది.

పథాకాల అమలు విషయంలో టీఆర్ఎస్ పనితీరు మెచ్చుకోదగ్గదే. పథకాల వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ వాటిని కొనసాగించగలిగింది. హైదరాబాద్ మూలంగా కొంత మెరుగైన ఆర్థిక స్థితి ఉండడమే అందుకు కారణం.

ఈ సంక్షేమ పథకాల జోరు టీఆర్‌ఎస్ పాలనకు అపారమైన ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఎన్నికల్లో విజయానికి దారితీసింది.

అయితే, వీటిలో కొరత, పరిమితులు లేవని కాదు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు, మూడెకరాల భూమి ఇస్తామన్న వాగ్దానాలను నెరవేర్చలేకపోవడం ప్రతిపక్షాలకు ప్రధానాస్త్రంగా మారింది. టీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టింది.

తెలంగాణ రాష్ట్ర సమితి

ఫొటో సోర్స్, TRS

ప్రజా ఉద్యమాలతో ఏర్పడినా..

సుదీర్ఘ ప్రజా ఉద్యమం తరువాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే, నిరంకుశమైన, దొరతనం నిండిన పార్టీ దశాబ్ద కాలం పాటు రాజ్యమేలడం ఒక రకమైన విరోదాభాస (పారడాక్స్) అనే చెప్పాలి.

పలు ప్రాంతీయ పార్టీల్లాగే, కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని టీఆర్‌ఎస్ కూడా ఒక కుటుంబం నియంత్రణలో ఉన్న పార్టీ. రాజకీయ విధానం, జనాకర్షక పథకాలు అన్నీ పార్టీ అధినేతకే చెల్లుతాయి. సభ్యులు అధిష్టానానికి విధేయత చూపించడం ప్రధానం.

అధికారం, పాలన అన్నీ కేసీఆర్ చేతిలోనే ఉన్నా, దొరతనంపై, అధిష్టానానికి లోబడి ఉండడంపై పార్టీలో ఎలాంటి చింతా కనిపించదు.

కేసీఆర్ కొడుకు కేటీ రామారావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో టీఆర్‌ఎస్‌లో వారసత్వం కాస్తా ఖాయమైంది.

టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం అనేది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

తెలంగాణ

ఫొటో సోర్స్, KTR/FACEBOOK

పౌర సమాజాన్ని పక్కకు నెట్టేశారు

రాష్ట్రంలో పౌర సమాజం, అణగారిన వర్గాల జీవితాలలో వచ్చిన మార్పులు, వారికి పార్టీ వ్యవస్థ, ఎన్నికల రాజకీయలతో ఉన్న సంబంధం బట్టి ప్రజాస్వామ్యం భవిష్యత్తును మరింత అంచనా వేయవచ్చు.

ఈ దిశలో ప్రధానంగా రెండు మార్పులు కనిపిస్తున్నాయి. మొదటిది, పౌర సమాజం, దిగువ కులాల గొంతు నొక్కేయడం, ఉద్యమ విధానాన్ని తొక్కిపెట్టడం. రెండవది, పౌర సమాజంపై రాజకీయ సమాజ ఆధిపత్యం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణ ఉద్యమ స్వభావానికి భిన్నంగా ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

1990లలో తెలంగాణ ఉద్యమాన్ని సామాజిక, సాంస్కృతిక సంఘాలు, సంస్థలు, పౌర సమాజ కార్యకర్తలు బలోపేతం చేసి ముందుకు నడిపించారు.

వారంతా కలిసి పార్టీ వర్గాలకు అతీతంగా, సైద్ధాంతిక ప్రమాణాలపై జాయింట్ యాక్షన్ కమిటీలను (జేఏసీలు), పార్టీయేతర సంఘాలను ఏర్పరచి ఉద్యమాన్ని కొనసాగించారు.

విద్యార్థులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, చేతివృత్తుల సంఘాల జేఏసీలు వీధుల్లోకి వచ్చి స్వచ్ఛందంగా వినూత్న పద్ధతులలో ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షా శిబిరాలు నిర్వహించాయి.

సైద్ధాంతిక విభేదాలు, పార్టీ విధేయతలను పక్కకు తోసి, కులం, వృత్తి, వర్గం గుర్తింపులను కాలరాసి తెలంగాణ ప్రజలంతా ఒక్క నినాదంతో ఉద్యమించారు. తెలంగాణ అనే ప్రాంతీయ గుర్తింపు తప్ప మరే తారతమ్యాలకు తావివ్వలేదు.

అంత చురుకైన, తిరుగులేని పౌర సమాజాన్ని రాష్ట్రావతరణ అనంతరం ఎలా తొక్కిపెట్టగలిగారు?

టీఆర్ఎస్ వ్యూహంలోనే దీనికి జవాబు ఉంది. అనుకూలురుకే పదవులు, సర్దుబాటు, పౌర సమాజంపై ఆధిపత్యం.. ఇదే ఆ వ్యూహం.

kcr, kodandaram

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ రాష్ట్ర అవతరణతో ఆనందోత్సాహాలు, ఆశావాదం వెల్లువెత్తింది. ప్రజలు కొత్త రాష్ట్ర పునర్నిర్మాణం గురించి కలలు కన్నారు. ఈ సందడి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది టీఆర్ఎస్. సమాజంలో కీలకమైన, విమర్శనాత్మక స్వరాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది. అంటే, మేధావులు, జర్నలిస్టులు, కళాకారులు, యువనేతలకు పదవులు, బాధ్యతలు కట్టబెట్టి అనుకూలుర జాబితాను సిద్ధం చేసుకుంది.

ఇలాంటి వ్యూహాలకు చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. దిగువ వర్గాల వారికి పదవులు ఇచ్చి, ఉపకారాలు చేసి, వాళ్ల ప్రయోజనాలకు స్థానం కల్పించి వాళ్లను అనుకూలంగా మార్చుకునే వ్యూహం కొత్తదేం కాదు.

కొత్త రాష్ట్ర నిర్మాణం కొత్త ఉత్సాహానిస్తుంది. ఉద్యమంలో ముందంజలో ఉన్న రాజకీయ పార్టీకి సామాజిక శక్తులను అణచివేయడానికి కావలసినంత సాంఘిక, రాజకీయ పెట్టుబడి ఉదారంగా దొరుకుతుంది. టీఆర్ఎస్‌కు ఆ ప్రయోజనం చేకూరింది.

మరొక కీలకమైన చర్య రాష్ట్రంలో రాజకీయ శూన్యతను తీసుకురావడం. ప్రతిపక్షమనేదే లేకుండా టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టడం, కాంగ్రెస్‌ సభ్యులను టీఆర్ఎస్‌లోకి తీసుకురావడం, వైయెస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు తెస్తూ 'ఆకర్ష్' వల విసరడం ద్వారా టీఆర్ఎస్ దీన్ని సాధించింది.

అధికార రాజకీయాల పట్ల ఆకర్షణ, పదవుల్లో లేకపోవడం వలన వచ్చే ఒత్తిళ్లను తట్టుకోలేక చాలావరకు టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీలోకి దూకేశారు. చాలామంది రాజకీయ నాయకులకు ప్రభుత్వ మద్దతు అవసరమయ్యే వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలున్నాయి.

ఇలా రాజకీయ స్థలం మొత్తాన్ని కబ్జా చేయడంతో ఒక మిడిల్ గ్రౌండ్ అనేదే లేకుండా పోయింది. దాంతో బీజేపీకి తలుపులు తెరుచుకున్నాయి.

తెలంగాణ

ఫొటో సోర్స్, KCR/FACEBOOK

ముందున్న సవాళ్లేమిటి?

అణగారిన వర్గాలు సామాజికంగా ఎదగాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గం.

ముఖ్యంగా భారతదేశం లాంటి వ్యవస్థలో.. అసమానతలు, కులాధిపత్యం, ఆర్థిక తారతమ్యాలు, పితృస్వామ్య పోకడలు ప్రబలంగా ఉన్న సమాజంలో విద్య ఒక్కటే దారి చూపిస్తుంది.

నేడు తెలంగాణాలో పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్య పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది.

తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో వెలుగులోకి తీసుకొచ్చింది విద్యా పరిరక్షణ సమితి.

రాష్ట్రంలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చినప్పటికీ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది.

మానవ వనరుల అభివృద్ధికి అవసరమైన విద్య, వైద్యం వంటి ప్రాథమిక అంశాలను పక్కనపెట్టి, జనాకర్షక పథాకలకు పెద్దపీట వేశారు. ఆ హోరులో బంగారు తెలంగాణ వాగ్దానం దాదాపు కొట్టుకుపోయిందనే చెప్పాలి.

వనరుల కొరత వలన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. వైస్-ఛాన్సలర్ల నియామకం ఆలస్యం కారణంగా నాయకత్వ లోపించడం, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోవడం మొదలైనవి ప్రభుత్వం హ్రస్వదృష్టికి నిదర్శనాలు.

మరోవైపు, ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించడం అనేది ప్రభుత్వ విధానాలు ప్రజా ప్రయోజనాలకు ఎంత దూరంగా ఉన్నాయో తెలియజేస్తుంది.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమవడంతో పాటు విద్యాసంస్థల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత, మధ్యతరగతి, కొన్ని వర్గాల ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వ పాలన పట్ల విరక్తి ఏర్పడిందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల నుంచి, అణగారిన వర్గాల నుంచి పై స్థాయి చదువుల కోసం యూనివర్సిటీలకు వస్తున్న విద్యార్థులకు అక్కడి పరిస్థితులు, పరిపాలన నిర్లక్ష్యం వారి ఆకాంక్షలకు అవరోధాాలుగా నిలుస్తున్నాయి.

హామీలకు, పనితీరుకు మధ్య ఉన్న అంతరాలను ఈ అంశాలు వెలుగులోకి తీసుకొస్తాయి.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)