విషపూరిత పుట్టగొడుగులు ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్నాయా?

అంజలి ఖరియా తన కూతురుతో కలిసి ఏప్రిల్ 8న రాత్రి భోజనం చేస్తున్నప్పుడు, వారిద్దరు కలిసి తినే ఆఖరి భోజనం అదే అవుతుందని ఆమెకు తెలియదు.
అస్సాం రాష్ట్రం చపటోలీ గ్రామంలోని తేయాకు తోటల్లో పొద్దంతా పనిచేసిన ఆమె కొండవాలుల గుండా నడుస్తూ ఇంటికి చేరుకున్నారు. భోజనం చేసి వెంటనే నిద్రలోకి జారుకున్నారు.
రాత్రి 3 గంటల సమయంలో తన కూతురు సుష్మిత వాంతి చేసుకుంటోన్న శబ్ధం వినిపించడంతో ఆమె నిద్ర లేచారు. సుష్మిత పరిస్థితి చూసి ఆమె చాలా భయపడ్డారు.
రాత్రంతా సుష్మిత వాంతులు చేసుకుంటుండటంతో ఆమెలో ఆందోళన పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమె కుమారుడు, మామయ్య కూడా వాంతులు చేసుకోవడంతో ఆమె వణికిపోయారు.
''వారంతా ఒకేసారి వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత తీవ్రమైన విరేచనాలతో బాధపడ్డారు" అని 37 ఏళ్ల అంజలి ఖరియా చెప్పారు.
తమ పొరుగునున్న చాలామంది కూడా ఇలాంటి లక్షణాలతోనే బాధపడుతున్నట్లు ఆమెకు తెలిసింది.
''అది ఒక పీడకలలా అనిపించింది. అందరూ వాంతులు చేసుకుంటున్నారు. కానీ అలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు'' అని ఆమె నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.
చపటోలీ గ్రామం దిబ్రూగఢ్ జిల్లాలో ఉంది. ఉదయం కాగానే ఖరియా తన కూతురును తీసుకొని దగ్గర్లోని ఫార్మసీకి వెళ్లారు. అక్కడ వారు ఆమెకు సెలైన్ పెట్టడంతో పాటు మందులు ఇచ్చారు.
మిగిలిన రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసం అంబులెన్స్‌ను పిలిపించారు. తన కుమారుడితో పాటు మామయ్యను అంబులెన్స్‌లో పంపించడం కోసం ఆమె తనదగ్గర ఉన్న డబ్బునంతా ఇచ్చేశారు.
''నా కూతుర్ని వారితో పంపలేదు. ఎందుకంటే మందులు తీసుకున్న తర్వాత సుష్మిత పరిస్థితి కాస్త మెరుగైనట్లు అనిపించింది. ఇక ఆమె త్వరగానే కోలుకుంటుందని నేను అనుకున్నా'' అని ఖరియా చెప్పారు.
కానీ 24 గంటలు కూడా గడవకముందే సుష్మితకు మళ్లీ వాంతులు కావడం ప్రారంభమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఈసారి ఖరియా వద్ద డబ్బులు లేవు. కొన్ని గంటల తర్వాత సుష్మిత, ఆమె చేతుల్లోనే కన్నుమూసింది.
ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, ఆరోజు అనారోగ్యానికి గురైనవారంతా అడవి పుట్టగొడుగులను ఆహారంలో తీసుకున్నారని. సమీపంలోని అడవి నుంచి అంజలి మామయ్య వీటిని తీసుకొచ్చారు. పొరుగు వారికి కూడా వాటిని పంచిపెట్టారు. విషపూరిత మష్రూమ్‌లు తిని సుష్మితతో పాటు మరో ఇద్దరు మరణించారని అధికారిక నివేదికలు ధ్రువీకరించాయి. మొత్తం 11 మంది ఆసుపత్రిలో చేరారు.
నెల రోజులు గడిచిపోయాయి. కానీ నాటి విషాదం నుంచి ఆ గ్రామస్థులు ఇంకా తేరుకోలేదు.
''ఆ రాత్రిని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఎవరూ బతకరనే అనుకున్నా'' అని 36 ఏళ్ల నేహా లామా అన్నారు.
నేహాతో పాటు ఆమె కుమారుడు ఆసుప్రతిలో కొన్నిరోజుల పాటు చికిత్స పొందారు. చనిపోయినవారిలో ఆమె అత్తమామలు ఉన్నారు.
''మేం ఎన్నో ఏళ్లుగా అడవి నుంచి మష్రూమ్‌లను తెచ్చుకుని తింటున్నాం. అవి విషంగా మారతాయని మాకెలా తెలుస్తుంది?'' అని ఆమె అన్నారు.

అస్సాంతో పాటు పొరుగునే ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో విషపూరిత మష్రూమ్‌ల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి.
అక్కడి ప్రజలు మష్రూమ్‌లు, ఫెర్న్ (ఒక రకమైన అడవి మొక్క), అడవి బెర్రీల కోసం చెట్లలో వెదుకుతుంటారు. వాటిని రకరకాల ఆహారపదార్థాల్లో వాడతారు. అడవి పుట్టగొడుగులను కొన్ని ప్రాంతాల్లో రుచికరమైన ఆహారపదార్థంగా పరిగణిస్తారు. వాటితో సూప్‌లు తయారు చేస్తారు. కూర కూడా వండుకుంటారు.
అస్సాంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే, ఈ సీజన్‌లోనే అక్కడి తేయాకు తోటల్లో వందలాది మష్రూమ్‌లు పుట్టుకొస్తాయి. ఆ ఎస్టేట్లలో పనిచేసే పేద కార్మికులే దాదాపుగా వీటికి బాధితులుగా మారుతుంటారు.
ఈ మరణాలకు సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులు నిర్వహించలేదు. కానీ, ఏప్రిల్‌లో మరణించిన 16 మందిలో ఎక్కువ శాతం మంది తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల కుటుంబాలకు చెందినవారేనని బీబీసీతో రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు అధికారులు చెప్పారు.
"2008లో విషపూరిత పుట్టగొడుగులు తినడం వల్ల 20 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక సంఖ్య. దీని తర్వాత ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, ఎక్కువ బాధితులుగా మారింది తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులే" అని అస్సాం వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్త దిలీప్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్లో దిలీప్ కుమార్ కూడా ఒక సభ్యుడు.

''మష్రూమ్‌ల రకాలకు సంబంధించి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులకు అవగాహన లేకపోవడమే ఇలా జరగడానికి ప్రధాన కారణం. అరుదైన పుట్టగొడుగులు ఎలా ఉంటాయి? రుచికరమైనవి ఎలా ఉంటాయి? విషపూరిత పుట్టగొడుగులను ఎలా గుర్తించాలి? అనే అంశాలు వారికి తెలియదు'' అని డాక్టర్ వర్మ అన్నారు.
తమ కోసం పని చేసేవారిని కాపాడుకోవడం తోట యజమానుల బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.
''విషపూరిత పుట్టగొడుగులు తినొద్దంటూ గతంలో ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం చెప్పాలనుకున్న సందేశం ఈ కుటుంబాల వరకు రాలేదు. ఎందుకంటే వీరిలో ఎక్కువమంది నిరక్షరాస్యులే'' అని ఆయన చెప్పారు.
అస్సాంలోని సారవంతమైన కొండలు అత్యంత ఖరీదైన తేయాకుకు ప్రసిద్ధి. భారత్‌లోని పెద్ద సంస్థలు, బహుళజాతి కార్పొరేషన్లు ఇక్కడ విలాసవంతమైన లాడ్జిలను ఏర్పాటు చేశాయి. ఇవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
కానీ, ఇక్కడి కార్మికులు మాత్రం కష్టాలతో కాలం గడుపుతున్నారు.

చపటోలీ గ్రామంలో తేయాకు తోటల్లో పనిచేసే చాలా కుటుంబాలతో బీబీసీ మాట్లాడింది. చిల్లులు పడిన రేకులు, అపరిశుభ్ర పరిస్థితులు, వెదురు కర్రలతో నిర్మించిన ఇళ్లల్లో తాము నివసిస్తున్నట్లు వారు బీబీసీతో చెప్పారు.
కార్మికులకు లభించే వేతనం మరీ దయనీయంగా ఉంటుంది. తరచుగా ఆ కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇటీవల కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
''అందుకే మేం దొరికినదాన్ని తెచ్చుకుంటాం. వాటినే తింటాం'' అని ఖరియా అన్నారు. రోజంతా పనిచేస్తే అంజలి ఖరియాకు రూ. 130 వేతనంగా లభిస్తుంది. ఆరుగురు సభ్యులున్న కుటుంబంలో ఆమె ఒక్కరే సంపాదిస్తున్నారు.
''నా కూతురు చనిపోయిన తర్వాత ప్రభుత్వ అధికారులు మా వద్దకు వచ్చారు. విషపూరిత పుట్టగొడుగులు తినొద్దని చెప్పారు. కానీ, మేం పేదవాళ్లం. అన్నింటి ధరలు పెరిగిపోయాయి. కాబట్టి మాకు దొరికినదాన్ని తినే మేం బతకాలి'' అని ఆమె తన కుటుంబ పరిస్థితిని వివరించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అధిక ధరల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.
''ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా వారికి ఉచిత రేషన్ అందేలా చూస్తున్నాం'' అని దిబ్రూగఢ్ డిప్యూటీ కమిషనర్ బిస్వజిత్ పెగూ అన్నారు.
దీన్ని అంజలి ఖరియా ఖండించారు. తమకెప్పుడూ ఉచిత రేషన్ అందలేదని ఆమె చెప్పారు.
''కొన్ని రోజులైతే తినడానికి ఏమీ లేదు. అప్పుడు కూడా ఎవరూ మా దగ్గరికి రాలేదు. మాకు సహాయపడలేదు'' అని ఆమె తెలిపారు.

అమనిటా ఫాల్లోయిడ్స్ లేదా డెత్ క్యాప్ అని పిలిచే పుట్టగొడుగులను తిన్నప్పుడే స్థానికులు తీవ్ర అనారోగ్యం బారిన పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ డెత్ క్యాప్ పుట్టగొడుగులు లేత ఆకుపచ్చ లేదా తెలుపు రంగులో ఉంటాయి. ఇవి తిన్న తర్వాత వాంతులు, వికారం, పొత్తికడుపులో నొప్పి, తీవ్ర డయేరియా లాంటి దుష్ఫలితాలు కనిపిస్తాయి.
చాలాసార్లు రోగులు అనారోగ్యానికి గురైన వెంటనే ఆసుపత్రికి రారు. ఇది మూత్రపిండాలు, కాలేయం విఫలం కావడం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుందని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ సూపరింటెండెంట్ ప్రశాంత్ దిహింగియా అన్నారు. వారు చికిత్స కోసం వచ్చే సమయానికే జరగాల్సిందంతా జరిగిపోతుందని ఆయన చెప్పారు.
విషపు పుట్టగొడుగులపై అవగాహన కల్పించడమే ఈ సమస్యను అధిగమించడానికి ఏకైక మార్గమని ఆయన అన్నారు.
''ప్రజల్ని వారి సంప్రదాయ ఆహారాలు తినకుండా ఆపలేం. కానీ, ఆరోగ్యవంతమైన ఆహారాల గురించి వారికి అవగాహన కల్పించాలి'' అని అన్నారు.
ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్లి చెప్పడం సాధ్యం కాదు. కానీ, విషపూరిత పుట్టగొడుగులను ఎలా గుర్తించాలనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అధికారులు ప్రచారాలు నిర్వహిస్తున్నారని పెగూ చెప్పారు.
''మా ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలకు తరచుగా వెళ్తారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం'' అని ఆయన అన్నారు.
కానీ చపటోలి గ్రామ ప్రజలు దీన్ని నమ్మడం లేదు.
''మాలో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వారు వస్తారు'' అని ఖరియా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సినిమా రివ్యూ: `జోసెఫ్`ని కాపీ, పేస్ట్ చేసిన `శేఖర్`
- నిజామాబాద్ గ్రౌండ్లో పరుగు ప్రాక్టీస్ చేసిన బక్కపల్చని అమ్మాయి బాక్సింగ్‌లో వరల్డ్ చాంపియన్ ఎలా అయిందంటే
- కరాటే కల్యాణి వివాదమేంటి, అసలేం జరిగింది... దత్తత చట్టాలు ఏం చెబుతున్నాయి?
- నిఖత్ జరీన్: చరిత్ర సృష్టించిన తెలంగాణ బాక్సర్... వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
- ఆంధ్రప్రదేశ్: అయిదేళ్లుగా అంగన్వాడీలకు బిల్లులు చెల్లించడం లేదు, కొత్తగా వేతనాలలో జాప్యం... ఎందుకిలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












