కరోనావైరస్: ‘చైనాలో అధికార సంఘర్షణ రావొచ్చు... కొత్త ప్రపంచ వ్యవస్థలో భారత్‌ది ముఖ్య పాత్ర’ - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రామ్ మాధవ్
- హోదా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
నూట పదేళ్ల క్రితం అమెరికా, యూరప్, వాటి వలస రాజ్యాలకు వెళ్లేందుకు వీసాలు, పాస్‌పోర్ట్‌లు ఏవీ ఉండేవి కావు. కానీ, ఆ తర్వాత వచ్చిన మొదటి ప్రపంచ యుద్ధంతో పరిస్థితులు మారిపోయాయి. దేశాలు మూసుకుపోయాయి. వాటి సరిహద్దులు బలపడ్డాయి.
ఆ తర్వాత ఆర్థిక మందగమనం, మాంద్యం వచ్చాయి. జాతీయవాదం అతిజాతీయవాదంగా మారి మరో ప్రపంచ యుద్దానికి దారితీసింది. అనంతరం దేశాలు ఒకదానితో ఒకటి అనుసంధానమైన, ఆధారపడ్డ, సంస్థాగతమైన అంతర్జాతీయ వ్యవస్థను మనం నిర్మించుకున్నాం. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, 75 ఏళ్లుగా ఆ వ్యవస్థ అలాగే కొనసాగుతోంది.
కానీ, ఇప్పుడు కరోనావైరస్ మహమ్మారి ఆ వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యే ముప్పును తెచ్చింది.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశాలు మూసుకుపోయి, నియంతృత్వ ధోరణికి వెళ్లినట్లుగానే... ఇప్పుడు కూడా మరింత మూసుకుపోయిన, సంకుచిత జాతీయవాద ప్రపంచం ఏర్పడొచ్చని కొందరు రాజకీయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్లోబలైజేషన్, స్వేచ్ఛా వాణిజ్యం తగ్గిపోతాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘చైనాపై అనుమానాలు’
ఈ ప్రతికూల వైఖరి ఎక్కడి నుంచి పుట్టుకువచ్చింది? కేవలం 0.125 మైక్రాన్ల సైజు, అంటే కను రెప్ప వెంట్రుక మందంలో వెయ్యో వంతు కన్నా తక్కువ ఉండే కరోనావైరస్ వల్ల వచ్చిందా?
కాదు, ఒక్క వైరస్ వల్ల కాదు. శక్తిమంతమైనవిగా భావించే రెండు దేశాలు ఇప్పుడు మొత్తం ప్రపంచపు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి.
హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన అమెరికన్ చరిత్రకారుడు నయల్ ఫెర్గసన్ వాటికి ‘చిమెరికా’ అని పేరు పెట్టారు.
దశాబ్దం కన్నా ముందు నుంచే అమెరికా, చైనా ఓ ఆర్థిక బంధం మోడల్‌ను సృష్టించుకున్నాయి. గత శతాబ్దం చివరి దాకా కొనసాగిన అమెరికా-జపాన్ ఆర్థిక బంధం ‘నిషిబీ’తో దీన్ని ఫెర్గసన్ పోల్చారు.
కానీ, ‘చిమెరికా’ వట్టి ‘చిమెరా’ (గ్రీకు కథల్లో సింహం తల, మేక శరీరంతో ఉండే జంతువు) అని కరోనావైరస్ తేల్చింది.
ప్రపంచం నుంచి వాస్తవాలు దాస్తూ, వైరస్ తమ సరిహద్దులు దాటి మహమ్మారిగా మారేలా చేసిందని చైనా నాయకత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. చైనా చెబుతున్న విషయాలను సవాలు చేస్తున్నారు. ఆ దేశం ఇస్తున్న సమాచారాన్ని ప్రశ్నిస్తున్నారు.
చైనాలో 82వేల మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారని, వారిలో 4,500 మంది చనిపోయారని అక్కడి ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, చైనాలో ఇన్ఫెక్షన్ సోకినవారి సంఖ్య 29 లక్షల దాకా ఉండొచ్చని వాషింగ్టన్‌లోని డెరెక్ సిస్సర్ ఆఫ్ ద అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘డ్రాగన్ దేశం పాటించే మూడు సూత్రాలు’
కొన్ని దేశాలు సంప్రదాయ మార్గాలను అనుసరించవు. వాటిలో చైనా ఒకటి. అది ‘చారిత్రక అనుభవం’ అనే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ రోజుల్లో అదేమైనా కావొచ్చు. కానీ, 1949లో మావో అధికారం చేజిక్కించుకునేందుకు తోడ్పడిన సుదీర్ఘ విప్లవం నుంచి వచ్చిందే అది.
ప్రపంచంపై చైనా దృక్కోణాన్ని ప్రధానంగా మూడు సూత్రాలు నిర్దేశిస్తాయి. అవే జీడీపీఇజం, చైనా సెంట్రిజం, చైనా ఎక్సెప్షనలిజం. ఇవన్నీ చైనా విప్లవం నుంచి వచ్చినవే.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
‘‘ఆర్థిక అభివృద్ధే అత్యంత ప్రధానమైన తర్కం’’ అని 1980ల్లో డెంగ్ షియో పింగ్ ప్రకటించారు. దీన్ని చైనీస్ ఆర్థికవేత్తలు ‘జీడీపీఇజం’ అన్నారు.
రెండోది చైనా సెంట్రిజం. స్వాతంత్య్రం, స్వయం ప్రతిపత్తి, స్వయంసమృద్ధికి మావో చాలా ప్రాధాన్యం ఇచ్చారు. వాంగ్ షెన్ రాసిన ‘గెచాంగ్ జుగువో’ – మాతృభూమి గేయం చైనాలో అందరికీ తెలుసు. పర్వతాలు, మైదానాలు, నదులను వర్ణిస్తూ, ‘గొప్పదైన అందమైన ఈ చైనా నేలే మన ఇల్లు’ అని ప్రకటించే ఈ పాటను ఆ దేశ పౌరులందరూ గట్టిగా నమ్ముతారు.
మూడోది చైనా ఎక్సెప్షనలిజం. చైనా ఇతరుల నుంచి నేర్చుకోవడాన్ని నమ్మదు. విప్లవ సమయంలో మావో చెప్పిన ‘అభ్యసించు. అమలు చేయి’ సూత్రాన్ని పాటిస్తుంది. సమస్యలను సొంత జ్ఞానంతోనే పరిష్కరించుకోవాలి అనే దాన్ని అక్కడి నాయకులు బలంగా చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నాజీ జర్మనీ సమయంలోనూ ఇంతే’
చారిత్రక సారూప్యతలున్నంత మాత్రాన ఒకేలా జరుగుతాయని కాదు. కానీ, చైనా జాతీయవాద దృక్పథానికి, రెండో ప్రపంచ యుద్ధానికి ముందటి జర్మనీ తీరుకు సారూప్యతలు కనిపిస్తాయి.
1930ల్లో జాత్యహంకారం, చరిత్ర గురించి వాదనలు, ఆర్యన్ ఎక్సెప్షనలిజం గురించి అందరికీ తెలుసు. కానీ, అప్పుడు చాలా దేశాలు ఏ సమస్యా లేదన్నట్లుగానే వ్యవహరించాయి.
ఒకప్పుడు చెకోస్లోవేకియాలో భాగంగా ఉండే సడెటెన్లాండ్ ప్రాంతాన్ని హిట్లర్ ఆక్రమించినప్పుడు యూరప్ హిట్లర్‌ను ఎదుర్కోవాల్సింది పోయి, బుజ్జగించాలని నిర్ణయించుకుంది. అక్కడితో హిట్లర్ ఆగిపోయేలా ‘మ్యునిచ్ ఒప్పందం’ కుదుర్చుకుని, బ్రిటన్ లాంటి యూరప్ దేశాలు సంబరాలు చేసుకున్నాయి.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు


ఫొటో సోర్స్, Getty Images
దీన్నంతా దూరం నుంచి చూస్తున్న అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్... ‘‘మానవాళికి మీరు చేసిన ఈ సేవను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుర్తిస్తారని నమ్ముతున్నా’’ అంటూ హిట్లర్‌ను పొగిడారు కూడా.
కానీ, హిట్లర్ మాట తప్పారు. ఏడాది కూడా గడవకముందే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.
1939-40ల్లో బ్రిటన్ ఉన్న స్థానంలో ఇప్పుడు అమెరికా ఉంది. కరోనావైరస్‌ను తమ రాష్ట్రాలను కుదిపేసే వరకూ ట్రంప్ ఏం చేయకుండా ఉండిపోయారు. చివరకు ఆలస్యంగా, ఫిబ్రవరి 28న నిద్ర లేచారు. అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తి గురించి చేస్తున్న హెచ్చరికలను నమ్మవద్దని సౌత్ కరోలినాలో ట్రంప్ తన మద్దతుదారులకు చెబుతూ ఉన్నారు. కరోనావైరస్ పేరుతో మీడియా ఓ నాటకం చేస్తోందని అన్నారు.
‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రయోజనాల కోసం చైనాను ముద్దు చేస్తున్న యురోపియన్ దేశాలు మహమ్మారిని అదుపు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి.

ఫొటో సోర్స్, NARENDRAMODI.IN
‘భారత్ ఓ ఉదాహరణ’
ఈ మహమ్మారికి ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాలు ఎదురునిలవడం ఆసక్తికరం. దక్షిణ కొరియా ఇందులో ముందు ఉంది. జనాభాలో తమకు ఆరు రెట్లు ఉన్న అమెరికా కన్నా ఎక్కువ పరీక్షలు నిర్వహించింది. సింగపూర్ కూడా భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించింది. హాంకాంగ్, తైవాన్ కూడా సార్స్ లాంటివాటిని ఎదుర్కొన్న అనుభవంతో సమయానుగుణంగా చర్యలు తీసుకున్నాయి.
కరోనావైరస్‌పై పోరాటంలో ప్రజాస్వామ్యవాదానికి భారత్ ఓ ఉదాహరణగా నిలిచింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని మోదీ ఈ పోరాటానికి నేతృత్వం వహించారు. పూర్తి ప్రజా మద్దతుతో లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించే చర్యలను అమలు చేశారు.
130 కోట్ల మంది ఉన్న దేశంలో కేవలం 21వేల కేసులు నమోదయ్యాయి. నియంతృత్వ, ఒంటెత్తు పోకడలకు మోదీ పోలేదు. ఇస్లామోఫోబియా అంటూ, ఇంకొకటి అంటూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఇలాంటివి జరుగుతున్నా మోదీ ఎంతో నిబ్బరం, ప్రశాంతత, సానుకూల దృక్పథం ప్రదర్శించారు.
దార్శనిక నాయకులు ఉంటే ప్రజాస్వామ్యాలు ఉదారవాద విలువలను వదులుకోకుండానే ఇలాంటి సవాళ్లను ఎదుర్కోగలవని ఆయన నిరూపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు ఏర్పడుతున్న కొత్త ప్రపంచ వ్యవస్థలో అమెరికా, జర్మనీ లాంటి దేశాలతో కలిసి భారత్ చాలా ముఖ్య పాత్ర పోషించవచ్చు. మోదీ సూచించినట్లు ‘హ్యూమన్ సెంట్రిక్ డెవలెప్‌మెంట్ కోఆపరేషన్’ మీద ప్రపంచాన్ని నిర్మించవచ్చు. ఇది కొత్త అట్లాంటిక్ చార్టర్‌కు సమయం. పర్యావరణం, వైద్యం, సాంకేతికత, ప్రజాస్వామ్య ఉదారవాదం దానికి పునాదులు కావొచ్చు.
చైనాకు ఇప్పుడు ఓ అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఆ దేశం దూషణలను ఎదుర్కొంటోంది. దేశంలో అంతర్గతంగా అలజడి కూడా రేగుతోంది. షీ జిన్‌పింగ్ నాయకత్వానికి సవాళ్లు పెరుగుతున్నాయి. ‘లోపలున్న రాళ్లను చూసుకుంటూ నదిని దాటాలి’ అన్న డెంగ్ సూక్తిని చైనా నాయకత్వం ఇప్పుడు పాటిస్తోంది.
చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ‘లుషియన్ డౌజెంగ్’ అనే ఓ పద బంధం ఉంది. దాని అర్థం ఇంచుమించుగా అధికార సంఘర్షణ. పార్టీలో కొత్త నాయకత్వ శ్రేణికి కూడా ఇది సంకేతం కావొచ్చు. ఇలాంటివి ఇది వరకు జరిగాయి. మరి, ఈసారి మెరుగైన మార్పు వస్తుందని ప్రపంచం ఆశించవచ్చా?
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనా ఎఫెక్ట్: నారింజ రసం ధరలు పైపైకి
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








