మ్యాన్ ఈటర్ ఆఫ్ చంపారన్: బీహార్‌లో తొమ్మిది మందిని చంపిన పెద్దపులి కాల్చివేత

బెంగాల్ టైగర్ (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెంగాల్ టైగర్ (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, మాలు కుర్సినో
    • హోదా, బీబీసీ న్యూస్

బీహార్‌లోని చంపారన్ జిల్లాలో తొమ్మిది మందిని చంపిన ఒక పులిని పోలీసులు కాల్చి చంపారు.

'మాన్-ఈటర్ ఆఫ్ చంపారన్' అని పిలుస్తున్న ఈ పులి కోసం దాదాపు 200 మంది పోలీసులు, అధికారులు వేటాడారు. ఈ పులి ఆచూకీ కనుక్కోవటానికి కొందరు అధికారులు ఏనుగుల మీద గాలింపు చేపట్టారు.

వాల్మీకి టైగర్ రిజర్వు పరిసరాల్లోని గ్రామస్తులను ఈ మగ పులి భయభ్రాంతులకు గురి చేసింది.

ప్రపంచంలోని అడవి పులుల్లో 70 శాతం పైగా పులులు భారతదేశంలో ఉన్నాయి.

దేశంలో పులుల జనాభా పెరుగుతున్నంత స్థాయిలో.. పులులకు ఆవాసమైన అభయారణ్యాలు విస్తరించలేదు.

దీనివల్ల కొన్ని పులులు మనుగడ కోసం మానవ ఆవాసాల వైపు మళ్లుతున్నాయి. ఫలితంగా పశువులు, కొన్నిసార్లు మనుషులు కూడా వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఆ పులి మనిషి రక్తం రుచి మరిగిందా? దానిని అధికారులే అడవిలోకి వదిలారా?

టీ-104 అని పేరు పెట్టిన ఈ మూడేళ్ల వయసు పులిని చంపే ఆపరేషన్‌కు బీహార్ పోలీసులు సారథ్యం వహించారు. సీతల్‌టోలా బాలువా అనే గ్రామం వద్ద చెరకు తోటలో ఈ పులిని చుట్టుముట్టారు.

ఈ పులి 'మనుషుల ప్రాణాలకు ప్రమాదకరం'గా గుర్తించటం జరిగిందని ఈ ప్రాంతంలో చీఫ్ వైల్డ్‌లైఫ్ గార్డెన్ కుమార్ గుప్తా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రికకు చెప్పారు.

ఒక పులి దాడిలో ఒక తల్లి, బిడ్డ చనిపోయారనే వార్త వచ్చాక.. శనివారం నాడు టీ-104 పులి కోసం తుది వేట మొదలైందని వాల్మీకి టైగర్ రిజర్వ్ డైరెక్టర్ నీసమణి.కె చెప్పారు.

''ఆ రాత్రి గ్రామం మొత్తానికి నిద్ర లేదు. పులిని దూరంగా తోలటానికి మాలో కొందరు రాళ్లను కొడుతూ శబ్దాలు చేస్తుండగా, మిగతా వాళ్లు డబ్బాలను మోగిస్తూ గడిపారు'' అని పాల్తు మహతో హిందుస్తాన్ టైమ్స్ వార్తా పత్రికకు వివరించారు.

వీడియో క్యాప్షన్, కాకినాడ జిల్లా ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న రాయల్ బెంగాల్ టైగర్

ఆ పులికి మత్తు మందు ఇవ్వటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, వేట బృందాలు చుట్టుముట్టినపుడు ఆ పులి ఏమాత్రం భయపడలేదని గుప్తా పేర్కొన్నారు.

రెండు ఏనుగుల మీద రెండు వేట బృందాలు అడవిలోకి వెళ్లాయి. పులి బయటకు వస్తుందని అధికారులు భావించిన ప్రదేశంలో మరో బృందం కాపు కాసింది.

శనివారం సాయంత్రం 3:15 గంటల సమయంలో టీ-104 పులిని కాల్చి చంపారు.

అక్కడి ప్రజల మరణాలకు మరో పులి కారణమని చెప్పే సమాచారమేదీ లేదని బీహార్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ పేర్కొన్నారు.

ప్రభుత్వం 2019లో ప్రచురించిన సమాచారం ప్రకారం.. ప్రతి ఏటా 40 నుంచి 50 మంది జనం పులుల దాడుల్లో చనిపోతున్నారు.

వీడియో క్యాప్షన్, పులుల సంఖ్య పెరిగితే ఓ పక్క ఆనందం.. మరోపక్క భయం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)