కొల్హాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కారాంబేల్కర్
- హోదా, బీబీసీ మరాఠి
కొల్హాపూర్ ఊరి పేరు, అంబాబాయి ఆలయం పేరు ఒకదానికొకటి పర్యాయపదం లాంటివి. ఈ రెండిటి మధ్య బంధం బలమైనది. అవినాభావమైనది.
కొల్హాపూర్ గుడిని అంబాబాయి ఆలయంగా - అంటే మహాలక్ష్మి గుడి అని పిలుస్తారు. ఇక్కడ దేవతను దర్శించుకోవటానికి ఎన్నో శతాబ్దాలుగా లక్షలాది మంది కొల్హాపూర్ వస్తున్నారు.
ఇది ప్రాచీన ఆలయం. గత కొన్ని శతాబ్దాలుగా మారుతున్న చరిత్రకు ఈ గుడి సాక్షిగా నిలిచింది. నేటి కొల్హాపూర్ నగరంలో తొలి నివాసం పంచగంగ నది ఒడ్డున మొదలైనట్లు బ్రహ్మపురి పర్వత శిఖరం మీద బయటపడిన పురావస్తు శిథిలాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రకూట పాలకులు బ్రహ్మపురి, ఉత్తరేశ్వర్, ఖోల్ఖండొబా, రంకాలా, పద్మాలా, రావణేశ్వర్ అనే ఆరు గ్రామాలను కలుపుతూ వాటి మధ్య మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించారని.. అదే అంబాబాయి ఆలయమని మరాఠీ విశ్వకోశ్ (విజ్ఞాన సర్వస్వం) చెప్తోంది.
పది - పన్నెండు శతాబ్దాల్లో ఇది శిలాహారుల రాజధానిగా ఉంది. వివిధ 'సాహీ'ల పాలనను చూసింది. మరాఠా సామ్రాజ్య స్థాపన తర్వాత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరాఠా సామ్రాజ్యం విభజన తర్వాత.. సతారాలో ఒకటి, కొల్హాపూర్‌లో ఒకటి చొప్పున రెండు రాజధానులు ఏర్పాటయ్యాయి. కొల్హాపూర్ పాలకుల వారసత్వ చరిత్ర ఇప్పటికీ కొనసాగుతోంది.
అంబాబాయి, మహాలక్ష్మి ఆలయం చరిత్రను తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక, చారిత్రక ప్రస్తావనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రముఖ సంపాదకుడు అరూన్ టికేకర్ తన 'స్థల్‌కాల్' పుస్తకంలో ఈ ఆలయం గురించి కొన్ని ప్రస్తావనలు ఇచ్చారు. ''ఈ ఆలయ గర్భగుడిని చాళుక్యుల సామంతుడైన కర్ణదేవుడు నేటి శకంలో 624 సంవత్సరంలో లేదా ఆ తర్వాత నిర్మించినట్లు భావిస్తారు. అనంతరం శిలాహార పాలకుడు మార్సిన్ ఈ ఆలయాన్ని విస్తరించగా.. అదే వంశానికి చెందిన గండరాదిత్య ఈ ఆలయ శిఖరాన్ని నిర్మించాడు'' అని అరూన్ వివరించారు.
''యాదవుల పాలనలో 13వ శతాబ్దంలో మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతల గుళ్లను ప్రధాన ఆలయానికి అనుసంధానించారు. వాస్తవానికి మహాలక్ష్మి గుడి ఆవరణలో పలు దేవతల గుళ్లు ఉన్నాయి. ముస్లిం పాలనలో ఈ ఆలయం దుర్దినాలను చవిచూసినట్లు చెప్తారు. కానీ ఛత్రపతుల పాలన స్థాపితమయ్యాక ఈ ఆలయాల పట్ల, వీటిలోని దేవతల పట్ల నిర్లక్ష్యం ముగిసిపోయింది'' అని ఆయన రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
''రుగ్వేదానికి ఉపాంగంగా భావించే 'శ్రీసూక్త'లో ప్రస్తావించిన 'శ్రీ' దేవతే లక్ష్మి. ఎందుకంటే లక్ష్మిని ప్రసన్నం చేయటానికి శ్రీసూక్తను ఉపయోగిస్తారు. శ్రీలక్ష్మి ఐశ్వర్యానికి ప్రతీక అయిన దేవత. ఆమెను స్వయం ప్రకాశితంగా, బంగారు వర్ణంలో ఉన్నట్లుగా, గుర్రాలు, రథాలు, ఏనుగుల యజమానిగా, కమలంలో ఆశీనమై, కలువపూల దండలు ధరించే దేవతగా భావిస్తారు'' అని మరాఠీ విశ్వకోశ్ వివరిస్తోంది.
''ఈ లక్ష్మి దరద్రాన్ని పారదోలుతుంది. జీవులన్నిటినీ పాలిస్తుంది. కోరికలు నెరవేరుస్తుంది. కార్దామ్, చిక్లిత్‌లు ఆమె కొడుకులని శ్రీసూక్త చెప్తోంది. శ్రీసూక్తలో చెప్పిన ప్రషిప్త మంత్రంలో ఆమెను విష్ణుపత్ని, మాధవప్రియ, అచ్యుతవల్లభగా ప్రస్తావించారు. ఆమెను మహాలక్ష్మిగా కూడా ఉటంకించారు. ఆమె విష్ణువుకు ప్రియమైనది. పాలసముద్రానికి రాణి. ఆమెను ధన, ధాన్య, ధైర్య, శౌర్య, విద్య, కీర్తి, విజయ, రాజ్య వంటి అష్టలక్ష్మిలుగా కూడా పూజిస్తారు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి వంటివి కూడా లక్ష్మి రూపాలే'' అని విశ్వకోశ చెప్తోంది.
వాసుదేవ షరన్ రచించిన దుర్గాసాపశతి (దేవీమహాత్మ్య)లో.. మహాలక్ష్మిని సర్వాంతర్యామిగా, ప్రపంచ మూలమహిళగా, ఆమె ఆకారిణిగానూ నిరాకారిణిగానూ చెప్పారు.
విగ్రహ రూపంలో ఆమె తన చేతుల్లో మాదీఫలం, దండం, డాలు, పానపాత్ర, పాము, తల మీద లింగ, యోని ధరించి ఉంటుంది. ఆమెను నాలుగు చేతుల రూపంలోను, ఎనిమిది చేతుల రూపంలోని పూజిస్తారు.
మహాలక్ష్మి తన ఉగ్రరూపంలో మహాకాళి అవుతుందని, తన సాత్విక రూపంలో మహాసరస్వతి అవుతుందని పురాణం చెప్తోంది. తర్వాత ఆమె బ్రహ్మదేవుడికి, లక్ష్మికి జన్మనిచ్చింది. ఆమె కోరిక మేరకు మహాకాళి శివుడికి, త్రివిధ జ్ఞానాలకు జన్మనివ్వగా.. మహాసరస్వతి విష్ణువుకు, గౌరికి జన్మనిచ్చింది. ఈ విధంగా విశ్వం రూపకల్పన మొదలైంది. మహాలక్ష్మి సృష్టికర్త అయింది.

ఫొటో సోర్స్, Getty Images
గోవాలో మహాలక్ష్మి ఆలయం
''భారత సంప్రదాయంలో లక్ష్మి అనేది విష్ణువు భార్య పేరు. కానీ 'మహా' అనేది చేర్చి మహాలక్ష్మి అన్నపుడు.. ఆ పేరును విష్ణుపత్నికి, శివపత్నికి ఇరువురినీ ప్రస్తావించటానికి ఉపయోగిస్తారు'' అని కూడా పురాణం చెప్తోంది.
సంస్కృత నిఘంటువు 'వాచస్పాత్యా' రెండు అర్థాలు ఇచ్చింది. 'లక్ష్మి' అనే పదానికి అర్థం 'చిహ్నం'. ఆ రకంగా.. లక్ష్మి అంటే మంగళప్రదమైన చిహ్నాలను ధరించినది, ఇతరుల సంక్షేమాన్ని చూసేది అని అర్థం. ఈ అర్థంలో.. 'మహాలక్ష్మి' అనేది విష్ణువు భార్యకు, శివుడి భార్యకు ఇద్దరికీ వర్తిస్తుంది. ఎందుకంటే భక్తులు వారు ఇద్దరినీ శుభప్రదమైన దేవతలుగా పరిగణిస్తారు.
ఝాన్సీలో మహాలక్ష్మి ఆలయం సరస్సులో ఉంది.
పి.కె.ప్రభుదేశాయ్ రాసిన 'దేవీకోశ్' ఇలా చెప్తోంది.. ''రుగ్వేదంలోని ఖిలా సూక్తాల్లో భాగమైన శ్రీసూక్తం ప్రకారం.. ఆమెను విష్ణుపత్నిగా ఉటంకించారు. పురాణాలు కూడా విష్ణువు భార్యను మహాలక్ష్మిగా చెప్పాయి. కొల్హాపూర్ కాకుండా మరోచోట ఎక్కడైనా మహాలక్ష్మి విగ్రహాన్ని చెక్కేటట్లయితే.. అది విష్ణుపత్ని విగ్రహమని భావించి, ఆ విధంగానే చేయాలి''.
మహాలక్ష్మి ఆలయాలు గోవా, ఝాన్సీ, ముంబైలలో కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, ONKAR KARAMBELKAR
మహాలక్ష్మి- అంబాబాయి ఆలయ సముదాయం ప్రస్తుత రూపాన్ని చూసినట్లయితే.. ఇందులో ప్రవేశం దగ్గర 'మహాద్వారం' ఉంటుంది. లోపల ఒక పొట్టేలు, ఒక ఎద్దు, ఒక నగరఖానా (నగారాలు మోగించే ప్రాంతం), ఒక దీపమాలలతో పాటు.. మధ్యలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిల గుడులు, చుట్టూ ఇతర దేవతల గుడులు ఉంటాయి.
నేటి మహాలక్ష్మి ఆలయం గురించి.. ఆలయ వాస్తుశిల్పకళ చరిత్రలో నిపుణుడైన డాక్టర్ యోగేష్ ప్రభుదేశాయ్‌ని అడిగినపుడు.. ఆయన బీబీసీ మరాఠీకి ఈ కింది సమాచారం ఇచ్చారు.
ఆయన తన పుస్తకం 'శ్రీ మహాలక్ష్మి సమగ్ర దర్శన్'లో ఇలా రాశారు: ''ఈ ఆలయాన్ని నిర్మించింది కచ్చితంగా ఎవరు అనే దానికి ఆధారాలేవీ లేవు. దీనిని ఎప్పుడు నిర్మించారనే అంశంపై పలు అభిప్రాయాలు ఉన్నాయి. దీనిని ఎనిమిదో శతాబ్దంలో సింధ్ వంశ పాలనలో నిర్మించారని ఒక అభిప్రాయం చెప్తోంది. అయితే ఆలయ వాస్తుశిల్పకళ ఇది 11వ శతాబ్దానికి చెందినది కావచ్చునని వెల్లడిస్తోంది''.

ఫొటో సోర్స్, Getty Images
ఆయన బీబీసీ మరాఠీతో మాట్లాడుతూ.. ''ఈ మహాలక్ష్మి ఆలయానికి రెండు దశలున్నాయి. ఒకటి 1055కు ముందు. రెండోది ఆ తర్వాతి కాలం. ఈ ఆలయానికి నిప్పు పెట్టటానికి చోళ రాజులు ప్రయత్నించారు. దాని అర్థం.. ఈ ఆలయ నిర్మాణంలో అధిక భాగం చెక్కతో చేసి ఉండాలి'' అని పేర్కొన్నారు.
ఈ ఆలయ విశిష్ట లక్షణాల గురించి మాట్లాడుతూ.. ''ఈ గుడి విలక్షణమైనది. దీనికి రెండు అంతస్తులు, రెండు గర్భగుడులు ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న రెండు శిఖరాలు.. అనంతర కాలంలో 18 లేదా 19వ శతాబ్దాల్లో చేర్చినవి కావచ్చు'' అని వివరించారు.
ఆలయ రూపురేఖల గురించి ప్రస్తావిస్తూ.. ''శ్రీ మహాలక్ష్మి ఆలయ గర్భగుడికి కచ్చితంగా పైన.. రెండో అంతస్తులో ఆద్యలింగం లేదా మాతృలింగం ఉంది. శ్రీమహాలక్ష్మి విగ్రహం బ్రహ్మస్థానంలో ఉంది. గుడిలో స్నాన స్థలి, నిద్రించే చోటు, నిల్వ చేసే చోటు కూడా ఉన్నాయి. పాత రోజుల్లో ఈ స్థలాలను ఎలా ఉపయోగించారనేది చెప్పటం కష్టం. ఆలయం పైకప్పు లోపలి భాగాన్ని చూస్తే.. చెక్కతో చేసిన శిల్పకళాకృతుల స్థానంలో రాతి కళాకృతులను భర్తీ చేసినట్లు కనిపిస్తుంది'' అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Getty Images
మహాలక్ష్మి విగ్రహం గురించి చరిత్ర పరిశోధకుడు ఇంద్రనీల్ బంకాపురి బీబీసీ మరాఠీకి మరింత సమాచారం అందించారు.
''ఈ విగ్రహాన్ని నల్ల పింగాణి రాతితో చెక్కారు. నిలబడివున్నట్లుగా విగ్రహాన్ని మలిచారు. ఆమె తన చేతుల్లో మాదీఫలం, దండం, డాలు, పానపాత్ర ధరించి ఉంటుంది. ఇటువంటి విగ్రహాలు కర్ణాటక, తమిళనాడు, ఒడిషాలలో కూడా కనిపిస్తాయి. ఆమెకు పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో సైతం ఆమె భక్తులు ఉన్నారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్, తూర్పు భారతదేశం నుంచి కూడా భక్తులు ఆమెను పూజించటానికి వస్తుంటారు. అందుకే నవరాత్రి సమయంలో ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తారు'' అని వివరించారాయన.
ఇవి కూడా చదవండి:
- ఒక సామాన్య మధ్యతరగతి ఇల్లాలిపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉంటుంది?
- విడాకుల సమయంలో భరణం తర్వాత మెయింటెనెన్స్ కూడా చెల్లించాలా? హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- ఈ దేశంలో వంట నూనె కూడా ‘డ్రగ్స్‌లాగా రహస్యంగా దాచిపెట్టి’ అమ్ముతున్నారు.. ఎందుకంటే..
- ‘ఒక్కసారి నాటితే 60 ఏళ్ల వరకు దిగుబడులు’ - ఖర్జూరం పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














