ఆంధ్రప్రదేశ్: బందరు పోర్టు కల ఎప్పటికి సాకారమవుతుంది... పనులు ఎందుకు ముందుకు కదలడం లేదు?

టీడీపీ హయాంలో వేసిన బందరు పోర్టు శిలాఫలకం
ఫొటో క్యాప్షన్, టీడీపీ హయాంలో వేసిన బందరు పోర్టు శిలాఫలకం
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన సముద్రతీరం ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చేయాలని వరుసగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. కానీ, ఆచరణ మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు.

గత ప్రభుత్వ హయంలో కాకినాడ సెజ్ ప్రాంతంలో గేట్ వే పోర్ట్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఆ పోర్ట్ ముందుకు సాగలేదు. ఇటీవల మరో మూడు పోర్టుల నిర్మాణాలకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది.

విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన రామాయపట్నం పోర్టుతోపాటు ఉత్తరాంద్రలో భావనపాడు పోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సుదీర్ఘ చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని పోర్టు నిర్మాణం రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. పోర్టు నిర్మాణానికి నవయుగ కంపెనీతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007లో చేసుకున్న ఒప్పందాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు. కొత్తగా టెండర్లు పిలిచారు.

రెండుసార్లు కాంట్రాక్లు సంస్థల నుంచి స్పందన రాలేదు. దాంతో మూడోసారి టెండర్లు పిలిచారు. ఈసారి రెండు సంస్థలు టెండర్లు వేయడంతో త్వరలో ఒకరికి కాంట్రాక్టు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో ఇప్పటికే పోర్టుల ఆధారంగా ఎగుమతులు ఊపందుకున్నాయి. కరోనావైరస్ మహమ్మారి తర్వాత విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల ద్వారా ఎగుమతులు పెరిగాయి. ఉదాహరకు కాకినాడ పోర్ట్ నుంచి 2020-21తో పోలిస్తే 2021-22 లో బియ్యం ఎగుమతులు 25 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఇదే రీతిలో అక్వా, అరటి సహా పలు ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి.

దక్షిణాంధ్రలో రామాయపట్నం, మధ్య ఆంధ్రాలో బందరు పోర్టు, ఉత్తరాంధ్రలో భావనపాడు పోర్టు అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ పోర్టుల నిర్మాణానికి పూనుకుంటోంది.

రామయాపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టారు. భావనపాడు పోర్టుకు త్వరలోనే టెండర్లు పిలవాలని ఆంధ్రప్రదేశ్ మారి టైం బోర్డ్ నిర్ణయించింది.

కాంగ్రెస్ హాయాంలో వేసిన బందరు పోర్టు శిలాఫలకం
ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ హాయాంలో వేసిన బందరు పోర్టు శిలాఫలకం

బందరు పోర్టుకు ఏమైంది?

బందరు పోర్టు నిర్మాణ పనులను నవయుగ కంపెనీకి 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్పగించింది. పోర్టు నిర్మాణానికి 2008 ఏప్రిల్ 23న రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ, ఆ తర్వాత ఆయా ప్రభుత్వాల ప్రకటనలకు తగినట్లుగా అడుగులు పడలేదు.

2019 ఫిబ్రవరి 7న బందరు పోర్టు నిర్మాణ పనుల్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. మేకావారిపాలెంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. దానికి ముందే మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయటం, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించటం, డీపీఆర్‌లు సిద్దపరచడం, తదితర పనులు పూర్తిచేశారు.

అలాగే రైతుల నుంచి పట్టా భూములు కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి రూ. 200 కోట్లు కేటాయించారు. దాంతో పాటుగా 2025 నాటికి రూ.12 వేల కోట్ల వ్యయంతో ఈ ఓడరేవును నిర్మిస్తామని చంద్రబాబు 2019 ఫిబ్రవరిలో ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది.

2019 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం, నవయుగతో చేసుకున్న బందరు పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో కన్సార్షియం ఏర్పాటు చేసి పోర్టు నిర్మాణం చేపడతామని ప్రకటించింది. దానికి అనుగుణంగా డెవలపర్ కి ఇచ్చిన 412.57 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది.

చంద్రబాబు హయంలో 10 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ పోర్టుని అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు వేయగా దానిని 800 ఎకరాలకు పరిమితం చేస్తున్నట్టు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు 2019 లోనే ప్రకటించారు.

రూ. 5,835 కోట్ల వ్యయంతో మూడేళ్లలో బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని 2020లో ప్రకటించారు. కానీ రెండేళ్లు గడిచినా నేటికీ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికాలేదు.

నిర్మాణానికి అవసరమైన నిధుల్లో రూ. 4745 కోట్లను మారిటైమ్ బోర్డు ద్వారా రుణం సేకరిస్తామని వెల్లడించారు. డీపీఆర్ ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కూడా ఆయన తెలిపారు.

వరుసగా ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రకటనల మీద ప్రకటనలు చేసినప్పటికీ బందరు పోర్టు విషయంలో ఆశించిన స్థాయిలో ముందడుగు పడలేదు.

తెలంగాణ నుంచి ఎగుమతులకు బందరు పోర్టు ఉపయోగపడుతుందన్న అంచనాలున్నాయి

ఫొటో సోర్స్, NHAI

ఫొటో క్యాప్షన్, తెలంగాణ నుంచి ఎగుమతులకు బందరు పోర్టు ఉపయోగపడుతుందన్న అంచనాలున్నాయి (ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ నుంచి ఆర్డర్లు వస్తాయనే అంచనాలు

బందరు పోర్టు ద్వారా సమీప రాష్ట్రాల నుంచి సరుకు రవాణాకు ఎక్కువగా అవకాశాలున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బందరు పోర్టు అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి ఈ పోర్టు గుండా ఎక్కువగా ఎగుమతులు, దిగుమతుల ఆర్డర్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి.

తద్వారా మచిలీపట్నం ప్రాంతంలో పోర్టు అభివృద్ధి ద్వారా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో 80 వేల మందికి ఉపాధి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

అందుకు తగ్గట్టుగానే బందరు పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అభివృద్ధి చేసి లీజుకు (ల్యాండ్‌ లార్డ్‌) ఇచ్చే విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ప్రభుత్వమే పోర్ట్ నిర్మాణం చేపడుతుంది. ఆ తర్వాత నిర్వహణను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగిస్తుంది.

ఇందులో భాగంగా తొలిదశలొ రూ.3,650.07 కోట్లతో పనులు చేపట్టడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు టెండర్లు పిలిచింది. ఈపీసీ విధానంలో పనులు చేపట్టడానికి టెండర్లను ఆహ్వానించారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: బందరు పోర్టు.. నిర్మాణం ఎప్పుడు?

తొలిదశలో వివిధ రకాల సరుకు రవాణాకు వినియోగించే విధంగా మొత్తం నాలుగు బెర్తులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో ఒకటి మల్టీ పర్పస్‌ బెర్త్‌ కాగా, రెండు జనరల్‌ కార్గో బెర్తులు, ఒకటి బోగ్గు కోసం కేటాయిస్తారు.

అలాగే 2.99 కిలోమీటర్ల బ్రేక్‌ వాటర్, 43.82 మిలియన్‌ మీటర్ల డ్రెడ్జింగ్‌తో పాటు, అంతర్గత, బహిర్గత మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ఈ పనులకు రూ.3,650.07 కోట్లు అవసరమని అంచనా వేశారు.

అయితే ఈ టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదు. దాంతో ఇప్పుడు మరోసారి టెండర్లు పిలిచారు. ప్రస్తుతం డిజైన్లు మార్చి టెండర్లను ఆహ్వానించామని, బిడ్డర్ల నుంచి ఆసక్తి ఉంటుందనే ఆశాభావాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో కె. మురళీధర్ రావు బీబీసీ వద్ద వ్యక్తంచేశారు.

ఏప్రిల్ 17తో టెండర్ల గడువు పూర్తి కాగా ఎట్టకేలకు రెండు సంస్థలు టెండర్లు వేశాయి. వాటిలో మేఘ, విశ్వసముద్ర హోల్డింగ్స్ ఉన్నాయి.

బందరు పోర్టులోని జెట్టీ
ఫొటో క్యాప్షన్, బందరు పోర్టులోని జెట్టీ

పోర్టుకు సుదీర్ఘ చరిత్ర

ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా కేంద్రమైన మ‌చిలీప‌ట్నం ఒక‌ప్పుడు బ్రిటిష్ హ‌యంలో పెద్ద తీర ప్రాంత ప‌ట్ట‌ణం. ఇక్కడనుంచి ఎన్నో ఎగుమ‌తులు, దిగుమ‌తులు జరిగేవి. అంతకు ముందే రెండు వేల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి.

1611లో ఆంగ్లేయులు, అంతకు ముందు డచ్చి, పోర్చుగీసు వారు మచిలీపట్నంలో అడుగుపెట్టి, దీన్ని తమ వ్యాపార స్థావరంగా మార్చుకున్నారు. తర్వాత బందరు పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతలు సాగించారు.

దాంతో ఏపీలో ఈ పట్టణం కీలకంగా మారింది. అయితే ఆ త‌ర్వాత 1830ల నుంచి బ్రిటిష్ వారి వ్య‌వ‌హారాలు క్ర‌మంగా బంద‌రు నుంచి చెన్న‌ప‌ట్నం చేరాయి.

బంద‌రు పోర్టు క‌న్నా చెన్నై నుంచి నౌకల్లో వెళ్లడం సులభంగా ఉంటుందని బ్రిటిష్ వారు అప్పుడే భావించిన‌ట్టు మ‌చిలీప‌ట్నంలోని చ‌రిత్ర అధ్యాప‌కుడు ఎస్.వెంక‌టేశ్వ‌ర రావు అభిప్రాయ‌ప‌డ్డారు.

"బంద‌రు పోర్ట్ నిర్వ‌హ‌ణ వల్ల పెద్దగా లాభం ఉండదని బ్రిటిష్ వారు భావించారు. ముఖ్యంగా స‌ముద్రంలో ఇసుక పేరుకు పోతుండడంతో ప‌దే ప‌దే డ్రెడ్జింగ్ చేయడానికి చాలా ఖర్చవుతుంది. భౌగోళికంగా బంద‌రు తీరంలో ఇసుక పేరుకోవడం పెద్ద స‌మ‌స్య‌గా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

ఈ కారణంగానే బ్రిటీష్ వారు అటు చెన్నై, ఇటు కాకినాడ‌, విశాఖల‌ను తమ రేవులుగా ఎంచుకున్నారని వెంకటేశ్వ రావు తెలిపారు.

‘‘ఆ పోర్టుల అభివృద్ది జరిగితే, మ‌చిలీప‌ట్నం పోర్ట్ మాత్రం ప్రాభవం కోల్పోతూ వచ్చింది. అయినా 1970 వ‌ర‌కూ అర‌కొర‌గా సాగిన పోర్ట్ ఆ త‌ర్వాత దాదాపుగా మూత‌ ప‌డిపోయింది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

"బంద‌రు పోర్ట్ వల్ల ఏపీకి ఆశించిన ప్ర‌యోజ‌నం ఉండదు. మ‌చిలీప‌ట్నం అభివృద్ధి జ‌ర‌గాలంటే పోర్టు క‌న్నా ఆక్వా ఆధారిత ప‌రిశ్ర‌మ‌లు, క‌లంకారీ, రోల్డ్ గోల్డ్ న‌గ‌ల ప‌రిశ్ర‌మ అభివృద్ధికి మార్గాలు వెతకాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.

బందరు పోర్టు ప్రాంతం
ఫొటో క్యాప్షన్, బందరు పోర్టు ప్రాంతం

బందరు పోర్టు కోసం ఆందోళనలు

అధికారంలో ఉన్న పార్టీలు హామీలు ఇవ్వడం, విపక్షాలు ఆందోళనలు చేయడం బందరుపోర్టు విషయంలో ఆనవాయితీగా వస్తోంది. గడిచిన రెండు దశాబ్దాలుగా ఇది సాగుతోంది.

కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ కూడా ఇదే రీతిలో వ్యవహరించాయి. విపక్షంలో ఉండగా ఉద్యమాలు చేశాయి గానీ అధికారంలో చేపట్టిన తర్వాత పోర్టు నిర్మాణానికి మాత్రం పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. అయితే బందరు పోర్టు పనులు త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధర్ రావు బీబీసీతో చెప్పారు.

"పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నాం. రామాయపట్నం పోర్టు ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుంది. భావనపాడు పనులు కూడా మొదలవుతాయి. బందరు పోర్టులో టెండర్లకు ఈసారి కాంట్రాక్టు సంస్థలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే మూడేళ్లలో మూడు పోర్టులు అందుబాటులోకి వస్తాయి’’ అని ఆయన అన్నారు.

మచిలీపట్నం

ఫొటో సోర్స్, We want MACHILIPATNAM Port/fb

ఫొటో క్యాప్షన్, మచిలీపట్నం

‘మూడేళ్లు గడువిచ్చాం, ఉద్యమిస్తాం’

బందరు పోర్టు నిర్మాణానికి మొత్తం 5200 ఎకరాల భూమి అవసరమవుతుందని గతంలో అంచనా వేశారు. అందులో 3వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూమి ఉంది. 700ల ఎకరాల ల్యాండ్‌ ఫూలింగ్‌లో సేకరించారు.

మిగిలిన దాదాపు 1700 ఎకరాల పట్టాభూమిలో ముడా (మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) 430 ఎకరాలను కొనుగోలు చేసింది. భూమి కొనుగోలు పధకం ద్వారా రైతుల నుంచి ఈ భూమిని కొన్నది. ఎకరానికి రూ. 25లక్షల చొప్పున కొనుగోలు చేశారు. మరికొంత సేకరించాల్సి ఉంది. పనులు మొదలైతే అన్నీ కొలిక్కి వస్తాయని అధికారులు చెబుతున్నారు.

మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం బందరు పోర్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా గ్రౌండ్ వర్క్ అంతా చేసినప్పటికీ నిర్మాణ పనులు చేపట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

"మేము అధికారంలో ఉండగా అనేక ఆటంకాలు పెట్టారు. అయినా భూమిని ల్యాండ్ ఫూలింగ్, భూసేకరణ, సమీకరణ పద్ధతుల్లో తీసుకున్నాం. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. అయినా దుష్ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి పోర్టు పనులు మాత్రం చేపట్టలేకపోయారు. మూడేళ్లుగా మాటలు తప్ప చేతలు లేవు. అందుకే బందరు పోర్టు సాధన కోసం టీడీపీ ఉద్యమించబోతోంది" అని రవీంద్ర చెప్పారు.

వీడియో క్యాప్షన్, నాలుగేళ్లలో 60 లక్షల మందిని చంపేశారు

టీడీపీ హయాంలోనే ప్రాథమికంగా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, మళ్లీ తామే అధికారంలోకి వచ్చి బందరు పోర్టుని సిద్ధం చేస్తామని ఆయన బీబీసీతో అన్నారు.

తాము పిలిచిన టెండర్లు త్వరలో ఖరారై పనులు మొదలవుతాయని ప్రభుత్వం చెబుతుంటే, పనులు చేపట్టి, పోర్టు సిద్ధం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

బందరు పోర్టు చుట్టూ రాజకీయాలు సాగుతున్నా, మచిలీపట్నం వాసులు ఆశించిన రీతిలో పోర్టు నిర్మాణం ముందుకు సాగలేదు. ఇకనైనా పనులు మొదలైతే సంతోష్తామని స్థానికుడు పి.ఆదినారాయణ బీబీసీతో అన్నారు.

"రేవుపట్టణం గడిచిన కొన్ని దశాబ్దాలుగా కళ తప్పింది. పూర్వవైభవం రావాలంటే పోర్టుతోనే సాధ్యం. కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ బందరు పోర్టు వస్తే వ్యవసాయ, ఆక్వా ఎగుమతులకు ఆస్కారం ఉంటుంది. అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)