టీఆర్ఎస్ ఇరవయ్యేళ్ల ప్రయాణం: అస్తిత్వ పోరాటం నుంచి అధికార పీఠం వరకు - అభిప్రాయం

టీఆర్ఎస్

ఫొటో సోర్స్, kcr/fb

    • రచయిత, కర్లి శ్రీనివాసులు
    • హోదా, బీబీసీ కోసం

తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది మొదలు అక్కడ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రెండు దశాబ్దాల చరిత్ర గల పార్టీ. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న వేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనే ఏకైక లక్ష్యంతో 2001లో పురుడుపోసుకున్న ఈ పార్టీ ఉద్యమానికి నిర్ణయాత్మకమైన, విలక్షణ రాజకీయ నాయకత్వాన్నిఅందించింది.

టీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) తెలుగుదేశం పార్టీలో, ఆ ప్రభుత్వంలో ఉన్నారు. అయితే, అక్కడ తనను ఎదగనివ్వడంలేదన్న అసంతృప్తితో ఉన్న ఆయనకు ఈ తెలంగాణ ఉద్యమం ఒక అవకాశంగా కనిపించింది.

నిజానికి కొద్దిమంది నిబద్ధత గల వ్యక్తులు, ప్రజాసంఘాల కృషి ఫలితంగా నిర్మితమైన ఈ మలిదశ ఉద్యమం అంతవరకు పూర్తిగా రాజకీయేతరంగా మొదలైంది.

రాజకీయేతర సంయుక్త కార్యాచరణ వేదికైన ‘తెలంగాణ ఐక్య వేదిక’ ద్వారా సమష్టి ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఉద్యమానికి నిర్ణయాత్మక సంస్థాగత ఆకృతి ఇవ్వడానికి ఒక నిర్దిష్ట పార్టీ, రాజకీయ రూపం కావాలని భావించారు.

ఇలాంటి తరుణంలో, తెలుగుదేశం పార్టీలో నిర్లక్ష్యానికి గురవుతున్నానని భావించిన కేసీఆర్ ఈ ఉద్యమంలో అవకాశాలను వెతుక్కుంటూ కొత్త పార్టీని స్థాపించారు. అదే తెలంగాణ రాష్ట్ర సమితి.

ఫెడరల్ ఫ్రంట్ యత్నాలు

ఉద్యమ పార్టీగా ప్రయాణం ప్రారంభించిన టీఆర్ఎస్ ఈ రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఒక కీలక రాష్ట్రంలో పాలక పార్టీగా అవతరించడమే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వ స్థాపనకు ఫెడరల్ ఫ్రంట్ నెలకొల్పేందుకు ప్రయత్నించడాన్నీ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో చూశాం.

అయితే, 2019 ఎన్నికల తీర్పు టీఆర్ఎస్ ఆశలకు పూర్తి విరుద్ధంగా ఉన్నప్పటికీ భారతదేశ బహుపార్శ్వ ప్రాంతీయ భిన్నత్వాన్ని.. దేశ సమాఖ్య భవిష్యత్తు రీత్యా కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాల ప్రజాస్వామిక అవసరాన్ని ప్రతిబింబించేలా కేంద్రంలో ఒక రాజకీయ కూటమి అవసరమని అంచనా వేసిన ఘనత మాత్రం ఆ పార్టీకి దక్కుతుంది.

రాష్ట్ర రాజకీయాల్లో, కేంద్ర స్థాయిలో టీఆర్ఎస్ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సమయంలో సునిశిత మదింపు చేయడం సమయోచితం.

కేసీఆర్

ఫొటో సోర్స్, trs

ఆరంభంలో...

టీఆర్ఎస్ చరిత్రను రెండు దశలుగా వర్గీకరించొచ్చు. మొదటి దశ అంతా ఉద్యమ పార్టీగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడడం. రెండో దశ, తెలంగాణ ఏర్పాటు తరువాత 2014లో అధికారంలోకి రావడం.

టీఆర్ఎస్ పాలక పార్టీగా పరిణామం చెందడమనేది అధికార రాజకీయాలు, పౌరసమాజం, కిందిస్థాయిలో ఉద్యమ తీరులో కూలంకుష పరివర్తనపై ఒక అధ్యయనం. ఇలాంటి పరివర్తనా ఉదంతాలు గతంలో, వేరేచోట్ల ఉన్నట్లు అనిపించినా వాటికీ టీఆర్ఎస్ కథకూ మధ్య కొన్ని తేడాలున్నాయి.

తెలంగాణ ఉద్యమ పార్టీగా అవతరించే క్రమంలో టీఆర్ఎస్ ప్రధానంగా రెండు అవరోధాలను ఎదుర్కొంది. అందులో ఒకటి కులం, వర్గం, చేతివృత్తులు, జెండర్, ఉప ప్రాంతాల కోణంతో ప్రజా తెలంగాణను ఆకాంక్షించే ప్రజా సంఘాలు, క్షేత్ర స్థాయి ఉద్యమ సంస్థల నుంచి కాగా, రెండోది తెలంగాణ ప్రాంతంలో అనేక పార్టీలు ఉండడం నుంచి.

సీపీఎం మినహా మిగతా అన్ని పార్టీలూ తాము ప్రత్యేక తెలంగాణకు అనుకూలమే అని చెప్పడంతో తెలంగాణ అంటే టీఆర్ఎస్సే అని చెప్పుకోవడానికి ఆ పార్టీకి వీలుకాని పరిస్థితి ఎదురైంది.

ప్రజాదరణ... ప్రజాకర్షక విధానాలు

ప్రజాదరణ రెండు స్థాయుల్లో దక్కుతుంది. ఒకటి ఉన్నత స్థాయిలో.. రెండు ఉద్యమ స్థాయిలో. ఉద్యమాల నుంచి ఉద్భవించిన నాయకులకు ఫలం దక్కాలి. వారికి అధికార వ్యవస్థలో చోటు దక్కాలి.

కానీ, ఇది చాలదు. టీఆర్ఎస్ పాలన ట్రాక్ రికార్డు పేట్రనేజ్ పాపులిజమ్ దిశగా పయనిస్తోంది. ప్రజాకర్షక విధానాలు, ప్రజాకర్షక రాజకీయాలు చేయడమనేది ప్రాంతీయ పార్టీలకు చాలావరకు ఉంటుంది. టీఆర్ఎస్ విషయానికొస్తే, తెలంగాణలో కుల సమీకరణలు... రాజకీయాలతో అవి ముడిపడి ఉండడాన్ని చూస్తే ప్రజాకర్షణ విధానాలనేవి ఇక్కడ నిర్మాణాత్మక అవసరంగా చెప్పొచ్చు.

చారిత్రకంగా చూస్తే తెలంగాణలో ఆధిపత్య రైత్వారీ కులం రెడ్లు. కాంగ్రెస్ పాలనాకాలంలో ఈ కులాధిపత్యం పెరుగుతూ పోయింది. కేసీఆర్ అంతగా ఆధిపత్యం లేని రైత్వారీ కులమైన వెలమ కులానికి చెందినవారు. రెడ్డి నాయకులతో పోల్చితే కేసీఆర్‌కు ఇది ప్రతికూలాంశం. జనాకర్షక ముద్రతో రాజకీయ పెట్టుబడి సమకూర్చుకోవడానికి ఇదే కారణం.

2004లో కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2004లో తీసిన చిత్రం: రాష్ట్రీయ లోక్‌ దళ్ పార్టీ అధినేత అజిత్ సింగ్‌తోపాటు పలు పార్టీల నేతలను కలిసిన కేసీఆర్

సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం... విద్యారంగం నిర్లక్ష్యం

ప్రజాకర్షణతో రెండు ప్రయోజనాలున్నాయి. మొదటిదేంటంటే.. ఒక నాయకుడు లేదా నాయకురాలు స్వయంగా సాధించుకున్న, తమకే సొంతమైన జనాకర్షణ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెస్తుంది. ఇది ఆ వ్యక్తి పట్ల ఆరాధన ఏర్పరచడంలో కీలకం. ప్రాంతీయ పార్టీలన్నీ ఆ పార్టీ అధినేత కేంద్రంగానే నడుస్తుండడం దీనికి ఉదాహరణ.

రెండోది.. కనీసం దక్కాల్సినవి కూడా దక్కని సమాజంలో ఆహార, కనీస ఆదాయానికి పూచీ ఉండేలా చేపట్టే పాలక విధానాలు ప్రజాకర్షక రాజకీయాలకు పునాది. అందువల్లే తెలంగాణలో టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పేరుతో పెద్ద ఎత్తున ప్రజాకర్షక పథకాలు కనిపిస్తాయి.

వీటిలో రాయితీపై బియ్యం ఇచ్చే పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటివన్నీ అందులో భాగమే.

సంక్షేమ కోణంలో చూస్తే టీఆర్ఎస్ రికార్డు చెప్పుకోదగ్గదే. దీనికి తోడు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తాగునీరందించే మిషన్ భగీరథ, పొలాలకు నీళ్లిచ్చే మిషన్ కాకతీయ వంటివి టీఆర్ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలుగా చెప్పాలి.

ఇదేసమయంలో అభివృద్ధిలో భాగమైన మిగతా అంశాలైన విద్య వంటివి పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి. నిధులు కానీ, విధానపరమైన ప్రాధాన్యం కానీ వీటికి దక్కలేదు. తెలంగాణ ఆత్మగా భావించే శతాబ్ద కాలం నాటి ఉస్మానియా యూనివర్సిటీ సహా విశ్వవిద్యాలయాలన్నీ దయనీయమైన స్థితికి చేరడమనేది టీఆర్ఎస్ పాలనలోని డెవలప్‌మెంటల్ విజన్‌‌కు మరకే.

కేసీఆర్

ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb

ప్రజాస్వామ్య వెలితి

పోషక ప్రజాకర్షక రాజకీయాలకు, అధికారస్వామ్యానికి ఏదో సహజ సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, మీడియాతో దురుసు ప్రవర్తన, ప్రజలను గాలికి వదిలేయడం, విధానపరమైన అంశాల్లో తలకిందులు నిర్ణయాలు వంటి అనేక రకాలుగా ఇది ప్రతిబింబిస్తుంటుంది. బాగా పరిశీలించి చూస్తే టీఆర్ఎస్ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... అటు ఉద్యమ పార్టీగా, ఇటు అధికారంలో ఉన్న పార్టీగా సుదీర్ఘ ప్రస్థానం సాగించిన టీఆరెస్ పార్టీ, సంస్థాగత నిర్మాణంపై మాత్రం ఎలాంటి శ్రద్ధ పెట్టలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సంస్థాగతంగా ఆ పార్టీ ఎమ్మెల్యే కేంద్రంగానే నడుస్తుంది.

సదరు ఎమ్మెల్యే అధినేత మనిషిగా, పార్టీకి, అభివృద్ధికి, ఎన్నికలకు బాధ్యుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. సంస్థాగతంగా ఎలాంటి పటిష్టమైన నిర్మాణం లేకుండానే 2018లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. పేద, బడుగువర్గాలకు ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాల అమలులో ఆ పార్టీ అధినేతకున్న పేరు ప్రఖ్యాతులు, ఛరిష్మాయే దీనికి కారణం. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందివ్వలేకపోవడం, భూముల్లేని ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి హామీని మర్చిపోవడం, విద్యావ్యవస్థను, ముఖ్యంగా యూనివర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ఉన్నప్పటికీ అధినేతకున్న మాస్ ఇమేజ్ ఈ విజయానికి సహకరించింది.

ఇక సామాజిక రాజకీయాల విషయానికి వస్తే... టీఆరెస్ పాలనలో వివిధ వర్గాలు అణచివేతకు గురయ్యాయన్న విషయాన్ని గమనించడం ద్వారా ఆ పార్టీ విధానాలను, తత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ఒకప్పటి టీడీపీ పాలనలో తెలంగాణలో సామాజిక అభివృద్ధి, అవకాశాల కల్పన జరిగిందని చెబుతారు. అప్పట్లో ఓబీసీ కమ్యూనిటీలకు సంస్థాగతమైన పదవుల్లో అంటే పంచాయతీ రాజ్ నుంచి అసెంబ్లీ వరకు విస్తృతమైన ప్రాధాన్యం ఇచ్చారని చెప్పాలి.

కేసీఆర్

ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb

తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో వివిధ కులాలు, వర్గాలు, వృత్తులు కీలకపాత్ర పోషించగా, ఎన్నికల రాజకీయాలు వచ్చేసరికి ముఖ్యంగా ఓబీసీలను, మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పైగా ఎన్నికల్లో లాభం పొందడానికి ఆయా వర్గాల మధ్య ఉన్న విభేదాలను వాడుకుని ప్రయోజనం పొందింది. సామాజిక నిర్మాణంలో కనిపిస్తూ బాగా వెనకబడిన వర్గాలైన సంచార, ఉపసంచార కులాలు సంఖ్యాపరంగా తక్కువే అయినప్పటికీ తమలోని ఐక్యతను, సంఘీభావాన్ని ప్రదర్శించాయి. విద్య, ఉపాధితోపాటు రాజకీయ ప్రాతినిధ్యంలో తన వాటాను కోరే ఓబీసీల వైఖరికి వీరు భిన్నం.

అందుకే, టీఆర్ఎస్ ఎంబీసీలను ఓబీసీలకు చెక్ పెట్టేందుకు వాడుకుంది. కులాధిపత్యం ఎక్కువగా కనిపించే రాజకీయాల్లో రెడ్లు తమ సంప్రదాయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ తిరిగి పుంజుకునే పరిస్థితి కనిపించకపోవడం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో నాయకత్వ లేమి ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గం బీజేపీవైపు మొగ్గు చూపుతోంది. అయితే రానున్న భవిష్యత్తులో ఇది టీఆరెస్‌కు సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. టీఆరెస్ కోరుకున్నట్లు ఇది కాంగ్రెస్ ముక్త రాష్ట్రం కావచ్చు గానీ, సవాళ్ల ముక్త రాష్ట్రం అయితే కాబోదు.

ఇప్పుడు వెనకబడి వర్గాలతో వ్యవహరించడంలో టీఆరెస్ తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. వారు రాజకీయంగా బలపడటంపై దృష్టి పెట్టకుండా, టీఆరెస్ ప్రభుత్వం కులాలు, వృత్తుల వారీగా వారి కోసం ప్రత్యేక పథకాలు ప్రకటిస్తూ వాటివైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది. ఇందులో భాగంగా యాదవులకు గొర్రెలు, ముదిరాజులు, గంగపుత్ర, బెస్తలకు చేపలను వారి సహకార సంఘాల ద్వారా అందేలా ఏర్పాటు చేసింది.

అలాగే, బీడీ కార్మీకులకు పెన్షన్లు (ఇందులో ఎక్కువమంది మహిళలే), నేతకార్మికులు, గీత కార్మికులు ఇతర వర్గాలకు అనేక పథకాలు ప్రకటిస్తోంది. వ్యవసాయ రంగాలకు రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలు తమ నేత మానస పుత్రికలుగా ప్రకటిస్తోంది టీఆరెస్ పార్టీ.

కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి కారు గుర్తు

ఫొటో సోర్స్, trspartyonline/facebook

ఇక రాష్ట్రంలో ప్రజాస్వామిక భావనను మరింత క్షీణింపజేసిన మరో అంశంమేంటంటే, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పౌర సమాజాలు, అణగారిన వర్గాలను పూర్తిస్థాయిలో చిన్నచూపు చూడటం. విభజన తరువాత ఈ సామాజిక శక్తులను పనికిరాని వాటిగా లెక్కగట్టారు. సామాజిక సాంస్కృతిక రంగాలను కుట్రపూరితంగా దుర్వినియోగం చేయడం, లేదా ఆక్రమించడం ఎన్నికల రాజకీయాలలో ప్రస్ఫుటంగా కనిపించే మరో కీలకమైన అంశం. ప్రజాస్వామిక చర్చలు, సామాజిక లోటుపాట్లపై ప్రశ్నలను అణచివేయడం ఎన్నికల రాజకీయాల్లోనే కాదు మీడియాలోనూ కనిపిస్తుంది.

'పార్టీకరణ' ప్రక్రియ ప్రభావం ఎన్నికల ప్రసంగాల నాణ్యతపైనే కాదు ప్రాతినిధ్య స్వభావంపైనా గణనీయంగా పడుతుంది. పార్టీలు ధనవంతులైన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో గణనీయమైన పెరుగుదల కనిపించడమే కాదు... అది ఎన్నికల ఖర్చులను కూడా విపరీతంగా పెంచింది.

గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరుగుదల కనిపించింది. 2018 ఎన్నికలు భవిష్యత్తులో ఈ ధన ప్రభావం నుంచి వెనక్కి మళ్లలేని పరిస్థితిని కల్పించాయి. ఈ పరిస్థితులన్నింటికీ మూల కేంద్రంగా కనిపిస్తున్న టీఆరెస్ పార్టీ, ప్రజాస్వామ్య క్షీణతలో, ప్రజాగొంతుకల అణచివేత, ప్రాతినిధ్యంలో అసమానతలు పెంచడలో తన పాత్ర నుంచి తప్పించుకోలేదు.

అందుకే టీఆర్ఎస్ తన రాజకీయ భవిష్యత్తును కేవలం పార్టీ అంతర్గత వేదికల మీదనే కాకుండా ప్రజావేదికల మీద కూడా ప్రతిఫలింపజేసుకోవాల్సిన తరుణం ఇది.

(అభిప్రాయాలు వ్యసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)