ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా వేదిక ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయటంతో.. ట్విటర్ భవిష్యత్తు గురించి గణనీయంగానే చర్చ జరిగింది. అమెరికా ప్రభుత్వం కూడా ''భారీ సోషల్ మీడియా వేదికలకు గల బలం గురించి ఆందోళన'' వ్యక్తం చేసింది.
అయితే.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 4,400 కోట్ల డాలర్లు పెట్టి ట్విటర్‌ను కొనటం.. ఇదే వేదికలో ఆయన చేసిన వివాదాస్పద ''ట్వీట్ల చరిత్ర''ను కూడా వెలుగులోకి తెచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాన్ 2009లో ట్విటర్‌లో ఖాతా తెరిచినప్పటి నుంచీ ఆయన చేసిన ట్వీట్లు ఆయన్ను చాలాసార్లు ఇబ్బందుల్లో పడేశాయి. కొన్నిసార్లు చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ గతంలో చేసిన అత్యంత వివాదాస్పద ట్వీట్లలో కొన్ని ఇవి.
థాయ్ గుహల్లో చిక్కుకున్న కుర్రాళ్ల ఉదంతంలో...

ఫొటో సోర్స్, Getty Images
2019లో బ్రిటన్‌కు చెందిన కేవ్ డైవర్ వెర్నాన్ ఉన్స్‌వర్త్‌ను ఓ ట్వీట్‌లో 'పీడో గై' అని అభివర్ణించిన ఎలాన్ మస్క్.. పరువునష్టం దావాను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు.
దానికి ఏడాది ముందు థాయ్‌లాండ్‌లోని ఓ భూగర్భ గుహలో చిక్కుకుపోయిన 12 మంది టీనేజీ కుర్రాళ్లను కాపాడే ఆపరేషన్‌కు సారథ్యం వహించిన వెర్నాన్ ఉన్స్‌వర్త్ ఆ ఉదంతంతో అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.
అప్పుడు ఆ ఆపరేషన్‌కు సాయం చేయటానికి ఎలాన్ మస్క్ ప్రయత్నించారు. ఒక మినీ సబ్‌మెరీన్‌ను విరాళంగా ఇవ్వాలనుకున్నారు.
కానీ.. ఎలాన్ ఆఫర్‌ను ''ప్రచార గిమ్మిక్కు''గా వెర్నాన్ ట్విటర్‌లో కొట్టివేయటంతో ఆయనతో ఎలాన్ ట్విటర్‌లో మాటల యుద్ధానికి దిగారు.
ఎలాన్ వ్యాఖ్యలపై వెర్నాన్ పరువునష్టం దావా వేశారు. ఎలాన్ తనకు 19 కోట్ల డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ కేసు వేశారు. అయితే లాస్ ఏంజెలెస్ కోర్టు మస్క్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది.
ఆ సమయంలో వెర్నాన్ ఉన్స్‌వర్త్ తరఫు న్యాయవాది లిన్ వుడ్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఈ తీర్పు ఒక సంకేతం పంపిస్తోంది. ఎవరికి తోచినట్టుగా వాళ్లు ఆరోపణలు చేయవచ్చు. అది ఎంత నీచమైనా కానీ, ఎంత అబద్ధమైనా కానీ. కొందరు (చట్టపరమైన చర్యలేమీ లేకుండా) బయటపడొచ్చు'' అని వ్యాఖ్యానించారు.
కోవిడ్-19 మీద ప్రతిస్పందనలు...

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని 2020 మార్చిలో మహమ్మారిగా ప్రకటించినపుడు లాక్‌డౌన్ల వంటి చర్యలను విమర్శిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్లు చేశారు. అవి ''తెలివితక్కువ'' పనులని కూడా అభివర్ణించారు.
కొత్త కరోనావైరస్ వల్ల ఎవరైనా చనిపోయారనేది నిర్ధారించటానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నిస్తూ ఆ ఏడాది జూన్ 30వ తేదీన ఆయన చేసిన ట్వీట్ చాలా అపకీర్తి మూటగట్టుకుంది.
ఎలాన్ మస్క్ తను వ్యాక్సీన్ వేయించుకున్నప్పటికీ.. వ్యాక్సీన్ తప్పనిసరి అనే ఆదేశాలను బాహాటంగా వ్యతిరేకించారు. వ్యాక్సీన్ వేయించుకోవటం తప్పనిసరి చేయటాన్ని నిరసిస్తూ కెనడా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగినపుడు.. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చుతూ ఎలాన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ యూదు సంస్థలకు ఆగ్రహం కలిగించింది.
పుతిన్‌తో బస్తీమే సవాల్...

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ మీద రష్యా సైనిక దండయాత్ర మీద చాలా మంది ప్రముఖుల నుంచి తీవ్ర ఆవేశంతో ప్రతిస్పందనలు వచ్చాయి. అయితే ఎలాన్ మస్క్ ప్రతిస్పందన చాలా విచిత్రమైన ప్రతిస్పందనల్లో ఒకటి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో ద్వంద్వ యుద్ధం చేయాలని సవాల్ చేస్తూ ఈలాన్ మస్క్ మార్చి 14న ట్వీట్ చేశారు.
''వ్లాదిమిర్ పుతిన్‌ను ముఖాముఖి యుద్ధానికి సవాల్ చేస్తున్నా. పందెం యుక్రెయిన్'' అంటూ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత నేరుగా రష్యా అధ్యక్షుడి అధికారిక అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ మళ్లీ ఇదే సవాల్ విసిరారు. జూడోలో బ్లాక్ బెల్ట్ ఉన్న పుతిన్ ఈ సవాల్‌కు ఇంకా ప్రతిస్పందించాల్సి ఉంది.
అమెరికా అధ్యక్షుడి మీద మండిపాటు

ఫొటో సోర్స్, Getty Images
ఎలాన్ మస్క్ అనేక వాణిజ్య కొనుగోళ్ల ద్వారా తన సంపదను ఆర్జించారు. అందులో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఒకటి. ఈ రంగం వాణిజ్యంలో అది అగ్రగామి సంస్థగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాలో విద్యుత్ కార్ల ఉత్పత్తి గురించి గత జనవరిలో చేసిన వ్యాఖ్యతో ఎలాన్ మస్క్ నొచ్చుకున్నట్లుగా ఉంది. బైడెన్ వ్యాఖ్యల్లో టెస్లా కంపెనీని ప్రస్తావించకుండా, ఆ కంపెనీ ప్రత్యర్థి కంపెనీలను ప్రస్తావించారు.
''బైడెన్ మనిషి రూపంలో ఉన్న నకిలీ తోలుబొమ్మ'' అంటూ ఈలాన్ మస్క్ జనవరి 27న ట్వీట్ చేశారు.
ఒక్క ట్వీట్‌తో టెస్లాకు దెబ్బ

ఫొటో సోర్స్, Getty Images
ఎలాన్ మస్క్ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యల వల్ల తన సొంత కంపెనీ టెస్లా వాటాదారులతోనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ట్వీట్ల కారణంగా టెస్లాకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.
టెస్లా కంపెనీలోని తన వాటాలో కొంత భాగాన్ని అమ్మాలా వద్దా అంటూ ఎలాన్ గత నవంబరులో ట్విటర్ పోల్ నిర్వహించారు. దీంతో టెస్లా షేర్ల ధరలు దాదాపు 5 శాతం పడిపోయాయి. నిజానికి ఎలాన్ పోల్‌లో ఓట్లు వేసిన 35 లక్షల అకౌంట్లలో 58 శాతం అకౌంట్లు ఆయన వాటాను అమ్మటానికే మొగ్గుచూపాయి.
దానికి ముందు 2020 మే నెలలో టెస్లా కంపెనీ షేర్ల ధరలు ''మరీ ఎక్కువగా'' ఉన్నాయని తనకు అనిపిస్తోందంటూ ఎలాన్ చేసిన ట్వీట్ వల్ల.. ఆ కంపెనీ భారీ మూల్యం చెల్లించుకుంది.
ఆ ఒక్క ట్వీట్ టెస్లా మార్కెట్ విలువను 1,400 కోట్ల డాలర్ల మేర తుడిచిపెట్టింది.
తాజాగా.. కోకా-కోలా జోక్

ఫొటో సోర్స్, Getty Images
ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశాక ఇటీవల చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. ఇప్పుడు తాను కోకా-కోలా కంపెనీని కొనాలని యోచిస్తున్నాని.. ఆ శీతల పానీయం ఫార్ములాకు కొకెయిన్‌ను చేర్చాలన్నది తన అభిలాష అని జోక్ చేస్తూ ఏప్రిల్ 28న ఎలాన్ ట్వీట్ చేశారు.
అమెరికా ఫార్మసిస్ట్ జాన్ పెంబర్టన్ 1885లో కనిపెట్టిన కోకా-కోలా తొలినాటి పానీయంలో కోకా ఆకు కషాయం ఉండేది. యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ డ్రగ్ అబ్యూజ్ సమాచారం ప్రకారం.. ఆ కాలంలో కొకెయిన్ వినియోగానికి చట్టబద్ధత ఉండేది. ఔషధాల్లో సాధారణంగా ఉపయోగించే దినుసుగా ఉండేది.
అయితే.. కోకా ఆకు కషాయాన్ని కోకా-కోలా పానీయం నుంచి తొలగించారు. 1929 నుంచీ దానిని మళ్లీ ఇందులో ఉపయోగించలేదు.
ఈ పోస్టుకు ఎలాన్ మస్క్‌ను ఫాలో అవుతున్న 8.74 కోట్ల మంది యూజర్లలో కొంత మంది సానుకూలంగా స్పందించగా.. మరికొందరు విమర్శించారు. ఇది మాదకద్రవ్యాలను ప్రస్తావిస్తున్నట్లుగా ఉందని తప్పుపట్టారు.
మాదకద్రవ్యాల విషయంలో ఎలాన్ మస్క్ వివాదాల్లో చిక్కుకోవటం ఇదే మొదటిసారి కాదు. ఆయన 2018లో జో రోగన్ అనే పాడ్‌కాస్టర్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ గంజాయి పొగతాగిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను గంజాయి వాడకం చట్టబద్ధంగా ఉన్న కాలిఫోర్నియాలో చిత్రీకరించారు. అయితే.. అలా గంజాయి తాగుతూ వీడియో ఇంటర్వ్యూలో పాల్గొనటం సరికాదని విమర్శకులు తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి:
- సిరాజుద్దౌలా: ఈయనను దారుణంగా చంపాకే భారతదేశంలో బ్రిటీష్‌వాళ్లకు ఎదురు లేకుండా పోయింది
- చైనాతో భారత్ వ్యాపారం సరిహద్దు ఉద్రిక్తతలో సంబంధం లేకుండా ఎందుకు పెరుగుతోంది?
- ఉద్యోగానికి వెళ్లిన తొలి రోజునే గ్యాంగ్ రేప్‌కు గురైన నర్స్
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం, రాష్ట్రాలు ఎందుకు గొడవ పడుతున్నాయి, అసలు తగ్గించాల్సింది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













