జ్ఞాన్‌వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?

జ్ఞాన్‌వాపి కేసు

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, విభురాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘జ్ఞాన్‌వాపి మసీదు-శృంగార గౌరీ ఆలయం’’ వివాదంలో హిందువులు దాఖలుచేసిన పిటిషన్‌ను వారణాసి జిల్లా న్యాయస్థానం విచారణకు పరిగణలోకి తీసుకోవడంతో ఈ కేసు కూడా బాబ్రీ మసీదు దారిలోనే వెళ్తోందని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.

‘‘ఈ కేసు విచారణ కూడా అదే దారిలో వెళ్తుందని అనిపిస్తోంది. ఇది బాబ్రీ లాంటి భూమికి సంబంధించిన వివాదం కాదని, కేవలం పూజలు చేసేందుకే వారు అనుమతించాలని కోరుతున్నారని కొందరు చెబుతున్నారు. అసలు అది ఎలా సాధ్యం?’’అని ఆయన ప్రశ్నించారు.

‘‘బాబ్రీ తీర్పు వచ్చినప్పుడు.. ఇది మరిన్ని సమస్యలకు కారణం కాబోతోందని అప్పుడే చెప్పాను. ఎందుకంటే ఆ తీర్పు మత విశ్వాసాల ఆధారంగా ఇచ్చారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలోని శృంగార గౌరీ దేవాలయంలో పూజలు చేసేందుకు అనుమతించాలని ఐదుగురు మహిళలు దాఖలుచేసిన పిటిషన్‌ను గత సోమవారం వారణాసి జిల్లా జడ్జి అనుమతించే సమయంలో ముస్లింల అభ్యంతరాలను తోసిపుచ్చారు.

గత ఏడాది ఆగస్టులో దిల్లీకి చెంది రాఖీ సింగ్, మరో నలుగురు మహిళలు ఆ ఆలయంలో పూజలు చేసేందుకు అనుమతించాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అక్కడ పూజలను నిర్వహిస్తే ప్రార్థనా స్థలాలు (ప్రత్యేక నిబంధనలు) చట్టం, వక్ఫ్ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని మసీదును పర్యవేక్షిస్తున్న అంజుమన్ ఇస్లామియా కమిటీ చెబుతోంది.

జ్ఞాన్‌వాపి కేసు

ఫొటో సోర్స్, ANI

జ్ఞాన్‌వాపి కేసు ఇతర కేసులపై ఎలా ప్రభావం చూపిస్తుంది?

హిందువులు దాఖలు చేసిన ఆ పిటిషన్.. ప్రార్థనా స్థలాల చట్టం లేదా వక్ఫ్ చట్టాలను ఉల్లంఘించడం లేదని వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ చెప్పారు. అయితే, ఇతర కేసులపై ఈ కేసు ఎలా ప్రభావం చూపిస్తుంది?

ఈ ప్రశ్నపై హిమాచల్ ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ చంచల్ కుమార్ సింగ్ మాట్లాడారు. ‘‘ఈ కేసును కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో ఇప్పటికిప్పుడు జ్ఞాన్‌వాపి మసీదు స్టాటస్ ఏమీ మారదు. ఎందుకంటే ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం, ఒక మతానికి చెందిన ప్రార్థనా స్థలంలో వేరే మతానికి చెందిన వారు ప్రార్థనలు చేయకూడదు. దీనికి ఒకేఒక మినహాయింపు ఉంది. అదే అయోధ్య-బాబ్రీ మసీదు కేసు. ఎందుకంటే అది భూమికి సంబంధించిన వివాదం’’అని ఆయన చెప్పారు.

‘‘ఇలాంటి వివాదాలు భారత్‌లో మరికొన్ని కూడా ఉన్నాయి. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని వస్తాయి. ఇప్పుడు జ్ఞాన్‌వాపి కేసును పరిశీలిస్తే, కోర్టు పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్నప్పుడు హిందువుల అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు మాత్రమే చెప్పింది’’అని ఆయన వివరించారు.

అయితే, అది చట్టపరంగా సాధ్యం కాకపోవచ్చని చంచల్ కుమార్ అన్నారు. ‘‘మరోవైపు వారణాసి జిల్లా కోర్టు నిర్ణయంపై హైకోర్టులో అప్పీలు చేయబోతున్నట్లు అంజుమన్ బోర్డు ఇప్పటికే స్పష్టంచేసింది. నాకు తెలిసినంతవరకు జిల్లా కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయొచ్చు. ఎందుకంటే ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఈ పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు అనుమతించకూడదు’’అని ఆయన చెప్పారు.

జ్ఞాన్‌వాపి కేసు

ఫొటో సోర్స్, ANI

కొత్త వివాదాలు వస్తాయా?

భారత రాజకీయాల్లో అయోధ్య వివాదం ఏళ్లపాటు కొనసాగింది. మొదట రామ జన్మభూమి ఉద్యమం, ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత, చివరగా సుప్రీం కోర్టు తీర్పుతో ఈ వివాదం ఓ కొలిక్కివచ్చింది. దీంతో మిగతా మతపరమైన కట్టడాలకు సంబంధించిన వివాదాలు కూడా రాజకీయ ఉద్యమాలకు బదులుగా కోర్టుల మార్గాన్ని ఎంచుకోవడం కనిపిస్తోంది.

రాజకీయాలపై ఏళ్ల నుంచీ వార్తలు రాస్తున్న పీటీఐకి చెందిన సీనియర్ జర్నలిస్టు దీపక్ రంజన్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘అయోధ్య లేదా కాశీ లేదా మథురా.. ఈ వివాదాలన్నీ చాలా సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి. అయోధ్య కేసును పరిశీలిస్తే, వివాదాన్ని ఎలా పరిష్కరించొచ్చు అని సుప్రీం కోర్టు చూపించింది. మన దేశం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లాలంటే ఇలాంటి సున్నితమైన అంశాలను కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం’’అని ఆయన అన్నారు.

అయోధ్య, జ్ఞాన్‌వాపి లాంటి కేసులు చాలా ఉన్నాయి. మథురలో ఆలయం-మసీదు, తాజ్‌మహల్, కుతుబ్ మినార్, బెంగళూరులోని ఈద్గా మైదాన్.. ఇలా చాలా ఉన్నాయి. దేశంలోని భిన్న ప్రాంతాల నుంచి ఈ వివాదాలు తెరపైకి వస్తున్నాయి.

‘‘హిందువుల తరఫువారు లేదా ముస్లింల తరఫువారు.. ఎవరైనా ఈ వివాదాలతో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తారు. ఎందుకంటే ఇవి సామాజిక అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసులను సుప్రీం కోర్టు నేరుగా విచారణకు స్వీకరించాలి. అన్నింటిని కలిపి ఒక రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలి. అన్నింటినీ ఒకేసారి పరిష్కరించాలి’’అని దీపక్ రంజన్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ప్రభుత్వంపై తమకు భరోసా లేదంటున్న స్థానిక ముస్లింలు

ప్రార్థనా స్థలాల చట్టంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

జ్ఞాన్‌వాపి కేసు, మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-ఈద్గా మసీదు వివాదాలలో ప్రార్థనా స్థలాలు (ప్రత్యేక నిబంధనలు) చట్టం-1991 గురించి ప్రస్తావిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం, 1947 ఆగస్టు 15కు ముందు ప్రార్థనా స్థలాలు ఏ మతానికి చెందినవో ఆ తర్వాత కూడా అదే మతానికి చెందినవై ఉంటాయి.

ఈ చట్టం నుంచి అయోధ్య వివాదానికి మినహాయింపు ఉంది. అయితే, జ్ఞాన్‌వాపి వివాదంలోనూ ఈ చట్టం వర్తించదని వారణాసి జిల్లా కోర్టు చెప్పడంతో తాజాగా మళ్లీ చర్చ మొదలైంది.

ప్రార్థనా స్థలాల చట్టంలోని నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ గత జూన్‌లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సెక్యులరిజం భావనను ఈ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు చెబుతున్నారు.

ఈ అంశంపై సుప్రీం కోర్టు అడ్వొకేట్ విరాగ్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ప్రార్థనా స్థలాల చట్టంలోని నిబంధనల చెల్లుబాటును సుప్రీం కోర్టులోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే చర్చ మొదలైంది. ఇది చాలా క్లిష్టమైన అంశం’’అని అన్నారు.

‘‘అయోధ్య తీర్పు సమయంలో.. ప్రార్థనా స్థలాల చట్టంలోని నిబంధనల చెల్లుబాటును ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం సమర్థించింది. అయితే, ఈ వివాదాలకు సంబంధించి కొత్తగా వెలుగులోకి వస్తున్న కోణాలను పరిశీలించేందుకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులతో మరో ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొత్తకొత్త భాష్యాలు, వివరణలు, సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఒక నిర్ణయానికి రావడానికి చాలా సమయం పట్టొచ్చు’’అని ఆయన వివరించారు.

మరోవైపు ‘‘అసలు ఈ ప్రార్థనా స్థలంలో మొదట ఏ మతానికి చెందిన వారు ప్రార్థనలు చేసేవారు? తర్వాత ఏమైంది? ఈ ప్రార్థనా స్థలం పరిధి ఎంతవరకు ఉంది? లాంటి ప్రశ్నలకు కూడా కోర్టులే సమాధానాలు చెప్పాలి’’అని చంచల్ సింగ్ అన్నారు.

బెంగళూరు ఈద్గా మైదాన్

ఫొటో సోర్స్, ANI

లైను

కోర్టుల్లో ఉన్న ఇతర వివాదాలు

లైను

బెంగళూరు ఈద్గా మైదాన్ కేసు

బెంగళూరులోని ఈద్గా మైదానం 1871 నుంచీ తమ ఆధీనంలోనే ఉందని ముస్లింలు చెబుతున్నారు. ఇక్కడ ప్రార్థనా స్థలంతోపాటు శ్మశానం కూడా ఎప్పటినుంచో ఉందని వివరిస్తున్నారు.

అయితే, ఇక్కడ ఈ మైదానంలో ఇతర మతాల వేడుకలను నిర్వహించుకోవచ్చని కర్నాటక హైకోర్టు చెప్పింది. దీంతో ఈద్గా మైదాన్‌లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో ముస్లిం అసోసియేషన్ ఆఫ్ కర్నాటక సవాల్ చేసింది.

ఈ మైదానాన్ని వక్ఫ్ ఆస్తిగా మైసూర్ స్టేట్ వక్ఫ్ బోర్డు ప్రకటించిందని కోర్టులో ముస్లింల ప్రతినిధులు చెప్పారు. ఒకసారి ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించిన తర్వాత, దానిలో మార్పులు చేయడానికి వీలులేదని వివరించారు.

వాదనల అనంతరం హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. అక్కడ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని, యాథాతథ స్థితిని కొనసాగించాలని సూచించింది. అనంతరం సెప్టెంబరు 23కు విచారణను కోర్టు వాయిదా వేసింది.

మథుర ఆలయం-మసీదు

ఫొటో సోర్స్, ANI

లైను

మథుర ఆలయం-మసీదు వివాదం

లైను

ఈ వివాదం కూడా ఎప్పటినుంచో ఉంది. అయితే, ఈ భూమిపై 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ మసీదు ట్రస్టు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

అయితే, అసలు ఈ స్థలం మొదట ఎవరికి చెందినది? ఇక్కడ మొదట దేవాలయం కట్టారా? లేదా మసీదు కట్టారా? అనే ప్రశ్నలపై తరచూ చర్చలు జరుగుతున్నాయి. 1618 నుంచి ఈ భూమి తమ ఆధీనంలో ఉందని హిందువుల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.

దీనిపై కోర్టు స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ముస్లింలతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ హిందూ సొసైటీకి ఎలాంటి అర్హతాలేదని, ఆ ఒప్పందం అక్రమమని కోర్టులో పిటిషనర్లు చెబుతున్నారు. అసలు శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టును ఆ ఒప్పందంలో చేర్చుకోలేదని వివరిస్తున్నారు.

అయితే, ఆ ఒప్పందం అక్రమం అయితే, అప్పుడే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు? అసలు ఆ ట్రస్టు నుంచి ఎవరూ ఎందుకు మాట్లాడటంలేదని ముస్లింలు అంటున్నారు. ప్రస్తుత పిటిషనర్లంతా బయటి వ్యక్తులని, అసలు వారు ఆ ఒప్పందం గురించి ఎలా ప్రశ్నించగలరని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మథుర సివిల్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

వీడియో క్యాప్షన్, కాశీ-జ్ఞాన్‌వాపి వివాదమేంటి? దాని వెనుక ఉన్న చారిత్రక మూలాలేంటి?
లైను

కుతుబ్ మినార్ కేసు

లైను

కుతుబ్ మినార్ ప్రాంగణం ఒకప్పడు హిందువుల ప్రార్థనా స్థలమని కొన్ని హిందూ సంస్థలు చెబుతున్నాయి.

ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేసిన హిందూ కార్యకర్త, న్యాయవాది హరి శంకర్ జైన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ అక్కడ ధ్వంసమైన హిందూ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. ఇది దేశానికి సిగ్గుచేటు. అక్కడ హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతించాలి’’అని వ్యాఖ్యానించారు.

‘‘అయితే, గత 800ఏళ్లుగా ఎలాంటి పూజలు లేకుండా దేవుడు జీవించినప్పుడు, ఇప్పుడు కూడా అలానే జీవించనివ్వండి’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.

గత మేలో కొన్ని హిందూ రైట్ వింగ్ సంస్థల సభ్యులు ఇక్కడ పూజలు చేసేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేశారు.

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌ బేస్‌మెంట్లో మూసేసిన ఆ 22 గదుల్లో దాగిన రహస్యాలేంటి?
లైను

తాజ్‌మహల్‌పై వివాదం

లైను

ఆగ్రాలోని తాజ్‌మహల్ కూడా ఎప్పటినుంచో వివాదాలకు కేంద్ర బిందువవుతోంది.

తాజ్‌మహల్‌లోని మూసివేసి ఉంచి 22 గదులను తెరవాలని దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ ధర్మాసనం తోసిపుచ్చింది.

ఆ గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయేమో పరిశీలించాలని పిటిషనర్లు చెబుతున్నారు. ఈ పిటిషన్‌ను ఒక బీజేపీ నాయకుడు దాఖలు చేశారు. అయితే, పార్టీతో దీనికి ఎలాంటి సంబంధమూలేదని చెప్పారు.

తాజ్‌మహల్ ఉన్నచోట ఒకప్పుడు శివాలయం ఉండేదని, హిందూత్వ చరిత్రకారుడు పురుషోత్తమ్ నాగేశ్ దీని గురించి తన పుస్తకాల్లో ప్రస్తావించారని కూడా కొందరు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)