మెక్‌డోనాల్డ్స్: భారత్‌లో ఈ ఫాస్ట్‌ఫుడ్ చైన్ ఎలా విజయం సాధిస్తోంది

ఫొటో సోర్స్, Getty Images
దశాబ్దాలుగా భారతీయుల అభిరుచులకు తగినట్లుగా ప్రపంచ దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయి. క్రమంగా స్థానిక రుచులకు ఈ సంస్థలు పెద్దపీట వేస్తూ వస్తున్నాయి. భారత్‌లో ఈ సంస్థల ప్రస్థానంపై బీబీసీ ప్రతినిధులు జోయా మతీన్, మెరిల్ సెబాస్టియన్ అందిస్తున్న కథనం ఇదీ.
దిల్లీ పరిసరాల్లో 1996లో మెక్‌డోనాల్డ్స్ తొలి షాపును తెరిచినప్పుడు పాశ్చాత్య రుచులు ఇక్కడివారికి చాలా కొత్త.
అయితే, మెనూలో స్థానిక రుచులకు ప్రాధాన్యమిస్తూ మెక్‌డోనాల్డ్స్ ముందుకువెళ్లి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
పంది, ఆవు మాంసాలు లేకుండా మీట్ ప్యాటీలు, గుడ్లు లేకుండా మయోనీస్‌లను మెక్‌డోనాల్డ్స్ తీసుకువచ్చింది. ఇక్కడి శాఖాహార ప్రియులకు తగినట్లుగా మెక్‌ఆలూ టిక్కీ, పిజ్జా మెక్‌పఫ్, స్పైసీ రాప్స్‌లను మెనూలో చేర్చింది.
క్రమంగా మెక్‌డీ బర్గర్లకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. దేశంలోని చాలా నగరాల్లో కంపెనీ ట్రేడ్‌మార్క్ లోగోతో షాపులు విస్తరించాయి. ‘‘అయామ్ లవింగ్ ఇట్’’ ట్యాగ్‌తో భారతీయులకు ఇవి సుపరిచితం అయ్యాయి.
ఇతర అమెరికా ఫాస్ట్‌ఫుడ్ చైన్లకు మెక్‌డోనాల్డ్స్ మార్గదర్శిగా నిలిచింది. ఈ సంస్థలన్నీ భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా నిరంతరం తమ మెనూలో మార్పులు చేస్తూ వచ్చాయి. ఫలితంగా మార్కెట్‌లోకి భారతీయ దినుసులతో కొత్త ఫుడ్స్ వచ్చి చేరాయి.
‘‘భారతీయుల రుచులకు అనుగుణంగా ఫుడ్స్‌ను అందించడంలో మెక్‌డోనాల్డ్స్, కేఎఫ్‌సీ, డోమినోస్ విజయవంతం అయ్యాయి. భారత్‌లో భిన్న ప్రాంతాలకు భిన్న రుచులను ఈ సంస్థలు తీసుకొచ్చాయి’’అని కన్సల్టెన్సీ సంస్థ టెక్నోపాక్ ఛైర్మన్ అరవింద్ సింఘాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా భిన్నరుచులను కలుపుతూ కొత్త రుచులను అందించడం భారత్‌లో కొత్తేమీ కాదు.
కేరళలో తియ్యటి పాయాసంతో కరకరలాడే అప్పడాన్ని అందించడంతో మొదలుపెట్టి ముంబయిలో అప్సరా ఐస్‌క్రీమ్ షాపులోని జామకాయ ఐస్‌క్రీమ్‌పై కారాన్ని చల్లడం వరకు ఇలా ఎన్నో భిన్నమైన రుచులు మనకు కనిపిస్తాయి.
‘‘భారతీయులకు అనుగుణంగా అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఫుడ్స్‌లో మార్పులు చేస్తుంటాయి. యూరప్‌తో పోల్చినప్పుడు కాస్త ఉప్పూ, కారం ఎక్కువగా వేస్తుంటాయి. తియ్యటి పదార్థాలను మరింత తియ్యగా ఇక్కడ అందిస్తుంటాయి’’అని సింఘాల్ చెప్పారు.
‘‘1980ల్లో మ్యాగీ బ్రాండ్ కింద నెస్లీ కొత్త కెచప్‌ను తీసుకొచ్చింది. మరింత కారంగా దీన్ని మార్చింది. దీంతో ఇది సూపర్‌హిట్ అయింది’’అని సింఘాల్ వివరించారు.
‘‘అలానే మ్యాగీ నూడుల్స్ కూడా భిన్నరుచుల్లో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. భారత్‌లోని ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఈ నూడుల్స్‌ను అందిస్తోంది’’అని ఆయన అన్నారు.
అయితే, ఇటీవల కాలంలో దిగ్గజ బ్రాండ్లు అసాధారణ కాంబినేషన్లతో ప్రయోగాలు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్నిక్కర్స్ కొత్తగా కేసర్ పిస్తా-సాఫ్రాన్, పాస్టాషియో బార్‌లను తీసుకొచ్చింది. మరోవైపు డంకిన్ కొత్తగా డ్రైఫ్రూట్స్ కలిపిన తీపి పానీయం థండాయ్‌ను తీసుకొచ్చింది. పాలతోచేసే ఈ పానీయంలో డ్రైఫ్రూట్స్, గులాబీ రేకులు, కుంకుమ పువ్వు వేస్తున్నారు. మరోవైపు మెక్‌డోనాల్డ్స్ తమ బర్గర్స్‌లో బటర్ చికెన్‌ను కూడా కలిపింది.
భారత్ దేశీయ బ్రాండ్లైన బీరా లాంటి సంస్థలు కూడా భిన్నమైన రుచులతో ముందుకు వస్తున్నాయి. మామిడి ఫ్లేవర్‌తో లస్సీ మిల్క్‌షేక్ బీర్‌లను బీరా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
కొన్ని అసాధారణ కాంబినేషన్లు భారతీయులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
‘‘ఫుడ్ బ్లాగర్లు వీటిపై వీడియోలు చేసినప్పుడు ఇవి వైరల్ అవుతుంటాయి. వీటి వల్ల ఆ బ్రాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంటుంది’’అని దిల్ సే ఫూడీ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న కరణ్ దువా చెప్పారు.
అయితే, కొన్నిసార్లు ఈ అసాధారణ కాంబినేషన్లను ప్రజలు తిరస్కరిస్తుంటారు కూడా. ఇక్కడ ప్రతి రుచికీ ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండనే ఉంటుంది.
ఉదాహరణకు బర్గర్లను తీసుకోండి. దీనికి ప్రత్యామ్నాయంగా వడ ఉంటుంది. పాప్‌కార్న్ తీసుకోండి. దీనికి ప్రత్యామ్నాయంగా భేల్‌పూరీ ఉంటుంది. పాప్‌కార్న్ బదులు దీన్ని తీసుకుంటున్నామని కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
భారత్‌లో భిన్న ప్రాంతాలకు అనుగుణంగా భిన్నరుచులను తీసుకురావడం సవాళ్లతో కూడుకున్న పని అని కరణ్ చెప్పారు. ‘‘ఇక్కడ రుచులు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రతి వీధి చివరా ఒక్కోరకమైన రుచి కనిపిస్తుంటుంది’’అని ఆయన అన్నారు.
‘‘గత ఏడాది భారత్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉండే సూరత్‌లో ఫ్రూట్ టీ తాగాను. పాలతో చేసిన టీలో పళ్ల ముక్కలు వేసి అందించారు’’అని ఆయన చెప్పారు. ఆ తర్వాత వేరేచోట చీస్, బట్టర్‌తో ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌ను కూడా తిన్నానని ఆయన వివరించారు.
‘‘గుజరాత్‌లో ప్రజలు తీపి, కారం కలిపి తింటుంటారు. అక్కడ ఈ కాంబినేషన్‌కు మంచి ప్రజాదరణ ఉంటుంది. కానీ, దిల్లీ ప్రజలకు ఇది పెద్దగా నచ్చకపోవచ్చు’’అని ఆయన వివరించారు.
ఇలా భిన్నరుచులను కలిపి అందించడమే లక్ష్యంగా కొత్త ఫాస్ట్‌ఫుడ్స్ సంస్థలు కూడా వస్తున్నాయి.
దక్షిణ ముంబయిలో ఇటీవల ఫ్రెంచ్ పేస్ట్రీల షాపు ఎల్15ను పూజా ధింగ్రా ప్రారంభించారు. ఫ్రెంచ్ టెక్నిక్‌లకు భారతీయ రుచులను కలగలిపి కొత్త ఫుడ్స్‌ను అందించేందుకు ఈ షాపును తెరిచినట్లు ఆమె చెప్పారు.
కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్లు నవ్వు కూడా తెప్పిస్తుంటాయి. పాన్ మెకరాన్స్, చాయ్ కప్ కేక్‌లు, గ్రీన్ చిల్లీ ట్రఫల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదే ఉంటుంది. కొన్ని రుచులతో మొదట తన తల్లిదండ్రులపై ప్రయోగాలు చేస్తానని, వారికి నచ్చితే మార్కెట్‌లోకి తీసుకొస్తామని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మన సంస్కృతీ సంప్రదాయాలను పరిశీలిస్తే, కొత్త కొత్త రుచులు మెనూలోకి అలా వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు కొత్తగా తీసుకొచ్చేవి చెండాలంగా కూడా ఉంటాయి. మరికొన్నిసార్లు ఇవి అద్భుతంగా అనిపిస్తాయి’’అని ఆమె అన్నారు.
‘‘ఆ ఫుడ్‌కు ప్రత్యేకమైన రుచి ఉండేటప్పుడు, దాన్ని మార్కెట్‌లో ప్రజలకు పరిచయం చేయడం చాలా తేలిక అవుతుంది’’అని ఆమె అన్నారు.
‘‘గత ఏడాది తీసుకొచ్చిన కాజుకట్లీ మెకరాన్ సూపర్‌హిట్ అయ్యింది. ఈ సారి మేం ఫ్రెంచ్ ట్విస్ట్‌తో బేసన్ లడ్డూను తీసుకొస్తున్నాం’’అని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ‘నేను ఎదురుగానే ఉన్నా చనిపోయానని మా అబ్బాయి అందరికీ చెబుతున్నాడు’
- ‘ఈ ప్రాంతం పగలు మనుషులది.. రాత్రి చిరుతపులులది, ఒకర్ని చూసి ఒకరు భయపడరు’
- లేడీ సింగం: కాబోయే భర్తపై కేసు పెట్టి జైలుకు పంపిన ఎస్ఐ
- ‘ఆ నటుడితో నాకు అఫైర్’ ఉందనే అనుమానంతో నా భర్త నన్ను తన్నాడు’
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















