ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు: అమెరికాను చేరుకోగల నిషిద్ధ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా క్షిపణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా మార్చి 16న ఒక క్షిపణిని పేల్చింది.. అది ఐసీబీఎం వ్యవస్థలోని విడిభాగాల పరీక్షఅని అమెరికా చెప్పింది

ఉత్తర కొరియా నిషిద్ధ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం - ఖండాంతర గతిశీల క్షిపణి)ని 2017 తర్వాత తొలిసారిగా పరీక్షించిందని దక్షిణ కొరియా చెప్పింది.

ఆ క్షిపణి 1,100 కిలోమీటర్ల దూరం గాలిలో ప్రయాణించిందని జపాన్ అధికారులు అంచనా వేశారు. దాదాపు గంటసేపు ప్రయాణించిన క్షిపణి జపాన్ ప్రాదేశిక జలాల్లో పడింది.

ఖండాంతర గతిశీల క్షిపణి ఒక ప్రామాణిక పథంలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. అమెరికాను కూడా చేరుకోగలదు.

ఉత్తర కొరియా ఇటీవలి వారాల్లో వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తోంది.

ఆ పరీక్షల్లో కొన్ని శాటిలైట్ ప్రయోగాలని ఉత్తర కొరియా వాదిస్తున్నప్పటికీ.. నిజానికి ఆ దేశం ఐసీబీఎం వ్యవస్థలను ప్రయోగాత్మకంగా పరీక్షించిందని అమెరికా, దక్షిణ కొరియాలు చెప్తున్నాయి.

గురువారం ప్రయోగించిన క్షిపణి 6,000 కిలోమీటర్లకు పైగా ఎత్తుకు చేరుకుందని జపాన్ అధికారులు అంచనా వేశారు.

వీడియో క్యాప్షన్, కిమ్ జోంగ్ ఉన్ పాలన భరించలేని ఉత్తర కొరియన్లు సరిహద్దులు దాటి ఎలా పారిపోతున్నారు...

ఉత్తర కొరియా గతిశీల క్షిపణులను, అణ్వాయుధాలను పరీక్షించటానికి వీల్లేదని ఐక్యరాజ్యసమితి నిషేధించింది. ఇంతకుముందు నిర్వహించిన ఇలాంటి పరీక్షలకు స్పందనగా ఆ దేశం మీద కఠిన ఆంక్షలు విధించింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపిన అనంతరం ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్.. దీర్ఘశ్రేణి గతిశీల క్షిపణులు, అణ్వాయుధాల పరీక్షల మీద మారటోరియం ప్రకటించారు.

అయితే.. ఇక తాను ఈ హామీకి కట్టుబడి ఉండాల్సిన అవసరమేమీ లేదని ఆయన 2020లో ప్రకటించారు.

ఉత్తర కొరియాలో 2017లో పరీక్షించిన ఐసీబీఎం 4,500 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.

ఆ క్షిపణిని ప్రామాణిక పథంలో పేల్చినట్లయితే 13,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి ఉండగలిగేదని నిపుణులు అంచనా వేశారు. అంటే.. అమెరికా ప్రధాన భూభాగంలోని ఏ ప్రాంతాన్నైనా ఆ క్షిపణి చేరుకోగలదు.

వీడియో క్యాప్షన్, చరిత్రలో 70 ఏళ్ల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇప్పటికీ విజేతలెవరో తేలలేదు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)