రాజస్థాన్: ‘ఈ ప్రాంతం పగలు మనుషులది.. రాత్రి చిరుతలది, ఒకర్ని చూసి ఒకరు భయపడరు’

ఫొటో సోర్స్, Pushpendra Singh Ranawat
- రచయిత, సుగతో ముఖర్జీ
- హోదా, బీబీసీ ట్రావెల్
మేము అడవంతా పరుచుకున్న ఎత్తు పల్లాల దారులను దాటుకుంటూ ఒక ఎత్తైన ప్రాంతంలో ఆగాం. మేమక్కడ నుంచి చూస్తే కింద రాళ్లతో నిండిన విశాలమైన భూభాగం కనిపించింది. ఇదే రాజస్థాన్‌లోని ఆర్వార్ పర్వత శ్రేణిలో ఉన్న గోర్వార్ ప్రాంతం.
చిరుత పులులు-మనుషుల మధ్య ఎటువంటి సంఘర్షణ లేకుండా కలిసి మనుగడ సాగిస్తున్న అసాధారణ తీరుని చూసేందుకు తెల్లవారుజామున బయలుదేరి బేరా గ్రామానికి సఫారీకి వెళ్లాం. ఉదయ్‌పూర్ నుంచి ఈ గ్రామానికి వెళ్లేందుకు మూడు గంటల సమయం పడుతుంది.
ఇటీవల కాలంలో భారతదేశంలో పులుల సంఖ్య పెరిగింది. ఈ సంఖ్య 12,852కి చేరినట్లు 2018లో విడుదలైన నివేదిక చెబుతోంది.
అత్యధిక జనాభాతో నిండిన దేశంలో జంతువులు- మనుషుల మధ్య సంఘర్షణ, ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు చొరబడటం లాంటివి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చాలా మంది పులులను వాటి చర్మం, ఇతర శరీర భాగాలను అక్రమ మార్కెట్లలో అమ్మేందుకు వేటాడుతూ ఉంటారు. గ్రామంలో పశువులపై దాడి చేయడం లేదా మనుషులు సంచరించే ప్రాంతాల్లోకి పులులు చొరబడటంతో భయం వల్ల కూడా గ్రామస్థులు వాటిని చంపేస్తూ ఉంటారు.
2021లో మొదటి ఆరు నెలల్లో 102 చిరుతలను వేటాడగా, మరో 22 పులులను గ్రామస్థులు చంపేశారు. 2012 - 2018 మధ్యలో ఒక్క రాజస్థాన్‌లోనే 238 చిరుతలను చంపేశారు. మనుషులపై చిరుతపులుల దాడులు కూడా తరచుగా జరుగుతున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
రాజస్థాన్‍లోని ఈ మారుమూల గ్రామంలో మాత్రం పశువుల కాపరి తెగకు చెందిన గిరిజనులు, చిరుతపులులు కలిసి జీవనం సాగిస్తున్నాయి. ఈ గిరిజన తెగ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇరాన్ నుంచి వలస వచ్చింది. ఈ భూభాగంలో సుమారు 60 చిరుతలు, హైనాలు, ఎడారి నక్కలు, అడవి ఎలుగుబంట్లు, జింకలు, ఇతర జంతువులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Sugato Mukherjee
ఇక్కడ స్వేచ్ఛగా సంచరించే చిరుతలను జవాయి పులులని పిలుస్తారు. 1957లో జవాయి నదిపై నిర్మించిన ఆనకట్ట పేరు మీద వీటికా పేరును పెట్టారు.
ఈ నదిలో నీరు ఈ చుట్టు పక్కల పట్టణాలు, గ్రామాలకు ప్రధాన నీటి వనరు. ఇది దేశంలో ముఖ్యమైన వన్యమృగాల ఆవాసం.
బేరాకు 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న అడవిలోకి పుష్పేంద్ర సింగ్ రణావత్ అనే వన్యప్రాణి పరిరక్షకుడు నన్ను తీసుకుని వెళ్లారు.
"గత ఐదు దశాబ్ధాల్లో ఇక్కడ పులులను వేటాడిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ఇక్కడ చిరుతలు కూడా మనుషుల సంచారాన్ని ముప్పుగా చూడవు" అని ఆయన చెప్పారు.
"ఇది గుర్తించాల్సిన విషయం" అని నేను ఆశ్చర్యంతో అన్నాను.
"కాసేపట్లోమనం పులిని చూస్తాం" అని అన్నారు. ఆయన రాళ్లతో కప్పి ఉన్న భూభాగాన్ని బైనాక్యులర్లలోంచి పరికించి చూశారు. కొన్ని క్షణాలు వేచి చూశాం. అడవి పొదల్లోంచి వీస్తున్న గాలి శబ్దం మాత్రం వినిపిస్తోంది. వాతావరణం కాస్త వెచ్చగా మారింది.

ఫొటో సోర్స్, Sugato Mukherjee
ఆ నిశ్శబ్దంలో నెమలి అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి. ఇంతలో రణావత్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న రాయి వైపు ఆయన బైనాక్యులర్స్‌ను తిప్పారు.
ఒక చిరుత పులి బయటకు వస్తూ, రాళ్ల పక్కగా నడుస్తూ కనిపించింది. వేకువజాము సూర్యకిరణాలు పడుతున్న చోట ఒక బల్లపరుపు రాయిపై అది కూర్చుంది. ఈ పులి పేరు లక్ష్మి అని రణావత్ చెప్పారు.
ఇక్కడుండే పులులన్నిటికీ, స్థానికులు పేర్లను పెట్టారు.
మా పక్కనే మరో రెండు సఫారీలు వచ్చి ఆగాయి. లక్ష్మి మా వైపు తీక్షణంగా చూసి, ఆవలించి, పులికి సాధారణంగా ఉండే హుందాతో ఒళ్ళు విరుచుకుంది. ఒక అరుపు అరిచింది.
పొద్దున్న సఫారీ పూర్తవ్వగానే, రణావత్ నేను కలిసి జీవాడా గ్రామంలో సక్లా రామ్‌ను కలిశాను. ఈ గ్రామం బేరా నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన చెట్ల కొమ్మలను, ఆకులను కోయడం అప్పుడే ముగించారు. "ఆయన పశువుల కోసం మేతను సమకూరుస్తున్నారు" అని రణావత్ చెప్పారు.
రబరీ పశువుల కాపర్లను మేం అనుసరించాం. వారు గడ్డి మోపులను తల మీద పెట్టుకుని నడుస్తుంటే నడుస్తున్న చెట్లను చూస్తున్నట్లుగా అనిపించింది. నెమ్మదిగా మేం ఆయన ఇంటికి చేరుకున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
"నా దగ్గర 52 మేకలు ఉన్నాయి" అని రామ్ చెప్పారు. నేను ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆయన నాలుగేళ్ల కూతురు ఆయన పక్కనే కూర్చుంది.
పులుల దాడుల వల్ల మీరెన్ని మేకలను కోల్పోయారు?" అని అడిగాను. "కొన్ని పోయాయి" అని సమాధానమిచ్చారు.
మీకెలా అనిపించింది? మీకు కోపం రాలేదా?" అని అడిగాను.
రామ్ ఒక నిస్సహాయమైన నవ్వు నవ్వారు. "నాకు చాలా విచారం కలుగుతుంది. నేను నా పశువులన్నిటినీ సొంతంగా సాకుతాను. కానీ, పులులకు కూడా వాటి ఆహారంపై హక్కు ఉంటుంది కదా" అని అన్నారు.
ఆయన ఈ విషయాన్ని అంత సులభంగా చెప్పిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది.

ఫొటో సోర్స్, Pushpendra Singh Ranawat
పులుల దాడుల వల్ల పశు సంపదను పోగొట్టుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ఇస్తుంది. కానీ, దీని కోసం గ్రామస్థులు నింపాల్సిన పత్రాలు, వాటి చుట్టూ ఉండే పని ఈ పరిహారం తీసుకునేందుకు గ్రామస్థులను వెనకడుగు వేసేలా చేస్తుంది.
రబారీలు శివుడిని పూజిస్తారు. వీరు పులులు పశువులను చంపడాన్ని కూడా భగవంతుడికి సమర్పించే నైవేద్యంలా భావిస్తారు.
కానీ, దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఈ తరహా సంస్కృతి లేదు.
జంతువులను కూడా జీవావరణంలో భాగంగా చూడటంతో వల్ల ఈ సమాజంలో పులులు పశువులను వేటాడడాన్ని సాధారణంగానే పరిగణించడం అలవాటుగా మారింది.
మనుషులు, వన్యమృగాలు వేర్వేరు భూభాగాల్లో ఉండాలనే సంప్రదాయ వాదనలకు వీరి విధానం భిన్నంగా ఉంది. డబ్ల్యూసీఎస్ ఇండియా, హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, నీనా, నార్వే కలిసి హ్యూమన్ -లెపర్డ్ డైనమిక్స్ గురించి నిర్వహించిన అధ్యయనాన్ని బ్రిటిష్ ఇకలాజికల్ సొసైటీ జర్నల్ ప్రచురించింది.
బేరా లాంటి సమాజాల్లో పెద్ద పులులను ఆలోచనా శక్తి కలిగిన జీవుల్లా చూస్తారని, అవి వాటి మనసాక్షికి అనుగుణంగా వేటాడతాయని, వాటికి కూడా మనుషులతో కలిసి నివసించగలిగే సామర్ధ్యం ఉందని నమ్ముతారని ఈ అధ్యయనం చెప్పింది.
"పరస్పర గౌరవం అనేది ఇక్కడ కీలకం" అని రణావత్ అన్నారు.
అక్కడ నుంచి బేరాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రాతి మందిరం దగ్గరకు వెళ్లాం.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
"ఇవి చిరుతపులులకు ఇష్టమైన స్థావరాలు. ఈ గుహల్లో గాలి, వెలుతురు అన్ని వైపుల నుంచి వస్తుంది" అని రణావత్ చెప్పారు.
ఇక్కడ పులులు సంచరించడాన్ని చాలా మంది భక్తులు చూశారు. కానీ, ఒకరిని చూసి ఒకరు బెదిరిపోలేదు.
ఈ కొండపై ఉన్న దేవాలయం నుంచి చుట్టూ పరుచుకున్న పొలాలు, మరోపక్క బంజరు భూములు కనిపిస్తున్నాయి.
"ఇక్కడ గ్రామస్థులు గోధుమ, చిరు ధాన్యాలు, ఆవాలు పండిస్తారు" అని రణావత్ చెప్పారు.
"ఈ భూమి వ్యవసాయానికి పనికి రాదు. జింకలు, ఎలుగుబంటులను పెద్దపులులు పొలాల్లోకి రానివ్వవు" అని చెప్పారు.
"దీనిని బట్టి మనుషులు - పులులు కలిసి జీవిస్తున్నాయని చెప్పగలమా?" అని నేనడిగాను. "అవును" అని అంటూ గట్టిగా నవ్వారు.
సాయంత్రం అవుతోంది. బేరాలోని పులులు తమ స్థావరాల నుంచి బయటకు వేటకు బయలుదేరే సమయం ఆసన్నమైంది.
"ఈ ప్రాంతం పగలు మనుషులది, సాయంత్రం పెద్ద పులులది" అని రబారీలు అంటారు.
కానీ, ఈ నియమాన్ని ఉల్లంఘించడం రణావత్‌తో పాటు ఇతరులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇవి సులభంగా అంతర్జాతీయ, జాతీయ పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. నియంత్రణ లేని సఫారీలు, రాత్రి పూట జరిగే సఫారీలు ఈ పులులకు ఇబ్బందిగా తయారవుతున్నాయి. ఇవి సంచరించే ప్రాంతాల్లో నిర్మిస్తున్న హోటళ్లు, గెస్ట్ హౌస్ లు ఇప్పటి వరకూ సంరక్షించుకుంటూ వస్తున్న సున్నితమైన పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీసే ప్రమాదం ఉంది.
"జవాయికి కమ్యూనిటీ రిజర్వ్" స్టేటస్ ఇవ్వాలని రణావత్ అంటున్నారు. 2003లో సవరించిన భారతీయ వన్యమృగ సంరక్షణ చట్టం జీవావరణాన్ని పరిరక్షించేందుకు కొన్ని సామాజిక కార్యక్రమాలను ప్రారంభించింది. దీంతో, స్థానిక అభివృద్ధి ఏ మేరకు జరగవచ్చో నిర్ణయించే అవకాశం గ్రామస్థులకు లభిస్తుంది. కొన్ని సుస్థిరమైన పర్యటక కార్యక్రమాల్లో స్థానికులకు కూడా ఉపాధి లభించే అవకాశం కలుగుతుంది.
"రబారీల తర్వాత తరం కూడా ఈ పశువుల కాపరి సంస్కృతిని కొనసాగిస్తేనే పులులు - మనుషుల మైత్రి కూడా కొనసాగుతుంది" అని రణావత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sugato Mukherjee
నేను జవాయి నుంచి బయలుదేరి ఉదయ్‌పూర్‌కు తిరిగి వెళుతుండగా దారిలో కొంత మంది రబారి అమ్మాయిలు పశువులను కాస్తుండగా చూశాను. ఆ అమ్మాయిలు మాత్రం ఆధునిక వస్త్రధారణలోనే కనిపించారు. ఈ తెగలో మహిళలు సాధారణంగా ఘాగ్రా చోళీలు ధరించి, నెత్తి మీద ముసుగు వేసుకుంటారు. ఆ అమ్మాయిలు చేతిలో కర్రలు పట్టుకుని పశువులను మేపుతున్నారు.
అప్పుడప్పుడూ వాటిని అదుపు చేసేందుకు ఈలలు వేస్తున్నారు.
వారిని చూసి ఆసక్తితో నేను డ్రైవర్‌ను కారు ఆపమన్నాను. నేను కారు దిగి వారి దగ్గరకు వెళ్లాను. వారు హైస్కూలులో చదువుతున్నారు.
వాళ్ళ నాన్న పనులపై బయటకు వెళ్ళినప్పుడు వాళ్లు పశువులను కాస్తుంటారు. వారి చదువును పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, పశువులను కాస్తూ సంప్రదాయ రీతిలో బతకడమే వారికి సంతోషాన్నిస్తుందని చెప్పారు.
"వీళ్ళ సమాధానం వింటుంటే, ఇక్కడ మనుషులు కానీ, పులులు కానీ భవిష్యత్తును వెతుక్కుంటూ ఈ ప్రాంతం వదిలి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు" అని అనిపించింది.
ఇవి కూడా చదవండి:
- టీవీ9 వర్సెస్ విశ్వక్ సేన్: సహనం కోల్పోయింది ఎవరు
- భారత్‌లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్‌కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











