లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
వివాహ బంధంలో ఉంటూ అత్యాచారానికి గురవుతున్న మహిళలు న్యాయస్థానం తలుపు తట్టేందుకు అవకాశం వచ్చింది. క్రూరమైన లైంగిక వేధింపులకు గురైన భార్య ఫిర్యాదుతో ఆమె భర్త పై అత్యాచారం అభియోగం మోపుతూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు సమర్థించింది.
భారతీయ శిక్షా స్మృతి ద్వారా అత్యాచారం కేసులో భర్తకు మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు (సెక్షన్ 14)ను, లింగ వివక్ష (సెక్షన్ 15-1) చట్టాలను ఉల్లంఘించడమేనని జస్టిస్ ఎం. నాగప్రసన్న తన తీర్పులో పేర్కొన్నారు.
మహిళలపై వేధింపులకు సంబంధించిన సమస్యలపై పనిచేస్తున్న కార్యకర్తలు, కర్ణాటక హైకోర్టు తీర్పును ప్రశంసించారు. ఇది ప్రగతిశీలమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. అయితే, తీర్పు వచ్చినప్పటికీ, రాజ్యాంగంలో భర్తకు ఇంకా ఇలాంటి కేసులలో మినహాయింపునిచ్చే నిబంధనలు కొనసాగడంపై వారు అభ్యంతరం తెలిపారు.
''అతను ఆ భార్యకు భర్త అయినప్పటికీ అతను మగవాడే, అతని చర్యలు చర్యలే, అత్యాచారం అంటే అత్యాచారమే'' అని జస్టిస్ నాగ ప్రసన్న వ్యాఖ్యానించారు.
ఈ తీర్పు భర్తల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు ఎంతో శక్తి లభిస్తుందని, ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగవుతాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు.
''వైవాహిక అత్యాచారం కేసులో దిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తీర్పుకు కర్ణాటక హైకోర్టు తీర్పు మార్గదర్శకం అవుతుంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 3 కింద ఇలాంటి అత్యాచారంలో భర్తకు మినహాయింపు ఇచ్చే నిబంధనను నేను సవాల్ చేశాను'' అని కర్ణాటక హైకోర్టులో సీనియర్ న్యాయవాది జయ కొఠారి అన్నారు.
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, మార్చి 2న దిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ విషయంలో ఒక స్టాండ్ తీసుకుని, పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయం కోసం వేచి చూస్తున్నట్లు కేంద్రం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక కేసులో ఏం జరిగింది?
కర్ణాటక హైకోర్టు ఈ కేసు పై 90 పేజీల తీర్పును వెలువరించింది. ఈ కేసులో 2017 మార్చిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒడిశాకు చెందిన రిచా (పేరు మార్చాం) తాను 12వ తరగతి వరకు చదివానని, నిందితుడితో పెళ్లి చేసుకోవాలని తన తల్లి ఒత్తిడి చేసిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
''నా జీవితం నరకప్రాయంగా మారిన రోజును గుర్తు చేసుకోవాలని కూడా కోరుకోవడం లేదు'' అని కూడా ఆమె అన్నారు.
"నా భర్త నన్ను సెక్స్ బానిసగా మార్చి కూడా, నేను తనతో లైంగిక సంబంధం పెట్టుకోవడం లేదంటూ మా బంధువులందరి ముందూ చెప్పేవాడు'' అని బాధితురాలు వెల్లడించారు.
ఈ కేసులో రిచా భర్త కూడా రిచాపై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు. భార్య తనతో లైంగిక సంబంధానికి సహకరించడం లేదని అందులో పేర్కొన్నారు.
ఈ కేసు పెట్టే విషయంలో రిచా, తన బంధువు నుండి సహాయం తీసుకుని ఒక లాయర్‌ను సంప్రదించారు.
కోటి రూపాయల విలువైన తన ఆస్తిని అమ్మాలని రిచా భర్త, ఆమె అత్తమామలు ప్రయత్నించారు. తన కూతురిని తీసుకుని అక్కడి నుంచి బైటికి రావడానికి రిచాను భర్త, అత్తమామలు అనుమతించలేదు. ఈ విషయంలో జరిగిన గొడవలో రిచా వేలు విరిగింది. ఇరుగు పొరుగువారు రావడంతో రిచా, తన కూతురును తీసుకుని అక్కడి నుంచి బైటపడగలిగారు.
''నాకు పెళ్లయిన రోజు నుంచి నా భర్త నన్ను సెక్స్ బానిసలా చూసుకున్నాడు. పోర్న్ సినిమాలు చూపించి అసహజ రీతిలో సెక్స్‌లో పాల్గొనమని బలవంతం చేసేవాడు. గర్భం దాల్చిన తర్వాత కూడా నన్ను సెక్స్ కోసం బలవంతం చేశాడు. అతనికి కనీస మర్యాద, మానవత్వం అనేవి లేవు. అబార్షన్ జరిగిన తర్వాత కూడా నాతో సెక్స్ చేశాడు'' అని రిచా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
"నా భర్త ప్రవర్తనలో కొంచెం కూడా మానవత్వం లేదు. నా కూతురు ముందే అసహజ రీతిలో సెక్స్‌లో పాల్గొనమని నన్ను బలవంతం చేశాడు. చాలా సందర్భాలలో నా కూతురిని కొట్టి బయటకు పంపి, నాతో బలవంతంగా సెక్స్ చేసేవాడు. నాపై సాగిన లైంగిక వేధింపులకు లెక్కలేదు. అలాంటి పరిస్థితిలో ఏ స్త్రీ అయినా తన బాధను ప్రపంచానికి చెప్పాలి. నా పేరు, నా కూతురు బయటి ప్రపంచానికి తెలియకుండా ఈ కేసును విచారించాలి. నా భర్తను శిక్షించాలని కోరుకుంటున్నాను" అని రిచా కోరారు.
''నా భర్త నా కూతురిని స్కూల్ టైం కంటే ముందే ఇంటికి తీసుకొచ్చి లైంగికంగా వేధించాడని తెలిసి నేను కుంగిపోయాను. ఇలాంటి కష్టం ఏ తల్లికి, ఏ కూతురికి రాకూడదు'' అన్నారు రిచా.

ఫొటో సోర్స్, ALEKSEI MOROZOV/GETTY IMAGES
కేసు విచారణ
ఈ కేసులో మార్చి 21, 2017న ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506, 498ఎ, 323, 377, ఇంకా పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ విషయం పై దర్యాప్తు చేసిన పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 ని కూడా చేర్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, పోక్సో ప్రత్యేక కోర్టు ఈ కేసులో అత్యాచారం నిబంధనలను కూడా చేర్చింది. దిగువ కోర్టు విచారణను నిలిపేయాలంటూ రిచా భర్త హైకోర్టును ఆశ్రయించారు.
''ఫిర్యాదును చూస్తుంటే పిటిషనర్ చేసిన క్రూరమైన చర్యలకు భార్య సహనం అనే ఆనకట్ట పేలినట్లు కనిపిస్తోంది. ఇది నిద్రాణమైన అగ్నిపర్వతం పేలినట్లుగా ఉంది. అందులో పేర్కొన్న వాస్తవాలను బట్టి చూస్తే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం శిక్షార్హమైన నేరాలను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు అభియోగాలు మోపడంలో తప్పులేదు" అని జస్టిస్ నాగప్రసన్న పేర్కొన్నారు.
పిటిషనర్ తన తొమ్మిదేళ్ల కుమార్తె సమక్షంలో ఫిర్యాదుదారుతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేశాడని, తన కుమార్తె ప్రైవేట్ భాగాలను తాకడం ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తీర్పులో సానుకూల-ప్రతికూలతలు
''ఈ తీర్పు చట్టాన్ని రాజ్యాంగ దృక్కోణం నుండి అర్థం చేసుకుంది. లింగ సమానత్వం కోణం నుండి విషయాన్ని సరిగ్గా చూడగలిగింది'' అని కర్ణాటక హైకోర్టు న్యాయవాది గీతాదేవి పాపన్న బీబీసీతో అన్నారు.
ఈ తీర్పుతో మహిళలను సమాన భాగస్వామిగా చూస్తారని, తక్కువ చేసే ప్రయత్నాలు చేయరని ఆమె అన్నారు.
''ఈ తీర్పు భర్త అత్యాచారం నేరారోపణ నుండి మినహాయించే చట్ట నిబంధనను తొలగించలేదు. ఈ నిబంధనను రద్దు చేయకపోతే, అది అలాగే చట్టాల్లో ఉంటుంది, కొనసాగుతుంది కూడా. కాబట్టి ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలి'' అని మద్రాస్ హైకోర్టు న్యాయవాది గీతా రామశేషన్ అన్నారు.
అయితే, ఈ తీర్పు ద్వారా మరికొన్ని అంశాలలో ముందడుగు వేసినట్లేనని గీతా రామశేషన్ అన్నారు. గృహహింస చట్టం ప్రకారం లైంగిక వేధింపులు కూడా గృహ హింసేనని, హింస ఉంటే అది అత్యాచారం కిందకు వస్తుందని, ఆ కోణంలో చూస్తే అది ఒక ముందడుగు నిర్ణయమని గీతా రామశేషన్ అన్నారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని 'పాజిటివ్ తీర్పు'గా అభివర్ణించారు. అయితే, ఈ తీర్పు అసహజ సెక్స్, అశ్లీలత మొదలైన వాటిపై దృష్టి పెట్టలేదని, మహిళల సమ్మతి లేకపోవడం పై దృష్టిపెట్టకపోతే ఈ తీర్పు ఉద్దేశం నెరవేరదని కవితా కృష్ణన్ అన్నారు.
విషయం ఇక్కడ నుండి ఎక్కడికి వెళుతుంది
దిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా...ఐపీసీలోని అత్యాచారం కేసులో భర్తలకు మినహాయింపు రద్దు రాజ్యాంగ చెల్లుబాటు పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందని జైసింగ్, కొఠారీ ఇద్దరూ అభిప్రాయపడ్డారు.
''దిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని గమనిస్తే, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందని నేను అనుకోను. ప్రభుత్వం దానిని సవాలు చేయవచ్చు" అని ఇందిరా జైసింగ్ అన్నారు.
యాదృచ్ఛికంగా, జస్టిస్ నాగప్రసన్న కొన్ని నెలల కిందట ఒక తీర్పు ఇచ్చారు. ఒక ప్రభుత్వోద్యోగి వివాహిత కుమార్తె ను కారుణ్య ఉద్యోగం విషయంలో కొడుకుతో సమానంగా చూడాలని స్పష్టం చేశారు.
దుర్వినియోగమయ్యే ప్రమాదం
కోర్టు నిర్ణయాన్ని ఒకపక్క ప్రగతిశీలంగా పరిగణిస్తుండగా, మరోపక్క దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. దిల్లీ హైకోర్టులో ఈ విషయంపై విచారణ జరుగుతున్నప్పుడు #MarriageStrike కూడా ట్రెండ్ అయింది.
అదే సమయంలో 498-ఎ (భారత శిక్షాస్మృతిలోని వరకట్న వేధింపుల సెక్షన్) దుర్వినియోగం కేసులు కూడా తెరపైకి వస్తాయని, అలాంటి చట్టం వస్తే ఇలాంటి కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- రష్యా ఆయుధాల కొనుగోళ్ళను భారత్ ఎందుకు తగ్గించుకోలేకపోతోంది?
- అమెరికాను చేరుకోగల నిషిద్ధ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- రష్యా ఆయుధాల కొనుగోళ్ళను భారత్ ఎందుకు తగ్గించుకోలేకపోతోంది?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- గెడ్డం శ్రీను మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
- పాకిస్తాన్లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













