ఆస్ట్రేలియా: ఈతకు వెళితే మొసలి తలను పట్టుకుంది, దవడలను చీల్చి బయటపడ్డాడు...

మొసలి

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఒక వ్యక్తి సరదాగా ఈతకు వెళితే అతనిపై మొసలి దాడి చేసింది. అయితే ఆ దాడి నుంచి అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

51 సంవత్సరాల వయసున్న మార్కస్ మెక్‌గోవన్ ఓ ఎక్స్‌క్లూజివ్ రిసార్ట్‌లో ఈత కొడుతున్నాడు. ‘‘ఎక్కడి నుంచి వచ్చిందో ఓ ఉప్పునీటి మొసలి నాపై దాడి చేసి తలను పట్టేసుకుంది’’ అని మార్కస్ వెల్లడించారు.

ప్రాణాలు పోయే స్థితిలో ఆ మొసలితో పోరాడిన మార్కస్, చివరకు దాని దవడలను బలవంతంగా విడదీసి తలను బయటకు తీసుకురాగలిగారు. ప్రస్తుతం ఆయనను సమీపంలోని ఓ ఆసుపత్రికి విమానంలో తరలించారు.

‘‘ఇక్కడున్న చేపలను పరిశీలిద్దామని మిత్రులతో కలిసి స్నోర్కెలింగ్‌( నీటి అడుగున ఈదడం)కి వచ్చా. మొదట అది నా దగ్గరకు వచ్చినప్పుడు షార్క్ అనుకున్నా. కానీ తర్వాత అర్ధమైంది అది మొసలి అని’’ అని మార్కస్ స్థానిక మీడియాతో అన్నారు.

‘‘అది నా తలను పట్టుకుంది. కానీ, ఎలాగోలా దాని దవడలను బలవంతంగా విడదీసి నా తలను బయటకు తీసుకోగలిగాను’’ అన్నారాయన.

తర్వాత కూడా మొసలి తనపై దాడికి ప్రయత్నించిందని మార్కస్ వెల్లడించారు.

‘‘అప్పటికే నా చేతికి మొసలి కరవడంతో గాయమై ఉంది. అది రెండోసారి నాపై దాడికి వచ్చింది. కానీ, గాయపడిన చేతితోనే దానిని అదిలించి అక్కడి నుంచి బయటపడ్డా’’ అని ఆయన స్కై న్యూస్‌తో అన్నారు.

మొసలి

ఫొటో సోర్స్, Getty Images

వరస దాడులు

మొదట మార్కస్‌ను హెలీకాప్టర్‌లో ఐలాండ్ హాస్పిటల్‌కు తర్వాత, కైర్న్స్ ప్రాంతంలో మరో ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రాణానికి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఆస్ట్రేలియాలో మొసళ్ల దాడులు చాలా అరుదుగా జరుగతాయి. అయితే, ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. గత కొద్ది నెలల్లో ఇలాంటి దాడులు కనీసం ఐదు జరిగాయని స్థానిక మీడియా కథనాలు రాసింది.

కేప్ యార్క్ సమీపంలోని హాగర్‌స్టోన్ ద్వీపానికి 28 కి.మీ. దూరంలో ఈ ఘటన జరిగింది. మొసలి తన వెనక నుంచి దాడి చేసిందని మార్కస్ వెల్లడించారు. దాడి చేసిన మొసలి చాలా యంగ్ గా ఉందని, రెండోసారి కూడా దాడి చేయగా తప్పించుకున్నానని ఆయన చెప్పారు.

మొసలి

ఫొటో సోర్స్, Getty Images

మత్స్యకారుడిని మింగేసిన మొసలి

మే నెల ప్రారంభంలో 65 ఏళ్ల కెవిన్ డార్మోడీ అనే మత్స్యకారుడి అవశేషాలు ఓ మొసలి కడుపులో కనిపించాయి.

ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని మొసళ్ల ఆవాస ప్రాంతమైన కెన్నడీస్ బెండ్ వద్దకు చేపల వేటకు వెళ్లిన డార్మోడీ అదృశ్య మయ్యారు.

డార్మొడీ కనిపించకుండా పోయిన ప్రాంతంలో సుమారు 4.1 మీటర్లు, 2.8 మీటర్ల పొడవైన రెండు భారీ మొసళ్లను రేంజర్లు కాల్చి చంపారు.

వాటిని పరిశీలించగా మనిషి శరీర భాగాలు బయటపడ్డాయి. అదృశ్యమైన మత్స్యకారుడి కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ విషాదంగా ముగిసినట్టు పోలీసులు చెప్పారు.

ఈ రెండు మొసళ్లు కలిసే అతన్ని చంపేసి ఉంటాయని అక్కడి అటవీశాఖ అధికారులు తెలిపారు.

మొసలి

ఫొటో సోర్స్, JERIN SAMUEL

ఎన్ని మొసళ్లు ఉన్నాయంటే...

క్వీన్స్‌లాండ్ ఎన్విరాన్‌మెంటల్ డిపార్ట్‌మెంట్ తాము ఈ ఘటనపై తాము దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించింది.

"ఇలాంటి ఓపెన్ సీ ప్రాంతాలలో మొసళ్లను గుర్తించడం చాలా కష్టం. ఈ జంతువులు రోజుకు పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి’’ అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కైర్న్స్ ప్రాంతంలోని ఓ బోటుపై ప్రయాణిస్తున్న వ్యక్తి మీద దాడి చేసి, అతని కుక్కను మింగేసిన ఓ మొసలిని రేంజర్లు కాల్చి చంపారు.

1974లో ఆస్ట్రేలియాలో మొసళ్ల వేటను నిషేధించడంతో అక్కడ దాదాపు 5,000 ఉన్న వాటి సంఖ్య, ఇప్పుడు దాదాపు 30,000కి చేరుకుంది.

వీడియో క్యాప్షన్, అడవిలో దారితప్పి అయిదు రోజులు వైన్ తాగి బతికిన లిలియన్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)