ఎలాన్ మస్క్: రూ.3.37 లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను ఎందుకు కొన్నారు? ఈ సోషల్ మీడియా వేదికను ఏం చేయనున్నారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జో కీన్‌మన్
- హోదా, టెక్నాలజీ ఎడిటర్
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి, బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేశారు.
ట్విటర్‌కు 'అద్భుత అవకాశాలున్నాయి' అని చెప్పిన ఆయన అవన్నీ తాను చేసి చూపిస్తానన్నారు.
కంటెంట్ విషయంలో నియంత్రణలు సడలిండచం నుంచి నకిలీ ఖాతాలను నిర్మూలించడం వరకు అనేక మార్పులు చేస్తామని చెప్పారు.
ట్విటర్ తొలుత ఎలాన్ మస్క్ బిడ్‌ను తిరస్కరించింది. అయితే, ఇప్పుడు ఈ ఒప్పందం ఆమోదం పొందేలా ఓటేయాలని షేర్ హోల్డర్స్‌ను ట్విటర్ కోరనుంది.
ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకారం ఎలాన్ మస్కే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు. ఆయన సంపద విలువ 273.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.20 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా.
ఇందులో అత్యధికం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో వాటాల కారణంగా సమకూరిన మొత్తం.
ట్విటర్ కొనుగోలుకు ఒప్పందం కుదిరిన తరువాత ఎలాన్ మస్క్.. 'వాక్ స్వాతంత్ర్య అనేది ప్రజాస్వామ్యానికి పునాది. ట్విటర్ అనేది ఒక డిజిటల్ కూడలి. మానవాళి భవిష్యత్‌కు సంబంధించిన కీలకాంశాలపై ఈ డిజిటల్ కూడలిలో చర్చ జరుగుతుంది'' అని ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్త ఫీచర్లు, విశ్వాసం పెంచేలా అల్గారిథమ్‌ను ఓపెన్ సోర్స్ చేయడం, స్పామ్ బాట్‌ల పనిపట్టడం, ట్విటర్‌లో ఉన్నవారందరి గుర్తింపును ధ్రువీకరించడం వంటి మార్పులతో ట్విటర్‌ను మరింత మెరుగుపర్చాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంతకీ ట్విటర్‌ను కొనాలని ఎలాన్ మస్క్ ఎందుకు అంతగా ప్రయత్నించారు?
నిజానికి ఎలాన్ మస్క్, ట్విటర్‌ల మధ్య వ్యవహారం మొదట్లో ఒక మూగ ప్రేమ కథలా ఉండేది.
ఎలాన్ మస్క్‌కి ట్విటర్ అంటే ఇష్టం. ట్విటర్‌లో ఆయనకు 8.38 కోట్ల మంది ఫాలోవర్లున్నారు.
తరచూ ట్విట్‌లు చేసే ఆయన కొన్ని వివాదస్పదంగాను, మరికొన్ని సార్లు విపత్తు వచ్చిపడేలాంటి ట్వీట్‌లు చేస్తుంటారు.
గతంలో ఆయన చేసిన ఓ ట్వీట్ కారణంగా టెస్లా కంపెనీ 1400 కోట్ల డాలర్లు నష్టపోయిన తరువాత యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆయన్ను టెస్లాకు సంబంధించి ట్వీట్ చేయకుండా నిషేధించింది.
థాయిలాండ్‌లోని ఓ గుహలో ఫుట్‌బాల్ జట్టు చిక్కుకుపోయిన తరువాత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వివాదమైంది. ఈ ట్వీట్ కారణంగా ఆయన పరువు నష్టం దావా కూడా ఎదుర్కొన్నారు.
అయినా, ఆయన ట్వీట్లు మాత్రం తగ్గలేదు.
16 ఏళ్లుగా చేస్తున్నవ్యాపారంలో ప్రత్యర్థుల స్థాయిలో వృద్ధి సాధించలేని సమయంలో ఎవరైనా 4,400 కోట్ల డాలర్ల డీల్‌తో ముందుకొస్తే నిజంగా వారు మీకు సహాయం చేస్తున్నారని అనుకోవాలి. ట్విటర్ షేర్ హోల్డర్లు ఈ ఒప్పందానికి ఆమోదం పలకడానికి గల కారణాలలో ఇదొకటి.
ట్విటర్‌కు ఉన్న అసాధారణ అవకాశాలను పూర్తిస్థాయిలో ఉఫయోగించుకోవాలన్నది ఎలాన్ మస్క్ అభీష్టం. ఆయనా ఇదే మాట చెబుతున్నారు. ట్విటర్‌తో డబ్బు సంపాదించాలని మస్క్ అనుకోవడం లేదు.
ఆయనకు ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది. పైగా బిలియనీర్ల ప్రాధాన్యాలు అనేకానేక రకాలుగా ఉంటాయి.
నిజానికి ట్విటర్ తొలుత పాయిజన్ పిల్ వ్యూహంతో రక్షణాత్మక ధోరణితో వ్యవహరించింది. ట్విటర్ షేర్లలో 15 శాతానికి మించి ఎవరూ కలిగి ఉండకుండా నిరోధించింది.
కానీ, ఇప్పుడు ఎలాన్ మస్క్‌తో ట్విటర్ ఒప్పందం కుదిరింది.

ఫొటో సోర్స్, Reuters
కారణమేంటి?
ట్విటర్‌లో వాక్‌స్వాతంత్ర్యం, మోడరేషన్ తగ్గించడంపై ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనలతో బోర్డు కలవరపడి ఉండొచ్చు. దీంతో వాక్‌స్వాతంత్ర్యం, వామపక్ష భావాలకు అనుకూలంగా ట్విటర్ మోడరేషన్ విధానాలు ఉంటాయని భావించే రిపబ్లికన్లు ట్విటర్ మొదట అనుసరించిన రక్షణాత్మక ధోరణితో సంతోషించారు.
కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెగ్యులేటర్లు.. సోషల్ నెట్‌వర్క్‌లు తమ కంటెంట్ విషయంలో మరింత బాధ్యత తీసుకునేలా ఒత్తిడి పెంచుతున్నారు.
హింస, విద్వేషం, దూషణ కోవలోకి వచ్చే కంటెంట్‌ను నియంత్రించడంలో నిబంధనలకు కట్టుబడని సోషల్ నెట్‌వర్క్స్‌పై భారీ జరిమానాలు విధిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రధానంగా ట్విటర్‌ది ప్రకటనల ఆధారిత బిజినెస్ మోడల్. ఇప్పుడు మాస్క్ దాన్ని మార్చాలనుకుంటున్నారు.
సబ్‌స్క్రిప్షన్లను ట్విటర్‌కు ఆదాయ మార్గంగా మార్చాలని మస్క్ అనుకుంటున్నారు. అయితే, మిగతా సోషల్ మీడియా వేదికలన్నీ ఉచితమైనప్పుడు ట్విటర్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు కష్టమేనని మస్క్ అభిప్రాయపడ్డారు.
ట్విటర్ వినియోగదారులు తమ డేటాను సంపాదన కోసం ఉపయోగించరాదని నిర్ణయించుకోవచ్చు, అలా చేయకుండా ఉండేందుకు వారు ట్విటర్‌కు డబ్బు చెల్లించేందుకు సిద్ధపడాల్సి రావొచ్చు.. కానీ, ఇదంతా ఒక జూదం లాంటిది.
ఎలాన్ మస్క్‌కు క్రిప్టో కరెన్సీలపైనా మోజు ఎక్కువే. బిట్ కాయిన్ వంటి అస్థిర, ఏమాత్రం సురక్షితం కాని చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఆయన ఈ వేదికను ఉపయోగించుకుంటారేమో చూడాలి.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ పేపాల్, టెస్లా సహా అనేక వ్యాపారాలలో విజయం సాధించారు.
మూస ధోరణులను మార్చడం, హద్దుల్లేని ప్రయోగాలు చేయడం మస్క్‌కు ఇష్టం.
జనవరిలో నెలలో ట్విటర్‌లో 9.2 శాతం వాటా కొనుగోలు చేసిన తరువాత కూడా ఆయన ఆ సంస్థ బోర్డులో చేరేందుకు నిరాకరించారు. బాధ్యతలలో చిక్కుకుపోరాదని ఆయన కోరుకోవడం వల్లే బోర్డులో చేరలేదు.
ఆయన్ను విపరీతంగా ఇష్టపడే కోట్లాది మంది అభిమానులున్నారు.
తన ఆదాయంలో ఎక్కువ శాతం షేర్ల ద్వారా వచ్చిందేనని, నగదు ఆదాయం తక్కువ, స్థిరాస్తులూ లేవు, అందుకే ఆదాయ పన్ను చెల్లించడం లేదని ఆయన ట్విట్ చేశారు.
పూల బొకేలు, చాక్లెట్లతో ఆయన ట్విటర్‌ను ఆకర్షించలేదు. దూకుడు గల ఒక వ్యాపారవేత్త నుంచి వచ్చిన అంతే దూకుడు గల బిడ్ ఇది. ఇందులో చర్చలూ లేవు, రాజీ లేదు.
ట్విటర్ విక్రయం ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన ప్రైవేట్ డీల్. అంతేకానీ, రెండు దిగ్గజాల మధ్య విలీనం కాదు ఇది. అందుకే ఈ ఒప్పందానికి పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చు.
ఈ ఒప్పందంపై ట్విటర్ యూజర్లు ఏమనుకుంటున్నారనేది ఒక్క మాటలో చెప్పడం కష్టం. అశాస్త్రీయమైన నా పరిశీలన ప్రకారం.. మస్క్‌ను స్వాగతిస్తూ కనిపిస్తున్న ప్రతి ట్వీట్‌కు సమానంగా ట్విటర్‌ను వీడాలంటూ కూడా ట్వీట్‌లు కనిపిస్తున్నాయి.
అయితే, ఏ విషయంలోనైనా ట్విటర్ యూజర్లంతా ఏకాభిప్రాయంతో రావడం ఎప్పుడైనా ఉందా?
ఇవి కూడా చదవండి:
- కూమా జైలు: స్వలింగ సంపర్కులకు మాత్రమే
- బందరు పోర్టు కల ఎప్పటికైనా నిజమవుతుందా?
- ఫాక్లాండ్ దీవులు: అర్జెంటీనా, బ్రిటన్ల మధ్య వివాదంపై బీజేపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు?
- అంతరిక్షంలో బతకాలంటే ఆహారం ఎక్కడినుంచి వస్తుంది? చెట్లు మొలుస్తాయా? మాంసం తయారు చేయొచ్చా?
- ఏపీ మంత్రి కాకాణి చుట్టూ మరో వివాదం, ఆ విల్లాలో యువకుడి మృతికి కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















