ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుమారు 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇప్పుడు భారతదేశంలో హాట్ టాపిక్‌గా మారాడు. సోషల్ మీడియాలో ఔరంగజేబు మీద చర్చలు నడుస్తున్నాయి.
భారతదేశాన్ని ఘనంగా పాలించిన మొఘల్ చక్రవర్తులలో చివరివాడిగా ఔరంగజేబు గురించి చెప్పుకుంటారు. 1658 నుంచి 1707 వరకు సుమారు 50 సంవత్సరాలు దేశాన్ని పాలించాడు. కానీ, చరిత్రకారులకు ఔరంగజేబు ఏమంత ప్రియమైనవాడు కాడు.
సొంత తండ్రిని కటకటాల పాలు చేసి, అన్నను చంపి సింహాసనం ఎక్కాడు. మిగతా మొఘల్ చక్రవర్తులతో పోలిస్తే ఔరంగజేబు క్రూరుడిగానే కనిపించాడు.
ఔరంగజేబు ముత్తాత అక్బరు దయగల ప్రభువుగా, లౌకికవాదిగా పేరు తెచ్చుకున్నాడు. తాత జహంగీర్ కళలు, వాస్తుశిల్పం పట్ల మక్కువ ఉన్న రాజుగా, తండ్రి షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించిన గొప్ప ప్రేమికుడిగా చరిత్ర పుటల్లోకెక్కారు.
కానీ, మొఘల్ చక్రవర్తులలో ఆరవ వాడైన ఔరంగజేబును నిరంకుశుడిగా, క్రూరుడిగా చరిత్రకారులు అభివర్ణించారు. లౌకికవాదాన్ని పక్కనబెట్టి ఇస్లాంకు పెద్ద పీట వేసిన ఔరంగజేబు కఠినమైన షరియా చట్టాన్ని అమలుచేశాడు. హిందువుల పట్ల వివక్షాపూరితమైన జిజియా పన్ను ప్రవేశపెట్టాడు.
కళలు ముఖ్యంగా సంగీతాన్ని అసహ్యించుకున్నవాడిగా, అనేక దేవాలయాలను కూల్చివేసిన విధ్వంసకారుడిగా ఔరంగజేబు చరిత్రలో కనిపిస్తాడు.
అయితే, ఇదంతా ఎప్పుడో మధ్యయుగం నాటి సంగతి. కానీ, ఇటీవల ఔరంగజేబు పేరు మళ్లీ చర్చల్లోకి రావడం, అతడిపై విస్తరిస్తున్న ద్వేషం ఊహకు అందనిది.

ఫొటో సోర్స్, Getty Images
కారణమేంటి?
ఇటీవల వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వివాదం రాజుకోవడంతో ఔరంగజేబు పేరు తెరపైకి వచ్చింది.
16వ శతాబ్దానికి చెందిన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని 1669లో ఔరంగజేబు ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. ఈ ఆలయ శిథిలాలపై జ్ఞాన్‌వాపి మసీదు నిర్మించారని చరిత్రకారులు చెబుతారు.
ఈ నేపథ్యంలో, ఔరంగజేబు పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఔరంగజేబు గురించి వ్యాఖ్యలు, హేళనలతో మారుమోగిపోతోంది. కోర్టు పత్రాల్లో, హిందూ జాతీయవాద నేతల నోళ్లల్లో ఔరంగజేబు పేరు నానుతోంది.
గత డిసెంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ "ఔరంగజేబు దురాగతాలు, సృష్టించిన భీభత్సం" గురించి వారణాసిలోని ఒక సభలో మాట్లాడారు.
"కత్తితో నాగరికతను మార్చాలనుకున్నాడు. మతోన్మాదంతో సంస్కృతిని అణిచివేసేందుకు ప్రయత్నించాడు" అని మోదీ ఆ సభలో అన్నారు.
మళ్లీ గత నెలలో సిక్కు గురు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఔరంగజేబు ప్రస్తావన తీసుకువచ్చారు.
"ఔరంగజేబు ఎంతమంది తలలు నరికినా, మన విశ్వాసాలను కదిలించలేకపోయాడు" అని మోదీ అన్నారు.
గురు తేజ్ బహదూర్ ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకు శిరచ్ఛేదానికి గురయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మోదీ వ్యాఖ్యలు చూసి ఒక కెనడియన్-అమెరికన్ జర్నలిస్టు విస్తుపోయారు.
"భారత ప్రధాని మోదీ, 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారో వివరించగలరా?" అంటూ డేవిడ్ ఫ్రమ్ ట్వీట్ చేశారు.
దానికి చరిత్రకారుడు ఆడ్రీ ట్రష్కే స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
"ముస్లింలు హిందువులను వందల సంవత్సరాల పాటు అణచివేశారు. అందుకు ప్రతీకారంగా ఇప్పుడు ముస్లింలను అణచివేయాలని హిందూ జాతీయవాదులు విశ్వసిస్తున్నారు" అంటూ ఆడ్రీ ట్రష్కే వివరించారు.
"ప్రస్తుతం ముస్లింలపై ద్వేషం చిమ్మడానికి, హింసను ప్రేరేపించడానికి ఔరంగజేబు పేరును పావుగా వాడుకుంటున్నారని" ఆమె అన్నారు.
ఔరంగజేబు సమాధి మూసివేత
ఔరంగజేబును "కసాయివాడి"గా చిత్రిస్తూ బహిరంగ ప్రదేశాల్లో అతడి జాడలను తొలగించాలని ఆగ్రా నగర మేయర్ పిలుపునిచ్చారు.
ట్విటర్‌లో ఔరంగజేబును "దురాక్రణదారుడు"గా పేర్కొంటూ, హిందువులను తుడిచిపెట్టడానికి కంకణం కట్టుకున్న మొఘల్ చక్రవర్తిగా నిందిస్తున్నారు.
మొఘలుల కాలంలో హిందూ దేవలయాలను ధ్వంసం చేసి కట్టిన స్మారక చిహ్నాలు, భవంతులను బుల్‌డోజర్‌తో కూల్చివేయాలని మరొక యూజర్ సూచించారు.
గురువారం, మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని సందర్శకులకు మూసివేశారు. ఒక స్థానిక రాజకీయ నాయకుడు "ఆ సమాధి ఉనికిని" ప్రశ్నిస్తూ, దాని కూల్చివేయాలని పిలుపునిచ్చారు. దాంతో, దాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

ఫొటో సోర్స్, Getty Images
'ముస్లింలపై దాడికి ఔరంగజేబు పేరు అనుకూలం'
ముస్లింలను చెడుగా చిత్రీకరించడానికి "ఔరంగజేబు పేరు చాలా అనుకూలమని" అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్, రచయిత నదీమ్ రెజావి అన్నారు.
ఔరంగజేబు ఎన్నో దేవాలయాలను కూల్చివేసిన మాట నిజమే, హిందువులపై జిజియా పన్ను విధించిన మాట నిజమే కానీ, అతడు పూర్తిగా చెడ్డవాడు కాదని, అతడి వ్యక్తిత్వం సంక్లిష్టమని ప్రొఫెసర్ రెజావి అభిప్రాయపడ్డారు.
"ఔరంగజేబు హిందూ దేవాలయాల నిర్వహణకు అత్యధికంగా సొమ్మును కేటాయించాడు. అతడి శరీరంలో హిందూ రక్తం ఉంది. అతడి ముత్తాత అక్బరు, రాజపుతుల యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరే ఇతర మొఘల్ చక్రవర్తి కన్నా ఔరంగజేబు పాలనలో ఉన్నత స్థానాల్లో అనేకమంది రాజపుత్‌లు ఉన్నారు" అంటూ రెజావి వివరించారు.
చాలామంది అనుకున్నట్లుగా ఔరంగజేబు నిజ జీవితంలో అంత ఛాందసవాది కాదని, అతడు "వైన్ తాగేవాడని, వీణ వాయించేవాడని, ఇతర మొఘల్ చక్రవర్తుల కన్నా ఔరంగజేబు పాలనలోనే సంగీతంపై ఎక్కువ పుస్తకాలు వెలువడ్డాయని" ప్రొఫెసర్ రెజావి చెప్పారు.
కానీ, ఔరంగజేబు "తన రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తన అధికారాన్ని బలోపేతం చేయడానికి మతాన్ని ప్రయోగించాడు ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకుల్లాగా" అని ప్రొఫెసర్ రెజావి అన్నారు.
"ఔరంగజేబు ఎంత చెడ్డవాడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత ఛాందసవాది అయినా, మతహింసను ప్రేరేపించినా, ఎన్నో దేవాలయాలను కూల్చివేసినా, నేడు అతడిని అనుకరించాలా? ఇదీ మనం అడగవలసిన ప్రశ్న" అని ఆయన అన్నారు.
"అతడు నిరంకుశ పాలకుడు. 300 ఏళ్ల కిందట భారతదేశాన్ని పాలించిన చక్రవర్తి. అప్పట్లో ప్రజాస్వామ్యం అన్న మాట లేదు. పాలకులను నడిపించే రాజ్యాంగం లేదు. నేడు మనకు రాజ్యాంగం ఉంది. పార్లమెంటు, చట్టాలు ఉన్నాయి. అలాంటప్పుడు 16,17 శతాబ్దాలలో చేసిన పనులను ఇప్పుడు రిపీట్ చేయాలనుకోవడం ఏమిటి? 17వ శతాబ్దపు రాజకీయలను ఇప్పుడు వాడుతున్నారంటే, ఆనాటి ఔరంగజేబు కన్నా పెద్ద నేరం చేస్తున్నట్టు లెక్క" అని ప్రొఫెసర్ రెజావి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై హత్య ఆరోపణలు ఎందుకొచ్చాయి? డ్రైవర్ డెడ్ బాడీని ఆయన తన కారులోనే ఎందుకు తీసుకెళ్లారు
- హైదరాబాద్‌లో మరో దారుణం: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని నడి బజారులో నరికి చంపేశారు
- ఎప్పటిలాగే అడవికెళ్లి పుట్టగొడుగులు తెచ్చుకుని తిన్నారు, కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- ఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇంతకీ ఏం జరిగింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















